Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సకలజనుల సౌభాగ్యం

-బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు -సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి -ఇదే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం పురోగమిస్తున్నది -ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా -అదేరోజు నుంచి కంటివెలుగుకు శ్రీకారం -సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ పథకాలు -యావత్ దేశం దృష్టిని ఆకర్షించాం -ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలో మన పథకాలు -21% ఆదాయం వృద్ధితో నంబర్‌వన్ -నిరంతర ఆరాటంలోంచి ఉద్భవించిందే రైతుబంధు -బీమాపత్రాలు కావవి.. రైతుకు అందించే భద్రతాపత్రాలు -తెలంగాణకు జీవనదాయిని కాళేశ్వరం -ఇక క్రియాశీలకంగా పంచాయతీ పాలకవర్గాలు -రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు

సకల జనుల సౌభాగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నదని తెలిపారు. గడిచిన నాలుగేండ్లలో బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేయగలిగామని అన్నారు. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించామని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యవసాయానికి వరదాయిని, తెలంగాణకు జీవనదాయినిగా సీఎం అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి హాజరైన సీఎం.. జాతీయజెండా ఎగురవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం గత నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ఆలోచనలను వివరించారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు పేరిట నేత్ర పరీక్షలను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు అందించే బీమా పత్రాలు.. రైతుల కుటుంబాలకు భద్రతా పత్రాలని అభివర్ణించారు. త్వరలో నూతన రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

రైతులను ఆదుకునేందుకే రైతుబంధు వ్యవసాయ సీజన్ వస్తే పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడుతారో ఒక రైతుగా నాకు తెలియంది కాదు. పెట్టుబడి కోసం ఇండ్లు, భూము లు, నగలు కుదువపెట్టి, అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇంతాచేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. వచ్చినా గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో తెలియదు. ఫలితంగా రైతులు అప్పులపాలై చితికిపోయేవారు. ఈ పరిస్థితుల నుంచి రైతును బయటపడేయాలి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.. ఎంత భారమైనా రైతులను మరింత ఆదుకోవాలి.. వారి ముఖంలో ఆనందం చూడాలి.. అనే నిరంతర ఆరాటంలోంచి ఉద్భవించిందే రైతుబంధు పథకం. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి రూ.8వేల చొప్పున ఈ ఏడాది నుంచే పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తొలి విడుత చెక్కుల పంపిణీతో గ్రామాల్లో, రైతాంగంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పథకం రైతన్నలలో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి తొలిగించింది. ఈ పథకం ప్రారంభంతో ఇన్నాళ్లకు రైతు మోములో ఆనందాన్ని చూడగలుగుతున్నాం. ఈ పథకం ఇతర రాష్ట్రాలలోనే కాదు, విదేశాలలో ఉంటున్నవారిలో కూడా చైతన్యం కలిగించింది. కొంతమంది సంపన్నవర్గాల రైతులు, దాతలు తమకు వచ్చిన పెట్టుబడి మొత్తాలను రైతు సంక్షేమానికే వినియోగించాలంటూ ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు మన కార్యక్రమాలకు ఆకర్షితమై ఆయా పథకాలను యథాతథంగా వారి ఎన్నికల ప్రణాళికల్లో పెట్టుకోవడం విశేషం.

రైతులకు జీవిత బీమా రైతులకు భూమి తప్ప మరే జీవనాధారం ఉండదు. రాష్ట్రంలో చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 18 లక్షలమంది ఉన్నారు. పేదరైతులెవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే, వారి కుటుంబాలు ఉన్నట్టుండి అగాథంలో పడిపోతాయి. అటువంటి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో ప్రభుత్వం ఎల్‌ఐసీ ద్వారా రైతులకు జీవితబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నది. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా అతని కుటుంబానికి 10 రోజుల్లోనే ఐదు లక్షల జీవిత బీమా మొత్తం అందితీరుతుంది. రైతు మీద ఒక్క పైసా భారం వేయకుండా ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు అందుతాయి. ఇవి కేవలం బీమా పత్రాలు కావు.. రాష్ట్రంలోని రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న భద్రతా పత్రాలు.

సృష్టించిన సంపద ప్రజలకు పంచాలి 21% ఆదాయాభివృద్ధి రేటుతో ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.40వేల కోట్లతో 40 పథకాల ద్వారా ప్రజాసంక్షేమానికి పెద్దఎత్తున పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, ఇమామ్, మౌజన్‌లకు ప్రభుత్వం జీవనభృతి అందిస్తున్నది. కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు రుణమాఫీ, నిరంతర విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, పెద్ద ఎత్తున గోదాంల నిర్మాణం, నీటితీరువా బకాయిల రద్దు తదితర నిర్ణయాలతో రైతుల జీవితాల్లో ఆనందపు వెలుగులు నిండాయి.

