Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సకల వస్ర్తోత్పత్తి సమ్మేళనం

సకల వస్త్ర ఉత్పత్తుల సమగ్ర సమ్మేళనంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్కు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉత్పత్తి చేసిన వస్ర్తాలను అక్కడే విక్రయించేలా మార్కెట్ సదుపాయం కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పార్కువల్ల ఇక్కడ భారీస్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన జరగాలని ఆయన ఆకాంక్షించారు.

KCR-Review-on-Textile-industry

-వరంగల్‌లో సమగ్రంగా టెక్స్‌టైల్ పార్కు -కసరత్తు ముమ్మరంచేసిన సర్కార్ -సూరత్‌కు కడియం నేతృత్వంలో అధ్యయన బృందం -నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశం -కేజీ టు పీజీపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం -విదేశాల్లో అధ్యయనానికి అధికారుల బృందం.. సీఎం వెల్లడి ఈ పార్కుకు తుదిరూపు ఇచ్చేముందు సూరత్, సోలాపూర్, తిర్పూరుల్లో వస్త్రపరిశ్రమను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక బృందం సూరత్‌లో పర్యటించి ఈ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వరంగల్ టెక్స్‌టైల్ పార్కు, కేజీ టు పీజీ విద్యావిధానాలపై అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. కేజీ టు పీజీ విద్య సమీక్షలో ప్రసంగించిన సీఎం, రాష్ట్రంలో అత్యుత్తమ విద్యావిధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తరుఫున ఒక బృందాన్ని దేశ విదేశాల్లో అత్యున్నత విద్యా విధానం అమలు చేస్తున్న ప్రాంతాలకు పంపి, అధ్యయనం చేయిస్తానని చెప్పారు.

విద్యావిధానాన్ని ఆషామాషీగా తీసుకోబోమని, మొత్తం సమాజంతో ముడిపడ్డ ఈ అంశంపై విస్తృతస్థాయి చర్చకోసం త్వరలో ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్లు, విద్యావంతులు, విద్యారంగంలో అనుభవం ఉన్న వారితో రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవలంబించే విద్యా విధానం, వృత్తి నైపుణాన్ని పెంచే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీ పడేలా ఉండాలని ఆకాంక్షించారు.

కడియం నేతృత్వంలో అధ్యయన బృందం.. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు ప్రాజెక్టు రూపకల్పన కోసం సూరత్, షోలాపూర్, తిర్పూర్ వంటి నగరాల్లో అధ్యయనం చేసేందుకు వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఈ వారంలోనే సూరత్‌లో పర్యటించి నెలాఖరులోగా అధ్యయన నివేదిక ఇస్తుంది. సూరత్‌లోని మగ్గాల పరిశ్రమలో వరంగల్ జిల్లానుంచి వెళ్లిన సుమారు 3 లక్షల మంది వస్ర్తాలు నేస్తున్నారని సీఎం చెప్పారు.

తెలంగాణవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి టెక్స్‌టైల్ పరిశ్రమలో పని చేస్తూ వృత్తిలో నైపుణ్యం, అనుభవం సంపాదించినవారు లక్షల్లో ఉన్నారని చెప్పారు. అలాంటి వారందరినీ ప్రాజెక్టుకోసం వినియోగించుకోవాలన్నారు. సూరత్‌లో చీరలు, సల్వార్ కమీజులాంటి ఉత్పత్తులు ఎక్కువగా ఉంటే, షోలాపూర్‌లో చద్దరు, తిర్పూర్‌లో డ్రెస్ మెటీరియల్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. ఈ మూడు రకాల ఉత్పత్తులతో పాటు ఇతర అన్ని రకాల వస్ర్తోత్పత్తి వరంగల్ పార్కులో జరిగేలా సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ రంగంపై ఆధారపడిన వారు ఇక్కడే పని చేసుకొని బతకాలని ఆకాంక్షించారు. వరంగల్ నగరం చుట్టూ ప్రభుత్వ భూములు సేకరించామని, వాటిలోనే టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటవుతుందని ప్రకటించారు. నాణ్యమైన వస్తువులను, వస్ర్తాలను విక్రయించడానికి అనువుగా మార్కెట్‌ను కూడా నిర్మిస్తామని చెప్పారు.

