Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్రాంతి తర్వాత శంకుస్థాపనలు

-ఏప్రిల్ కల్లా టీఆర్‌ఎస్ ఆఫీసుల నిర్మాణాలు పూర్తికావాలి
-ఓటరునమోదు పర్యవేక్షణకు తెలంగాణభవన్‌లో ప్రత్యేకబృందం
-పార్టీ ప్రధాన కార్యదర్శులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

టీఆర్‌ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాలకు సంక్రాంతి పండుగ తర్వాత వరుసగా శంకుస్థాపనలు చేయనున్నట్టు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. అన్ని జిల్లాల శంకుస్థాపనలకు తాను హాజరవుతానని చెప్పారు. సిరిసిల్ల కార్యాలయ శంకుస్థాపనకు పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు హాజరవుతారన్నారు. ప్రభుత్వం అనుమతించిన మేరకు ప్రతి జిల్లా కార్యాలయానికి ఒక ఎకరం వరకు స్థలాన్ని సేకరించేందుకు అవకాశముందని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా 20కిపైగా జిల్లాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. గుర్తించిన స్థలాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, చదునుచేయాలని సూచించారు. పార్టీ కార్యాలయాలను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. మిగిలిన జిల్లాల్లో స్థలాలను ఖరారుచేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సూచించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఓటర్ల నమోదు, కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. గత ఎన్నికల్లో ఓటుహక్కు పొందలేకపోయినవారిని గుర్తించి వారందరికీ ఓటుహక్కు కల్పించాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని కోరారు.

కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి అవసరమైన దరఖాస్తు ఫారాలను పార్టీ నాయకుల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు.. స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎక్కువరోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటుగా మండల పార్టీ అధ్యక్షులతోనూ నేరుగా మాట్లాడుతూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు. ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించేందుకు తెలంగాణభవన్‌లో ప్రత్యేకబృందాన్ని ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ప్రతి రెండ్రోజులకోసారి ఎంతమంది ఓటర్లను నమోదు చేయించేందుకు దరఖాస్తులు సమర్పించారో వాటి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. దీనితోపాటు ప్రతిరోజు ఎంతమంది దరఖాస్తులను నమోదయ్యేలా చేశారు..? వాటి లెక్కలను కూడా పంపించాలన్నారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఏ శ్రీనివాస్‌రెడ్డి, బీ వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్‌రావు, గంగాధర్‌గౌడ్, ఫరీదుద్దీన్, గ్యాదరి బాలమల్లు, రావుల శ్రవణ్‌రెడ్డి, బండి రమేశ్, పీ రాములు, బస్వరాజు సారయ్య, తుల ఉమ, సత్యవతి రాథోడ్, టీ రవీందర్‌రావు, నరేశ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన ప్రముఖులు
కేటీఆర్‌తో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ప్రముఖులు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, పట్నం నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, బేతి సుభాష్‌రెడ్డి, పువ్వాడ అజయ్, టీ రాజయ్య, మాగంటి గోపీనాథ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం తదితరులు కలిశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను కలిసినవారిలో ప్రముఖ యాంకర్ సుమ, యాడ్ ఫిల్మ్ మేకర్ యమున కిశోర్ ఉన్నారు. సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పనికోసం కేటీఆర్ మద్దతు కోరామని, అందుకు సానుకూలంగా స్పందించారని యాంకర్ సుమ మీడియాతో అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.