-సానుభూతి కోసమే నాటకం
-ఎన్నికలప్పుడే బీజేపీ దొంగ డ్రామాలు
-శస్త్రచికిత్సతో ఈటల ఎత్తుగడ
-హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరు
-మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ఎన్నికలు అనగానే బీజేపీ దొంగ డ్రామాలు ప్రారంభిస్తుంది.. ప్రచారంలో గాయాలైనట్టు, అనారోగ్యానికి గురైనట్టు, ఒళ్లంతా పట్టీలు కట్టుకొని తిరగడం ఆ పార్టీ ప్రచార ప్రణాళికలో ఓ ఎత్తుగడ.. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ కాలికి శస్త్రచికిత్స పేరుతో కొత్త నాటకానికి తెరతీశాడని, వీల్‌చైర్‌లో తిరుగుతూ సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేటలోని టీఆర్ఎస్ భవన్లో సోమవారం పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హుజూరాబాద్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇన్చార్జిలకు ఎన్నికల ప్రచారంపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..‘ఆసరా పింఛన్లు ఇవ్వడం, కల్యాణలక్ష్మి సాయం చేయడం అంటే మాటలా.. రైతుబంధు పెట్టుబడి సాయం అనేది ఎన్నికల హామీనే.. కాళేశ్వరం ప్రాజెక్టును కలలో కూడా కట్టలేరు.. మిషన్ భగీరథతో మంచినీళ్లు ఇంటింటికీ వస్తాయా?’ అంటూ నాడు ప్రతిపక్షాలు వెక్కిరించిన పథకాలే నేడు తెలంగాణ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. అదే తరహాలో దళితబంధును కూడా రాష్ట్రమంతటా అద్భుతంగా అమలుచేస్తామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయట్లేదని, హుజూరాబాద్‌లో ఆ పార్టీ గెలిచిన నయాపైస ఉపయోగం ఉండదని చెప్పారు. ఎన్నికలు రాగానే కొత్త కొత్త నాటకాలకు బీజేపీ తెరదీస్తుందని.. బెంగాళ్, తమిళనాడులో ప్రజలు ఆ పార్టీ ఎత్తుగడను బండకు కొట్టి బీజేపీని తరిమికొట్టారని గుర్తుచేశారు. వీరి డ్రామాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని నేతలకు మంత్రి సూచించారు.
ఉద్యోగాలు ఊడగొట్టడమే బీజేపీ నైజం..
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉద్యోగాలు ఊడగొడుతున్న పార్టీ బీజేపీ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఎస్ఎన్ఎల్ సంస్థలో సగం మందిని తొలగించారని గుర్తుచేశారు. అన్నింటినీ ప్రైవేటీకరిస్తే రిజర్వేషన్లు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. బీజేపీ ఉద్యోగాలు ఊడగొడుతుంటే, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నదని, ఇప్పటివరకు లక్ష 32 వేల ఉద్యోగాలు కల్పించిందని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడానికి ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం.. బీసీల అభ్యున్నతి కోసం బీసీ కులాలకు ఓ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.