Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సమైక్య పాలన పచ్చిమోసం

సమైక్య పాలనలో జరిగిందంతా పచ్చి మోసమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాలు హక్కుభుక్తం చేసుకోవడానికి ఆ నది పరిధిలో ఉన్నా హైదరాబాద్‌కు నీరు తీసుకురాలేదని అన్నారు. తెలంగాణ ఒక విఫల ప్రయోగం అనిపించాలని చంద్రబాబు ఒక నీచమైన ఎత్తుగడ వేశాడని , అందుకే ఇక్కడ నలుగురైదుగురిని ఉసిగొలిపి బస్సుయాత్రల పేరిట మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు.

CM KCR in Inaugral function of Comprehendive water supply

-హైదరాబాద్‌ను కబ్జాలతో నాశనం చేసిండ్రు -అసెంబ్లీ భేటీ తర్వాత నగరాభివృద్ధి -ఇంటింటికీ నీరివ్వకపోతే ఓట్లే అడగం -చంద్రబాబు కుట్ర .. తెలంగాణను విఫలప్రయోగమనిపించాలనే -మల్కాజిగిరిలో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన అన్ని మోసాలను అసెంబ్లీ వేదిక మీద ఎండగడతానని చెప్పారు. జేజమ్మలు దిగివచ్చినా శ్రీశైలం ప్రాజెక్టులో కరెంటు ఉత్పత్తి ఆపేది లేదన్నారు. మల్కాజిగిరిలో రూ.338.54 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న తాగునీటి పథకం పనులకు ముఖ్యమంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబూ..అక్కడ నువ్వు రుణమాఫీ చేయలె.. ఇక్కడ నేను చేసి చూపించిన. ముందుకు పోవాలంటే సాహసం, ధైర్యం కావాలి.

మాట ఇచ్చినమంటె కచ్చితంగా నేరవేర్చుతం అని సవాలు చేశారు. రైతు రుణాలన్నీ మాఫీ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అన్న చంద్రబాబు ఇవాల్టికీ ఐదు రూపాయలు కూడా రైతులకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అవసరమైతే విజయవాడ వేదికగా బాబు బండారాన్ని బయటపెట్టి, ఆంధ్ర ప్రజల పక్షాన పోరాడతానని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

పంటలు కాపాడుతం.. తెలంగాణ పంటలు ఎండగొడతవా? నీ తాత జేజమ్మ కూడా ఎండగొట్టలేడు? మా పంటను మేం కాపాడుకుంటం. భగవంతుడి దయ వల్ల… భగవంతుడి ఇచ్చే శక్తిని బట్టి యూనిట్‌కు రూ.20 అయినా సరే ఖర్చు పెట్టి మా రైతాంగాన్ని కాపాడుకుంటం. ఇప్పటికే కాపాడుకున్నం, ఇక ముందు కూడా కాపాడుకుంటం… ఇక్కడి నుంచి నేరుగ చత్తీస్‌గడ్ రాష్ర్టానికి పోతున్న. ఆ రాష్ట్రంతో ఎంవోయూ చేసుకుంటున్న. ఆరేడు నెలల్ల అక్కడి నుంచి కరెంటు తెస్త.

కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ ఏం తీర్పు ఇచ్చిండో నాకైతె అర్థం కాలె! మెడకాయ మీద తలకాయ ఉన్నడెవడూ హర్షించడు. మేం గత 19 ఏండ్ల లెక్కలను తీసి చూపించినం. టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు.. ఏ ఒక్క రోజు కూడా శ్రీశైలం నీటి మట్టం 800 అడుగులు కూడా మెయింటేన్ చేయలే. ఎప్పుడూ 760, 770, 790 అడుగులే ఉన్నయి. ఇవన్ని నేను చెప్పే స్టోరీలు కాదు. స్వయంగా అధికారుల రికార్డులే చెబుతున్నయి. శ్రీశైలంల 859 అడుగుల నీటిమట్టం ఉంటే ఆ సన్నాసి కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ తీర్పేంది? మేం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజు కరెంట్‌ను కూడ ఆపం…

