రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా పనిచేసి పల్లెల్లో సమస్యలను పరిష్కరించుకుందాం. గ్రామాల సమగ్రాభివృద్ధికి పాటుపడుతూ గంగదేవిపల్లిలా తీర్చిదిద్దుదాం. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. సకల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం గ్రామజ్యోతి ప్రవేశపెట్టింది. ఇండ్లను, పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలు గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలి. గ్రామజ్యోతిలో గుర్తించిన సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. నాలుగేండ్లలో గ్రామాల్లో రూ.25 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు దీనికి సహకరించాలి అని ప్రజాప్రతినిధులు సూచించారు.

– సమస్యలను పరిష్కరించుకుందాం – పల్లెల సమగ్రాభివృద్ధికి పాటుపడుదాం – నాలుగోరోజు గ్రామజ్యోతిలో ప్రజాప్రతినిధులు గ్రామజ్యోతిలో నాలుగోరోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తన జీవిత లక్ష్యమని, ఇందుకోసం నిరంతరం కృషిచేస్తానని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నానని తెలిపారు. అభివృద్ధికి అందరూ సహకరిస్తే మరో గంగదేవిపల్లిలా మొట్లపల్లిని తయారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని పిడిసిల్ల పాఠశాల హెడ్‌మాస్టర్ నాగేశ్వర్‌రావు గ్రామజ్యోతికి రూ.5116 విరాళంగా స్పీకర్ సమక్షంలో అందజేశారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం సుందిల్లలో ఎమ్మెల్యే పుట్ట మధు, ధర్మారం మండలం చామన్‌పల్లిలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి పాల్గొన్నారు. మెదక్ మండలం శివ్వాయిపల్లిలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందాలంటే జీవన విధానంలో మార్పురావాలన్నారు. ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని, సమస్యల పరిష్కారం కోసమే గ్రామజ్యోతిని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మంత్రి స్వయంగా పారపట్టి డ్రైనేజీలో చెత్తను తొలగించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలంలో దత్తత తీసుకున్న పిల్లలమర్రి గ్రామంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం గ్రామజ్యోతిని ప్రవేశపెట్టిందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పర్యటించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దత్తత తీసుకున్న పెబ్బేరు మండలం కంబాళాపూర్‌లో పర్యటించారు. ఆదిలాబాద్ మండలం వాఘాపూర్, రాజుగూడ, పోతగూడ, ఖండాల, దార్‌లొద్ది(కే), లోహరా గ్రామాల్లో అటవీశాఖ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం అలూర్, కౌట్ల(బీ) గ్రామాల్లో దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు.

ఉత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకో – కాంగ్రెస్ 60 ఏండ్ల పాపం ఏడాదిలో కడగడం సాధ్యమా? -పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్
పీసీసీ అధ్యక్షుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ నాయకులు 60 ఏండ్లలో చేసిన పాపం ఒక్క ఏడాదిలో కడగడం సాధ్యమవుతుందా? అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని, ప్రజలను మరచిన మీరు ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజల పక్షమంటూ రోడ్డెక్కితే ఎవరూ నమ్మరు అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో గ్రామజ్యోతిలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
గ్రామజ్యోతిలో ప్రజల స్పందన చూసిన కాంగ్రెస్ నేతలు భవిష్యత్తుపై ఆందోళనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోకుండా పదవులు, నిధులు పంపకాల గురించి ఆలోచించారని ఎద్దేవాచేశారు. జైలు జీవితం గడిపి, బెయిల్‌పై వచ్చి పదవులను అనుభవించిన కాంగ్రెస్ నేతలు నీతివాక్యాలు పలుకుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, పింఛన్లు, విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, బాలింతలకు పౌష్ఠికాహారం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హరితహారం, మిషన్‌కాకతీయ వంటి పథకాలతో ముందుకు సాగుతున్నామన్నారు.నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ యోగితారాణా, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.