Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్షేమమే బడ్జెట్ లక్ష్యం..

రాష్ట్ర ప్రజలు అత్యున్నత జీవనం అందుకోవాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి ద్వారానే సమాజం బాగుపడుతుందని తమ సర్కార్ గుర్తించిందన్నారు. ఆదివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు, చర్యలను పేర్కొంటూనే కాంగ్రెస్ హయాంలో జరిగిన పనుల తీరును . రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.1,30,0000 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించినట్లు వెల్లడించారు. బడ్జెట్‌లో అంచనాలు ఉంటాయే తప్ప ఓ ప్రవేటు సంస్థ పద్దుల పుస్తకంలా ఉండదని అన్నారు. -ప్రతి ఎకరాకు సాగునీరందించడం ప్రభుత్వ ధ్యేయం -అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని అయోమయానికి గురి చేయొద్దు -చట్టాలు దేవుడు చేసినవి కావు.. ప్రజల కోసం మార్చుకోవచ్చు -ప్రజల కాళ్లలో కాళ్లు వేసి నడిచాం కాబట్టే చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం -ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడ్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం -అభివృద్ధిలో అందరూ కలిసి రావాలి .. బడ్జెట్‌పై శాసనమండలిలో ఆర్థిక మంత్రి ఈటల

Etela Rajendar01

గత ప్రభుత్వాలు డబ్బును కేంద్రంగా చేసుకొని ప్రణాళికలు రూపొందించాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను కేంద్రంగా తీసుకొని కార్యక్రమాలను, బడ్జెట్‌ను రూపొందించిందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు, సాగునీటి పారుదల, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సంక్షేమ రాష్ట్రం అన్నారు. తాము తీసుకొస్తున్న పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నదని, మిషన్ భగీరథ వంటి పథకాలను పొరుగు రాష్ట్రాలు అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ నాయకులకు పరిపాలించడం రాదని గత పాలకులు ఎద్దేవా చేశారని కానీ నేడు గొప్ప రాష్ట్రంగా గుర్తింపు వచ్చేలా పరిపాలన జరుగడం గర్వకారణమన్నారు.

వనరులుంటేనే గొప్ప రాష్ట్రంగా మారిపోదని వాటిని సద్వినియోగం చేసుకొనేందుకు, ప్రజల కోణంలో నిర్ణయాలు తీసుకొనేందుకు చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కావాలి. అలాంటి ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిందన్న విశ్వాసం ప్రజల్లో కల్గింది. ఆ నమ్మకానికి నిదర్శనమే జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో వరుస విజయాలు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలలో కరువు వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాం. కానీ 2016-17లో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. 2015-16 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్సైజ్ శాఖ వసూళ్లలో 35.3 శాతం, వాహనపన్నులో 26.83 శాతం, స్టాంప్స్-రిజిస్ట్రేషన్స్‌లో 19.6శాతం, వ్యాట్‌లో 78.5, గనుల శాఖలో 25శాతం వృద్ధి కనిపించింది అని తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా సీఎం కేసీఆర్ సుమారు మూడు నెలలు అనేక శాఖల అధిపతులతో, కార్యదర్శులతో వందల గంటలపాటు సమావేశమయ్యారు. అనంతరం వాస్తవిక ఆలోచనతో, దూరదృష్టితో బడ్జెట్ రూపొందించారు అని తెలిపారు.

బడ్జెట్లో కేటాయించిన నిధులను వందకు వందశాతం ఖర్చు ఏ రాష్ట్రమూ చేయదని, దేశ బడ్జెట్లో కూడా ఇలాగే ఉంటుందని మంత్రి ఈటల వివరించారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో నిధుల ఖర్చు 67 శాతం సగటు ఉంటే, రెండేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో 86.5 శాతం ఉన్నట్లు ఈటల తెలిపారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని, ప్రజలను ఆయోమయానికి గురి చేయవద్దని తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా ఉందని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్‌లో రాష్ట్రం 25 శాతం రుణాలు పొందవచ్చని, 2015-16 నాటికి రాష్ట్రం అప్పు 16.1శాతం మాత్రమే ఉందని ఈటల గుర్తు చేశారు. ఇది ఆంద్రప్రదేశ్, బీహర్, హర్యానా, గోవా, పంజాబ్ రాష్ట్రాల కంటే చాలా తక్కువన్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే గుమ్మిలో వడ్లు గుమ్మిలోనే ఉండాలె.. బిడ్డలు దొడ్డుగా ఉండాలె అనే విధంగా ఉందని ఈటల విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజి నారాయణరావు, చాకలి ఐలమ్మ.. వంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని, తెలంగాణ వైతాళికులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విశేషంగా గౌరవిస్తున్నదని మంత్రి రాజేందర్ పేర్కొన్నారు. పీవీని కాంగ్రెస్ పార్టీ గౌరవించకుంటే తాము జయంతి నిర్వహించామని గుర్తు చేశారు.

