సచివాలయంలోని ముఖ్యకార్యదర్శిస్థాయి నుంచి గ్రామస్థాయి కార్యదర్శి వరకు సమయపాలన పాటించాల్సిందేనని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నా.. సమయపాలన పాటించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. సచివాలయంలోని డీ బ్లాక్‌లో పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించిన వివిధ విభాగాలలో గురువారం ఉదయం 10:50 గంటలకు కేటీఆర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

-ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టంచేసిన మంత్రి కేటీఆర్ -సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు ఆ సమయానికి కూడా ఉద్యోగులెవరూ హాజరుకాకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ విభాగంలో మొత్తం 21 మంది సెక్షన్ ఆఫీసర్లకుగాను కేవలం నలుగురు అధికారులు మాత్రమే హాజరవడంపై ఆరా తీశారు. సెక్షన్ ఆఫీసర్లే సమయానికి రాకపోతే ఇతర ఉద్యోగులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇతర ఉద్యోగుల పనితీరు, సమయపాలనపై పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ని అడిగి తెలుసుకున్నారు.
సమయానికి రాని ఉద్యోగులను వెంటనే ముఖ్యకార్యదర్శికి రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగుస్థాయి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించడంలో పంచాయతీరాజ్‌శాఖ ప్రముఖపాత్ర పోషిస్తుందని, అందుకే తమ శాఖ నుంచే సమయపాలన పాటించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కొత్త రాష్ట్రంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకొని, ప్రభుత్వానికి సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తన ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పిన మంత్రి, మరోసారి ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను నిర్వహిస్తున్న శాఖల నుంచే సంస్కరణలు అమలు కావాలనే ఉద్దేశంతో ఐటీశాఖలోని వివిధ సెక్షన్లలో ఉద్యోగుల హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ విధానాన్ని ఇతర శాఖల్లోనూ ప్రవేశపెట్టే విషయాన్ని ముఖ్యమంత్రి అనుమతితో పరిశీలించనున్నట్లు తెలిపారు.