-పదహారేండ్ల ప్రస్థానం బంగారు తెలంగాణ నిర్మాణం -టీఆర్ఎస్ ప్లీనరీ నేడే -హాజరుకానున్న పది వేల మంది ప్రతినిధులు -ఏడు తీర్మానాలపై చర్చించనున్న ప్లీనరీ వేదిక -తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని ప్రకటించనున్న నాయిని, కేకే -ప్లీనరీలో తొలుత జెండా ఆవిష్కరణ.. అమరవీరులకు నివాళులు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పదహారేండ్ల పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి సమాయత్తమయింది. పిడికెడు మందితో పుట్టిన పార్టీ పుట్టెడు జనం మద్దతుతో మురిసిపోయేలా ముందుకుపోతున్నది. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఉరుకలు వేస్తున్నది. అశేష జనాభిమానానికితోడు క్రియాశీల శ్రేణుల కార్యాచరణతో అనుకున్న ఫలితాలను సాధించేందుకు కృషిచేస్తున్నది. ప్రజల ఆదరణకు ప్రతీకగా రికార్డుస్థాయిలో 75 లక్షల సభ్యత్వంతో టీఆర్ఎస్ పార్టీ జయపతాకాన్ని ఎగురవేస్తున్నది. పార్టీ 16వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలో తెలంగాణ ప్రగతి ప్రాంగణంలో భారీ ఎత్తున ప్లీనరీని నిర్వహించుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ క్రియాశీల క్యాడర్‌ను నేరుగా కలుసుకునేందుకు ఈ వేదికను ఉపయోగించుకోనున్నది. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతికాముక పథకాలు, పనులను ఈ సందర్భంగా క్యాడర్‌కు మరోసారి వివరిస్తారు. పార్టీ క్యాడర్ నుంచి గ్రౌండ్ రిపోర్టు తీసుకుంటారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను ప్రజల వద్దకు చేర్చేలా క్యాడర్‌ను ఉత్సాహపరుస్తారు. ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రతిపాదించి, ఆమోదిస్తారు. ఈ ప్లీనరీకి మొత్తం పదివేల మంది క్రియాశీల కార్యకర్తలు హాజరవుతున్నారు. ప్రతినిధులను ఎంపికచేసి ఇప్పటికే పాస్‌లను అందజేశారు. పాస్‌లు ఉంటేనే లోపలికి అనుమతిస్తారు.25వేల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.

కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ఉదయం పదిగంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావుతో కలిసి టీఆర్ఎస్ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. పార్టీ అధ్యక్ష పదవికి 11 నామినేషన్లు సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ నాయిని నర్సింహారెడ్డి అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడ అధ్యక్ష ఎన్నిక ప్రకటన ప్రక్రియ పూర్తికాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి కొంపల్లిలోని తెలంగాణ ప్రగతి ప్రాంగణానికి చేరుకుంటారు.

ప్లీనరీ కార్యక్రమాలు.. టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపానికి పుష్పాలను సమర్పిస్తారు. అనంతరం ఎంపీ కే కేశవరావు లాంఛనంగా పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. నాయిని, మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్లీనరీకి కొత్త అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. అమరుల స్మృతిలో రెండునిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగత ఉపన్యాసం చేస్తారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తొలి ప్రసంగం చేస్తారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్లీనరీని ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం చేస్తారు.

ఏడు తీర్మానాల వివరాలు.. -సంక్షేమంలో స్వర్ణయుగం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రతిపాదిస్తారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ బుడాన్ బేగ్ బలపరుస్తారు. -నీటిపారుదల, వ్యవసాయరంగాల్లో నూతన అధ్యాయం: రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్ నిరంజన్‌రెడ్డి ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బలపరుస్తారు. -గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠం- వృత్తి పనులకు ప్రోత్సాహం: ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ బలపరుస్తారు. -విద్యుత్ రంగంలో విజయం- పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ అభివృద్ధి: ఎమ్మెల్సీ, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్సీ, విప్ బీ వెంకటేశ్వర్లు బలపరుస్తారు. -వినూత్న విధానాలు-ప్రగతి కాముక పథకాలు: ఎంపీ వినోద్ ప్రతిపాదిస్తారు. ఎంపీ సుమన్ బలపరుస్తారు. -తాగునీటి వ్యథ తీర్చే మిషన్ భగీరథ: ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బలపరుస్తారు. -సామాజిక రుగ్మతలపై సమరం: ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరుస్తారు. అనంతరం పార్టీ నియమావళికి సవరణలు చేసే తీర్మానాన్ని ఎంపీ కే కేశవరావు ప్రతిపాదిస్తే, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి బలపరుస్తారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
సర్వం సిద్ధం.. టీఆర్ఎస్ ప్లీనరీకి అంతా సిద్ధమైంది. వారం పది రోజులుగా పార్టీ నేతలంతా అహర్నిశలు కష్టపడి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పది కమిటీలు వేసుకుని పని విభజన చేసుకున్నారు. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించారు. ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, మైనంపల్లి హనుమంతరావు, నాయకులు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి గత రెండుమూడు రోజులుగా ప్లీనరీ ప్రాంగణంలోనే ఉంటున్నారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎంపీలు మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ప్లీనరీ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ, భారీ ఎత్తున తరలివస్తున్న పార్టీ క్యాడర్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డితోపాటు పలువురు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 26 రకాల ఆహార పదార్థాలు, ఎండ నుంచి తట్టుకునేందుకు లక్ష వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ బాటిళ్లు సిద్ధం చేస్తున్నారు. ఆరు డైనింగ్ ఏరియాలుంటాయి.ప్రాంగణం మొత్తం 200 ఏసీలు నెలకొల్పుతున్నారు. మొత్తం సభా ప్రాంగణం 60 ఎకరాల్లో వెయ్యి మంది వాలంటీర్లను నియమించి, వారికి వాకీటాకీలు అందజేశారు. నగరంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అనుమతి తీసుకుని హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయొద్దన్న కేటీఆర్ సూచన మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ప్లీనరీ జరిగే ప్రాంతం ముందు గేటుభాగంతోపాటు లోపల సీఎం కేసీఆర్ చిత్రమాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొందరు ఆ చిత్రమాలికల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు.