Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సమగ్ర అభివృద్ధి సాధిద్దాం..

మీ జిల్లా.. మీ ప్రణాళిక పాలనలో మూసపద్ధతి విడనాడాలి. ప్రతీ జిల్లాలో ఒకే పద్ధతి అవసరం లేదు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలి. నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అనే పేరుతో ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక ఉండాలి. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం.

నగదు రహితం దిశగా.. సిద్దిపేటలో నగదురహిత లావాదేవీలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఇలాగే జరుగాలి. బ్యాంక్ లావాదేవీలు, ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల వినియోగం పెరుగాలి. త్వరలోనే టీ వ్యాలెట్ కూడా వస్తుంది. వీటన్నింటిపై అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలి. అంతిమంగా తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చాలి. -సీఎం కేసీఆర్

cm-kcr-conference-meeting-with-district-collectors

-జిల్లా ప్రణాళికల ఆధారంగానే బడ్జెట్.. జిల్లా స్థాయిలో వ్యవసాయ ప్రణాళిక -హెచ్‌ఎండీఏ, కుడా పరిధిలో సాదాబైనామా అమలు -సంక్షేమ రంగంలో నంబర్ వన్‌గా నిలిచాం.. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు -కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -11 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం -ప్రజావసరాలకే పెద్దపీట

అందరం కలిసి ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన, విలువలతో కూడిన రాష్ట్రంగా తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కలెక్టర్ల తొలి సమావేశం బుధవారం ప్రగతి భవన్‌లో 11 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న సీఎం.. వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలుకావాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా ఉండాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాల పేదల కోసం అమలుచేసే కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. పూర్తి నగదు రహిత లావాదేవీల కోసం సిద్దిపేటలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, అక్కడి అనుభవాలు ఉపయోగించుకొని, తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చాలన్న కేసీఆర్.. కలెక్టర్లు పోటీపడి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా సాగవద్దని కేసీఆర్ స్పష్టంచేశారు.

కలెక్టర్లకు చెప్పుకొంటే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో రావాలన్నారు. ప్రభుత్వం అంటే మంజూరీలు ఇవ్వడం కోసమే అనే అభిప్రాయం ఉందన్న సీఎం.. కేవలం డబ్బులతోనే పనులు కావని, మంచి పాలసీలు, పథకాలు రావాలని, అవి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని అన్నారు. సర్కారు దవాఖానల పరిస్థితి మెరుగుపడాలని సీఎం స్పష్టంచేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో గర్భసంచుల తొలగింపు ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. హెచ్‌ఎండీఏ, కుడా పరిధిలోని వ్యవసాయ భూముల సాదాబైనామాలను ఆమోదించడానికి అనుమతి ఇస్తున్నామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. కలెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని కోరారు. తెలంగాణకు హరితహారం చాలా ముఖ్యమైన కార్యక్రమమని సీఎం చెప్పారు. హాస్పిటల్ బెడ్‌షీట్లు, స్కూలు యూనిఫారాలు తదితరాలకు వస్ర్తాలను చేనేతరంగం నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్లే రాష్ర్టానికి బలమన్న సీఎం.. కలెక్టర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమావేశాలు భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయని చెప్పారు. చిన్న వయసులోనే కలెక్టర్లుగా అవకాశం వచ్చిన యువ అధికారులు.. అంతటి అవకాశమిచ్చిన రాష్ట్రం పట్ల కృతజ్ఞతతో ఉండాలని కోరారు.

ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ప్రభుత్వ ప్రాధమ్యాలుండాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లకు చెప్పారు. జిల్లా ప్రణాళికల ఆధారంగానే ఈసారి బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కలిగించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత మొట్టమొదటిసారి జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ వేశారు. హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలుకావాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా ఉండాలని అన్నారు. బుధవారం ప్రగతి భవన్‌లో కలెక్టర్ల సదస్సు జరిగింది. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ప్రభుత్వ సీఎస్, ముఖ్యకార్యదర్శులు, హెచ్‌వోడీలు, కలెక్టర్లు, జేసీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రగతిపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మిషన్ కాకతీయ బాగా జరుగుతున్నదని, మంచిగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో జలకళ ఉట్టి పడుతున్నదని చెప్పారు. మిషన్ భగీరథ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర పేదల కోసం అమలుచేసే కార్యక్రమాలు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. గతంలో అసైన్ చేసిన భూములు ఏ స్థితిలో ఉన్నాయో చూసి, అవి ఉపయోగంలోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. జాతీయ రహదారులు పెద్ద ఎత్తున మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ప్రాజెక్టులకు అవసరమైన భూమి సేకరించాలని ఆదేశాలు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువున్న జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరు గుదలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఇలాంటి చోట్ల ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.

