Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సఫల తెలంగాణ

-ఐదేండ్లలో అపూర్వ విజయాలు..
-చరిత్ర సృష్టించనున్న కాళేశ్వరం..
-ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రమంతటా పచ్చని పైర్లే
-కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం..
-సరికొత్తగా మున్సిపల్, రెవెన్యూ చట్టాలు
-అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకమైన పాలన
-జూలై ఒకటి నుంచి ఆసరా పింఛన్ల రెట్టింపు
-రూ.10వేలకు రైతుబంధు సాయం
-ధనిక రైతులున్నరాష్ట్రంగా తెలంగాణ
-రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్
-గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి
-రైతుల జీవితాల్లో వెలుగు నింపడంకోసం శక్తియుక్తులన్నీ ధారపోస్తా
-ఐదేండ్లలో అవాక్కయ్యేలా అభివృద్ధి సాధించాం
-16.5% తో సుస్థిరంగా వృద్ధిరేటు
-కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నా మానసపుత్రికలు
-అట్టడుగువర్గాలకు అంతర్జాతీయ విద్య: కేసీఆర్

దేశచరిత్రలోనే ఎన్నదగిన మహోద్యమాన్ని సాగించి సాధించుకొన్న తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేండ్లు చిన్నకాలమే అయినప్పటికీ ప్రభుత్వం సాధించిన అసామాన్య విజయాల రీత్యా ఎంతో విలువైన కాలమని పేర్కొన్నారు. కాళేశ్వరంతోపాటు రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించదు.. కనిపించదని సీఎం తెలిపారు. రెండున్నరేండ్ల అతి తక్కువ సమయంలో నిర్మిస్తున్న అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించబోతున్నదన్నారు. వచ్చేనెల చివరినుంచి మేడిగడ్డ బరాజ్ నుంచి ప్రతిరోజు రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతికి ఎంతమాత్రం చోటులేకుండా కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చి పారదర్శకమైన పాలనను అందిస్తామన్నారు. కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడుతామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తనకు సంతృప్తినిచ్చిన ఆసరా పింఛన్లను జూలై ఒకటి నుంచి రెట్టింపుచేస్తున్నామని సీఎం ప్రకటించారు.

సమీప భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచంలోనే ధనిక రైతులకు చిరునామా కాబోతున్నదని, రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న రూ.8 వేలను ఈ ఏడాది నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామని తెలిపారు. ప్రజల దీవెనలే కొండంత అండగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్‌పార్క్‌వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి, తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారికి నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్‌గార్డెన్స్‌లో పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. దాదాపు అరగంటపాటు సాగిన సీఎం ప్రసంగపాఠం సమగ్రంగా ఆయన మాటల్లోనే..

అవాక్కయ్యేలా రాష్ర్టాభివృద్ధి
అనేక అపనమ్మకాలు, అనుమానాల నడు మ ఏర్పడ్డ రాష్ట్రం.. అనతికాలంలోనే వాటన్నింటినీ పటాపంచలుచేసింది. ఎక్కడా తొట్రుపాటు, తడబాటు లేకుండా పాలనలో పరిణతిని ప్రదర్శించింది. నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా, తెలంగాణ ప్రగతిపథంలో పరుగులుతీస్తుంటే అపహాస్యం చేసినవాళ్లు అవాక్కవుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి, పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమిష్టి విజయం. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసినవాళ్లే, కొత్త రాష్ర్టాన్ని ప్రగతిదారుల్లో నడిపిస్తారని తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసాన్ని మేము నూటి కి నూరుశాతం నిలబెట్టుకున్నాం. ప్రభుత్వం పనితీరును మెచ్చి ప్రజలు తమ హృదయంలో మాకెంతటి స్థానం ఇచ్చారన్నదానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టినయి. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా ప్రతి ఎన్నికలో విజయాన్ని కట్టబెడుతూ ప్రజలు మాకు తిరుగులేని బలాన్ని అందిస్తున్నారు.