మెరికల్లాంటి విద్యార్థులు రావాలి.. తెలంగాణ రాష్ట్రం అవలంబించే నూతన విద్యా విధానం, వృత్తి నైపుణాన్ని పెంచే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీ పడేలా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కేజీ టు పీజీ విద్యా విధానం అంశంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఉప ముఖ్యమంత్రి డా రాజయ్య, విద్యా శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జగన్నాధ్‌రెడ్డి, విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ (విద్య) దేశపతి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన విద్యావిధానం భావితరాలను ఉత్తమ పౌరులుగా, దేశానికి ఉపయోగపడే మానవ వనరులుగా తయారు చేసే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్యపై ఖర్చు వృథా పెట్టుబడి అనే నీచ ప్రచారంకూడా గతంలో జరిగిందని, ఫలితంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చును అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమంగా భావిస్తున్నదని చెప్పారు. కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ఏ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలి? ఏ వయస్సు నుంచి పిల్లలు హాస్టల్లో ఉండడం మంచిది? విద్యా బోధన చేయడానికి ప్రభుత్వం ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారా? వారికి అదనంగా ఏమైనా శిక్షణనివ్వాలా? బోధన అంశాలు ఎలా ఉండాలి? తదితర విషయాలపై సీఎం చర్చించారు. ఈ అంశంపై ఒక రౌండ్‌టేబుల్ సమావేశం, వివిధ ప్రాంతాల్లో ఉత్తమ విద్యావిధానల అధ్యయనం అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

తొలుత నియోజకవర్గ స్థాయిలో.. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా మొదటి సంవత్సరం నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించి, నిర్వహణలోని సాధక బాధకాలను గమనించి మరుసటి ఏడాది నుంచే పాఠశాలలను విస్తరించాలని సీఎం నిర్ణయించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు పది నుంచి పదిహేను ఎకరాల స్థలంలో ఉండాలని, హాస్టల్, స్కూల్, ప్లేగ్రౌండ్, డైనింగ్ హాల్ నిర్మాణాలన్నీ ఆధునికంగా, సౌకర్యవంతంగా నిర్మించాలని అన్నారు.

అటాచ్డ్ టాయిలెట్‌తో కూడిన గదిలో నలుగురు విద్యార్థుల చొప్పున మాత్రమే ఉండాలని, ఆహారం కూడా పోషక విలువలతో కూడినదై ఉండాలన్నారు. పప్పు, చారుతో సరిపెట్టకుండా గుడ్డు, తాజా, నాణ్యమైన కూరగాయలుండాలని సీఎం చెప్పారు. కలెక్టర్, ఎస్‌పీల వంటి అధికారుల పిల్లలుకూడా ఈ పాఠశాలల్లో చదవాలన్నారు.

రాష్ట్రమంతా ఒకే తరహా పాఠశాలలు, ఒకే సిలబస్, ఒకే భోజనం మెనూ, ఒకే పద్ధతి, ఒకే పరీక్షల విధానం ఉండాలని చెప్పారు. కుల మతాల గురించి పట్టింపు లేకుండా పిల్లలందరూ ఒకే చోట చదవడం వల్ల అంతరాలు లేని సమాజం సృష్టించవచ్చని సీఎం అభిలషించారు.

పాఠ్యాంశాల్లో శాంతి భద్రతలు, మహిళల పట్ల గౌరవంగా ఉండడం, సాంస్కృతిక వికాసం, నైతిక ప్రవర్తన లాంటి అంశాలు ఉండాలన్నారు. భవిష్యత్‌లో ఎంత మంది డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు, వృత్తి నిపుణులు కావాలో ముందుగానే అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే స్థాయికి ఈ విద్యావిధానం చేరాలని ముఖ్యమంత్రి అన్నారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జగన్నాథ్‌రెడ్డి, విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ (విద్య) దేశపతి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టెక్స్‌టైల్ పార్కుతో వైభవం వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా తమ వృత్తికి పూర్వ వైభవం వస్తుందని చేనేత, నేత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హన్మకొండ, గీసుకొండ మండలాల పరిధిలో దాదాపు 1850 ఎకరాల ప్రభుత్వ భూములను టెక్స్‌టైల్ పార్కు కోసం గుర్తించారు. వీటిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు త్వరలోనే అప్పగించనున్నారు. అన్ని మౌలిక సదుపాయాలను టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు.

ఈ పార్కులో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇటీవల రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు దుబాయికి వెళ్లి అక్కడి టెక్స్‌టైల్ పార్కును సందర్శించారు. ఆ నమూనాలో ఇక్కడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దుబాయిలోని టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణకు చెందిన పెట్టుబడిదారులు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ స్వస్థలాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించారు. అదే విధంగా నైపుణ్యం ఉన్న కార్మికులకు కూడా వేలాదిగా ఉన్నారు. వారికి కూడా తెలంగాణలోనే ఉపాధి అవకాశాలు లభిస్తే తిరిగి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.