Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్షేమ తెలంగాణ

దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ సమగ్ర జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం విశేష కార్యక్రమాలు.. వినూత్న పథకాలు దాదాపు కోటిన్నర మంది లబ్ధిదారులు దాదాపు కోటిన్నర మంది లబ్ధిదారులు.. ఇంటింటికీ చేరుతున్న ఫలాలు ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు వినూత్న పథకాల అమలు

ఇల్లు కట్టడం.. పెండ్లి చెయ్యడం.. ఒకప్పుడు ఏ పేద కుటుంబానికైనా ఈ రెండూ పెను సవాళ్లు! బిడ్డ పెండ్లి చేసిన తర్వాత పురుళ్లు మరో పెద్ద బాధ్యత! ఇక పిల్లల చదువు.. చదువుకు తగిన ఉపాధికి నిత్యం సమరమే! దానికి తోడు ఇంట్లో ఉన్న వృద్ధుల బాధ్యత.. ఇంటిల్లిపాది పోషణ! అరకొర ఆదాయాలతో బతుకీడ్చడం గగనమైన రోజులు! అరవై ఏండ్లుగా ఇదే గోస! తమ బొజ్జలు పెంచుకునేందుకు తాపత్రయపడే పాలకుల హయాంలో.. రైతులను, కార్మికులను పట్టించుకోని సమైక్య రాష్ట్రంలో ప్రజల వ్యథాభరిత జీవన దృశ్యమిది! ఇప్పుడు ఆ దృశ్యం మారుతున్నది! సొంత రాష్ట్రంగా తెలంగాణలో సబ్బండ వర్ణాల సమగ్ర జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమయజ్ఞం చేస్తున్నారు! ఒకటా.. రెండా.. అనేక పథకాలు.. ఒక పేద కుటుంబం సమగ్రంగా మెరుగైన జీవితం గడిపేందుకు భరోసానిస్తున్నారు!! సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్న కోటిన్నరమంది జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని.. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లుగా పడిన అవస్థలకు చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావించారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ సంక్షేమరాజ్యంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో వినూత్న పద్ధతుల్లో సంక్షేమ పథకాలను రూపొందించి విస్త్రృతస్థాయిలో అమలుచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు దాదాపు కోటిన్నర మందికి చేరుతున్నాయి. ఇందులో 41 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, 14 లక్షల మందికి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయి. 3,13,575 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పెండ్లి సంబురాలు తెచ్చింది. గత ప్రభుత్వాలు అనుసరించిన పైరవీ విధానాలకు భిన్నంగా శాస్త్రీయంగా నవీన పద్ధతుల్లో నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించే విధంగా సకుటుంబ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. హెగెల్ వంటి తత్వవేత్త నిర్వచించిన పంథాలో సంక్షేమరాజ్య నిర్మాణంలో తెలంగాణ ముందుకు దూసుకుపోతున్నది. ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి గ్రామీణ, పట్టణ నిరుపేదలకు లబ్ధి చేకూర్చేవిధంగా జరుగుతున్న ప్రయత్నాలకు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు ఎక్కువమంది పేదలకు అందాలనే ఉద్దేశంతో రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆదాయ పరిమితిని సర్కారు భారీగా పెంచింది. గ్రామాల్లో రూ.60 వేల వార్షిక ఆదాయ పరిమితిని రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల ఆదాయ పరిమితిని రూ.2 లక్షలకు తెలంగాణ సర్కారు పెంచింది. దీని ఆధారంగా రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన, మైనార్టీవర్గాల ప్రజలందరికీ సంక్షేమఫలాలు అందుతున్నాయి. ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి ఒకనాడు భారమైతే నేడు వేడుకగా మారింది.

గౌరవప్రదమైన జీవనానికి భరోసా.. ఆసరా పెన్షన్

ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు కేవలం నెలకు రూ.200 పెన్షన్ మాత్రమే ఇచ్చారు. అది కూడా సరిగా అందేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ పెన్షన్‌ను నెలకు రూ.1000గా పెంచారు. ఏడాదికి కేవలం పెన్షన్ల కోసమే రూ.5,300 కోట్లకు పైగా బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. మొత్తం 41,78,291 మందికి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తున్నది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదలైన వృద్ధులు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారు. వికలాంగులకు నెలకు రూ.1500 పెన్షన్ ఇస్తున్నారు. గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, హెచ్‌ఐవీ పేషంట్లకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు తెలంగాణ సర్కారు ఆసరా పెన్షన్లు అందజేస్తున్నది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పెన్షన్ల కోసమే ప్రభుత్వం రూ.16,631.37 కోట్లు ఖర్చు చేసింది.

మహిళా సాధికారత దిశగా..

మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా పయనిస్తున్నది. మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావించారు. రాజకీయాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఇతోధికంగా ఉండాలని భావించి స్థానికసంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఫలితంగా ఎంతోమంది మహిళలు నేడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాగే మహిళా రక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మహిళలపై దాడులు జరుగకుండా షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారు. షీటీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తుండడంతో ఆకతాయిల బెడద తప్పింది. మహిళలు స్వయంశక్తితో ఎదుగాలని సీఎం కేసీఆర్ భావించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి సర్కారు వీహబ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులలో ఉన్న మహిళలకు వ్యాపార అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ఎలాంటి తనఖాలు పెట్టుకోకుండా స్త్రీనిధి ద్వారా రూ.లక్ష, అంతకంటే ఎక్కువ రుణాలు ఇస్తున్నది.

ఈ రుణాలకు పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. స్త్రీనిధి ద్వారా వివిధ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులలో ఉన్న దాదాపు 18 లక్షల మంది మహిళలకు పావలా వడ్డీ కింద రూ.2771.29 కోట్ల రుణాలు అందజేసింది. రాష్ట్రంలో ఉన్న 4.45 లక్షల సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులు 83.58 లక్షల కుటుంబాలను బాసటగా నిలిచాయి. అలాగే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బ్యాంకు లింకేజీ ద్వారా 1,04,805 గ్రూపులకు రూ.3421.97 కోట్ల రుణాలు ఇచ్చారు. 3,93,542 గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నది. దీపం పథకం కింద 4.73 లక్షల గ్యాస్‌కనెక్షన్లు ఇచ్చింది. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పోషక ఆహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే సహాయానికి అదనంగా రూ.277.71 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో గర్భిణులు 3,66,199 మంది కాగా, 14,40,614 మంది ఏడునెలల నుంచి ఆరేండ్ల వయసున్న చిన్నపిల్లలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడేండ్ల్లలోపు చిన్నారులకు నెలకు 8 గుడ్లు మాత్రమే ఇస్తే తెలంగాణ ప్రభుత్వం నెలకు 16 గుడ్లు ఇస్తున్నది. మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు ఉమ్మడి సర్కారు 16 గుడ్లు మాత్రమే ఇస్తే తెలంగాణ సర్కారు నెలకు 30 గుడ్లు ఇస్తున్నది. అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలను రూ.10,500లకు, మినీ అంగన్‌వాడీ హెల్పర్లకు నెలకు రూ.6 వేలకు జీతాలను పెంచింది.

పేదింటి గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లోనే సురక్షితమైన ప్రసవాలు జరిగేవిధంగా తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ దవాఖానల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. కేసీఆర్ కిట్స్ పథకం ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వైద్యపరీక్షలు చేయడమే కాకుండా ప్రసవాలు కూడా చేస్తున్నారు. గర్భిణులు పనులకు వెళ్లకుండా నగదుతోపాటు బాలిక సంరక్షణకు కిట్ ఇస్తున్నారు. మగపిల్లాడు పుడితే కిట్‌తోపాటు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే కిట్‌తోపాటు రూ.13 వేలు ఇస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలులోకి వచ్చాక సర్కార్ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం కోసం 5,92,397 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్యసేవలు పొందుతున్నారు. ఇప్పటివరకు 2,15,445 మంది ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయ్యారు. ఇప్పటివరకు 2,00,588 మందికి కేసీఆర్ కిట్లను అందించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.262.64 కోట్లు ఖర్చు చేసింది.

పేదింటి ఆడపిల్ల పెండ్లికి అండగా..

తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెండ్లికి అండగా నిలబడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆడబిడ్డల పెండ్లిళ్లకు భారీఎత్తున ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఈ ఆర్థికసహాయాన్ని రూ.51 వేలతో ప్రారంభించిన ప్రభుత్వం 2017, మే 15వ తేదీ నుంచి రూ.75,116కు పెంచింది. దీనిని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,00,116 (లక్షా నూటపదహారు)కు పెంచింది. ఇప్పటివరకు దీనికింద రూ.10.60 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు 3,13,573 మందికి ఆర్థిక సహాయం అందజేసింది. ఇందులో 82,859 మంది మైనార్టీలు, 84,112 మంది ఎస్సీలు, 51124 మంది ఎస్టీలు, 95,478 మంది బీసీలు ఉన్నారు. అలాగే దివ్యాంగులను వివాహం చేసుకున్నవారికి రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది.

మానవవనరుల అభివృద్ధే లక్ష్యంగా..

రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా రాష్ట్రంలో పేదలందరికీ చదువుకునే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యకు బాటలు వేశారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నతచదువులు చదువుకునే 14 లక్షల మంది విద్యార్థులకు ప్రతిఏటా రూ.2,400 కోట్లు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నది. గత సర్కారు ఇవ్వకుండా వదిలేసిన బకాయిలను కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. అలాగే హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులందరికీ సన్నబియ్యం భోజనం పెడుతున్నారు. ప్రతిఏటా రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చుచేసి 2.74 లక్షల మంది హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భారీగా రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 786 గురుకులాల్లో 2.54 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1855.55 కోట్లు ఖర్చుచేసింది. రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో 304 గురుకులాలు మాత్రమే ఉండగా 2017-18 నాటికి 786 గురుకులాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 119 గురుకులాలు రానున్నాయి. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన 26 మంది విద్యార్థులకు మెడికల్, ఆరుగురు విద్యార్థులకు బీడీఎస్‌లో సీట్లు వచ్చాయి. అలాగే నలుగురు విద్యార్థులకు ఐఐటీల్లో, 12 మందికి నిట్‌లో సీట్లు లభించాయి. 2017-18 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.156.32 కోట్ల ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చింది. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఉంటున్న 2,38,526 మంది విద్యార్థులకు రూ.1187.49 కోట్లు ఖర్చుచేసింది.