ప్రతి కలెక్టర్ వద్ద రూ.3కోట్లు నిధులు పెడుతాం. అత్యవసరంగా వారి దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఈ నిధులు ఖర్చుచేసే విచక్షణాధికారం ఇస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫండ్‌ను, ఎంపీల సీడీఎఫ్‌ను కూడా ఉపయోగించుకోవాలి. హాస్టళ్లు, హాస్పిటళ్లలో కనీస వసతులపై దృష్టిసారించాలి అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి చాలా మెరుగైంది. షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ తగిన ఏర్పాట్లు చేశాం. అన్ని జిల్లాల్లో షీ టీమ్స్ ఏర్పాటుచేసి ఈవ్‌టీజింగ్ అరికట్టాలి అని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు టీమ్‌గా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

సమాజంలో ఏదో అసంతృప్తి ఉంది.. అనేక భిన్న దృక్పథాలు కలిగిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయినా సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉన్నట్లుంది. లోపం ఎక్కడుందో గుర్తించాలి. ప్రజలకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవాలి. పరిష్కారం వెతకాలి. ప్రజల అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలి. సమాజంలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను అరికట్టాలని అనుకుంటే అసాధ్యమేమీ కాదు. ప్రభుత్వం అంటే మంజూరీలు ఇవ్వడం కోసమే అనే అభిప్రాయం ఉంది. కేవలం డబ్బులతోనే అంటే పనులు కావు. మంచి పాలసీలు, పథకాలు రావాలి. అవి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలి. టీఎస్‌ఐపాస్ చట్టం తేవడం వల్ల పారిశ్రామిక విధానం అద్భుతంగా వచ్చింది. 2500 పరిశ్రమలు వచ్చాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు గొప్పగా పునరుద్ధరించుకుంటున్నాం. హరితహారం ద్వారా గ్రీన్ కవర్ పెంచుకుంటున్నాం. పేకాటను అరికట్టగలిగాం. గుడుంబాను నిర్మూలించగలుగుతున్నాం. గుడుంబా తయారీ మానేసిన మహిళలకు ఉపాధి చూపించాలి. సంక్షేమ రంగంలో నంబర్‌వన్‌గా నిలిచాం. సంక్షేమంపై రూ.30వేల కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నం. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే దురాచారాలను రూపుమాపడంలో విజయవంతమయ్యాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగాలి అని సీఎం చెప్పారు.

వైద్యంపై కేంద్రీకరణ సర్కారు దవాఖానల పరిస్థితి మెరుగుపడాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ప్రతీ బెడ్‌కు ప్రతినెలా రూ.5 వేలకు పైగా ఇస్తున్నాం. మందుల కొనుగోలు బడ్జెట్ రెట్టింపు చేశాం. కాబట్టి ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితి మెరుగుపడాలి. కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలి అని సీఎం చెప్పారు. ఎస్టీ, ఎస్సీ జనాభా 50శాతానికిపైగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో వైద్యశాలలు, వైద్యం మెరుగుదలకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో గర్భ సంచుల తొలగింపు ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అవసరం లేకున్నా జరిగే ఆపరేషన్లు ఆపాలి అని సీఎం తెలిపారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసూతి కోసం పరికరాలు ఉన్నందున ఎక్కువ కాన్పులు అక్కడే జరుగాలి. పేదలకు ఇదెంతో ఉపయోగకరం. ప్రజల్లో అవగాహన కల్పించాలి అని చెప్పారు. దవాఖానలనుంచి మృతదేహాల తరలింపు వాహనాలను సరిగ్గా ఉపయోగించుకోవాలని కోరారు.

ఆహార అలవాట్లపై సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అవగాహన ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పౌష్టిక అహారలోపంతో రోగాల బారిన పడుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలకు అహార అలవాట్ల పట్ల అవగాహన కల్పించడానికి సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలి కలెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని సీఎం చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని భూమి స్వరూపం, స్వభావాన్ని బట్టి క్రాప్ కాలనీలుగా మార్చాలని అన్నారు. నగర ప్రాంతాలకు దగ్గరి భూముల్లో హార్టికల్చర్‌కు అవకాశం ఎక్కువ. ప్రాజెక్టులకు దగ్గరున్న భూముల్లో వ్యవసాయం ఎలా ఉండాలి? మైక్రో ఇరిగేషన్ విధానం విస్తరణ తదితరాలపై దృష్టి పెట్టాలి అన్నారు. చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది వంద కోట్లు ఇచ్చాం. నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేపల పెంపకంపై దృష్టి పెట్టాం అని సీఎం చెప్పారు.

ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు నిర్మించాలి. ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే చోట ఖనన వాటికలు (బరేల్ గ్రౌండ్స్) ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికలు నిర్మించడం పుణ్యకార్యం. దాతలనుంచి విరాళాలు సేకరించడానికి సీఎస్‌ఆర్ పథకం వినియోగించుకోవాలి. జోగుళాంబ గద్వాల జిల్లాలో బాల కార్మికులు, బాల్య వివాహాలు ఎక్కువ. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి అని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు చెప్పారు. తెలంగాణకు హరితహారం చాలా ముఖ్యమైన కార్యక్రమం. గ్రీన్‌కవర్ పెంచాలి. పెట్టిన మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయాలి. జాతీయ రహదారులపై పై విధిగా మొక్కలు పెంచేలా వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడాలి. మొక్కల పెంపకానికి ఉపాధి హామీ పథకం నిధులు వాడాలి. సామాజిక వనాలు పెంచడంతోపాటు అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి అని సీఎం చెప్పారు.

వరంగల్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి హైదరాబాద్ మాదిరిగా వరంగల్ అడ్డదిడ్డంగా పెరుగవద్దని సీఎం అన్నారు. హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరమైన వరంగల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాం.అనేక విద్యాలయాలు పెడుతున్నాం. రింగ్‌రోడ్ నిర్మించుకుందాం. రూ.300 కోట్లు మంజూరు చేశాం. ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. సెంట్రల్‌జైలు, కేఎంసీని కలుపుకొని హెల్త్ వర్సిటీ నిర్మించాలి. హెరిటేజ్, అమృత్, స్మార్ట్ సిటీ హోదాలకు వరంగల్ ఎంపికైనందున అన్ని నిధులు కలిపి మంచి ప్లాన్‌తో ఖర్చు చేయాలి. వరంగల్‌లో శాస్త్రీయ పద్ధతిలో కూరగాయలు, మాంసం మార్కెట్లు నిర్మించాలి. కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించాలి. అన్ని కార్పొరేషన్లలో ఇదేవిధంగా లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్/నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మించాలి. వరంగల్ సీకేఎం, మెటర్నిటీ దవాఖానలను అభివృద్ధి చేయాలి. మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం అని తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికీ ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. వాటికి అవసరమైన భవనాల నిర్మాణానికి వెంటనే స్థలాలను గుర్తించి, నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. స్కూళ్లలో కూలిపోయే దశలోన్న గదులకు వెంటనే రిపేర్లు చేయాలి. అన్ని బడుల్లో టాయ్‌లెట్లు నిర్మించాలి అని చెప్పారు. సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ హెడ్ క్వార్టర్స్, కోర్టుల సముదాయం నిర్మించడానికి స్థలాలను గుర్తించాలని సూచించారు. సదస్సులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభోపన్యాసం చేయగా.. సీఎస్ ప్రదీప్‌చంద్ర సమావేశం ఉద్దేశాలను తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిద్దిపేటలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివరించారు. షీ టీమ్స్ పనితీరుపై హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. సమావేశంలో పాల్గొన్న అన్ని జిల్లాల కలెక్టర్లు గత రెండు నెలలుగా విధులు నిర్వహించే సమయంలో ఎదురైన అనుభవాలను సీఎంకు వివరించారు. ఈ సదస్సులోనే నో యువర్ డిస్ట్రిక్ట్- ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ బుక్ లెట్, సీడీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు -అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసే దందా చాలా చోట్ల జరుగుతున్నది. దీనిని అరికట్టడానికి కఠిన వైఖరి తీసుకోవాలి. ఇందుకు విధి విధానాలు రూపొందించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలి. -మారుమూల, గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు అదనపు వేతనం (అలవెన్స్). -వరంగల్ రూరల్ జిల్లా గూడెప్పాడ్‌లో కూరగాయల మార్కెట్, నర్సంపేటలో మిర్చి రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి. -కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతులు పూర్తి చేయాలి. -ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఆగ్రానమిస్టును నియమించాలి. -రాష్ట్రంలోని యువతకు ఇక్కడే ఉపాధి దొరికే విధంగా అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. -గ్రీన్‌హౌస్ కింద వాణిజ్య పంటలను ప్రోత్సహించేందుకు ఎస్సీ లబ్ధిదారులకు 75% సబ్సిడీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి 25% మార్జిన్ మనీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. -వికారాబాద్‌లో పేరుగాంచిన ఔషధ మొక్కలకు పూర్వవైభవం తీసుకురావడానికి అటవీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవసరమైతే డెహ్రాడూన్ నుంచి మొక్కలను దిగుమతి చేసుకోవాలి. -హైదరాబాద్, ఇతర కార్పొరేషన్లు, పట్టణాలకు సమీప గ్రామాల్లో వాణిజ్య పంటలు ప్రోత్సహించాలి.

