Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్షేమానికి స్వర్ణయుగం

-రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి
-సీఎంగా మరో 15 ఏండ్లు కేసీఆరే కొనసాగాలి
-చంద్రబాబు స్వయంప్రకాశం లేని చంద్రుడు
-మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
-నాకు మంత్రి పదవే ఎక్కువ.. మరే పదవిపై ఆశలు లేవు
-ఆయన పనితీరును ప్రత్యర్థులే అభినందించారు
-డ్రైవర్ మారొద్దు.. కారు ఆగొద్దు
-నిరుద్యోగ సమస్యపై మూడంచెల విధానం
-ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు
-ఈ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరెండమే

తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడంతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది తాను చెప్తున్నమాట కాదని, కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాలా స్వయంగా పార్లమెంట్‌లోనే ఈ విషయాన్ని స్పష్టంచేశారని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతంగా అధికారంలోకి వస్తుందని, అలా జరుగకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టంచేశారు. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము, ధైర్యం ఏ ప్రతిపక్ష నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో 15 ఏండ్లు సీఎంగా కేసీఆరే ఉండాలన్నది తన కోరికని స్పష్టంచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంప్రకాశంలేని చంద్రుడని, ఆయన ఏనాడూ ఒంటరిగా పోటీచేయలేదని, రాబోయే రోజుల్లో చంద్రబాబు వైసీపీతోనూ పొత్తుపెట్టుకుంటాడని ఎద్దేవాచేశారు.

తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, దీంతో రైతు ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంప్రకాశంలేని చంద్రుడని, ఆయన ఏనాడూ ఒంటరిగా పోటీచేయలేదని, రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్న చరిత్ర ఆయనదని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు వైసీపీతోనూ పొత్తుపెట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబులా తాము సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేమని, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకొనే చంద్రబాబు 2004 ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలువలేదని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతగా అధికారంలోకి వస్తుందని, అలా జరుగకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ స్పష్టంచేస్తూ.. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము, ధైర్యం ఏ ప్రతిపక్ష నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేవునితోనైనా పంచాయితీ పెట్టుకుంటామని, డిసెంబర్ 11 తర్వాత ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టిసారిస్తామని చెప్పారు. కలలోకూడా తాను మంత్రిని అవుతాననుకోలేదని, మంత్రి పదవే తనకు ఎక్కువని, మరే పదవిపై ఆశలు లేవని తెలిపారు. డ్రైవర్ మారొద్దు.. కారు ఆగొద్దన్నదే తమ నినాదమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలన్నది తన కోరికని స్పష్టంచేశారు. ఏపీ- తెలంగాణ రాష్ట్రాల పాలనను పోల్చిచూసుకొని ఓట్లు వేయాల్సిందిగా ఏపీ సరిహద్దు నియోజకవర్గాల్లోని ప్రజలను కోరుతున్నామన్నారు.

ప్రజాసంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శం..
తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు తదితర ఎన్నో పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అని గతంలో సోషలిస్టులు, కమ్యూనిస్టులు చెప్పిన అర్థవంతమైన, స్ఫూర్తిమంతమైన నినాదంతో సమాజంలోని అన్నివర్గాలను కలుపుకొని అన్నార్తులు, ఆకలిచావులు, ఆత్మహత్యలులేని తెలంగాణను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నది నేను చెప్తున్నమాట కాదు.. కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాలా స్వయంగా పార్లమెంట్‌లోనే ఈ విషయాన్ని స్పష్టంచేశారు అని తెలిపారు.

శాంతిభద్రతలు భేష్..
శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదని, రాష్ట్రంలో నేరాల రేటును, ఇతర దురాగతాలను సమర్థంగా అదుపుచేయగలిగామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పేకాట క్లబ్బులు, గుడుంబా స్థావరాలు, భూదందాలకు పూర్తిగా చెక్‌పెట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగేండ్లుగా హైదరాబాద్‌లో కనీసం నాలుగు నిమిషాలు కూడా కర్వ్యూ విధించలేదని గుర్తుచేశారు.

కేసీఆర్ పనితీరును ప్రత్యర్థులే అభినందించారు..
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును రాజకీయ ప్రత్యర్థులు సైతం మెచ్చుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కేవలం ఉద్యమనేతగానేకాకుండా అద్భుతమైన పాలనాదక్షకుడిగా సత్తా నిరూపించుకున్నారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్వయంగా మెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయని, రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రుల భవిష్యత్తు ఏమవుతుంది? విద్యుత్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రం ఏ విధంగా ముందుకు సాగుతుంది? అసలు పరిపాలన సాధ్యమవుతుందా? తెలంగాణలో పరిపాలించే సత్తా కలిగిన నాయకులు ఉన్నారా? అంటూ చాలామంది మాట్లాడారని మంత్రి కేటీఆర్ పేర్కొంటూ.. ఈ రోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే నాయకులు కూడా నోరెళ్లబెట్టేలా తెలంగాణ ముందుకు సాగుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనదక్షతతో రాష్ట్రం 17.17 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్నదని చెప్పారు. ఈ తరుణంలో డ్రైవర్ మారడం, కారు ఆగడం రాష్ర్టానికి శ్రేయస్కరం కాదని స్పష్టంచేశారు.

డిసెంబర్ 7న ప్రజలే తేలుస్తారు..
చంద్రబాబులా తమకు జబ్బలు చరుచుకొనే అలవాటు లేదని, హైదారాబాద్‌లో ఎవరు ఏంచేశారో? సమర్థపాలనను అందించింది ఎవరో డిసెంబర్ 7న ప్రజలే తేలుస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తమకు రాజకీయ ప్రత్యర్థేనని, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేయబోయేది టీఆర్‌ఎస్సేనని అన్నారు.

