Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సాగునీటిరంగానికి కొత్తదశ

-అన్ని సాగునీటి ఇంజినీరింగ్‌ విభాగాలు ఒకే గొడుకు కిందకు
-నిండుగోదావరిని చూసి పులకించిన అపర భగీరథుడు
-తెలంగాణ భూములను మాగాణం చేయాలని గంగమ్మకు పూజలు
-గోదావరి నదిపై ఏరియల్‌ సర్వే
-కాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేకం
-ఆలయాభివృద్ధికి రూ.వందకోట్లిస్తామని వెల్లడి
-11 సర్కిల్స్‌గా సాగునీటి ఇంజినీరింగ్‌ వ్యవస్థ
-సర్కిల్‌ అధిపతిగా చీఫ్‌ ఇంజినీర్‌
-రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ
-బరాజ్‌ల ఆపరేషన్‌ రూల్స్‌ సిద్ధంచేయాలి
-కరీంనగర్‌ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌

స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ పీఠభూమిపై మునుపెన్నడూ కనీవినీ ఎరుగని జలనిధిని చూసి అపరభగీరథుడు, సీఎం కేసీఆర్‌ ఉప్పొంగిపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో రేయింబవళ్లు ఏ కలనైతే కన్నారో.. ఆ కల సాకారమైన దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. తెలంగాణ బీడుభూములను అణువణువూ తన స్పర్శతో సస్యశ్యామలంచేస్తున్న గోదావరి గంగమ్మకు జోతలు పట్టి పూజలుచేశారు. నాణేలు విసిరి తెలంగాణను ఆకుపచ్చగా మార్చాలని వేడుకొన్నారు. కేవలం మూడున్నరేండ్ల వ్యవధిలో రికార్డుస్థాయిలో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం ‘కాళేశ్వరం’లో ప్రధానమైన లక్ష్మీ బరాజ్‌లో 16 టీఎంసీల నీటిని చూసి తన్మయంచెందారు.

రాష్ట్ర సాగునీటిరంగానికి సరికొత్త దశదిశను సీఎం నిర్దేశించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా సాగునీటి లక్ష్యాల సాధనకోసం నీటిపారుదల, ఇంజినీరింగ్‌ విభాగాలను పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సాగునీటిరంగానికి సంబంధించిన అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొనిరావాలని సూచించారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రందాకా రోజంతా జరిపిన పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్మీబరాజ్‌ను సందర్శించడంతోపాటు ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.

కాళేశ్వర ముక్తీశ్వరస్వామికి అభిషేకాదులు నిర్వహించి.. ప్రార్థనలుచేశారు. పార్వతీదేవిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ప్రాజెక్టుల పరిశీలన అనంతరం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా ఏటా 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని నిర్దేశించారు. మే మాసంలో రాష్ట్రంలోని అన్ని సాగునీటి కాల్వలకు అవసరమైన మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ఇంజినీరింగ్‌ వ్యవస్థను మొత్తం 11 సర్కిళ్లుగా విభజించనున్నట్లు చెప్పారు.

సర్కిల్‌ అధిపతిగా చీఫ్‌ ఇంజినీర్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సర్కిల్‌ పరిధిలో సాగునీటికి సంబంధించి ఏ అంశమైనా.. సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌ బాధ్యత వహిస్తారని చెప్పారు. జూన్‌ నెలాఖరులోగా నీటిపారుదల ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఖాళీలు భర్తీచేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆపరేషన్‌ నిర్వహణ ప్రభావవంతంగా చేపట్టడానికి వీలుగా ఇంజినీరింగ్‌ అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి ప్రాజెక్టుల వద్ద కనీస వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం, ఇతర అవసరాలకోసం రూ.120 కోట్లు మంజూరుచేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఏప్రిల్‌ నెలాఖరులోగా ఇరిగేషన్‌ అధికారులు, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని పేర్కొన్నారు. సాగునీటి కాల్వలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మతు పనులను పూర్తిచేయాలని సీఎం స్పష్టంచేశారు.

కరీంనగర్‌లో 161 చెక్‌డ్యాంలు
కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మంజూరుచేసిన 161 చెక్‌ డ్యాంల నిర్మాణాన్ని మే 15లోగా పూర్తిచేయాలని ఇరిగేషన్‌ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు మరిన్ని చెక్‌డ్యాంలు కావాలని కోరుతున్నందున ఆ మేరకు అదనంగా చెక్‌ డ్యాంలను నిర్మించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు తక్కువగా కోట్‌చేసి పనులను దక్కించుకొన్న ఏజెన్సీలు సకాలంలో పనులను పూర్తిచేయకపోవడం వల్ల ఉద్దేశిత లక్ష్యాలు నెరవేరడంలేదని, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఏజెన్సీలను గుర్తించి సస్పెండ్‌చేయాలని తెలిపారు.

సదరు ఏజెన్సీలకు భవిష్యత్‌లో తిరిగి పనులు అప్పగించకుండా చూడాలని చెప్పారు. గోదావరి ప్రధాన ఉపనది అయిన ప్రాణహితలో వాస్తవ నీటి పరిమాణాన్ని తెలుసుకునేందుకు వీలుగా కాళేశ్వరం నుంచి తుమ్మిడిహెట్టి వరకు ఐదు నుంచి ఆరు చోట్ల గేజెస్‌లను ఏర్పాటుచేయాలన్నారు. ప్రతిఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భగీరథ పథకాన్ని చేపట్టిందని, దీనిద్వారా 56 లక్షల కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు నల్లాలను విరగ్గొట్టడం, పనిచేయకుండా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయనీ, అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలనీ, అప్పటికీ వినకపోతే రూ.5 వేల జరిమానా విధించాలని సీఎం ఆదేశించారు.

కరీంనగర్‌తోపాటు నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ విజయ, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ సునీల్‌రావు, ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌, సీఎం వో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, నగర కమిషనర్‌ క్రాంతి, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వచ్చే జూన్‌ నుంచి 530 టీఎంసీలు ఎత్తిపోయాలి
వచ్చే జూన్‌ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు అన్ని విధాలుగా సంసిద్ధులై ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. లక్ష్మీ బరాజ్‌ (మేడిగడ్డ), సరస్వతి బరాజ్‌ (అన్నారం), పార్వతి బరాజ్‌ (సుందిల్ల), ఎల్లంపల్లి రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటిని ఏప్రిల్‌ 10వ తేదీలోగా ఖాళీచేయాలని సూచించారు. తద్వారా వానకాలంలో మరింతగా గోదావరి జలాలను ఒడిసిపట్టే ఆస్కారం ఉంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ దాకా పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సమాచారాన్ని వేగంగా అందిపుచ్చుకొనేందుకు వీలుగా వైర్‌లెస్‌ సెట్లను కొనుగోలుచేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బరాజ్‌ల ఆపరేషన్‌ రూల్స్‌ కార్యాచరణను సిద్ధంచేయాలన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.