-ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.. -రెండోరోజు గ్రామజ్యోతిలో ప్రజాప్రతినిధులు – బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని తీసుకొచ్చింది.. గ్రామస్తులంతా సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో రెండోరోజైన మంగళవారం ఆయా గ్రామాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు సమస్యలపై స్థానికులతో చర్చించారు. పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, కమిటీలను ఆదేశించారు.
వందశాతం మరుగుదొడ్ల నిర్మిస్తే రూ.కోటి నజరానా: డిప్యూటీ సీఎం కడియం మూడు నెలల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేస్తే గ్రామానికి ప్రభుత్వం తరపున రూ.కోటి నజరానా ఇప్పిస్తానని చిన్నముప్పారం వాసులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రామజ్యోతిలో భాగంగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ దత్తత తీసుకున్న నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో నిర్వహించిన గ్రామసభలో కడియం మాట్లాడారు.ప్రజలు సంఘటితంగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మెదక్ జిల్లా శివ్వంపేట గ్రామజ్యోతిలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్, సైదాపూర్ గ్రామజ్యోతిలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు, పాలకుల మాదిరిగా ఉత్త మాటలు చెప్పేటోళ్లం కాదని, పనులు చేసి చూపెడుతామని స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్‌లో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. స్వయంగా పలుగు,
పార పట్టుకొని మురికి కాల్వలను శుభ్రం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో దత్తత తీసుకున్న జైనథ్, బేల
మండలం బెదోడ, గూడ, దహెగాం, బేల గ్రామాల్లో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పర్యటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మల్, కడ్తాల్, సాకెర,నిర్మల్‌లో గ్రామజ్యోతిలో గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి పంచాయతీ పరిధిలోని జీకే బంజరలో గ్రామజ్యోతిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎన్‌ఎఫ్‌సీనగర్, కీసర మండలం బోగారం, కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ గ్రామజ్యోతి సభల్లో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా చివ్వెంల గ్రామజ్యోతిలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలంతా భాగస్వాములై గ్రామాల్లో వెలుగులు నింపాలన్నారు. వార్డుల్లో పిచ్చిమొక్కలను తొలగించి, కంపచెట్లను గొడ్డలిపట్టి నరికి ముందుకుసాగారు.
గ్రామస్తులే కథానాయకులు – రాజాపూర్‌లో సమస్యలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్ – జంగమ్మ దుస్థితిపై చలించి రూ.పది వేల ఆర్థిక సాయం ఎవరి గ్రామాలకు వారే కథానాయకులుగా మారి గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వ యం సమృద్ధికి కృషిచేయాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్‌లో గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రితోపాటు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మా రెడ్డి , ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధికారులతో గ్రామంలో తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. ఎరుకలి జంగమ్మ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్, ఆమె ఉంటున్న రేకులషెడ్డును చూసి చలించారు. ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదనడంతో తక్షణ సహాయంగా రూ.పది వేలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి రుణం మంజూరు చేయిస్తానని హామీఇచ్చారు. తర్వాత గ్రామసభలో మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారానికి ప్రణాళికకు, లబ్ధిదారుల ఎంపికకు ఇకపై గ్రామసభలే ప్రాతిపదికగా ఉంటాయన్నారు. రాజాపూర్ పేరుకు తగ్గట్టుగా రాజులా లేదు. ఎక్కడ చూసినా చెత్త, రోడ్ల పై బురద ఉన్నదని, పరిస్థితి మారకుంటే రోగాలు వస్తాయని అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించడానికి యువజన సంఘాలు, మహిళా సంఘాలు నెలకు కనీసం ఒక్కరోజైనా శ్రమదానం చేయాలని సూచించారు.