– 17 నుంచి ప్రతి ప్రాజెక్టునూ పరిశీలించనున్న సీఎం..! – అవసరమైతే కొండ ప్రాంతాల్లో టూవీలర్‌పై సందర్శన – వీలుకాకుంటే హెలికాప్టర్‌లో సర్వే – ఆయనతోపాటే అధికారులు, సర్వేయర్లు – జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతలకు ప్రాధాన్యం – నీటిపారుదల రంగంపై అధికారులతో కేసీఆర్ సమీక్ష – కాంట్రాక్టర్ల కోసం కాదు-రైతుల కోసం ప్రాజెక్ట్‌లు.. – పైసా అవినీతి జరిగినా సహించేదిలేదని స్పష్టీకరణ

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఈ నదులపై రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 17 నుంచి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. నీటిపారుదల రంగంపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయించారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, కొత్తగా నిర్మించాల్సిన వాటిపై స్వయంగా పరిశీలన జరుపనున్నారు. ప్రాజెక్టుల సందర్శనకు అవసరమైతే టూవీలర్‌పై కూడా వెళ్లాలని, అదీ వీలు కాకుంటే హెలికాప్టర్‌లో వెళ్లాలని నిర్ణయించారు. రైతులకు త్వరితగతిన సాగునీరందించేందుకు ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయటం, వాటికి కాలువలు తవ్వటం తదితర విషయాలను పరిశీలించనున్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో తెలంగాణలో నీటిపారుదల రంగం అవినీతి మయంగా మారిందని, దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని సమీక్షా సమావేశంలో సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్‌పై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి అరవింద్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కృష్ణా, గోదావరి బేసిన్‌లో నీటిపారుదల వ్యవస్థ, రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల పురోగతి, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్‌ల పరిస్థితిపై జిల్లాల వారిగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రాజెక్ట్‌లు కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడ్డాయని, వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా రైతులకు సాగునీరందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల ప్రజాధనం పుట్నాలు బుక్కినట్లు బుక్కారు తప్ప రైతులకు నీరివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విషవలయంలో చిక్కుకున్న నీటిపారుదల రంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
గతంలో జరిగిన తప్పులు రాష్ట్రంలో జరగడానికి వీలులేదని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా కాకుండా రైతులకు ఉపయోగపడేలా ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరగాలన్నారు. జూరాల -పాకాల ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌ల సర్వే మూడునాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎత్తిపోతల ద్వారానే కాకుండా గ్రావిటీ ద్వారా కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. సమీక్షకు సర్వేయర్లను కూడా పిలిపించి తగు సూచనలు చేశారు. తనతో పాటు అధికారులు, నిపుణులనుకూడా తీసుకెళ్లి ఏరియల్ సర్వే నిర్వహిస్తానని చెప్పారు.
ఆంధ్రప్రాంత ప్రయోజనాల కోసమే కొన్ని తెలంగాణ ప్రాజెక్ట్‌లు నిర్మించారని, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం అన్నారు. అలాంటి ప్రాజెక్ట్‌లు ఇకపై తెలంగాణలో ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లన్నింటిపై రీసర్వే జరుపాలని ఆదేశించారు. సిద్దిపేట పాములపర్తిలో భారీ రిజర్వాయర్లను నిర్మించి ఎక్కువనీటిని నిలువచేసుకోవాలని సూచించారు. రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్ట్‌లపైనే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న అంతర్‌రాష్ట్ర ప్రాజెక్ట్‌లపై కూడా చర్చ జరిగింది. పూడిక పేరుకుపోయిన ప్రాజెక్ట్‌లలో ఇసుక తోడేందుకు క్వారీలకు అనుమతించే అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.