Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సకల మతాల సర్కారు మాది

-సీఎం కేసీఆర్‌ అన్ని మతాలను గౌరవిస్తారు
-యాదాద్రిని నిర్మిస్తూనే క్రిస్టియన్‌ భవన్‌కు నిధులిచ్చారు
-దేశంలో క్రైస్తవ మిషనరీల సేవలు గుర్తుంచుకోదగ్గవి
-క్రైస్తవ పెద్దలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్‌

హిందూ ధర్మాన్ని గొప్పగా నమ్మి.. యాగాలను నిర్వహించే సీఎం కేసీఆర్‌.. హిందువుగా తన ధర్మాన్ని కొనసాగిస్తూనే క్రైస్తవ, ముస్లిం మతాల నమ్మ కాన్ని సైతం మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. ఈ కారణంగానే బతుకమ్మతో పాటు క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలను ప్రభుత్వపరంగా మన రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తున్నం. సీఎం కేసీఆర్‌ మాటల సెక్యులరిస్ట్‌ కాదు.. గుండె లోతుల్లోనుంచి తన భావాలను అమలుచేసే సెక్యులరిస్టు.
– మంత్రి కే తారకరామారావు

రాష్ట్రంలో సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి విధానాలను అమలుచేస్తూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలకు టీఆర్‌ఎస్‌ ప్రతినిధిగా హాజరైన తాను దేశంలో సమగ్రాభివృద్ధికి ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ సూత్రాన్ని అమలుచేయాలని ప్రధానికి సూచించానని చెప్పారు.ఈ విధానం దేశంలో అమలుకాకున్నా తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నామని తెలిపారు.మంత్రుల నివాసం ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో శుక్రవారం జరిగిన క్రైస్తవ మత పెద్దలు, ప్రముఖుల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారత్‌ వివిధ మతాలు, కులాలు, జాతులు కలిగిన వసుధైక కుటుంబమని చెప్పారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా జీడీపీ 1980లో ఇండియాకంటే తక్కువ అని తెలిపారు. 2020లో చైనా జీడీపీ ప్రపంచంలో రెండోస్థానంలో ఉంటే, భారత్‌ ఎక్కడో ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.

సేవల్లో ముందున్న క్రైస్తవ మిషనరీలు
దశాబ్దాలుగా దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా క్రైస్తవ మిషనరీలు ముందుండి సేవలందించాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తాను పుట్టింది కరీనంగర్‌ క్రిస్టియన్‌ హాస్పిటల్‌లోనేనని చెప్పారు. బాల్యంలో పలు పాఠశాలలు మారిన తాను ఎక్కువకాలం చదివింది సెయింట్‌ జార్జ్స్‌లోనే అని గుర్తుచేసుకున్నారు. హిందూ ధర్మాన్ని గొప్పగా నమ్మి.. యాగాలను నిర్వహించే సీఎం కేసీఆర్‌.. హిందువుగా తన ధర్మాన్ని కొనసాగిస్తూనే క్రైస్తవ, ముస్లిం మతాల నమ్మకాన్ని సైతం మనస్ఫూర్తిగా గౌరవిస్తారని చెప్పారు. ఈ కారణంగానే బతుకమ్మతోపాటు క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలను ప్రభుత్వపరంగా మన రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ గుండె లోతుల్లోనుంచి తన భావాలను అమలుచేసే సెక్యులరిస్టు అని కొనియాడారు. ఒక వైపు యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తూనే మరోవైపు క్రిస్టియన్‌ భవన్‌ నిర్మించేందుకు నిధులు, స్థలాన్ని మంజూరు చేశారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సేఫ్టీలో, సెక్యూరిటీలో, ఆర్థికంగా బలంగా ఉన్నదని, సమర్థ నాయకత్వంలో తెలంగాణ జీఎస్డీపీ జాతీయ స్థాయికన్నా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. క్రైస్తవుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, రాష్ట్రంలో క్రైస్తవ సలహా సంఘం ఏర్పాటు చేయాలని తాను కూడా మంత్రి ఈశ్వర్‌ను కోరుతున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. మత పెద్దలు వ్యక్తం చేసిన అభిప్రాయలను సీఎంకు వివరిస్తామని, క్రిస్టియన్‌ భవన్‌ను త్వరలో పూర్తిచేస్తామన్నారు.

క్రైస్తవులకు మేలు జరిగేలా..
ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 204 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభించుకున్నామని, ఇందులో 8వేల మంది క్రైస్తవ పిల్లలు చదువుకుంటున్నారని మంత్రి తెలిపారు. క్రైస్తవ శ్మశానవాటికలకు స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిని అభివృద్ధి పరచి ఇస్తున్నామని, క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్‌ పాత్ర అద్వితీయమని, ఆయన డైనమిక్‌ మినిస్టర్‌ అంటూ కొప్పుల ఈశ్వర్‌ ప్రశంసించారు.

సంతోషంగా అన్నివర్గాలు
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అంతటా అభివృద్ధి కనిపిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు కొనసాగడానికి మంత్రి కేటీఆర్‌ ఆలోచన విధానమే కారణమని చెప్పారు. క్రిస్టియన్ల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ క్రిస్మస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడం గొప్పవిషయమని చెప్పారు.

క్రైస్తవులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడంలో విజయం సాధిస్తున్నదని క్రైస్తవ మతపెద్దలు పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్నట్టుగా క్రైస్తవులకు 3% రిజర్వేషన్లు కల్పించాలని, నామినేషన్‌ పోస్టుల్లో ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, సికింద్రాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.