Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సబ్‌కా సత్యనాశ్‌.. సబ్‌కా వినాశ్‌.

-బీజేపీ అంటే బక్వాస్‌ జుమ్లా పార్టీ
-జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్‌ ఎర్రగడ్డ
-మీ కేంద్ర నేతలే తెలంగాణను పొగుడుతున్నారు
-మరి మెంటల్‌ నీకా.. నీ కేంద్ర నాయకులకా?
-దేశాన్ని అధోగతిపాలు చేసిన బీజేపీ సర్కారు
-ఏడేండ్లలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
-2022 వచ్చింది.. నీళ్లు, ఇండ్లు, టాయిలెట్లు ఏవీ?
-అన్నదాతల ఆదాయం రెట్టింపు ఎక్కడైంది?
-బుల్లెట్‌ రైళ్ల పరుగులెక్కడ?.. కడిగేసిన కేటీఆర్‌

నిత్య అబద్ధాలు, చెత్త వాగ్దానాలతో బీజేపీ దేశాన్ని అధోగతిపాలుచేస్తున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏడేండ్లపాలనలో ఇచ్చిన ఒక్కో హామీ ఏమైందని ఫొటోల సాక్షిగా నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టారు. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, సబ్‌కా సత్యనాశ్‌ చేస్తున్నదని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, దేశంలో బీజేపీ అరాచకాలను ఏ కీలుకాకీలు వలిచి ప్రజల ముందు పెట్టారు. కురచ బుద్ధి బీజేపీ నేతలు ఇంతకాలం ఏం చేసినా ఓపికగా ఉన్నామని, ఇక వెంటపడి తరుముతామని హెచ్చరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతు విరోధి అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే బక్వాస్‌ జుమ్లా పార్టీ అని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వ్యవస్థలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా మార్చుకొని తమ విధానాలను విమర్శించే రాష్ర్టాలపై హమ్లా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, దాసరి మనోహర్‌రెడ్డి, ఏ జీవన్‌రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ మహమ్మద్‌ సలీం, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్‌ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జేపీ నడ్డా నిన్నమొన్నటిదాకా కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి.. చదువుకున్నవాడు.. జ్ఞానం ఉన్నవాడు అనే అభిప్రాయం ఉండేది. కానీ మంగళవారం ఆయన మాటలు విన్న తరువాత.. బండి సంజయ్‌కి ఆయనకు పెద్ద తేడాలేదని స్పష్టంగా అర్థమైంది. బీజేపీలో బండి అయినా.. గుండు అయినా.. అరగుండు అయినా గంతె అని స్పష్టంగా బయటపడింది. జేపీ నడ్డా అంటే అబద్ధ్దాల అడ్డా.. కేరాఫ్‌ ఎర్రగడ్డ’ అని ఎద్దేవా చేశారు.


చీకట్లో గాడ్సే.. వెలుతురులో గాంధీ జపం

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రెండుసార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు చాలా చిల్లరగా, ఛండాలంగా మాట్లాడారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నడ్డా మాటలు అత్యంత జుగుప్సాకరంగా, హేయంగా, నీచంగా ఉన్నాయని మండిపడ్డారు. బీజేపీ నేతలు చీకట్లో గాడ్సేను, వెలుతురులో గాంధీని కీర్తిస్తారని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ అనుకున్నాం కానీ.. ఆ పార్టీ నాయకుల దిక్కుమాలిన విమర్శలు, సోషల్‌ మీడియాలో వారి ప్రవర్తన చూస్తే ‘బక్వాస్‌ జుమ్లా పార్టీ’ అని అర్థమవుతున్నదని ఎద్దేవాచేశారు. 2022 కల్లా ప్రధాని మోదీ చేస్తానన్న ఏ ఒక్క పనీ చేయలేదని ఆధారాలతో సహా ఎండగట్టారు. అవినీతి, కుటుంబ పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని స్పష్టంచేశారు.


ప్రశ్నిస్తే.. దాడులా?

కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవారిపై దర్యాప్తు సంస్థలతో మోదీ సర్కారు దాడులు చేయిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ‘ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములు అంటే బీజేపీ, సీబీఐ, ఐటీ, ఈడీ, ఎన్‌ఐఏ ఇంకొన్ని సంస్థలు. వ్యవస్థను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని, ఢిల్లీలోని మీడియాను కూడా గుప్పిట్లో పెట్టుకొని ‘మీడియాను మోడియా’గా మార్చిపారేశారు. దేశాన్ని మొత్తం ఆగమాగం చేసి నాలుగు ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా కొట్టి బయటపడాలని చూడటమే తప్ప.. ఇప్పటిదాకా చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే చెప్పరు. మోదీ చెప్పినవన్నీ జుమ్లా అంటే మామీద హమ్లా. ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుడు.. ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడితే వాళ్ల మీదికి పంపుతున్నరు’ అని మండిపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అని చెప్పుకొంటున్న బీజేపీ, ఉత్తరప్రదేశ్‌లో దిక్కుమాలిన ప్రకటనలు ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు.


కాపీ బీజేపీ..

ఇతర రాష్ట్రాల్లోని అభివృద్ధి పనులను కాపీ కొట్టి తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రచారం చేయటంలో బీజేపీది అందెవేసిన చెయ్యి అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కోల్‌కతాలోని ఫ్లై ఓవర్‌ ఫొటోలను ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో వాడుకొంటున్నారని, బీహార్‌లో హైదరాబాద్‌ ఫ్లై ఓవర్‌ ఫొటోలు వాడుకొన్నారని గుర్తుచేశారు. ‘మా పథకాలను కాపీ కొడతరు.. కేంద్రం తెచ్చిన కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి స్ఫూర్తి ఎవరు? కేసీఆర్‌ తెచ్చిన రైతుబంధు కాదా? హర్‌ ఘర్‌ జల్‌కు ఆద్యులు ఎవరు? మిషన్‌ భగీరథ కాదా? మాట్లాడేందుకు కనీసం సిగ్గుండాలి కదా? మా ప్రభుత్వ విధానాలు.. మా నాయకుడి విధానాలే మీ ఎన్నికల నినాదాలుగా మారాయి. గుర్తుపెట్టుకో బిడ్డా నడ్డా..! బీజేపీ పాలిత రాష్ర్టాలతోసహ 11 రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశంసించాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం. కేంద్రం అరపైసా ఇవ్వకపోయినా మేమే నిర్మించాం. ఆ ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందిపోయి సిగ్గుమాలిన మాటలా? కాళేశ్వరాన్ని చూసి సీఎం కేసీఆర్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ స్వయంగా అన్న విషయం నీకు తెలుసా? సోయి ఉండి మాట్లాడుతున్నవా? సోయి తప్పి మాట్లాడుతున్నవా? ఎవడో అడ్డమైనోడు రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదువుడేనా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.


మా పంటలు కొనలేక చేతులెత్తేసి..

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిన మార్పులకు రాష్ట్రంలో పండుతున్న పంటలే నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లక్షల ఎకరాల్లో టన్నులకొద్ది పంటలు పండిస్తుంటే కొనలేమని ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ రైతులు పండించిన పంటను చూసి ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది. ధాన్యం కొనలేం.. మాతోని అయితలేదు.. మేం చేతగానివాళ్లం అని తేల్చేశారు. తెలంగాణలో పాలమూరుకు వెళితే రివర్స్‌ మైగ్రేషన్‌ కనిపిస్తది.. కాళేశ్వరం వెళితే రివర్స్‌ పంపింగ్‌ కనిపిస్తది. పాలమూరుకు ఏపీలోని కర్నూలు నుంచి కూలీలు వస్తున్నారు. ఇక్కడ పనిచేసే హమాలీలు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చినవారే. మీరు పాలించే రాష్ర్టాల్లో ఉపాధి లేకపోతే పొట్టచేత పట్టుకొని ఇక్కడికి వచ్చినవాళ్లను కూడా కరోనా సమయంలో కడుపులో పెట్టుకున్నది కేసీఆర్‌ ప్రభుత్వం’ అని గుర్తుచేశారు.