విజయవాడ వేదికగా చంద్రబాబును ఎండగడతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు. మొత్తం రైతు రుణమాఫీలు చేస్త్తమని చెప్పిండు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తనన్నడు. లక్షా 54వేల కోట్లు రుణమాఫీ చేయాలి. ఐదు నెలలు దాటినారూ.5లు కూడా మాఫీ చేయలే. ఇంక ఉల్టా కేసీఆర్‌కు ముందు చూపులేదు అంటడు. కానీ నాకు దొంగచూపు లేదు. అక్కడ నువ్వు రుణమాఫీ చేయలె… ఇక్కడ నేను చేసి చూపించిన. ముందుకు పోవాలంటే సాహసం, ధైర్యం కావాలి. మాట ఇచ్చినమంటె కచ్చితంగా నేరవేర్చుతం.

ఈ సాహసం కేసీఆర్‌కు ఇవాల కొత్తకాదు. చరిత్ర ఉంది. సీడీలు, టీవీల సాక్ష్యాలు ఉన్నయి. 107 ఎన్నికల సభలల్ల 86 సభల్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన..నికార్సయిన తెలంగాణ బిడ్డను కాబట్టే కరెంట్ ఇబ్బందులు ఉంటయని నిజాయితీగ ముందే చెప్పిన. చంద్రబాబూ… నీలాగ అధికారంలోకి రానీ తర్వాత సూద్దాం అనుకోలె. బెల్ట్‌షాపులు బంద్ చేయిస్తన్నవ్.. కాని బంద్ పెట్టలే. ఉల్టా అమ్మకాలు పెంచినవు. బిడ్డా నీ బండారం మొత్తం బయటపెడత. అవసరమైతే విజయవాడలో సభ పెట్టి ఆంధ్ర ప్రజల పక్షాన కొట్లాడటానికి సిద్ధంగ ఉన్నా… జాగ్రత్త! అక్కడ నువ్వు చేసిందిలేదు… సచ్చింది లేదు.

ఒక్క నలుగురిని పెట్టుకుని ఇక్కడి ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీ కుట్రలు బయటపెడతం. నాకు ధైర్యం ఉంది కాబట్టే నీలాగ తప్పుడు వాగ్ధానాలు చేయలె. కరెంటు, నీళ్లు, రోడ్ల మీద నీళ్లు నిలబడటం… ఇవన్నీ కాంగ్రెస్, టీడీపీ నుంచి వారసత్వంగ వచ్చిన దరిద్రాలు. మాకు నిబద్ధత ఉంది… కడుపు, నోరు కట్టుకుని… మా శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు బ్రహ్మండంగ పనిచేస్తున్నం.

ఇంటింటికీ నీరివ్వకపోతే ఓట్లే అడగం… మీ బిడ్డగ… కేసీఆర్‌గ… రాజకీయాలకు అతీతంగా ఒక మాట చెబుతున్న. వంద శాతం మల్కాజ్‌గిరిల జరిగిన ఈ శంకుస్థాపన ప్రారంభం మాత్రమే. జంట నగరాల కోసం రూ. 25 వేల కోట్లు ఖర్చు పెట్టయినా సరే నాలుగేండ్లల ప్రతి ఇంటికి నల్లా నీరిస్తం. యావత్తు తెలంగాణలో నాలుగవ సంవత్సరం పూర్తయ్యే నాటికి ప్రతి కాలనీకి స్వచ్ఛమైన తాగునీరందిస్తా. మాకు దమ్ముంది, ధైర్యం ఉంది. తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టినం. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేయదు. ఎన్నికల్ల ఓట్లు అడగం.

సమైక్య పాలనల నగరం అస్తవ్యస్తం సమైక్య పాలనల ఇంతకాలం మన నగరం అన్యాయానికి గురైంది. ఇది నిష్టూరమైన నిజం. ఈ నగరం కృష్ణా నది పరివాహక ప్రాంతంల ఉంటది. వంద శాతం కృష్ణాజలాలే అందాలి. కానీ సమైక్య పాలకులు స్వార్థం కోసం సమీపం నుంచి నీళ్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాగునీటి వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు. కొందరు నాయకులు హైదరాబాద్‌ను మేమే కట్టినమని చెబుతున్నరు. హైటెక్ సిటీ చేసినమని చెబుతున్నరు. కానీ ఎంత లోటెక్ ఉందో ప్రజలు చెబుతరు.

