Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్షేమ తెలంగాణ దిశగా…..

-రెవెన్యూ మిగులు రూ.4,571.30 కోట్లు -ద్రవ్యలోటు రూ.26,096.31 కోట్లు -ప్రగతి పద్దులో సంక్షేమ వాటా 41.86% -సామాజిక సేవారంగానికి రూ.37 వేల కోట్లు -మొత్తంగా నీటిపారుదల రంగానికి 25 వేల కోట్లు

సంక్షేమ తెలంగాణ దిశగా.. -ఎస్సీ సంక్షేమానికి రూ.14,375.12 కోట్లు -ఎస్టీ సంకేమానికి రూ.8165.88 కోట్లు -బీసీ సంక్షేమానికి రూ.5070.36 కోట్లు -మైనారిటీ సంక్షేమానికి రూ.1249.66 కోట్లు

కీలక రంగాలకు కేటాయింపులు -వ్యవసాయరంగానికి రూ.5,942 కోట్లు -మిషన్ భగీరథకు రూ.3000 కోట్లు -మిషన్ కాకతీయకు రూ.2000 కోట్లు -విద్యుత్‌రంగానికి రూ.4,203 కోట్లు -పారిశ్రామిక రంగానికి రూ.985 కోట్లు -పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ.14,723 కోట్లు -పట్టణాభివృద్ధి శాఖకు 5,599 కోట్లు

పేదల సంక్షేమమే పరమావధిగా, ప్రజా సమస్యలే ఇతివృత్తంగా 2017-18 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేశామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చి, కులవృత్తులకు ఆదరువుగా నిలిచి, కూలిన జీవితాలను నిలబెట్టేదే ఈ బడ్జెట్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాలకు చేర్చేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం సంక్షేమ రంగంలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ త్వరలో అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

పేదల సంక్షేమమే మాకు పరమావధి. ప్రజానుగుణంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మాకు ప్రజలే ప్రభువులు.. వారికోసం పనిచేయడమే మా కర్తవ్యం. మా ప్రభుత్వం బ్యాలెట్ బాక్స్ బడ్జెట్‌ను కాకుండా బతుకును నిలబెట్టే బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారానే తెలంగాణ ఎదుగుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణనిచ్చే పథకాలను రూపొందిస్తున్నాం, వలసల నుంచి తిరుగు వలసల దిశగా తెలంగాణ ప్రస్థానం సాగేందుకు ఈ బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాం అని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 1,49,646 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. తాను ప్రవేశపెడుతున్నది ప్రగతి బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రజలే కేంద్రంగా ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తమకు మార్గనిర్దేశనం చేస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలనే ఆరాటం తమ ప్రణాళికలలో అడుగడుగునా కనిపిస్తుందన్నారు. ఈ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి ఈటల చెప్పారు. పేదల సంక్షేమం పట్ల ఆపేక్షతోపాటు వారి ఆదాయాన్ని పెంచే అవకాశాలను, ఉపాధిని కల్పిస్తూ బంగారు తెలంగాణను సాధ్యమైనంత తొందరగా సాధించాలన్న సీఎం ఆకాంక్షను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన క్రియాశీల విధానాల వల్ల రెవెన్యూ అమితంగా పెరిగిందని సభకు సంతోషంగా తెలియజేశారు. ఈ ఏడాది 4,571.30 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని చెప్పారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చి, కుల వృత్తులకు ఆదరువుగా నిలిచి, కూలిన జీవితాలను నిలబెట్టేదే ఈ బడ్జెట్ అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలువడం గర్వకారణమని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి కార్యక్రమాలను నీతి ఆయోగ్ ప్రశంసించిందన్నారు. సంక్షేమ రంగంలో మనం దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. అభివృద్ధి నమూనా అంటే కేరళ, గుజరాత్‌ల గురించి మాట్లాడుతున్నారని, అతి కొద్ది సమయంలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకం తనకుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈసారి రెవె న్యూ, క్యాపిటల్ పద్దుల కింద బడ్జెట్ రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో మార్పులు అనివార్యం అయ్యాయన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు ఉండే విధంగా అంచనాలు రూపొందించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధులు ఖర్చు కాకపోతే తదుపరి ఏడాది క్యారీ ఫార్వర్డ్ పద్ధతిలో బదిలీ చేసుకోవచ్చునని తెలిపారు. పేదలకు గౌరవప్రదమైన నివాసాల్ని కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో తమ ప్రభుత్వం 2.60 లక్షల రెండు పడకగదుల ఇండ్లను మంజూరు చేసిందన్నారు.

మహిళ, శిశు సంక్షేమానికి పెద్దపీట పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఇస్తున్న రూ. 51 వేలను రూ.75,116లకు పెంచుతున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. పెండ్లి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో పేదల కుటుంబాల్లో ఎనలేని ఆనందాన్ని పంచుతున్న ఈ పథకానికి ఇచ్చే మొత్తాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో మానవీయ నిర్ణయాలు తీసుకుందని అన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు సరిపడేంత పోషకాహారం లభించాలనే ఉదాత్త భావనతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు గుడ్లు, పాలు, పోషకాహారం అందిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలకు మూడు విడుతలుగా రూ.12 వేలు ఇస్తామన్నారు. అడపిల్ల ప్రసవించిన మహిళలకు ప్రత్యేకంగా మరో వెయ్యి రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తామన్నారు. అలాగే పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే 16 వస్తువులను కేసీఆర్ కిట్ పేరుతో అందించాలని మరో నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమంలో మనమే నంబర్ వన్ డాక్టర్ బీఆర్‌అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీల కోసం130 గురుకులాలను మంజూరు చేసి, ఇప్పటివరకు 103 ప్రారంభించినట్లు తెలిపారు. ఎస్సీ విద్యార్థినుల కోసం 23 గురుకుల కళాశాలలను ప్రారంభించామని, వచ్చే ఏడాది మరో ఏడు కాలేజీలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్‌లను రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచామన్నారు. ప్రభుత్వం మైనారిటీల కోసం 201 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసిందని, ఇందులో 71 ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిందని మంత్రి ఈటల తెలిపారు. విదేశాలలో చదువుకునే బీసీ విద్యార్థుల కోసం మహాత్మాజ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పేర ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నామన్నారు.

