గ్రామపంచాయతీ, పురపాలక పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసింది. ఉన్నతస్థాయి కమిటీని నియమించి రెండు నెలల్లో కార్మికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. గురువారం సచివాలయంలోని పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు చాంబర్‌లో కార్మిక నేతలు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఉభయపక్షాలు అంగీకారానికి వచ్చాయి.

-పారిశుద్ధ్య కార్మిక సంఘాలతో మంత్రి కేటీఆర్ చర్చలు ఫలప్రదం -ఉన్నతస్థాయి కమిటీ.. తక్షణం గుర్తింపు కార్డులు, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపై పరిశీలన -పంచాయతీల్లో వేతన వ్యయ పరిమితి 50 శాతానికి పెంచుతూ జీవో విడుదలకు హామీ -సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామన్న ప్రభుత్వం.. కార్మిక సంఘాల సంతృప్తి కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి, ప్రభుత్వ పథకాల్లో కార్మికులకు లబ్ధి చేకూర్చే అంశాన్ని నిశితంగా పరిశీలించేందుకు, అలాగే గ్రామ పంచాయతీల ఆదాయంలో వేతనాల వ్యయ పరిమితిని 30 నుంచి 50 శాతానికి పెంచుకునేందుకు వీలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జీవోను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ నెల 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం అలాగే ప్రతిష్ఠాత్మకంగా గ్రామాల అభివృద్ధికోసం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం చేపడుతున్నందున సమ్మె విరమించి కార్మికులు సహకరించాలని ప్రభుత్వం కోరగా కార్మికనేతలు సానుకూలంగా స్పందించారు.
చిత్తశుద్ధితో ఉన్నాం… గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని మంత్రి కే తారకరామారావు చెప్పారు. అందుకే పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఆర్థిక, న్యాయశాఖ అధికారులతో కలిపి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ఈ కమిటీ రెండు నెలల్లో అధికారులు, కార్మిక సంఘాలు, కార్మికులతో కలిసి చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి జరుపుతుందని చెప్పారు. కార్మికుల వేతనాల పెంపునకు ఉన్న అన్ని అవకాశాలను సానుకూలంగా పరిశీలిస్తామని, అలాగే ప్రభుత్వ పథకాల్లో కార్మికులకు లబ్ధి కల్పించే అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం చేయగలిగిందే చెప్తుందని, అందుకే రెండు నెలల సమయం తీసుకుని కార్మికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గట్టి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
పల్లెల ప్రగతి కోసం, మార్పు కోసం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో కార్మికులు పాల్గొనాలన్నది తమ అభిమతమని మంత్రి తెలిపారు. కార్మికుల వేతనాలు పెంచుకునేందుకు గ్రామపంచాయతీలకు అవకాశం కల్పిస్తూ వేతనాల వ్యయ పరిమితిని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని కార్మిక సంఘాల నేతలకు తెలిపామన్నారు. ఈ మేరకు వెంటనే జీవోని జారీ చేస్తామని తెలిపారు. కార్మికుల కోరిక మేరకు కార్మికులకు గుర్తింపు కార్డులను కూడా త్వరగా ఇచ్చేలా ఆదేశిస్తామన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, గ్రామాల్లో పంచాయతీలు స్వయంపోషకాలుగా మార్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
సంతృప్తి చెందాం.. చర్చల అనంతరం కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ మంత్రితో జరిపిన చర్చలు సంతృప్తి కల్గించాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నామని తెలిపారు.మంత్రి కేటీఆర్ కార్మికుల సమస్యల పట్ల స్పందించిన తీరు తమకు విశ్వాసాన్ని కలిగించిందని చెప్పారు. ప్రభుత్వానికి తమ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి ఉన్నట్లుగా భావిస్తున్నామన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు, ప్రభుత్వానికి కార్మిక సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రితో జరిగిన చర్చల్లో సీపీఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య, సీపీఐ శాసనసభాపక్ష నేత ఆర్ రవీంద్రకుమార్ నాయక్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్, డిప్యూటీ కమిషనర్ రామారావు, గ్రామీణ తాగునీటి, పారిశుద్ధ్య శాఖ పీడీ రాములు నాయక్‌తో పాటు వివిధ కార్మిక సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.