16.5% వృద్ధిరేటు
ప్రభుత్వం ముందుచూపుతో అవలంబించిన సమర్థమైన ఆర్థిక విధానాలు, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండాచేయడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణను పాటించడంవల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థికశక్తిగా, పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకున్నది. గడిచిన ఐదేండ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వృద్ధిరేటును స్థిరంగా సాధిస్తున్నది. ఈ ధోరణి ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం మరిన్నిరెట్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.

కరంట్ సమస్యను అధిగమించినం
అతి తక్కువ కాలంలో కరంటు సమస్యను సంపూర్ణంగా అధిగమించినం. విద్యుత్‌వ్యవస్థను అధ్వాన్న స్థితి నుంచి అద్భుతం అనే స్థాయికి తీసుకురాగలిగినం. తెలంగాణ ఎక్కడినుంచి ఎక్కడికి చేరుకున్నదో అర్థంచేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. దేశంలో వ్యవసాయంతోసహా అన్నిరంగాలకు 24 గంటలపాటు నిరంతరాయ నాణ్యమైన కరంటు సరఫరాచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. విద్యుత్ సరఫరాలో వచ్చిన గుణాత్మకమైన మార్పు వ్యవసాయరంగానికి, పారిశ్రామికరంగానికి నూతనోత్తేజాన్ని కలిగించింది.

మంచినీటి గోసలేదు
మంచినీటి సమస్య సమగ్ర పరిష్కారం కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సఫలం అవుతుండటం ప్రజల కండ్లముందే ఉన్నది. ఇంత భయంకరమైన వేసవి ఎండల్లోనూ ప్రజలు తాగునీటి కోసం గోసపడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు 97 శాతం పూర్తయినయి. జూలై చివరినాటికి వందకు వందశాతం పూర్తయితయి. పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయబోతున్నాం.

ఆసరాతో వృద్ధులకు భరోసా
సమాజం చివరిఅంచున, నిస్సహాయంగా నిలిచిపోయిన నిరుపేదవర్గాలకు నిజమైన చేయూతనందించడమే ప్రథమ ప్రాధాన్యంగా నిర్ణయించుకున్నాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఒకరేమిటి.. ఎవరైతే పేదరికంతో విలవిల్లాడుతున్నారో వారందరినీ గుర్తించి, కనీస జీవన భద్రత కలిగించేవిధంగా ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తూ ఆదుకొంటున్నది. ఆసరా పింఛన్ల పథకం నాకు అత్యంత, సంతృప్తినీ.. సంతోషాన్ని కలిగిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచి అందించిన పెన్షన్‌ను ఇప్పుడు 2,016కు పెంచుతున్నాం. వికలాంగుల పెన్షన్‌ను 1500 రూపాయల నుంచి 3,016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి, కొత్తగా మరో ఆరేడు లక్షల మందికి పెన్షన్ అందించబోతున్నాం. పెంచిన పెన్షన్లను జూలై ఒకటి నుంచి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నా మానస పుత్రికలు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అచ్చంగా నా మానసపుత్రికలు. ప్రభుత్వం అందించే ఒక లక్షా నూట పదహార్ల ఆర్థిక సహాయంతో ఆడపిల్లల పెండ్లిండ్లుచేసిన పేద కుటుంబాల ఆశీస్సులే మా ప్రభుత్వానికి పెట్టనికోటలయ్యాయి. బలహీనవర్గాలవారికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం అందించాలనే పట్టుదలతో రెండు బెడ్‌రూంల ఇండ్లనిర్మాణం కొనసాగుతున్నది. బడుల్లో, హాస్టళ్లలో విద్యార్థులకు పెడుతున్న సన్నబియ్యం అన్నం పరిపాలనలో మానవీయకోణానికి నిదర్శనం. గర్భిణులకు పౌష్టికాహారం అందించే ఆరోగ్యలక్ష్మి, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకాలు మహిళాసంక్షేమానికి నూతన నిర్వచనంగా నిలిచాయి. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతంచేసే దిశగా బలమైన అడుగులు వేయగలిగాం.