బరాబర్‌ తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం

కేసీఆర్‌ బరాబర్‌ తెలంగాణ రాష్ర్టానికి ఏటీఎం అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అన్నదాతలకు తోడుండే మిషిన్‌ కేసీఆర్‌ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ది రాజనీతిజ్ఞుడి పాలన (స్టేట్స్‌మెన్‌ పాలన) అయితే, మీది దిక్కుమాలిన సేల్స్‌మెన్‌ పాలన అని బీజేపీపై నిప్పులు చెరిగారు. ‘ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముడు తప్ప మీ మొహాలకు ఏం తెలుసు? ఆ సంస్థలను ఏటీఎంలుగా మార్చుకున్నది మీరు. మాకేం ఖర్మ పట్టింది. మీరంటున్న సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ దేశంలో ఎక్కడున్నది? దిక్కుమాలిన బీజేపీ పాలనలో సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ కాదు.. సబ్‌ కా సాత్‌ సబ్‌ సత్యనాశ్‌.. సబ్‌కా బర్దాస్‌ అయితున్నది. మీ పాలనలో సామాన్యుడికి శోకం.. కార్పొరేట్‌కు కనకాభిషేకం జరుగుతున్నది. సామన్యుడికి పెట్రోల్‌, డీజీల్‌ మీద ఏడేండ్లలో రూ.50 పెరిగింది’ అని ధ్వజమెత్తారు.


నిన్న రైతులను రెచ్చగొట్టి.. నేడు ఉద్యోగులను ఉసిగొలిపే కుట్ర

వరిపంట వేయాలని నిన్నమొన్నటివరకు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఉద్యోగులను ఉసిగొలిపే కుట్ర చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ కుట్రలు తమముందు నడువవు బిడ్డా అని హెచ్చరించారు. ‘కాంటాల్లో వడ్ల నుంచి కంటోన్మెంట్‌లో రోడ్ల దాకా అడుగడుగునా ఈ రాష్ర్టానికి మీరు చేసిన అన్యాయం అందరికీ తెలుసు. మాది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఏడేండ్లల్లో డీఏను కలుపుకొని 87 శాతం జీతాలు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. దేశ చరిత్రలో ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు పెంచిన నాయకుడు సీఎం కేసీఆర్‌. కేంద్రం పెంచింది 15 శాతం మాత్రమే. నిరుద్యోగులపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి ఉన్నదా? బదిలీలు ఎందుకు చేస్తున్నాం? ఎక్కడెన్ని ఖాళీలున్నాయో తేలిన తరువాత వాటిని భర్తీ చేయాలని చూస్తున్నాం. జోనల్‌ వ్యవస్థను అడ్డుకున్నమీరే నోటిఫికేషన్లు ఇవ్వటంలేదని ఆందోళన చేస్తారా? ఇదేం దిక్కుమాలిన వ్యవహారం? దేశంలో గతంలో ఎప్పుడూ లేనంతం నిరుద్యోగిత ఉన్నది బీజేపీ పాలనలోనే కాదా? అత్యధిక ద్రవ్యోల్బణం తెచ్చింది మీరు కాదా? అత్యధిక ప్రభుత్వరంగ సంస్థలను మూసేసిన చరిత్ర మీది కాదా? 317 జీవో గురించి బీజేపీకి తలా తోకా తెలియదు. ఆ జీవోతో రాజకీయ నిరుద్యోగులకు ఏం పని? వాళ్లెవరు? 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కాలనే సదాశయంతో ప్రభుత్వం జీవో తెచ్చింది. అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా ప్రభుత్వం పరిష్కరిస్తది. ఉద్యోగులకు మాకు ఉన్నది పేగుబంధం. బీజేపీ వాళ్లకున్నది తోకబంధం. బీజేపీవాళ్లు ఎప్పుడైనా ఉద్యోగులను పట్టించుకున్నరా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండ్రా? మాకంటే ఎక్కువ జీతాలిచ్చారా? ఉన్న ఉద్యోగాలు పోగొట్టే బీజేపీనా మాట్లాడేది?’ అని మండిపడ్డారు.