స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ

పేదింటి యువకులు ఏర్పాటు చేసుకునే స్వయం ఉపాధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సిడీ ఇస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయల రుణానికి రూ.30 వేల సబ్సిడీ ఉండగా తెలంగాణ ప్రభుత్వం దీనిని రూ.80 వేలకు పెంచింది. అలాగే రెండు లక్షల రుణానికి రూ.1.20 లక్షలు, ఐదు లక్షల రుణానికి రూ.2.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నది. ఈ పథకం కింద 2014-15లో 67,442 మందికి, 2015-16లో 19,821 మందికి, 2016-17లో 49,200 మందికి, 2017- 18లో 66,185 మంది యువకులకు స్వయంఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలు ఇచ్చారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ను సర్కారు అందిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 800 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 1964 మంది విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందించింది.

డబుల్ బెడ్‌రూం ఇండ్లు

రాష్ట్రంలో గుడిసెలు అనేవి ఉండకూడదనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. ఆ ఉద్దేశంతోనే రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఒక్క హైదరాబాద్‌లోనే రెండు లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించడానికి కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నారు. ఈ తరహా ఇండ్లకు సికింద్రాబాద్‌లో నిర్మించిన ఐడీహెచ్ కాలనీ మోడల్ కాలనీగా నిలిచింది. ఆ తరువాత సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి మొదలుకుని అనేక గ్రామాలలో ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2,72,763 డబుల్ బెడ్‌రూం ఇండ్లను రూ.16,975 కోట్లతో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు ఇప్పటివరకు 1,73,406 ఇండ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నది, ఇందులో 1,38,795 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 5,824 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ఇదిలాఉండగా గత ప్రభుత్వాలు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు అప్పటి సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కారు 29,64,435 మంది లబ్ధిదారులకు చెందిన రూ.3,920.56 కోట్ల రుణాలను రద్దుచేసి, వారిని రుణవిముక్తులను చేసింది.

దళితులకు మూడెకరాల సాగుభూమి వ్యవసాయ భూమిలేని దళితులకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు ఎకరాల వరకు సాగుభూమిని ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ భూమి అందుబాటులోలేని గ్రామాల్లో ఇతర రైతుల వద్ద భూమిని కొని దళితులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు కావాల్సినన్ని నిధులు కేటాయించింది. ఎక్కడ భూమి దొరికితే అక్కడ కొనుగోలు చేసి దళితులకు పంచాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 4,984 మంది దళితులకు 12,853.05 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఇప్పటివరకు ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.551.59 కోట్లు ఖర్చు చేసింది.

రూ.5 లక్షల ప్రమాద బీమా రాష్ట్రవ్యాప్తంగా 14,48,611 మంది జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డులకు ప్రభుత్వం ప్రమాదబీమాను అందిస్తున్నది. ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు అందించాలని నిర్ణయించింది. కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రభు త్వం ఏటా రూ. 6,66,65,079 మొత్తాన్ని బీమా ప్రీమియంగా చెల్లిస్తున్నది.

పథకం .. లబ్ధిదారుల సంఖ్య -ఆసరా పెన్షన్లు 41,78,291 -కల్యాణలక్ష్మి/షాదీముబారక్ 3,13,573 -గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పోషకాహారం 18,06,814 -స్వయం ఉపాధి పథకాలు 2,02,648 -స్త్రీనిధి రుణాలు (పావలావడ్డీ) 18,00,000 -కేసీఆర్ కిట్స్ 2,00,588(ఇప్పటివరకు ఇచ్చినవి) -ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం కోసం వైద్యసేవలు పొందుతున్న గర్భిణులు 5,92,397 -ప్రమాదబీమా 14,48,611 -దీపం పథకం 4,73,000 -పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు 14,00,000 -2037 హాస్టళ్లల్లో2,74,733 -786 గురుకులాలు 2,54,187 -ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు 40,904 -1597 ప్రీమెట్రిక్ హాస్టల్స్ 2,38,526 -727 ప్రీమెట్రిక్ గురుకులాలు 2,26,405 -వడ్డీలేని రుణాలు3,93,542 (గ్రూపులు) -బ్యాంకు లింకేజీ రుణాలు1,04,805 (గ్రూపులు) -దళితులకు భూపంపిణీ 4,984 -మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ 2,420 -ఓవర్సీస్ స్కాలర్‌షిప్ 1,964 -డబుల్ బెడ్‌రూం ఇండ్లు 2,72,763 మంజూరు1,38,795 (గ్రౌండ్ అయినవి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.