మిషన్ కాకతీయకు అంతర్జాతీయ ప్రశంసలు
శిథిలమైన చెరువులను పునర్జీవింప చేసేందుకు ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాకు నిదర్శనంగా అంతర్జాతీయంగా ప్రశంసలను పొందింది. వ్యవసాయ అనుబంధ వృత్తులకు ప్రోత్సాహాన్ని కలిగించే పథకాలను మనం అమలుచేసుకొంటున్నాం. గొర్రెల పం పిణీ గొల్లకుర్మల దగ్గర జీవసంపదను పెం చింది. రాష్ట్రంలోని నీటి వనరుల్లో చేపల పెంపకానికి కావాల్సిన చేపపిల్లలను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసింది. రాశులకొద్దీ ఉత్పత్తవుతున్న మంచినీటి చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. చేనేత, పవర్‌లూం కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో ప్రభు త్వం చాలావరకు సఫలమైంది. బతుకమ్మ చీరెల తయారీని చేనేత కార్మికులకు అప్పగించి వారికి నిరంతరం పని దొరికేలాచేసింది. 50% సబ్సిడీతో రంగులు, రసాయనాలు అందించటంవల్ల నేత కార్మికులకు ఊరట కలిగింది.

తెలంగాణ గంగా జమునా తెహజీబ్
తెలంగాణ బహుళత్వాన్ని గౌరవించే సమాజం. విభిన్న మతాలు, జాతుల ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే పరస్పరం ఇచ్చిపుచ్చుకొంటూ సహజీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని ఈ సామరస్య సంస్కృతినే మహాత్మాగాంధీ గంగా జమునా తెహజీబ్‌గా ప్రస్తుతించారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి అధికారికంగా జరుపుతున్నది. ఈ పండుగల సందర్భంగా పేదకుటుంబాలకు ఉచితంగా నూతన వస్ర్తాలను పంపిణీచేస్తున్నది. ఆలయాల అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే వేతనాలు అందేవిధంగా సంస్కరణ తెచ్చింది. ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల్లో పూజాదికాలు నిర్వహించేందుకు ఇచ్చే మొత్తాన్ని పెంచింది. మసీదుల్లో ఇమాంలకు, మౌజాన్లకు రూ.5 వేల భృతిని అందిస్తున్నది. ఆయా కులాల విశిష్ట సంస్కృతికి ప్రతీకలుగా ఆత్మగౌరవ భవనాలను రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇం దుకోసం స్థలాలను కేటాయించింది. త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభమవుతుంది.

అట్టడుగువర్గాలకు అంతర్జాతీయ స్థాయి విద్య
అట్టడుగువర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వంతో నూతనంగా 608 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటుచేసింది. ఈ ఆవాస పాఠశాలల్లో శిక్షణ పొం దిన విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో మన రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. ప్రజావైద్యంపై విశ్వాసంపెరిగే విధంగా ప్రభుత్వ దవాఖానల పనితీరును మెరుగుపరిచింది. రాష్ట్రంలో దృష్టి లోపాల నివారణకోసం పెద్దఎత్తున చేపట్టిన కంటివెలుగు ద్వారా నేత్ర పరీక్షలు.. వైద్యం, మందులు, కండ్లద్దాలు ఉచితంగా అందించే పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణకోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. తెలంగాణ ఆరోగ్యసూచిక (హెల్త్ ప్రొఫైల్) రూపొందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.

తలాపునే నీళ్లున్నా.. మడి తడిపే నీళ్లు లేవు
తెలంగాణ అనుభవించిన ఇతర దుఃఖాలన్నీ ఒక ఎత్తయితే, ఒక్క సాగునీటి కోసం అనుభవించిన దుఃఖం ఒక్కటే ఇంకో ఎత్తు. తలాపున గోదావరి, పక్కనే కృష్ణమ్మ పారుతున్నా, మడి తడిపే నీళ్లకు నోచుకోక తెలంగాణ గొడగొడ ఏడ్చింది. బీళ్లకు నీళ్లు మళ్లించే గురుతర బాధ్యతను మా భుజస్కంధాల మీద మోపిన్రు. రైతన్నల కలలను నెరవేర్చే ఈ సవాల్‌ను స్వీకరించి, కోటికి పైచిలుకు ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు గోదావరి, కృష్ణా నదుల మీద ఏకకాలంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకొన్నాం. మొదటిదశలో పెండింగ్ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తిచేసి, ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగాం.

ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఎటు చూసినా పచ్చనిపైర్లే
తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత తెలంగాణలో ఎటుచూసినా పచ్చనిపైర్లే దర్శనమిస్తాయి. తెలంగాణలో కరువు అనే మాట ఇకముందు కనిపించదు, వినిపించదు. 365 రోజులూ తెలంగాణ చెరువులు, రిజర్వాయర్లు, బరాజ్‌లు నిండుకుండలను తలపిస్తాయి. ఏటా రెండు పంటలు పండి, ధాన్యపు రాశులతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరిస్తుంది. పెరిగే వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నూతనోత్తేజాన్ని ఇస్తాయి. నదిపొడవునా నిలిచే నీళ్లు, నిండుగా జలాశయాలు, పెరిగే భూగర్భ జలాలతో తెలంగాణ ఎకానమీ మాత్రమే కాదు, ఎకాలజీ అంటే పర్యావరణం కూడా మారిపోతుంది.

రైతుబంధు ప్రపంచానికే ఆదర్శం
రైతులకు పంటకాలంలో కావాల్సిన పెట్టుబడిని అందించడంకోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతుల హృదయాల్లో హర్షం నింపింది. ఎకరానికి నాలుగువేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలు అందించి, పెట్టుబడి కోసం అప్పులుచేయాల్సిన అగత్యాన్ని నివారించగలిగాం. రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి, ఈ ఏడాదినుంచే అందిస్తున్నామనే శుభవార్తను రైతులోకానికి తెలియజేస్తున్నాను. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే, అతని కుటుంబం అగాధంలో పడవద్దని ఎంతో ఆలోచించి రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. బీమా ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి, మరణించిన రైతు కుటుంబానికి రూ.ఐదు లక్షల జీవిత బీమా మొత్తాన్ని సత్వరమే అందించుకోగలుగుతున్నాం. రైతులందరూ ఒకేపంట వేయడం వల్ల, డిమాండ్ తగ్గి తగిన ధర రాకుండాపోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నాం. నేను కంటున్న కల ఒకటే. రైతుల తలరాతలు మారాలె. భారతదేశంలో ధనవంతులైన రైతాంగం ఎక్కడున్నారంటే, తెలంగాణలో అని చెప్పుకొనే రోజులు రావాలని నేను ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ కల నెరవేరేదాకా అవిశ్రాంతంగా పరిశ్రమిస్తాను. అంకితభావంతో కృషిచేస్తాను. భగవంతుడు నాకిచ్చిన శక్తియుక్తులన్నింటినీ ఈ పవిత్ర లక్ష్యం కోసం ధారపోస్తానని మనవిచేస్తున్నాను.

కాలం చెల్లిన వ్యవస్థలకు చరమగీతం
దశాబ్దాల తరబడి తెలంగాణలో సాగిన అస్తవ్యస్త విధానాలవల్ల స్థానిక పాలనావ్యవస్థలు చతికిలపడిపోయాయి. అందుకే ప్రభుత్వం స్థానికసంస్థల పనితీరును పునర్నిర్వచిస్తూ కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పనచేసింది. గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు ఏటా మొత్తం 2,458 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందుతాయి. నూతన చట్టం పరిధిలో గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు. విధుల నిర్వహణలో విఫలమయినవారిని ఈ చట్టం ఉపేక్షించదు. కఠినమైన శిక్షలు విధిస్తుంది. పదవుల నుంచి తొలిగిస్తుంది.