కాలపరీక్షను తట్టుకొని నిలబడడమే కాకుండా ఎంతో లాభసాటిగా ఉన్న కులవృత్తులను తమ ప్రభుత్వం గుర్తించిందని ఆర్థిక మంత్రి ఈటల చెప్పారు. ఈ మేరకు పశు సంవర్థకం, చేపల పెంపకం పట్ల ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసి, గొల్లకురుమలకు ఆదాయాన్ని సమకూర్చే పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అర్హత కలిగిన కుటుంబానికి 20 గొర్రెలు, ఒక్క పొట్టేలును 75 శాతం సబ్సిడీతో సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

గంగపుత్రులు, ముదిరాజ్ కులాలతో పాటు బోయకులస్తులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయడం, చెరువులు బాగు చేయడం ద్వారా చేపల పెంపకానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. చేపల విత్తనాన్ని ప్రభుత్వమే సరఫరా చేసి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. చేపల పెంపకం పరిశ్రమ స్థాయికి ఎదిగి, దానిపై ఆధారపడిన లక్షలాది మత్య్సకారుల బతుకులు మారిపోయి, ఆర్థికంగా బలపడుతారన్నారు.

నాయీ బ్రాహ్మణుల కోసం నవీన క్షౌరశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పెట్టుబడిని సమకూరుస్తుందన్నారు. అలాగే రజకులకు అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం పూనుకుందన్నారు. విశ్వకర్మలుగా పిలువబడే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కల్లుగీత ఆధారంగా జీవిస్తున్న గౌడ్‌లకు, కుమ్మరి తదితర కులవృత్తుల వారందరికీ అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించడంతోపాటు పరికరాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నేత కార్మికులకు ప్రతి నెల కనిష్ఠంగా రూ.15 వేలు వేతనం ఇచ్చే విధంగా పవర్‌లూమ్ యజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించిందన్నారు. ప్రభుత్వం తరుపున జరిపే వస్ర్తాల కొనుగోళ్ల ఆర్డర్లను చేనేత మరమగ్గాల సొసైటీలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే వరంగల్‌లో టెక్స్‌టైల్‌పార్క్, సిరిసిల్లలో అపారెల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, వారి అభివృద్ధి, సంక్షే మం కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని వెల్లడించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈ బడ్జెట్‌లో రూ.1,939 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి తెలిపారు. బ్రాహ్మణ సామాజికవర్గంలోని పేదల ఇక్కట్లు తీర్చేవిధంగా వివిధ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఇదేతీరుగా జర్నలిస్టుల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. సైన్యంలో పదవీ విరమణ చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్ పెన్షన్ అందించే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. అలాగే త్వరలో సైనిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

వైద్యానికి జవసత్వాలు వైద్య రంగాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ దవాఖానలను మెరుగుపరుస్తున్నామని, హైదరాబాద్‌లో మరో మూడు మల్టీ సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. మరో సూపర్‌స్పెషాలిటీ దవాఖానను కరీంనగర్‌లో నిర్మించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ చొరవ, ఎంపీల ఒత్తిడితో కేంద్రం రాష్ట్రానికి ఎయిమ్స్‌ను మంజూరు చేయడానికి చర్యలు తీసుకున్నదన్నారు. బడ్జెటేతర నిధులతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న వేగంతో పూర్తవుతుందని ఈటల చెప్పారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నదీజలాలు చేరే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. సమైక్య రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ ఒక తీరని కల అని నేడు అది ప్రజల నిత్యఅనుభవమని మంత్రి ఈటల అన్నారు. లోటు విద్యుత్‌తో మొదలైన తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారబోతున్నదన్నారు. టీఎస్ ఐపాస్‌తో లైసెన్స్ రాజ్‌కు ప్రభుత్వం చరమగీతం పాడిందన్నారు.

నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్లు కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని ఈటల రాజేందర్ తెలిపారు. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇందులో 7 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందని, మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల శాఖకు రూ.25 వేల కోట్లు కేటాయించామన్నారు. రైతులను రుణ విముక్తులను చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకానికి చివరి విడతగా రూ.4 వేల కోట్లను కేటాయించామని ఆర్థికశాఖ మంత్రి తెలిపారు. పరిపాలనా విభాగాలు చిన్నగా ఉన్నప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే అంబేద్కర్ ఆలోచన మేరకు తెలంగాణను పునర్వ్యవస్థీకరించి 31 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు.

ఈటల బడ్జెట్ ప్రస్థానం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ నాలుగోసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం రాజేందర్‌కు ఆయన సతీమణి జమున, శాసనసభ్యులు శ్రీనివాస్‌గౌడ్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీకి బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడుతూ కులవృత్తులకు,ఆర్థికవృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తూ ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది అని చెప్పారు. అక్కడినుంచి సచివాలయానికి చేరుకున్న మంత్రికి పలువురు టీఆర్‌ఎస్ శాసనసభ్యులు స్వాగతం పలికారు. అక్కడ బడ్జెట్ ప్రతులపై సంతకం చేసిన మంత్రి ఈటల రాజేందర్ శాసనసభకు చేరుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.