Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సంక్షేమానికి స్వర్ణయుగం

-దేశం అబ్బురపడేలా కేసీఆర్ పాలన -అందరికీ తాగునీరు.. ప్రతీ ఎకరానికి సాగునీరు -1.12 లక్షల ఉద్యోగాల భర్తీ ఖాయం -రూ.10 కోట్లతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి -వంచన, ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది -ఖమ్మం,మధిర సభల్లో మంత్రి శ్రీ కేటీఆర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి నాలుగేండ్లకాలం సంక్షేమానికి స్వర్ణయుగమని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు అభివర్ణించారు. సంక్షేమరంగంలో నాలుగేండ్లలో ఇన్ని కార్యక్రమాలు చేయవచ్చా! అని దేశం మొత్తం అబ్బురపడి చూసేలా కేసీఆర్ పాలన సాగుతున్నదని అన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయద్దేరినట్టు కాంగ్రెస్ నాయకుల కథ ఉందని ఎద్దేవాచేశారు. సోమవారం ఖమ్మంజిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం శివాయిగూడెంకాలనీ, మధిర పట్టణంలోని తేళ్ల వసంతయ్య మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రగతిసభల్లో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అద్భుతంగా పారిశ్రామికరంగంలో దూసుకెళ్తున్నామని, టీఎస్‌ఐపాస్ ద్వారా పరిశ్రమలను ఆకర్షిస్తున్నామని చెప్పారు. ప్రైవేటురంగంలోనూ ఉద్యోగాలిచ్చే ప్రయ త్నం చేస్తున్నామన్నారు.

ప్రభుత్వరంగంలో 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీచేసి తీరుతామని స్పష్టంచేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే.. మన సీఎం నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కూ డా కావాలని అంటున్నారని చెప్పారు. సీతారామ, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి, మనకు రావాల్సిన 1200 టీఎంసీల నీటిని తీసుకొస్తామని అన్నారు. మాట నిలబెట్టుకునే సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 2,630 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేశారని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్‌కు ఏటా రూ.100 కోట్లను కేటాయిస్తున్నామని, ఖమ్మం రూపురేఖలు మార్చామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను ఖమ్మంలా తీర్చిదిద్దితే తన పదవికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దని, తమది పేదల ప్రభుత్వమే తప్ప పొట్టగొట్టే ప్రభుత్వం కాదని అన్నారు.

ఎవరేం చేశారో మీరే బేరీజువేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి? ఇప్పుడు జరుగుతున్నవి ఎలా ఉన్నాయో బేరీజువేసుకోవాలని ప్రజలను మంత్రి శివాయిగూడెంకాలనీ సభలో కోరారు. టీడీపీ హయాంలో రూ.70 వృద్ధాప్య పింఛను ఇచ్చేవారని, అది కూడా ఒకరు చనిపోతే తప్ప మరొకరికి వచ్చేదికాదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200కు పెంచి అదేదో గొప్పగా చెప్పుకొన్నదని ఎద్దేవాచేశారు. పేదల కన్నీళ్లలోంచి, కష్టంలోంచి వచ్చిన రాష్ట్రం కాబట్టి తెలంగాణలో పేదలు ఇబ్బంది పడటానికి వీల్లేదని, దేశంలో ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా రాష్ట్రంలో ముమ్మాటికీ పింఛన్ల కింద వెయ్యి, పదిహేనువందలు ఇస్తామని కేసీఆర్ చెప్పారని, చెప్పినట్టే 42 లక్షల మందికి ఈ రోజు పింఛన్లపై ఏటా రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పింఛన్లకోసం ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ బియ్యం మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు అని సీలింగ్ పెడితే.. సీఎం కేసీఆర్ ఈ విధానాన్ని తీసేసి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఆరు కిలోల చొప్పున ఇస్తున్నారని చెప్పారు.

ఈ రోజు సీఎం మనుమడు, మనుమరాలు ఏ సన్నబియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్నబియ్యంతో హాస్టళ్లు, పాఠశాలల్లో పేదింటి పిల్లలకు కడుపునిండా బువ్వ పెడుతున్నామని తెలిపారు. మహిళలు బిందెలు పట్టుకుని వెళ్లాల్సిన దుస్థితిలేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భద్రాద్రిలో రూ.వందకోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మణుగూరులో విద్యుత్ కేంద్రం, కొత్తగూడెంలో కేటీపీఎస్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. పేదింటి ఆడకూతురు పెళ్లీడుకొస్తే కులమతాలతో నిమిత్తం లేకుండా లక్షానూటపదహార్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. గతంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అని సినిమా కవులు పాటలురాస్తే.. నేడు కేసీఆర్ కిట్ పథకం వచ్చాక 30-50 శాతం వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెరుగుతున్నాయని, పేద గర్భిణులు కూలిపనులకు వెళ్లాల్సిన దుస్థితిని తొలిగిస్తూ వారికి రూ.12వేలు అందజేస్తున్నామని చెప్పారు.

కన్నతల్లికి అన్నం పెట్టడుకానీ.. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులుచేయిస్తానన్న చందంగా కాంగ్రెస్ తీరుందని కేటీఆర్ ఎద్దేవాచేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ది డ్రామాలు, ద్రోహాలు, వంచనలతోకూడిన చరిత్రని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చరిత్ర చెప్తే చాలామంది సిగ్గుపడతారన్నారు. అలాంటి కాంగ్రెస్ ఈ రోజు నీతులు చెప్తే విని, మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని భట్టివిక్రమార్కనుద్దేశించి అన్నారు. గడ్డం పెంచిన ప్రతీ ఒక్కడు గబ్బర్‌సింగ్ అయిపోతాడా? అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవాచేశారు. గడ్డం తీయను కనుక నాకే ఓట్లు వేయాలి అని అడుగటమేంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో చేస్తున్న పనులను దేశం మొత్తం చూస్తున్నదని చెప్పారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌కు కూడా అర్థయింది కానీ.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు మాత్రం అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు.. చేయాల్సిన నీచమైన పనులన్నీ చేసి.. ఈ రోజు కల్లబొల్లి మాటలు చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు బస్సుల్లో బయలుదేరుతున్నారని మండిపడ్డారు. ముదిగొండలో ఆరుగురిని కాల్చి చంపిన పార్టీ మాటలు వింటుంటే వేదాలు వల్లించే దెయ్యాలు కూడా సిగ్గుపడతాయన్నారు. రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి రెండు పంటలకు రూ.8 వేలు ఇస్తానని చెప్పడంతో కాంగ్రెసోళ్ల కడుపులు మండుతున్నాయని చెప్పారు.

రెండున్నరేండ్లలో సీతారామను పూర్తి చేస్తాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే సీతారామ ప్రాజెక్టును రెండున్నరేండ్లలో పూర్తిచేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. దుమ్ముగూడెం నుంచి రఘునాథపాలెంకు నీళ్లు రప్పిస్తామని, బుగ్గవాగును నిర్మించి చెరువులు నింపుతామని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.72 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాకు 850 మంజూరుచేశామని తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ.. 2,637 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధికి ఖమ్మం గుమ్మంగా తయారైందన్నారు.

కేసీఆర్ పాలన స్వర్ణయుగం కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మధిరలోని తేళ్ల వసంతయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రగతిసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పాలన చేతనవుతుందా అన్నవారే ఇప్పుడు ఆంధ్రాలో టీఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు పంపుతున్నారని చెప్పారు. చరిత్రలో ఏ సందర్భంలోనూ మధిరకు రూ.15 కోట్లు మంజూరు కాలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్‌ను చూసి టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి ఆశీర్వదించాలని, మధిర నియోజకవర్గంలో గులాబీజెండా ఎగురవేయాలని కోరారు. మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ మధిర దవాఖానను వంద పడకలతో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లికి దీటుగా అన్ని రంగాల్లో మధిర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ కేటీఆర్ ఆశీస్సులతో మధిరకు రూ.15 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.

ఈ సభల్లో టీఎస్‌ఐడీసీ చైర్మన్ షేక్ బుడన్‌బేగ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్, ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం మేయర్ పాపాలాల్, మధిర మున్సిపాలిటీ చైర్‌పర్సన్ నాగరాణి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు, టీఆర్‌ఎస్ నాయకులు లింగాల కమల్‌రాజు, బొమ్మెర రామ్మూర్తి, కలెక్టర్ డీఎస్ లోకేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సందీప్‌కుమార్ ఝా, పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ వినిపించిన పిట్టకథ కాంగ్రెస్ నాయకుల తీరుపై మంత్రి కేటీఆర్ ఒక పిట్ట కథ చెప్పారు. గాంధీచౌక్ సెంటర్‌లో ఒక దర్జీ ఉండేవాడు. ఒక రోజు హడావుడిగా బట్టలు కుడుతున్నాడు. అది పండుగ సీజన్. ఒకసారి సూది పడిపోయింది. ఎంత వెతికినా దొరుకలేదు. దేవుడా ఆ సూది దొరికితే నీకు కొబ్బరికాయ, కిలో పంచదార ఇస్తానని మొక్కాడు. ఇంట్లో వంటగదిలో ఉన్న భార్య పరుగున వచ్చి.. నీకేమైనా మెదడు పనిచేయడం లేదా? పది పైసల సూది కోసం కిలో పంచదార, కొబ్బరికాయ కొంటాడా? అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ దర్జీ దేవుడు వస్తాడా? మనల్ని అడుగుతాడా! ముందు సూది దొరకనీ! ఆ తర్వాత కొబ్బరికాయ, పంచదార సంగతి చూద్దాంలే అన్నాడట! కాంగ్రెసోళ్ల సంగతి కూడా అచ్చంగా ఇలాగే ఉంది. నోటికి ఎంత వస్తే అంత.. ఎంత తోస్తే అంత! 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాం అంటున్నారు. ఇస్తే గిస్తే ఉత్తమ్‌రెడ్డిగారు రేపటి రోజున రిటైర్ కాబోయే కాంగ్రెస్ నాయకులకు ఇచ్చుకోవాలి తప్ప ఈ రాష్ట్రంలో నీ నిరుద్యోగ భృతి కోసం ఆశపడి, పొరపాటున కూడా నీకు ఓట్లు వేసే యువకులు లేరు అని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.