సక్రమంగ నీళ్లు రావు. నగరానికి రోజుకు 580 మిలియన్ గ్యాలన్ల డిమాండు ఉంటె సరఫరా 340 ఎంజీడీలు మాత్రమే ఉంటది. అతి కొద్ది రోజుల్లోనే ఈ డిమాండ్ 740 ఎంజీడీలు దాటి పోతది. డబుల్ నీరు కావాలె. హైదరాబాద్‌ల రియల్ ఎస్టేట్ దందా చేసిండ్రె తప్ప ప్రజలకు మెరుగైన నీటి సరఫరా, రోడ్లు వేసే అలోచన చేయలె. ఎక్కడపాయే హైటెక్కు! లోటెక్కు! హైదరాబాద్‌ను మేమే నిర్మించామని మాట్లాడే టీడీపీ, కాంగ్రెసోళ్లకు కనీసం సిగ్గుండాలి.

నీరు నిలువకుండ చేస్తం… ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడో రోజున జీహెచ్‌ఎంసీ వాళ్లను పిలిచిన. వర్షాలు పడ్డయి, జంట నగరాల్లో నీళ్లు నిల్వకుండ ఏదైన చేద్దామన్న. వాళ్లు సార్ మేం ఏం చేయలేమన్నరు. చీఫ్ ఇంజినీరు, వేల మంది ఉద్యోగులు ఉంటరు? బాధ్యత లేదా? అంటే.. నిజంగ మేం ఏం చేయలేం సార్ హైదరాబాద్‌ల నాలాలన్ని రియల్ ఎస్టేట్, భూ బకాసురులు కబ్జా పెట్టేసిండ్రు. వరద నీళ్లు సక్రమంగ పోయే పరిస్థితే లేదన్నరు. లోతుగా అధ్యయనం చేసి సమగ్ర ప్రతిపాదనలు తెప్పించిన. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇప్పుడు హైదరాబాద్‌లోని నాలాల వ్యవస్థ బాగుచేసి లోతట్టు ప్రాంతాలకు నీళ్లు చేరకుండా, నీళ్లు నిలువకుండా చేయాలంటే అక్షరాల రూ. 10 వేల కోట్లు కావాలె. అయినా సరే మేం చేస్తం.

మీరు కరెంటు ఇస్తే మేం రాకుండ చేసినమా? తెలంగాణ ప్రాంత ప్రజలు 57 ఏండ్లు అమాయకుల్లా, అడుక్కుతినే వాళ్లలా బతికిండ్రు. భగవంతుడి దయ… దేశ రాజకీయ వ్యవస్థ మన్నించి మనకు తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది. మీకు తెలుసు. ఒక దశలో నేను చావడానికి సిద్దపడ్డ. అప్పుడు రాష్ట్రం ఏర్పాటైంది. నిన్నటికో ఇయాల్టికో ఐదు నెలలు అయితది. ఇగొ..గీ ఐదు నెల్లల్లనే అల్లావుద్దీన్ అద్భుత దీపంలెక్క చేయాలట! టీడీపోళ్లు సిగ్గు లేకుండా బస్సు యాత్రలు చేస్తున్నరు. ఇంతకాలం మీరు చేసిన పెంటను ఈ ఐదు నెల్లల్ల ఎత్తిపోయాలట. కరెంట్ పుట్టించి, మెరుగులు దిద్దాలట.

