Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంపద సృష్టించి ప్రజలకే పంచుతున్నాం

– మానవీయ కోణంలో సంక్షేమ పథకాలు – పౌర సరఫరాల్లో భారీ సంస్కరణలు తెచ్చాం – జీఎస్టీ అధిక రేట్లను వ్యతిరేకిస్తాం – నమస్తే తెలంగాణతో ఆర్థికశాఖ మంత్రి ఈటల

మూడేండ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు సంస్కరణలను ప్రవేశపెట్టి మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను చేపట్టిందని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బీసీలు, వృత్తి కులాలతోపాటు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల అభ్యున్నతికి బడ్జెట్‌లో భారీ నిధులను కేటాయిస్తున్నదని అన్నారు. ప్రజలపై భారం పడకుండా సొంత రాబడులను పెంచుకుంటూ దేశంలో ప్రథమస్థానంలో ఉన్న తెలంగాణ.. సంపద సృష్టిస్తూ ప్రజలకే పంచుతున్నదన్నారు. జీఎస్టీలో సామాన్యులపై అధికభారం పడకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నదని చెప్పారు. నిత్యావసర వస్తువులపై కూడా జీఎస్టీ రేట్లను పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తామని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

జీఎస్టీలో రాష్ర్టాల హక్కులకు భంగం వాటిల్లకుండా, పన్ను భారాన్ని పెంచకుండా చూస్తామని మొదటి నుంచి చెప్తున్న మీరు ఈ దిశలో విజయం సాధించారా? జీఎస్టీ విధానం సామాన్యులకు భారం కారాదని, వ్యాపార వర్గాల్లో అయోమయం సృష్టించే విధంగా ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్తున్నది. జీఎస్టీ కౌన్సిల్‌లో జరిగిన చర్చల్లో రాష్ర్టాల హక్కులకు భంగం కలుగరాదని, పన్నుల రేటు హేతుబద్ధంగా ఉండాలని వాదిం చాం. ఆచరణ యోగ్యమైన రీతిలో పన్ను ల విధానం ఉండాలని పట్టుబట్టాం. పన్నుల వాటాలో, అధికారాల్లో రాష్ర్టాల ఉనికి దెబ్బతినకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలు కూడా ప్రత్యేక కృషి చేశాయి. ఈ దిశలో ఫలితాన్ని సాధించగలిగాం. జీఎస్టీ అమలు వల్ల కలిగే నష్టాన్ని ఐదేండ్ల వరకు కేంద్రం భరించాలని, రూ.కోటిన్నర లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదానితోపాటు పలు అంశాలపై రాష్ర్టాల హక్కులను కాపాడుకున్నాం. వ్యవసాయ ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మినహాయించమన్నాం.

రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆచరణయోగ్యంగా ఉన్నదని భావిస్తున్నారా? కేంద్రం కొన్ని వస్తువులపై తాజాగా విధించిన ట్యాక్స్ రేటు వల్ల చాలా వర్గాలలో అనుమానాలు, భయాందోళనలు తలెత్తాయి. సేవారంగాలు, ఉపాధితో ముడిపడిన వస్తువులపై కూడా రేట్లు పెంచడం బాధాకరం. దీనిపై తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపినా యునానిమిటీ పేరుతో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించింది. ఉదాహరణకు బీడీలపై పన్నును మినహాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కానీ గతంలో కంటే ఎక్కువగా తునికాకుపై 28 శాతం, బీడీలపై 28 శాతం పన్ను విధించడం అన్యాయం. వ్యవసాయరంగంలో ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై అధిక పన్ను భారం మోపారు. బంగారంపై మూడు శాతం పన్ను విధించారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్‌లలో ఉపయోగించే హార్డ్‌వేర్ ఇతర వస్తువులపై పన్ను రేటు పెంచారు. వాస్తవానికి పన్ను రేటు ఎంత పెరిగితే అంత ఎగవేత ఉంటుం ది. పన్నురేటు అందుబాటులో ఉంటే ట్యాక్స్ పరిధిలోకి చాలా మంది వస్తారు. దాని వల్ల ఎగవేత తగ్గి రాబడి పెరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష ఉదాహరణ. పన్నులను పెంచకుండానే సొంతరాబడులను పెంచుకోవడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

జీఎస్టీ రేట్లను తగ్గించడానికి మీరే విధంగా కృషి చేస్తారు? ఈనెల 11న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో సామాన్య ప్రజలకు భారంగా మారిన పన్నుల రేట్లను తగ్గించాలని కోరుతాం. ప్రాక్టికల్ ట్యాక్సేషన్ లేకపోతే తలెత్తే విపరిణామాలను వివరిస్తాం. పేదల ఉపాధితో ముడిపడి ఉన్న బీడీలు, తునికాకుపై అసలే పన్ను వేయరాదని స్పష్టం చేస్తాం. కండ్లద్దాలు, వ్యవసాయవ్యర్థాలతో తయారయ్యే వస్తువులు, ఎరువులు, గ్రానైట్, వికలాంగులకు అవసరమయ్యే పరికరాలపై పన్ను రేటును తగ్గించాలని డిమాండ్ చేస్తాం.

యాసంగిలో వరిధాన్యం సేకరణలో దళారుల ప్రమేయాన్ని తగ్గించడానికి, గిట్టుబాటు ధరల కోసం చేపడుతున్న చర్యలేమిటీ? యాసంగిలో ఈసారి రికార్డుస్థాయిలో రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తయింది. ధాన్యంసేకరణకు, తరలింపునకు రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశాం. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1510, కామన్ రకానికి రూ.1480 చెల్లిస్తున్నాం.

వచ్చే ఏడాది బడ్జెట్ ఎలా ఉండబోతున్నది? రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రధానంగా దృష్టి నిలిపి పూర్తిగా విజయం సాధించగలిగారు. ప్రజలపై పన్ను భారం లేకుండా సుస్థిరపాలనతో ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించి సొంతరాబడిని పెంచుకోగలిగాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాబడిలో 17.5% వృద్ధిరేటు సాధించాం. ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రతీ పైసాను లెక్కించడంలో కచ్చితంగా ఉంటూ ప్రజా సంక్షేమానికి నిధులను వెచ్చించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలోబడ్జెట్‌కు రూపకల్పన చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. సంపదను సృష్టించి పేదల అభివృద్ధికి వెచ్చిస్తున్నాం. బీసీలు, ఎంబీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశాం. వేయి కోట్లతో ఎంబీసీల కార్పొరేషన్ ఏర్పాటు, చేతి, కుల వృత్తులకు ఆర్థిక చేయూత తెలంగాణ బడ్జెట్‌లో విశేషాలు.

పౌర సరఫరాల్లో చేపట్టిన సంస్కరణలు ఎంత వరకు ఫలించాయి? ఇంకా చర్యలుంటాయా? పేదలకు అందాల్సిన సబ్సిడీ ,లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్, బయో మెట్రిక్, సీఎంఆర్ విధానాలు, కమాండ్ కంట్రోల్ సిస్టమ్, వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం వంటి చర్యలతో అవినీతికి అడ్డుకట్టవేయగలిగాం. గత పాలకులు పౌరసరఫరాలను గాలికి వదిలేయడం వల్ల అవినీతి, అక్రమాలు భారీస్థాయిలో జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశాం. లెక్కలు పక్కాగా ఉండేలా ఆన్‌లైన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నాం. హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ వల్ల సరుకులు అసలైన లబ్ధిదారులకే చేరుతున్నాయి. దీని వల్ల ఇప్పటి వరకే దాదాపు రూ.200 కోట్లు ఆదా చేయగలిగాం. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.