చట్టాలను మారుస్తాం
పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిపాలనలో క్రమబద్ధతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ప్రభు త్వం కొత్త పురపాలకచట్టాన్ని రూపొందిస్తున్నది. ఈ చట్టం ద్వారా పట్టణాలు, నగరాలు అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా పెరుగకుండా ఉండేందుకు కావాల్సిన కఠిననియమాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. కాలంచెల్లిన భావనలతో మన వ్యవస్థలు ఇంకా కొనసాగుతుండటం విచారకరం. చేసే పని మారినా, పేరు.. తీరు మారని భావదారిద్య్రంలో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఉదాహరణకు భూమిశిస్తు వసూలుచేసే కాలంలో రెవెన్యూశాఖ ఏర్పడింది. భూమిశిస్తు అనే మాటే ఇప్పుడు లేదు. రెవెన్యూ వసూలుచేసే పనిపోయినా, ఆ శాఖకు రెవెన్యూ అనేపేరు పోలేదు. రెవెన్యూను కలెక్ట్‌చేసే బాధ్యత పోయినా, కలెక్టర్ అనే మాట మారలేదు. ఇటువంటి అసంగతమైన విషయాలు చట్టంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫ్యూడల్ కాలంలో రూపొందించిన చట్టంలో అవినీతికి ఆస్కారమిచ్చే లొసుగులు అట్లనే ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకున్న సందర్భంలో ఈ లోపాలన్నీ ప్రభుత్వ సంకల్పానికి అడ్డుగోడలుగా మారినాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ చట్టాన్ని పునరావలోకనం చేయడానికి, పునస్సమీక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రైతులు పడుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ చట్టం అమలులో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఆశిస్తున్నది, ఆహ్వానిస్తున్నది. తెలంగాణ ప్రజలకు మొదటినుంచీ సామాజిక లక్ష్యాలను సాధించే చైతన్యం ఉన్నది. సుపరిపాలన కోసం కావాల్సిన మార్పులను సాధించడం పెద్ద కష్టమేమీకాదు. కావాల్సింది సంకల్ప శక్తి, సమన్వయ దృష్టి. ఈ దిశగా మనందరం పట్టుపట్టి, జట్టుకట్టి ముందడుగు వేయాలి. అవినీతికి అడ్డుకట్టలు వేస్తూ, పారదర్శక పరిపాలనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలి.

చరిత్ర సృష్టించనున్న కాళేశ్వరం
గోదావరి మీద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ తలరాతను మార్చబోతున్నది. ప్రపంచంలోనే అత్యంతవేగంగా నిర్మాణమైన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలువబోతున్నది. రెండున్నరేండ్ల అతితక్కువ సమయంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించగలగడం ప్రభుత్వ సమర్థతకు, సాంకేతిక ప్రతిభకు నిదర్శనం. వచ్చేనెల చివరినుంచి మేడిగడ్డ బరాజ్ ద్వారా ప్రతిరోజు రెండు టీఎంసీల చొప్పున గోదావరి నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీలను ఎత్తిపోసేందుకు వీలు గా నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండేందుకు చాలినంత సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజె క్టు తెలంగాణ వరదాయినిగా అవతరించబోతున్నది. సముద్రమట్టానికి 90 మీటర్ల ఎత్తునుంచి 618 మీటర్ల ఎత్తుదాకా నీళ్లను ఎత్తిపోసే ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు నీటిపారుదలశాఖ సన్నద్ధంగా ఉన్నది. భూగర్భాన్ని తొలిచి నిర్మించిన సొరంగాల గుండా ప్రవహించి వచ్చే, గోదావరి జలాలు తెలంగాణ పొలాలను తడుపుతుంటే రైతుల బతుకులు బాగుపడేరోజు దగ్గరలోనే ఉన్నదని తెలియజేస్తున్నాను. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మొత్తం, మహబూబాబాద్ జిల్లాలో కొంతభాగానికి పుష్కలంగా సాగునీరు లభించేవిధంగా సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ధప్రాతిపదికన నిర్మాణమవుతున్నది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీర్చేందుకు దేవాదుల ప్రాజెక్టు స్థాయిని మరింత పెంచి నిర్మించుకుంటున్నం.

మొక్కలు నాటుదాం కదలిరండి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. పచ్చదనాన్ని 33% పెంచడానికి ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు విధిగా పాల్గొని, విరివిగామొక్కలు నాటాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధితో పనిచేసి హరిత తెలంగాణను ఆవిష్కరించుకోవాలె. సస్యశ్యామల, సమశీతల తెలంగాణను నిర్మించుకుందాం. జైహింద్, జై తెలంగాణ.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.