గణనీయంగా పెరుగుతున్న పశుసంపద గొల్ల, కురుమలకు 75% సబ్సిడీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెలు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే పంపిణీచేసిన గొర్రెలు పిల్లలను పెడుతుండటంతో రాష్ట్రంలో పశుసంపద గణనీయంగా పెరుగుతున్నది. చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వీటి పెంపకానికి అవసరమయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలు మాత్రం బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందిస్తున్నది. నవీన క్షౌరశాలల ఏర్పాటుకు నాయీ బ్రాహ్మణులకు, అధునాతన యంత్రపరికరాల కొనుగోలుకు రజకులకు, అదే విధంగా ఇతర కులాల వారికి ఆర్థిక సహాయం అందించబోతున్నది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈత, తాటిచెట్ల పెంపకం చేపట్టింది. సంచార, ఆశ్రిత కులాలు, తదితర వర్గాలవారి కోసం రూ.1000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేశాం.

నాలుగేండ్లలో కొత్తగా 3155 కి.మీ. జాతీయ రహదారులు రాష్ట్రం ఏర్పడేనాటికి మనకు జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుంటే తెలగాణలో కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణలో 2,527 కిలోమీటర్ల హైవేలుంటే, ఈ నాలుగేండ్లలో కొత్తగా 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులు సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో 5,682 కిలోమీటర్ల జాతీయ రహదారులున్నాయి. హైవేల్లో దేశ సగటు 3.81 కిలోమీటర్లుంటే, రాష్ట్రంలో 5.02 కిలోమీటర్లుంది.

నిరుపేదల ఆత్మగౌరవం పెంచే డబుల్ ఇండ్లు నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2.65 లక్షల ఇండ్లు మంజూరుచేసి, నిర్మిస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే నిరుపేదలకు లక్షకు పైగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నాం.

ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో పథకాన్ని రూపొందించింది. ఆగస్టు 15వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు, అవసరమైనవారికి ప్రభుత్వం శస్త్ర చికిత్సలు చేయిస్తుంది.

రికార్డుస్థాయిలో గురుకులాలు కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటుచేశాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు 296 గురుకులాలే ఉండేవి. రికార్డుస్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటుచేసుకున్నాం. వీటిలో ఉచిత విద్య, హాస్టల్ వసతితోపాటు ఒక్కో విద్యార్థికి ఏడాదికి మూడు జతల యూనిఫారాలు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు చక్కటి పోషకాహారం, గుడ్లు, పాలు, పెరుగు, మాంసాహారం, నెయ్యి కూడా అందిస్తున్నాం. మన గురుకులాల్లోని వసతులు, అందిస్తున్న ఆహారం, విద్యావిధానాన్ని గమనించేందుకు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికార బృందాలు వచ్చివెళ్తున్నాయి. రాష్ట్రంలో అటవీప్రాంతాన్ని 33 శాతానికి పెంచే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలుచేస్తున్నాం. గత మూడేండ్లలో 82 కోట్ల మొక్కలు నాటాం.

తెలంగాణ గర్వకారణం అనుదీప్ సివిల్స్‌లో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు విజయం సాధించారు. దేశం మొత్తం మీద ప్రథమస్థానం సాధించిన అనుదీప్ తెలంగాణ బిడ్డే కావడం మనందరికీ గర్వకారణం, నాకెంతో సంతోషం కలిగించింది.

రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువటీఎస్‌ఐపాస్ విధానం పారిశ్రామికవేత్తలకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7155 పరిశ్రమలు అనుమతి పొందాయి. రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5.74 లక్షలమందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీరంగాన్ని ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేస్తున్నది. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టీ హబ్ ఎంతోమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నది.

క్రియాశీలకంగా పంచాయతీ పాలకవర్గాలు నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలకవర్గాలను క్రియాశీలకం చేసేందుకు చట్టంలో మార్పులుచేశాం. అధికారాలతోపాటు కచ్చితమైన విధులను కూడా పొందుపరిచి ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చూశాం. పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తిని తిరిగి గ్రామీణప్రాంతాల్లో నెలకొల్పేలా రాబోయే రోజుల్లో ప్రభు త్వం మరింత కృషిచేస్తుంది. తండాలు, గూడేలు, శివారుపల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని సమైక్య పాలనలో ప్రజలు ఎంత మొత్తుకున్నా వారి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. గిరిజనుల చిరకాల వాంఛను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. కొత్తగా 4383 గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసింది. 1326 ప్రత్యేక ఎస్టీ గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటుచేసింది. వీటితోపాటు ఇతర గ్రామాల్లో జనాభా నిష్పత్తిని అనుసరించి ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ లభిస్తుంది. మా తండాలో మా రాజ్యం.. మా గూడెంలో మా రాజ్యం అని గిరిజనులు, ఆదివాసీలు కన్న కలను తెలంగాణ ప్రభుత్వం నిజంచేసింది.