కలెక్టర్ల బలమే రాష్ర్టానికి బలం సదస్సు ముగింపు ఉపన్యాసంలో సీఎం -11 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం ముగింపు ఉపన్యాసం చేశారు. ఇవీ ముఖ్యాంశాలు.. -కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం మొదటిసారి.. ఒక అవగాహన కోసం కలిశాం. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని జరుగుతాయి. -ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేద్దాం. కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. కలెక్టర్ల బలమే రాష్ర్టానికి బలం. -చాలా జిల్లాల్లో యువ అధికారులకు అతి పిన్న వయసులోనే కలెక్టర్లుగా అవకాశం వచ్చింది. అటువంటి అవకాశం ఇచ్చిన తెలంగాణపట్ల మీరు కృతజ్ఞతతో వ్యవహరించాలి. -అవసరమైతే మీ విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయండి. -కొత్త జిల్లాలు ఏర్పడి, ప్రజల ఇంటి ముందుకు పాలన రావడంద్వారా ప్రతి వ్యక్తి తానే కలెక్టర్ అయినట్టు భావిస్తున్నాడు. -రెసిడెన్షియల్ పాఠశాలల పర్యవేక్షణలో కలెక్టర్లు భాగస్వాములు కావాలి. గురుకులాల్లో వీలునుబట్టి రాత్రి నిద్రలు చేయడం ద్వారా విద్యార్థుల సమస్యలు తెలుసుకోండి. -పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు ప్రజలను సమాయత్తం చేయండి. -రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ కవర్ అభివృద్ధి చేయాలి. -విద్యుత్ పరిశ్రమల రంగాలతో రాష్ర్టానికి దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చినాయి. -మనందరం కలిసి ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన, విలువలతో కూడిన రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం.

నగదు రహితంలో అందరికంటే ముందు నగదురహిత లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే అందరికంటే ముందుందని సీఎం చెప్పారు. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి జైట్లీ కూడా అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ట్రేడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులను గత సంవత్సరాల లావాదేవీల వివరాలకోసం వేధించవద్దని, పాత లెక్కలను పరిగణలోకి తీసుకుని పన్నులు, చార్జీలు వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలో నగదురహితానికి యత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఇలాగే జరుగాలి. బ్యాంక్ లావాదేవీలు, ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల వినియోగంపై అవగాహన కల్పించాలి. అంతిమంగా తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చాలి. ఇందుకు కలెక్టర్లు పోటీపడాలి. విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. వారి ద్వారా ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలి. స్వైప్ మిషన్స్, మొబైల్ యాప్స్ వాడకం పెంచాలి. త్వరలోనే టీ వ్యాలెట్ కూడా వస్తుంది. వీటన్నింటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి అని సీఎం వివరించారు.

జిల్లా ప్రణాళికల ఆధారంగా బడ్జెట్ జిల్లాల ప్రణాళిక ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. కాబట్టి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలి. పరిపాలన సమర్థవంతంగా సాగడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. పాలన మరింత బాగా సాగాలి. మూసపద్ధతి విడనాడాలి. ప్రతీ జిల్లాలో ఒకే పద్ధతి అవసరం లేదు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలి. నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అనే పేరుతో ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక ఉండాలి. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. అర్బన్, రూరల్, వ్యవసాయ, పారిశ్రామిక, గనులపరంగా జిల్లాల వారీగా ప్రాధాన్యాలు మారుతాయి. దీన్ని బట్టి ప్లాన్ వేయాలి. ఇలా ప్రతీ జిల్లాలో జరుగాలి అని ముఖ్యమంత్రి సూచించారు.

జిల్లాకు మూడు కోట్లు జిల్లాల్లో కీలకమైన పనులను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశంతో ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 31 జిల్లాలకుగాను ఒక్కొక్క జిల్లాకు రూ.3కోట్ల చొప్పున రూ.93కోట్లను విడుదల చేస్తూ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) వెలువడింది. రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ (సీబీఎఫ్)కు నిధులను విడుదల చేశారు. పాత జిల్లాల పరిధిలో గతంలో విడుదల చేసిన నిధుల్లో ఖర్చుచేయని వాటిని రాష్ట్ర ఖజానాకు జమచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రత్యేక అకౌంట్లు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నిధుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.