విరాట్‌ కోహ్లీ కంటే అమిత్‌షా కొడుకు పెద్ద క్రికెటరా?

కుటుంబ పాలన గురించి మాట్టాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘నడ్డా సొంత అత్త జయశ్రీ బెనర్జీ నిన్నమొన్నటి దాకా ఎంపీ, మంత్రి. ఆయన వచ్చి మాకు నీతులు చెప్తరు. నడ్డా భార్య ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఫ్రంట్‌లైన్‌ ఆర్గనైజేషన్లో ఉండొచ్చు. వసుందరా రాజే ఉండొచ్చు.. యశోదరా రాజే ఉండొచ్చు. విజయరాజే సింధియా ఉండొచ్చు.. వేదప్రకాశ్‌ గోయల్‌ కొడుకు పీయూష్‌ గోయల్‌ ఉండొచ్చు. ఎస్‌ఆర్‌ బొమ్మై కొడుకు బస్వరాజ్‌ బొమ్మై ఉండొచ్చు. యడియూరప్ప కుటుంబం ఉండొచ్చు.. అమిత్‌షా కొడుకు జైషా క్రికెట్‌లో ఏం పొడిసిండు? ఎట్లా బీసీసీఐ కార్యదర్శి అయిండు. సౌరవ్‌ గంగూలీ కన్నా.. విరాట్‌ కోహ్లీకన్నా గొప్ప ప్లేయరా? గీ పొటుగాళ్లు అందరూ ఉండొచ్చు కానీ ఉద్యమంలో ఉండి, ప్రజల చేత గెలిచి వచ్చినవాళ్లు ఉండొద్దా? ఇవేం చిల్లర మాటలు?’ అని ప్రశ్నించారు.


గుండు పోతే గుండు ఫ్రీగా వస్తదా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘బండి సంజయ్‌ గుండును బండకేసి గుద్దుకొంటుంటే పోలీసోల్లు పోయి ఆపిండ్రు. బండిపోతే బండి ఫ్రీ వస్తది.. గుండుపోతే ఫ్రీ ఎట్లా వస్తది? ఎవరు చెప్పాలే ఈ పిచ్చోనికి. కావాలంటే జనంలోకి పోయి కొట్లాడు అంటే లేదు.. నేను పగులకొట్టుకొని కేసీఆర్‌ పగులగొట్టిండు అని చెప్తా? అంటున్నడు. అతను గుండు పగులగొట్టుకొంటుంటే పోలీసులు కేసులు పెడితే, న్యాయమూర్తి రిమాండ్‌కు పంపితే మాకేం సంబంధం. పిచ్చొళ్లను ఎర్రగడ్డకు పంపుతమా? జైళ్ల పెడ్తమా అనేది న్యాయమూర్తి ఇష్టం. తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్తున్నం. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బరాబర్‌ ముందుకే సాగుతాం. బ్రహ్మాండంగా పురోగమిస్తూ వెళ్తాం. దిక్కుమాలిన బీజేపీ పాలనను చీల్చి చెండాడుతం. ప్రతీ అంశంమీద వెంటాడతం. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం నిలదీస్తం. బరాబర్‌ గల్లా పట్టుకొని అడుగతం. ఏం చేస్తరో చేసుకోండి. ఎక్కడిదాకా అంటే అక్కడిదాకా పోరాటం చేస్తాం’ అని స్పష్టంచేశారు. ఈడీ నోటీసులకు, కేసులకు తాము భయపడేరకం కాదని తేల్చిచెప్పారు. ‘మంచివాళ్లు మాట్లాడితే సమాధానం ఇస్తాం. నెత్తిమీద బొచ్చులేనోడు మాట్లాడితే సమాధానం ఇవ్వాల్సిన అవసరంలేదు. నేను నల్లగొండ పర్యటిచింది కొవిడ్‌ మార్గదర్శకాలు అమల్లోకి రాకముందు. ఉత్తర్వులు అమలులోకి వచ్చింది ఒకటో తారీఖు నుంచి. మార్గదర్శకాల కారణంగానే ఖమ్మం పర్యటన రద్దు చేసుకున్నా’ అని తెలిపారు. లక్షలమందితో ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని ర్యాలీలు తీస్తూ, రాత్రయితే మాస్క్‌ పెట్టుకొని టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


మెంటల్‌ బ్యాలెన్స్‌ కోల్పోయింది ఎవరు నడ్డా..?