సమర్థంగా శాంతిభద్రతలు శాంతిభద్రతలను ప్రభుత్వం సమర్థంగా పరిరక్షిస్తున్నది. పోలీసుశాఖను ఆధునీకరించడంతో పోలీసుసేవలు ప్రజలకు మరింత మెరుగ్గా అందుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఏర్పాటుచేస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తికావస్తున్నది. వ్యవసాయరంగానికి ముప్పుగా పరిణమించిన కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నిరోధించడానికి ఈ నేరాలను పీడీ యాక్టు పరిధిలోకి తెచ్చాం. అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాం.

ఇప్పుడూ ప్రతీఘాత శక్తులున్నాయి ఒక చారిత్రాత్మక విజయయాత్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతీఘాత శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయి. ఈనాడు పరిపాలనలోనూ ఎదురవుతున్నాయి. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చని ప్రభుత్వం రుజువుచేసింది. రాబోయే రోజుల్లోనూ అదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అవిశ్రాంతంగా పరిశ్రమించి, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదాం.

వడివడిగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సమైక్యరాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పడేసిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మిడ్‌మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రంభీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్‌లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. ఈ ఏడాది వానకాలం పంటనాటికి మొత్తం ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్‌మాట్ బరాజ్, మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదులను పూర్తిచేయడంతోపాటు 365 రోజులపాటు ఈ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేందుకు గోదావరిపై తుపాలకుగూడెం బరాజ్ నిర్మిస్తున్నాం. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లాతోపాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని భూములకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న కృషిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తిచేయడం ద్వారా పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందించింది.

తెలంగాణకు జీవనదాయిని.. కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికి వరదాయిని, తెలంగాణకు జీవనదాయిని. జిల్లాలకు సమృద్ధిగా నీరందించే కాళేశ్వరం నిర్మాణం రికార్డు సమయంలో పూర్తిచేసేలా పనులు జరుగుతున్నాయి. 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే అన్నిరకాల అనుమతులు సాధించాం. భారీ ఎత్తున సాగుతున్న నిర్మాణపనులను తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పలువురు ప్రముఖులు వచ్చి వెళ్ళారు. గవర్నర్ నరసింహన్ కూడా ఈ ప్రాజెక్టును తిలకించి, ఇది రాష్ట్రప్రజలకు జీవధారగా మారబోతున్నదని ప్రశంసించారు. కేంద్ర జలసంఘం ప్రతినిధి బృందం రెండ్రోజులపాటు కాళేశ్వరం పనులను పరిశీలించి, ఈ ప్రాజెక్టు దేశచరిత్రలోనే భిన్నమైనదని, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణరంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలరీత్యా కూడా అన్నివిధాలా ప్రత్యేకమైనదని ప్రశంసించింది. ఉమ్మడి రాష్ట్రంలో దారుణ నిర్లక్ష్యానికి గురై, విధ్వంసమైన వేల చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. దీంతో సాగుభూమి విస్తీర్ణం పెరుగడంతోపాటు, భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. గ్రామాల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. 46500 చెరువుల పునరుద్ధరణ లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే ప్రధాన చెరువుల పనులు పూర్తయ్యాయి. చిన్న చెరువులు, కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే పథకం మిషన్ భగీరథ. దీనిద్వారా ఇప్పటికే వేల గ్రామాలకు శుభ్రమైన తాగునీరు అందుతున్నది. రాబోయే కొద్దినెలల్లోనే అన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చురుకుగా సాగుతున్నది. ఆశించిన ఫలితాలను ప్రభుత్వం అందించబోతున్నది.

భూరికార్డుల ప్రక్షాళన సాహసం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, మరే ఇతర రాష్ట్రంలోనూ, ఎవరూ సాహసించలేని భూరికార్డుల ప్రక్షాళనను కేవలం వందరోజుల్లోనే విజయవంతంగా పూర్తిచేశాం. పంట పెట్టుబడి చెక్కులతో పాటు పట్టాదార్ పాస్‌పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నాం. జూన్ 20లోగా రైతులందరికీ వీటి ని పంపిణీ పూర్తిచేసే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. 2.38 కోట్ల ఎకరాల భూమికి సం బంధించిన రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు 1.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిపై స్పష్టత సాధించగలిగాం. రైతులు తమ భూమి కుదువపెట్టకుండానే, పాస్‌బుక్కులు తీసుకోకుండానే బ్యాం కర్లు రుణాలిచ్చే విధానాన్ని అమలుచేస్తున్నాం. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి, అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. అవినీతికి, జాప్యానికి ఆస్కారంలేకుండా రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరుగాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు అన్ని మండలాల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నాం. రికార్డుల ప్రక్షాళనతో తేలిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రభుత్వం ధరణి పేరుతో వెబ్‌సైట్ రూ పొందిస్తున్నది. జూన్ 20 వరకు భూములకు సం బంధించి పూర్తిస్థాయి స్పష్టత సాధించి, ఆ వివరాలను పారదర్శకంగా ధరణిలో నమోదు చేస్తారు.

అపూర్వ పథకం కేసీఆర్ కిట్స్ నిరుపేద మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో కూడా కూలికి పోవాల్సి రావడం బాధాకరం. ఈ పరిస్థితుల నుంచి వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంతో కేసీఆర్ కిట్స్ పేరుతో అపూర్వమైన పథకాన్ని అమలుచేస్తున్నాం. పేద గర్భిణులకు నాలుగు విడుతలుగా 12 వేల రూపాయలు చెల్లిస్తున్నాం. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో వేయి రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాం. దీనితోపాటుగా నవజాత శిశువులకు 16 రకాల వస్తువులతో రెండువేల రూపాయల విలువైన కిట్‌ను కూడా అందిస్తున్నాం. ఈ పథకం అమలు తరువాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు రెండు లక్షల మంది మహిళలకు ఈ ప్రయోజనాలు అందించాం. ప్రభుత్వ చర్యల ఫలితంగా సర్కారు దవాఖానల పనితీరు మెరుగుపడింది. ప్రజల్లో విశ్వాసం పెరిగింది. స్వయంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకోవడం ప్రభుత్వానికి గర్వకారణం. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడి సదుపాయాలను చూసి ఎంతగానో అభినందించారు. కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఉచితంగా డయాలసిస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. 39 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే 17 పనిచేస్తున్నాయి. ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు రాష్ట్రానికి పలు జాతీయస్థాయి అవార్డులు కూడా లభించాయి. హైదరాబాద్‌లో వెయ్యికి పైగా బస్తీ దవాఖానలు ఏర్పాటుచేస్తున్నాం.

కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ప్రాజెక్టులు సమైక్యరాష్ట్రంలో సాగునీటిలో జరిగిన అన్యాయాన్ని సవరించి, గోదావరి, కృష్ణాజలాలను తెలంగాణ పొలాలకు తరలించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. రైతుల కలలను నిజంచేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. సమైక్యపాలనలో ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గరనే వారి కుట్ర ప్రారంభమయ్యేది. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించేలా డిజైన్‌చేసి, తరువాత ఆ వివాదాలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు. అదేమిటంటే నెపం పక్క రాష్ట్రం నెత్తిన వేయడం, ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమనే పన్నాగాన్ని అమలుచేశారు. సమైక్యపాలకులు తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతుంటే తెలంగాణ నాయకులు తమ చేతకానితనాన్ని ప్రదర్శించారే తప్ప ఏనాడూ ఎదురుతిరిగి ప్రశ్నించలేదు. అందుకే సమైక్య పాలకులు చేసిన ప్రాజెక్టుల డిజైన్లను తెలంగాణ అవసరాలకు తగిననట్టు రీ డిజైన్ చేయాల్సి వచ్చింది. గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నది. దీనిని కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాయి. గత 70 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ మహారాష్ట్రతో ఒప్పందాన్ని సాధించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతీసారి ఎన్నికల అంశంగా వాడుకున్నారు. మహారాష్ట్ర నుంచి అనుమతి సాధించడం కానీ, నిర్మాణం ప్రారంభించడం కానీ చేసిన పాపానపోలేదు. తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధితో చనాఖా-కొరాటా బరాజ్ నిర్మాణం వేగంగా జరుగుతున్నది. గోదావరి, కృష్ణానదులపై 23 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఇప్పటికే చేపట్టాం. కొన్ని పూర్తిచేయగలిగాం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు బడ్జెట్‌లో ఏటా రూ.25వేల కోట్లు కేటాయించుకుంటున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. సమైక్యపాలనలో ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గరనే వారి కుట్ర ప్రారంభమయ్యేది. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించేలా డిజైన్‌చేసి, తరువాత ఆ వివాదాలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు..ఒక చారిత్రాత్మక విజయయాత్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతీఘాత శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయి. ఈనాడు పరిపాలనలోనూ ఎదురవుతున్నాయి. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చని ప్రభుత్వం రుజువుచేసింది. రాబోయే రోజుల్లోనూ అదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అవిశ్రాంతంగా పరిశ్రమించి, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదాం. – ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.