నాకు మంత్రి పదవే పెద్దది..
రాష్ట్ర మంత్రిని అవుతానని జీవితంలో ఎన్నడూ ఊహించలేదని, 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో సీఎం కేసీఆర్ దయవల్ల మంత్రినయ్యానని కేటీఆర్ తెలిపారు. దీనినే చాలాపెద్ద పదవిగా భావిస్తున్నానని, ఇంతకుమించిన పదవి కావాలన్న దురాశ, ఇంతకంటే పైకిపోవాలన్న ఎజెండా లేదని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు సీఎంగా కొనసాగాలన్నదే తన తపని అని, అలాంటి నాయకుడు ఉంటేనే రాష్ట్రం సవ్యమైన దిశలో నడుస్తుందని పేర్కొన్నారు.

రాజకీయ సన్యాసం..
ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాని మంత్రి కేటీఆర్ పేర్కొంటూ.. నా సవాల్‌ను స్వీకరించే దమ్ము పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదా ఇతర పార్టీల నాయకులకు ఎవరికైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు మా పరిపాలనకు నిజంగా రెఫరెండమే. వంద శాతం మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చితీరుతుంది అన్నారు.

పరిపాలనా సంస్కరణలు..
1956 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా తప్ప కొత్తగా జిల్లాలు ఏర్పాటుకాలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని వికేంద్రీకరించుకొని 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలకు పెంచుకోవడంతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను పెంచుకున్నామని, తండాలు, గూడేలను 3,400 గ్రామపంచాయతీలుగా చేసుకొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కులవృత్తులు, వ్యవసాయానికి పెద్దపీట వేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసుకున్నామని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఆదర్శవంతమైన పథకాలతో ముందుకుసాగుతూ నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని వివరించారు.

ఇసుకతోనే 2 వేల కోట్లు..
పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర సంపదను పెంచగలిగామని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా మొత్తం రూ.39.40 కోట్ల ఆదాయం వస్తే.. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయడం ద్వారా గత నాలుగేండ్లలో రూ.2 వేలకోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే ఐటీరంగంలో జాతీయ సగటు కంటే అన్ని గణాంకాల్లో ముందున్నామన్నారు. లివ్ అండ్ లెట్ లివ్ అనే విధానంతో ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అవలంబిస్తున్నామని, ఏ రాష్ట్రంతోనూ కయ్యానికి కాలుదువ్వకుండా సహనంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలకు మూడంచెల విధానం..

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీచేయడం, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం ఇందులోని ముఖ్యాంశాలన్నారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం, వ్యాపారాన్ని సరళతరంచేయడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వశాఖల్లో 1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపగా.. 87 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయని, వీటిలో 38 వేల ఉద్యోగాలను అవినీతి ఆరోపణలకు ఆస్కారంలేకుండా పారదర్శంగా భర్తీ చేశామని వివరించారు. రాష్ట్రంలో 8 వేల పైగా పరిశ్రమలకు అనుమతులిచ్చామని, వాటిలో 60 శాతానికిపైగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని తెలిపారు. నిరుద్యోగ సమస్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిష్కారం చూపేలా ముందుకుసాగుతున్నామని, టీఎస్‌ఐపాస్ ద్వారా 8 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు.

ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే..

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే రిజర్వేషన్ సాధించుకోగలిగామని, తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో 100 కోట్ల మొక్కలను నాటుకొని తెలంగాణకు హరితహారాన్ని తొడిగామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అలాగే ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు కేసీఆర్ కిట్ల ద్వారా మాతాశిశు మరణాలను 30 నుంచి 35 శాతం మేరకు తగ్గించగలిగామని తెలిపారు.

మహాకూటమి కోసమే..
ఓ విలేకరి ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. మహాకూటమి కోసమే ధర్నాచౌక్‌ను ఆరువారాలపాటు తెరువాలని వెసులుబాటు ఇచ్చినట్టు ఉందని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం గాంధీభవన్ గేట్లు మూసేశారని, ఎన్టీఆర్‌భవన్ వద్ద సెక్యూరిటీతోపాటు బౌన్సర్లను పెట్టుకొన్నారని కేటీఆర్ గుర్తుచేస్తూ.. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ టికెట్ల కోసం ఆశించి భంగపడినవారికోసమే ధర్నాచౌక్‌ను తెరిచినట్టు ఉందన్నారు. రాష్ట్రంలో నిరసనలకు తావు ఉండరాదన్నది తమ విధానం కాదని, ధర్నాచౌక్ విషయమై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమంలో రోల్ మోడల్..
దేశంలో ఏ రాష్ట్రమైనా జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్లను పెట్టిందా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జర్నలిస్టుల హౌసింగ్ సమస్యను మహా సమస్యగా గత ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా మాట ఇచ్చారని గుర్తుచేస్తూ.. ఎన్నికల తర్వాత దీన్ని పరిష్కరిస్తామని, ఆ బాధ్యత తనదేనని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు రామసహాయం రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్ విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీ రాజమౌళిచారి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెసోళ్లయితే కాళేశ్వరం పూర్తికి 40 ఏండ్లు పట్టేది..
తెలంగాణలో సాగునీటిరంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.25 వేలకోట్లు కేటాయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెసోళ్లకు అప్పగిస్తే 40 ఏండ్లు కట్టేవారని, కేసీఆర్ కాబట్టి గత నాలుగేండ్లలో ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని అన్నారు. దీనిద్వారా 38లక్షల ఎకరాలకు నీరందించవచ్చని, ఇప్పటివరకు ఉన్న ఆయకట్టు కంటే ఇది రెట్టింపని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.