మీరు కరెంటు ఇస్తే మేం కరెంట్ రాకుండ చేసినమా? చెప్పడానికి సిగ్గుండాలి… బాధ కలుగుతుంది. ఇంతకాలం చెప్పలె. ఈ బహిరంగ సభ వేదిక ద్వారా చెబుతున్న. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేగనీ.. కొత్తగ ఏర్పడిన ఈ ప్రభుత్వానికి కనీసం ఓ నిర్ణయాత్మక సలహా, సూచన ఇంతవరకు చేసిండ్రా. పొద్దునలేస్తె ఆడిపోసుకోవడం, తిట్టడం, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీయడం. ప్రజల్లో ఒక నెగిటివ్ థృక్పథాన్ని సృష్టించడం తప్ప ఒక నిర్ణయాత్మక సలహా ఇచ్చింది లేదు.

మరీ ముఖ్యంగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణకు కరెంట్ రాకుండ చేసి, పంటలను ఎండగొట్టాలని శపథం కట్టుకున్నడు. ఆయన మాయలో పడ్డ కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేయడానికి ముందుకు పోతున్నది. ప్రజలను పచ్చి మోసం చేశారే తప్ప టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేసింది ఏంలేదు. వారి పాలనలో జరిగిన మోసాలపై రేపు జరిగే శాసనసభ సమావేశాలల్ల చెప్పబోతున్న. వాళ్ల కుట్రలన్నీ బయటపెడత. ఈ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పేదల కార్డులను గుంజుకుంటున్నరని దుష్ప్రచారం చేస్తున్నారు.

మీరా పేదల పక్షపాతులు? మీరా పేదల కోసం పోరాడేది? అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చినం. ఒక్క రూపాయికి కిలో బియ్యమే కాదు. ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇయ్యబోతున్నం. జిల్లా కలెక్టర్లు , రెవిన్యూ అధికారులకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించిన. ఒక్క నిరుపేద వ్యక్తికి కార్డు రాకున్నా, అనర్హులకు కార్డు వచ్చినా చర్యలు ఉంటయని గట్టిగ చెప్పిన.

అసెంబ్లీ తర్వాత అభివృద్ధి చూపిస్తా… జంటనగరాల ప్రజలకు ఒకటే మనవి.బతకడానికి వచ్చిన పేదలు.. గుడిసెలు వేసుకున్నోళ్లకు మంచి రోజులు కల్పిస్తం. ఇంతకాలం పేదోడు గుడిసె వేసుకుంటే బుల్డోజర్లతో కూలగొట్టే పరిస్థితులుండె. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కడ గుడిసెలు వేసుకుంటే అక్కడే పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం.అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.అందరితో కలిసి నియోజవర్గాల వారీగా పేదలకు పట్టాలిస్తం. నగరంలో మురికివాడలు మాయం కావాలి. అసెంబ్లీ తర్వాత జంట నగరాల అభివృద్ధి జరుగుతది.

మల్కాజ్‌గిరివాసుల చింత తీర్చిండు… మల్కాజ్‌గిరి ప్రజల చింత తీర్చిన ఘనత చింతల కనకారెడ్డికే దక్కుతుంది. వరల్డ్ బ్యాంకు నిధులు ఉన్నయని పది రోజులు నా పానం తిని నా దగ్గర ఉండిమరీ… ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయించిండు. వంద శాతం కీర్తి, ప్రతిష్ట ఎమ్మెల్యే కనకారెడ్డికే దక్కుతుంది. ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే ప్రజలకు మేలు జరుగుతది. ఒక్క మల్కాజ్‌గిరి కాదు… గ్రేటర్ మొత్తంల ప్రతి ఇంటికి నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని జలమండలి ఎండీ జగదీశ్వర్‌ను ఆదేశిస్తున్న. నాలుగేండ్ల నాటికి గ్రేటర్‌కు సురక్షిత నీరు అందించమే ప్రభుత్వ లక్ష్యం.. అని సీఎం స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, మహేందర్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, గువ్వల బాలరాజు, ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, ఆకుల రాజేందర్, మచ్చేంధ్ర, మురుగేష్, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జలమండలి డైరెక్టర్లు సత్యనారాయణ, కొండారెడ్డి, రామేశ్వరరావు, రవీందర్‌రెడ్డి, సత్యసూర్యనారాయణ , గుర్తింపు కామ్‌గార్ యూనియన్ నేత చెవ్వా సతీష్‌కుమార్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.