వ్యవసాయరంగానికి ప్రాధాన్యం వ్యవసాయరంగ అభివృద్ధికి తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉద్యమ సమయంలో మేం వానమ్మ.. వానమ్మ పాట, చుట్టూ నీరు ఉన్న చుక్కనీరు లేని గోదారి.. వంటి పాటలను విన్నాం. ప్రజల కాళ్లలో కాళ్లు వేసి నడిచాం కాబట్టే మాకు వారి సమస్యలు తెలుసు. అందుకే చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం. కోదాడ-హాలియా పాదయాత్ర, జోగులాంబ గుడి- గద్వాల్ పాదయాత్ర, చెంచుపెంటల్లో నిద్ర, తండా నిద్ర.. ఇలా ఎన్నో సందర్భాల్లో ప్రజల్లో మేం ఒకరమయ్యాం. తెలంగాణలో ఒక సామెత ఉన్నది. పరిగె ఏరుకుంటే బతుకు పెరుగది.. పంట పడిస్తేనే పెరుగుతది అనే సామెతను నిజం చేసేందుకు పుడమి తల్లిని నీటితో తడిపేందుకు సిద్ధమయ్యాం. పింఛన్లు, సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వంటి పథకాల కంటే జీవితం ఇచ్చే భూతల్లిని సాగులోకి తెచ్చేందుకు వ్యవసాయరంగానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చాం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ట్రాక్టర్లకు సబ్సిడీ ఇచ్చాం.

రైతులకు రెండు విడతల రుణమాఫీ చేశాం. మిగిలినది మరో రెండు విడతల్లో మాఫీ చేయనున్నాం. యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా రూ.72వేల కోట్ల రుణ మాఫీ చేస్తే తెలంగాణలో రూ.3200 మాత్రమే మాఫీ అయ్యాయి అని మంత్రి ఈటల గుర్తు చేశారు. ఆర్‌బీఐ సహకరించకపోయినా మా సీఎం బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి రుణమాఫీని విజయవంతంగా అమలు చేస్తున్నాం. 2017-18లోపూ పూర్తి మాఫీ చేస్తాం. విద్యుత్ సబ్సిడీలు రూ.5000 కోట్లు కూడా మొత్తం రైతులకే చెందేలా చేశాం. కేవలం తొమ్మిది గంటల విద్యుత్ ఉత్పత్తి చేస్తేనో, రుణమాఫీ చేస్తేనో, సబ్సిడీలు ఇస్తేనే రైతులు బాగుపడరని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, పంటకు సాగునీరు అందించినప్పుడే రైతులు అభివృద్ధి చెందుతారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రహించింది. సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు కేటాయించాం. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. చేవేళ్లకు నీరురాదని రంగారెడ్డి జిల్లా రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ సర్కార్‌కు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే భేదం లేదు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ సమానమే. ప్రతి ఒక్కరి కన్నీళ్లు తూడ్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని రాజేందర్ తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖలో నిధుల కేటాయింపులు 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంఆర్‌ఆర్ పథకం కింద రూ.259.68 కోట్లతో 2383.62 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే చేపట్టగా, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 8138.52 కిలోమీటర్ల రోడ్లు వేశామని మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని అభినందించకపోగా విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో కోటి, రెండు కోట్ల నిధుల మంజూరు కోసం నేను స్వయంగా మంత్రుల కార్యాలయాలకు వెళ్లాను. కానీ ఇపుడు కాంగ్రెస్ వారు అడగకపోయినప్పటికీ చక్కటి రోడ్లు వేస్తున్నాం అని ఈటల చెప్పారు.

కేంద్రం కొన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వార్షిక బడ్జెట్ కేటాయింపులు ప్రజలకు మంచి చేస్తాయని, ఈ విషయంలో గందరగోళ పడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం దాదాపు రూ.20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు నిధులు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే వాటర్‌గ్రిడ్ పథకం కూడా అద్భుతంగా కొనసాగుతుందని ఈ రెండు పథకాలకు కేంద్రం నుంచి కొన్ని నిధులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. పాతబస్తీ ఇరానీకేఫ్‌లలో, పంక్చర్ దుకాణాలలో అందరూ ముస్లిం యువకులే ఉన్నారని, వారంతా నిజాం వారుసులే తప్ప, నిజాం అంత ధనికులు కాదని ఈటల వ్యాఖ్యానించారు. మైనారిటీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉర్దూ అకాడమీని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. రూ. లక్ష కోట్ల ఖర్చు విషయంలో కాగ్ లెక్క తేల్చుతుందని, తలసరి ఆదాయం విషయంలో జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న సూచనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

