-దూసుకుపోతున్న తెలంగాణ సర్కారు -అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు -సాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి భారీ ప్రాజెక్టులు -దీర్ఘకాలిక ప్రణాళికల రచన -ప్రభుత్వ పనితీరుపై తెలంగాణవాదుల హర్షం

తొలి ఏడాది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ సర్కార్, రెండో ఏడాది మరింత స్పీడు పెంచింది. ఒకవైపు సంక్షేమ పథకాలు చేపడుతూనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణకు దీర్ఘకాలిక వ్యూహాలు రచించారు. రెండో ఏడాదిలోకి అడుగుపెడుతూనే ఆ వ్యూహాల అమలుకు శ్రీకారం చుట్టారు. పాలనపగ్గాలు చేపట్టింది మొదలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనేక విజయాలు సాధించారు. ప్రధానంగా ఆసరా పింఛన్లు, రేషన్ బియ్యం కోటా పెంపు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితులకు మూడెకరాల భూపంపిణీ.. వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాలు పారదర్శకంగా అమలయ్యేలా కట్టుదిట్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు రహదారుల అభివృద్ధి, మిషన్ కాకతీయ కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణ అభివృద్ధిపథాన దూసుకుపోవడంపై తెలంగాణవాదులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
శరవేగంగా భారీ ప్రాజెక్టులు.. మొదటి ఏడాది భారీ ప్రాజెక్టులను ప్రస్తావించిన సీఎం కేసీఆర్, ఎంతో మేధోమథనం తరువాత వాటికి తుదిరూపు తెచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఆయా ప్రాజెక్టులకు నాంది పలికారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో జులైలోపే వివిధ శాఖల్లోని 25వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. చెప్పినట్టుగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకూ పచ్చజెండా ఊపారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది రూ.2500 కోట్లతో 50వేల మందికి ఇండ్ల్లు కట్టించి ఇస్తానని స్పష్టం చేశారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాలో విజయం సాధించిన తెలంగాణ సర్కారు మిగులు విద్యుత్ సాధించే దిశగా దూసుకుపోతున్నది.
సుమారు 91వేల కోట్ల ఖర్చుతో 24వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించడంలో భాగంగా బృహత్తర థర్మల్ పవర్ ప్లాంటు పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 8న నల్లగొండ జిల్లా దామరచర్లలో దేశంలోనే అతిపెద్ద అల్ట్రా పవర్ ప్లాంటు ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.24వేల కోట్ల వ్యయంతో 4వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు పునాదిరాయి పడింది. ప్రతి ఇంటికీ నల్లా నీరందించేందుకు రూ.36వేల కోట్లతో చేపడుతున్న తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ ఈనెల 8న శంకుస్థాపన చేశారు. సమైక్య పాలనలో కాగితాల్లో ఉండిపోయిన సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కార్యరూపం కలిగిస్తున్నారు.
పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈనెల 11న శంకుస్థాపన చేశారు. మరుసటి రోజే నల్లగొండ జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక చిత్రాన్ని మార్చే టీ-ఐపాస్‌ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పరిశ్రమలకు పదిహేను రోజుల్లోనే అన్నిరకాల అనుమతులు ఇచ్చే సింగిల్ విండో విధానాన్ని అమలులోకి తెచ్చారు. పాలసీని ప్రవేశపెట్టిన పదోరోజున ఏకంగా 17 కంపెనీలకు సాక్షాత్తూ సీఎం కేసీఆర్ అనుమతి పత్రాలను ఇవ్వడం విశేషం. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో రూ. 1501.42 కోట్ల పెట్టుబడులతో 17 కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 12న రాష్ర్టానికి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేకూర్చే సోలార్ పవర్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. దీంతో పదివేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి సాధించవచ్చని భావిస్తున్నారు.