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరుగలేదని కేంద్రమే పార్లమెంటు సాక్షిగా చెప్పిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా? అని రేవంత్‌రెడ్డి అనే సన్నాసి ప్రశ్న అడిగితే.. ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తన సొంత వనరులతో కట్టిందని, అవినీతి జరిగిన దాఖలాలు తమ దృష్టికి రాలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పింది నిజం కాదా? మతి తప్పింది జల్‌శక్తి మంత్రికా? నీకా? ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మరి మెంటల్‌ బ్యాలన్స్‌ తప్పింది ఎవరికి? మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ గొప్ప పథకాలని నీతి అయోగ్‌ ప్రకటించి, వాటికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. చెడ్డ పథకాలే అయితే నీతి అయోగ్‌ సిఫారసుల్లో నీతి లేదా? నీ దిమాక్‌ల నీతి లేదా? తెలంగాణ మొత్తం నీళ్లు వస్తున్నాయని చెప్పిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు మతి భ్రమించిందా? లేక నీకా? నరేంద్రమోదీ వచ్చి గజ్వేల్‌లో నల్లా తిప్పిపోయిండు.. ఆయనకు మతిలేదా? నీకు మతిలేదా? లేదా మీ ఇద్దరికి శృతిలేదా? మీలెక్క మేము రూ.3 వేల కోట్లతో మేడ్‌ ఇన్‌ చైనా విగ్రహాలు పెట్టలేదు. మీలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం ఇచ్చి మేడ్‌ ఇన్‌ చైనా విగ్రహాలు తేలేదు. మోదీ ప్రభుత్వం కొవిడ్‌ గైడ్‌లైన్స్‌ విడుదల చేస్తది. ఇక్కడ బండి సంజయ్‌ వాటిని ఉల్లంఘిస్తడు. మెంటల్‌ బ్యాలన్స్‌ పోయింది ఎవరికి?’ అని జేపీ నడ్డాను నిలదీశారు.


దయ్యాలు వేదాలు వల్లించినట్టే

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలమంది రైతులు చలిలో పోరాటాలు చేస్తే, రోడ్లపై మేకులు కొట్టి, శిలలు పెట్టి రైతుల కాళ్లు, జబ్బలు ఇరిగేటట్టు చేసిన బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి రైతులపైకి బండెక్కిచ్చి తొక్కి చంపినా పదవినుంచి తొలగించని సిగ్గూ లజ్జాలేని మీరా మాకు చెప్పేది? రైతుల రక్తాన్ని కండ్లచూసిన మీరా మాకు చెప్పేది? అని ధ్వజమెత్తారు. ఇనుప కంచెలుపెట్టి లక్షలమంది రైతుల గోస పుచ్చుకున్న దౌర్భాగ్యులు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతారా? అని నిలదీశారు. ‘గోవా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మణిపూర్‌సహా 8 రాష్ర్టాల్లో మెజారిటీ రాకపోయినా గవర్నర్‌ వ్యవస్థను వాడుకొని, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆగమాగం చేసి ప్రభుత్వాలను మార్చింది ఎవరు? ప్రజలను ఏమార్చింది ఎవరు? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? నడ్డా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహం ముందు మోకరిల్లుతే సిగ్గనిపించింది. చీకట్లో గాడ్సే గొప్పోడు, గాంధీని చంపుడు కరక్టే అంటరు. బయటికి వచ్చి వెలుతురులో గాంధీని మొక్కుతరు. దిక్కుమాలిన పార్టీకి సిగ్గుందా? గాంధీని మొక్కితే క్షమిస్తడా? సిగ్గూ శరం లజ్జ ఉన్నదా? ఇదీ మీ బతుకు’ అని వ్యాఖ్యానించారు.


ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభివృద్ధి చేసినట్టు చూపిన చిత్రాలు ఎక్కడివి?