సంక్షేమ రంగానికి ప్రాధాన్యం టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందని, నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ రంగంపై చిన్నచూపు చూసినా తాము ఆచరణలో అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పారిశ్రామికరంగంలో వృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. లక్షా 25 వేలమందికి ఉచితంగా పట్టాలు ఇచ్చామని చెప్పారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకున్నామన్నారు. హాస్టళ్లలో విద్యార్థుల దయనీయ స్థితిగతులను వివరించిన ఈటల వారి తలరాత మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చట్టాలనేవి దేవుడు చేసినవి కాదని ప్రజల సంక్షేమం కోసం వాటిని మార్చుకోవచ్చని చెప్పారు. రూ.200 పెన్షన్ ఇస్తూ ఆనాడు సంక్షేమం కోసం రూ.800 కోట్లు ఖర్చు చేస్తే, ఇపుడు 35లక్షల మందికి పెన్షన్ ఇస్తూ రూ.4,800 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

ఇది 500 శాతం ఎక్కువ. వసతి గృహాల విద్యార్థులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కళాశాలలు, విశ్వవిద్యాలయాల హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 1.91 కోట్ల మందికి పీడీఎస్ బియ్యం అందజేస్తే మేము 2.81 కోట్ల మందికి ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నాం. దీనివల్ల రూ.2800 కోట్ల భారం పడుతున్నప్పటికీ ఖర్చుగా మేం భావించడం లేదు. అణగారిన వర్గాల అభ్యున్నతిలో భాగమని అనుకుంటున్నాం. హాస్టల్, స్కూళ్లలోని విద్యార్థులకు సన్నబియ్యం భోజనం పెట్టేందుకు రూ. 700 కోట్లు ఖర్చుచేస్తున్నాం. కాలేజీలు, యూనివర్సిటీల్లో సన్నబియ్యం పెట్టడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయల భారం పడినప్పటికీ సంతోషంగా భరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వ హయాంలో 216 స్కీములు ఉన్నాయి.

ఆటో, బస్సు డ్రైవర్ల కోసం ఇన్సూరెన్స్‌లు, జర్నలిస్టుల కోసం రూ.100 కోట్ల బడ్జెట్ వంటివి ఎన్నో పథకాలు రూపొందించాం, సమర్థంగా అమలుచేస్తున్నాం. అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన పార్టీ ఎమ్మెల్యేలు ఇదే సభలో ఉన్నారు. అంగన్‌వాడీ అక్కాచెల్లెళ్లను సీఎం కేసీఆర్ స్వయంగా పిలిపించుకొని మాట్లాడి వారి వేతనాలు రూ.7000 చేశారు. ఆశావర్కర్ల సమస్యను టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంతో ఇప్పటికే విన్నవించారు. అత్యుత్తమ వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో 4 అత్యున్నత దవాఖానలు, కరీంనగర్, ఖమ్మం లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మించనున్నాం. సర్కారు అంటే రోడ్లు, విద్యా, వైద్యం అనే మేం అనుకోవడం లేదు. ప్రభుత్వం బాధ్యతను పూర్తిగా నెరవేర్చేందుకు బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను జరిపి ప్రజల విశ్వాసాలను గౌరవిస్తున్నాం. సమాజంలో 85% ఉన్న బడుగు, బలహీనవర్గాల సంతోషం కోసం, వారి కంట కన్నీళ్లు తుడవటం కోసం పనిచేస్తూ ఇంత గొప్పగా నిధులు కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు కలుషిత తాగునీటి వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. వాటిని నిర్మూలించి, ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ఇంటికే తాగునీరు అందించాలని నిర్ణయించాం. నీళ్లివ్వకపోతే ఓట్లడగబోమని మా సీఎం స్వయంగా ప్రకటించారు. అలా ఇంటింటికీ ఎల్లవేళలా నీరందించేందుకు నాగార్జునసాగర్, ఎల్‌ఎండీ, మానేరు, శ్రీరాం సాగర్‌ల నుంచి నీటిని తీసుకొనేందుకు సిద్ధమయ్యాం. డెడ్‌స్టోరేజీలోనూ ప్రజల గొంతు ఎండవద్దని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది నాటికి 6100 గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు నీళ్లందిస్తాం. 2018 చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీరిందించడమే లక్ష్యం. ఇందుకోసం 40 టీఎంసీల నీటిని కేటాయించాం. పరిశ్రమలకు 10 శాతం కేటాయిస్తాం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పనితీరును, చిత్తశుద్ధిని గుర్తించి ప్రతిపక్షాలు అభివృద్ధిలో కలిసి రావాలి అని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

రెప్పపాటు కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేకుండా రాష్ట్రంలో వెలుగులు నింపామని మంత్రి ఈటల వివరించారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాం. జెన్‌కో ఆధ్వర్యంలో భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుతో పాటు సింగరేణి విద్యుత్, సోలార్ విద్యుత్, ఎన్టీపీసీ, కోల్ మైన్స్ ద్వారా 91వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగనుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి గ్యారెంటీ, అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే పారిశ్రామికరంగంలో వృద్ధి సాధిస్తున్నాం.అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నాం అని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.