Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సర్కారు దవాఖానలకు కార్పొరేట్ కళ

-అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దిన ప్రభుత్వం -అదనపు భవనాల నిర్మాణంతో పెరిగిన పడకలు -అత్యవసర వైద్య సేవల విస్తరణపై సర్కార్ దృష్టి -జిల్లా వైద్యశాలల్లో నవజాత శిశువులకు ప్రత్యేక యూనిట్లు -మెరుగైన సదుపాయాలతో ఐసీసీయూలు

372 కోట్లు -రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.372.47 కోట్లతో అదనపు భవనాల నిర్మాణం/విస్తరణ చేపట్టి కొత్తగా 2,690 బెడ్లను అందుబాటులోకి తెచ్చింది.

చిన్నారుల కోసం ప్రత్యేక యూనిట్లు -22 ఎస్సెన్సీయూలు (సిక్‌న్యూబోర్న్ కేర్ యూనిట్లు) -61 ఎన్బీఎస్‌యూలు -562 ఎన్బీసీసీలు

ప్రతిరోజు.. ఖమ్మం: గతంలో 600 వరకు ఉండే ఔట్ పేషెంట్ల సంఖ్య ఇప్పుడు సుమారు 2000కు చేరింది. నిజామాబాద్: గతంలో సుమారు 500 మంది ఔట్ పేషెంట్ల సంఖ్య ఇప్పుడు 1500కు పెరిగింది.

శిథిలావస్థలో ఉన్న భవనాల్లో.. పగుళ్లు తేలిన గచ్చులు.. పెచ్చులూడుతున్న పైకప్పులు.. తుప్పుపట్టిన మంచాలు.. చేతూలూడి.. కాళ్లు విరిగిన కుర్చీలు! తుమ్మలు మొలిచిన పరిసరాలు.. శుచీశుభ్రతకు నోచుకోక దుర్వాసన కొట్టే ప్రాంగణాలు! దేనికైనా ఎర్రనీళ్లమందు.. సున్నపు నీళ్ల సూదులే గతి! ప్రాణంమీదకొస్తే.. నమ్ముకునేవారికి దేవుడే దిక్కు.. ఇది గతం! నునుపుదేలిన ఫ్లోరింగ్.. రోగులు ప్రశాంతంగా కూర్చునేందుకు వీలుగా కుర్చీలు! ఆహ్లాదకర వాతావరణం.. మెరుగైన సౌకర్యాలు.. ఆధునిక పరికరాలు! అన్ని జిల్లా కేంద్ర దవాఖానల్లో ఐసీసీయూలు.. నవజాత శిశువుల కోసం ప్రత్యేక యూనిట్లు.. సుశిక్షిత సిబ్బంది! వెళితే సర్కారు దవాఖానకే వెళ్లాలనిపించేలా అందుతున్న వైద్యసేవలు! ఇది వర్తమానం! సర్కారు సంకల్పం, వైద్యారోగ్యశాఖ పట్టుదలతో ప్రభుత్వ వైద్యంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యశ్రీవంటి పథకాలతో ఒకవైపు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూనే.. ప్రభుత్వ హాస్పిటళ్లను సైతం వాటికి దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ ప్రభుత్వం! ప్రభుత్వ దవాఖానలు అధునాతన హంగులతో కొత్త కళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బోధనా దవాఖానలు, జిల్లాస్థాయి, ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని హంగులతో ముస్తాబయ్యాయి. దవాఖానలకు వచ్చే రోగులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు అత్యవసర వైద్యసేవల విస్తరణపై ప్రత్యేకదృష్టి సారించింది. ఐసీయూలను మెరుగుపర్చడంతో పేద, మధ్యతరగతికి కుటుంబాలకు కార్పొరేట్ దవాఖానల తరహాలో నాణ్యమైన వైద్యం అందుతున్నది. అన్ని జిల్లా వైద్యశాలల్లో నవజాత శిశువుల సంరక్షణ కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటుచేస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే నీలోఫర్ దవాఖానలో ఏర్పాటుచేసిన ఇంటెన్సివ్‌కేర్ బ్లాక్‌లో దేశంలోనే ఎక్కడాలేనన్ని వసతులు కల్పించారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలంగాణ వ్యాప్తంగా 22 ఎస్సెన్సీయూలు (సిక్‌న్యూబోర్న్ కేర్ యూనిట్లు), 61 ఎన్బీఎస్‌యూలు, 562 ఎన్బీసీసీలను ఏర్పాటుచేసింది. వీటిలో పనిచేస్తున్న సిబ్బందికి ఎఫ్‌బీఎన్సీ శిక్షణ ఇప్పించి చిన్నారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందజేస్తున్నారు.

కొత్తగా అందుబాటులోకి 2,690 బెడ్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు సర్కారు దవాఖానల్లో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.372.47 కోట్లతో అదనపు భవనాల నిర్మాణం/విస్తరణ చేపట్టి కొత్తగా 2,690 బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. 14 దవాఖానల్లో భవనాల విస్తరణ కోసం తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ద్వారా రూ.129.35 కోట్లు వెచ్చించి అదనంగా 720 బెడ్లు అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. మరో 7 దవాఖానల్లో రూ.127.50 కోట్లు ఖర్చుచేసి 1,050 బెడ్ల సామర్థ్యంతో మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. అలాగే మరికొన్ని దవాఖానల్లో అదనంగా 470 బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూ.61.56 కోట్ల నాబార్డు నిధులను వెచ్చించడంతోపాటు నీలోఫర్ దవాఖానకు వస్తున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని రూ.54.06 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా మెటర్నిటీ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 450 బెడ్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ అదనపు భవనంలో నవజాత శిశువులకు ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యాన వివిధ దవాఖానాల్లో నిర్మించిన అదనపు భవనాలు, వాటి వలన పెరిగిన బెడ్ల సంఖ్య కింది విధంగా ఉన్నది.

మాతాశిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎంఐసీయూలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా ఏర్పాటైన యంత్రాల వివరాలు..

-ఈసీజీ 12 చానల్ మిషన్ డిస్‌ప్లే -బీఐ పాప్ ఫిలిప్స్ రెస్పిరెనిక్స్ 5 సెట్లు -ఏబీజీ మిషన్ కార్టేజ్ -ఓపెన్ రాఖి 4 సెట్లు -వీల్‌చైర్లు 2 సెట్లు -ఇన్‌స్ట్రుమెంట్ ట్రాలీ 2 సెట్లు -ఓవర్ బెడ్ టేబుల్ 10 సెట్లు -ఫుల్ ఫోలర్ కాట్ 10 సెట్లు -క్రాష్ కార్ట్స్ (మెడిసిన్ ట్రాలీ) -వెంటిలేటర్ 2 సెట్లు -లాకర్లు 2 సెట్లు -బెడ్‌సైడ్ లాకర్లు10 సెట్లు

మెరుగైన ఐసీయూ సేవలు అన్ని జిల్లా కేంద్ర వైద్యశాలల్లో అధునాతన సౌకర్యాలతో ఐసీయూలను ఏర్పాటు చేయడంతో అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్‌కు వచ్చే రోగుల సంఖ్య ఏటా తగ్గుతున్నది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర వైద్యశాల ఐసీయూ పరిధిలో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో అత్యవసర వైద్యం కోసం అక్కడికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఈ ఐసీయూలోని వివిధ విభాగాల్లో 2016 మార్చి నుంచి 2017 మే వరకు మొత్తం 4,418 మందికి వైద్యసేవలు అందించగా, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలోని ఐసీయూలో 1,046 మంది వైద్యసేవలు పొందారు.

ఖమ్మం.. దేశానికే తలమానికం

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గతం లో రోజుకు దాదాపు 600 వరకు ఉండే ఔట్ పేషంట్ (ఓపీ)ల సంఖ్య ఇప్పుడు సుమారు 2 వేలకు చేరింది. ఈ దవాఖానలో కార్పొరేట్ వైద్యశాలను తలదన్నే అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రావడం, శానిటేషన్ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడటమే ఇందుకు కారణం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ దవాఖానలో ఓపీ బ్లాక్‌ను, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), ఎక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్, డయాలసిస్ యూనిట్, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాలను రూ.30 లక్షలతో ఆధునీకరించి అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దేశంలో అత్యంత మెరుగైన వైద్యశాలలకు ఇచ్చే కాయకల్ప అవార్డును ఖమ్మం ప్రభుత్వ దవాఖాన ఇప్పటికే రెండుసార్లు కైవసం చేసుకున్నది. ఈ దవాఖానలో అన్ని విభాగాలకు చెందిన 40 మంది వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండి రోగులకు సేవలందిస్తున్నారు.

నూతనంగా 150 పడకలతో మాతాశిశు సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేసి గర్భిణులకు వైద్యసేవలందిస్తున్నారు. అంతేకాకుండా 20 పడకలతో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)ను ఏర్పాటుచేసి లోపాలతో పుట్టిన శిశువులకు వైద్యసేవలందిస్తున్నారు. ఈ దవాఖానలో మరో 60 మంది వైద్యులను నియమించేందుకు ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేయగా, ఎన్‌ఐసీయూలో మరో 20 పడకల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఈ దవాఖానను దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని, ఈ ఏడాది కూడా కాయకల్ప అవార్డును కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్ తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, ట్రామాకేర్ సెంటర్, బర్న్స్‌వార్డు, స్కిన్ గ్రాఫ్టింగ్ సెంటర్‌లను ఏర్పాటుచేసి వైద్య సేవలను మరింత విస్తరిస్తామని ఆయన స్పష్టంచేశారు.

ఇందూర్‌లో ఈ-దవాఖాన! ఖలీల్‌వాడీ: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన రాష్ట్రంలోనే మొట్టమొదటి ఈ-హాస్పిటల్‌గా చరిత్రకెక్కింది. వైద్యం కోసం ఈ దవాఖానకు వచ్చే రోగికి యూనిక్ నెంబర్‌ను కేటాయించి వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుడు రాసిన మందులు తదితర వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఆ యూనిక్ నెంబర్‌తో అతను దేశంలోని ఏ ఈ-హాస్పిటల్‌లోనైనా వైద్యం చేయించుకునేందుకు వీలుం టుంది. అందుకోసం ఆ రోగి తన యూనిక్ నెంబర్‌ను చెబితే అతని వివరాలు, వ్యాధి పుట్టుపూర్వోత్తరాలన్నీ అక్కడి దవాఖానలోని కంప్యూటర్‌లో ప్రత్యక్షమవుతాయి. వాటి ఆధారంగా ఆ రోగికి వెనువెంటనే తగిన వైద్యం చేయించుకునేందుకు వీలుంటుంది. ఇంతటి ఉపయోగమున్న ఈ-హాస్పిటల్ విధానాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో తెలంగాణలో తొలుత నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో గతేడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ దవాఖాన కనీవినీ ఎరుగని రీతిలో 5.25 లక్షల మంది రోగులకు వైద్యసేవలు అందించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఈ దవాఖానకు రోజువారీగా సుమారు 500 మంది ఔట్ పేషెంట్లు, 100 మందిలోపు ఇన్‌పేషెంట్లు మాత్రమే వచ్చేవారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరిగి ఓపీల సంఖ్య 1,500 కు ఐపీల సంఖ్య 150 కి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆరోగ్య, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు అన్ని రకాల మందులను, వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకురావడమే ఇందుకు కారణం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.