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఐదేండ్లనుంచి అధికారంలో ఉన్న బీజేపీకి, ఇప్పుడు ఎన్నికల్లో చెప్పుకోవటానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమంకూడా లేదు. ఐదేండ్లు పాలించిన తరువాత ఏ నినాదంతో ముందుకు పోవాలి? మేం ఫలానా పనిచేశాం.. మాకు ఓటేయండి అని ప్రజలను అడగాలి. కానీ వీరి దౌర్భాగ్యం ఏమిటంటే.. అంతకుముందు ఎవరో రాళ్లు విసిరారట. ఈ పోటుగాడు వచ్చాక వాడు వీడి దగ్గరికి వెళ్లి తలవంచుకొని క్షమాపణ చెప్పాడట. ఆ పిలగాడు ఒక ముస్లిం అని మాత్రమే చెప్పలే. మత పిచ్చి.. హిందూ ముస్లింలను వేరు చేసి నాలుగు ఓట్లు తెచ్చుకోవాలనే బక్వాస్‌ జుమ్లా పార్టీ. అదీ వారి దిగజారిన ప్రభుత్వానికి, దిక్కుమాలిన పరిస్థితికి పరాకాష్ట. ఉత్తరప్రదేశ్‌లో మేము రాకముందు గుండాగిరి ఉండేది.. ఇప్పుడు లేదు కాబట్టి ఓట్లేయండి అని అడుగుతున్నారు. ప్రజలకోసం చేసిన పైసా పనిలేదు. పనికొచ్చే ఒక్క పనీలేదు. అంతా చిల్లర రాజకీయం.


ఢిల్లీలో కక్ష -గల్లీలో దీక్ష

రాష్ట్రంనుంచి వడ్లు సేకరించాలని ఢిల్లీకి పోయి అడిగితే తిరస్కరించి, గల్లీలో దీక్షలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణపై కక్షగట్టి సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. ‘ఢిల్లీలో కక్షగడుతరు. ఇక్కడికొచ్చి ఒకరికి మించి మరొకరు డ్రామాలు, స్టంట్లు చేస్తరు’ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీచేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం ఇవ్వమంటే నెలల తరబడి చావగొడతరు. రాష్ట్రపతి దగ్గరనే దాచిపెడుతరు. ముప్పుతిప్పలు పెడుతరు. ఇక్కడేమో నోటిఫికేషన్లు కావాలని దొంగదీక్షలు చేస్తరు’అని విమర్శించారు.

కేటీఆర్‌ పంచ్‌లు

-బీజేపీ అంటే… భారతీయ జుమ్లా పార్టీ
-బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ జుగల్‌బందీ ఏమిటంటే.. జుమ్లా, హమ్లా
-ఎన్డీయే కూటమిలో బీజేపీ భాగస్వాములు ఎవరంటే…
సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ.
-మీడియా ఏమైందంటే… మోడియా
-కేసీఆర్‌ తెలంగాణ రైతుల ఏటీఎం.. అంటే.. అన్నదాతలకు తోడుండే మిషన్‌
-నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్‌ ఎర్రగడ్డ
-నరేంద్ర మోదీ.. రైతు విరోధి
-సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. కేసీఆర్‌
-సబ్‌కా సత్యనాశ్‌.. సబ్‌కా బర్దాస్‌.. మోదీ
-మోదీ పాలన… సామాన్యులకు శోకం.. కార్పొరేట్లకు కనకాభిషేకం
-కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలు.. దిక్కుమాలిన బీజేపీకి నినాదాలు
-మాది స్టేట్స్‌మన్‌ పాలన… మీది సేల్స్‌మన్‌ పాలన
-చీకట్లో గాడ్సే గొప్పోడంటరు.. లష్కర్లో గాంధీకి మొక్కుతరు
-బండి పోతే బండి ఫ్రీగా వస్తది… గుండు పోతే గుండు ఫ్రీగా వస్తదా?
-మేం మేక్‌ ఇన్‌ చైనా విగ్రహాలు పెట్టలేదు.
-గత ఏడేండ్లలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకటనల చిత్రాలను చూపుతూ వాటి అమలు ఏమైందని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.