Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సర్పంచే కింగ్

-గ్రామ స్వరాజ్యం దిశగా కేసీఆర్ ముందడుగు -గ్రామపాలన ఇక గ్రామం చేతిలోనే -మరింతగా ప్రజా భాగస్వామ్యం.. 73వ సవరణ పరిపూర్ణ అమలుకు కృషి -అధికారులంతా సర్పంచ్‌కే జవాబుదారీ -గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక.. కార్యాచరణకు సిద్ధమైన కేసీఆర్ సర్కార్ -మహాత్ముడి కలలు నిజం చేసేందుకు తపన

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించే దిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరుగులు తీస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్నతస్థాయి నుంచి క్షేత్ర స్థాయికి సాగిన పరిపాలనా క్రమాన్ని పూర్తిగా మార్చివేసేందుకు కంకణబద్ధులవుతున్నారు. గ్రామాభివృద్ధికి ఇకపై క్షేత్రస్థాయిలోనే ప్రణాళికలు రచించి.. గ్రామ ప్రజల సహకారం, భాగస్వామ్యంతో అమలు చేయించి.. అభివృద్ధిపథాన ఊరిని ఉరకలెత్తించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి గ్రామాన్ని సచివాలయంగా, గ్రామసభలను అసెంబ్లీలుగా మార్చి.. గ్రామానికి సర్పంచే సీఎంగా అధికారాలు కట్టబెట్టేందుకు సమాలోచనలు చేస్తున్నారు.

kcr01

73వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన 29 అధికారాలను పూర్తిస్థాయిలో కట్టబెట్టి.. గ్రామ సార్వభౌమత్వం సాధించే దిశగా యజ్ఞానికి సిద్ధమవుతున్నారు. తద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని సంకల్పిస్తున్నారు. ఇందుకోసం సదరు గ్రామ పరిధిలో సర్వాధికారాలను సర్పంచ్‌కే కల్పించడంతోపాటు.. ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారందరూ సర్పంచ్‌కే జవాబుదారీగా ఉండేలా వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. ఒక్కో గ్రామంలో అమలు జరుగాల్సిన ప్రతి కార్యక్రమానికి ఒక కమిటీ చొప్పున ఏర్పాటు చేసి గ్రామంలో ఎక్కువ మందిని వాటిలో భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన వారు ప్రజాసేవకే కట్టుబడి ఉండేలా వారిని తీర్చిదిద్దడానికి కూడా ప్రభుత్వ చర్యలు ఉండబోతున్నాయి. గ్రామం స్వయం పోషకంగా ఉండేందుకు అటు ప్రభుత్వపరంగా లభించే గ్రాంట్లు, ఇటు పన్నుల వసూళ్లకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటారు. గ్రామ పంచాయతీ కేంద్ర బిందువుగా తీరు మార్చుకోనున్న కొత్త వ్యవస్థలో సర్పంచ్‌కు కీలకాధికారాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

 

కారోబార్ స్థాయి ఉద్యోగి నుంచి.. – పంచాయతీ కార్యదర్శి – కారోబార్ – వీఆర్‌ఏ – వీఆర్‌వో – అంగన్‌వాడీ టీచర్, ఆయా – ఆశ వర్కర్ -వెటర్నరీ హాస్పిటల్ కాంపౌడర్ -రేషన్ డీలర్ -ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ – టెక్నికల్ అసిస్టెంట్…

వీరేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 36 శాఖల అధికారులు, ఉద్యోగులు ఇకపై ఒకే చట్రంలో సర్పంచ్ పర్యవేక్షణలో పనిచేయనున్నారు.గ్రామాల్లో కొత్తగా ప్రజలు రేషన్ కార్డు, కులం, ఆదాయం ధ్రువపత్రాలు తీసుకోవాలన్నా, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అర్హుల జాబితా రూపొందించాలన్నా.. అన్నింటికీ సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామసభలకే పూర్తి అధికారం ఉంటుంది. దీనిని ఆచరణలోకి తెచ్చేందుకు, తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చివేసేందుకు ప్రణాళికా రచన వేగంగా సాగుతోంది. గ్రామ పరిపాలనలో ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయంపై రెండు రోజులపాటు ఎంఎంఆర్ అపార్డ్‌లో జరిగిన జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో గ్రామస్థాయి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ లక్ష్యంగా ఈ ప్రణాళికలు ఉండాలని నిర్దేశించారు. ఇందుకోసమే గ్రామ పాలనలో సర్పంచ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న వివిధ శాఖల అధికారులపై ప్రత్యక్ష పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించడం ద్వారా వారిలో జవాబుదారీతనం పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లోని పలు గ్రామాలు స్వయం పోషకాలుగా మారాయి. తమతమ గ్రామ అవసరాలకు కావాల్సిన ప్రత్యేక కమిటీలు నియమించుకొని వాటికవే నిర్వహించుకుంటున్నాయి. అందుకు గంగదేవిపల్లి, ముల్కనూరు, అంకాపూర్ వంటి గ్రామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇలాంటి వేల గ్రామాలను తయారు చేయడమే ప్రస్తుత ప్రణాళిక లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలోనే స్క్రీనింగ్ గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేసే దిశలో గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఇకపై అవినీతికి చోటు లేకుండా చర్యలు తీసుకుంటారు. లబ్ధిదారుల ఎంపికపై గ్రామసభలో చర్చ జరుగుతుంది. ఒక లబ్ధిదారుడు పలుసార్లు ప్రభుత్వ పథకానికి అర్హుడు కాకుండా కట్టడి చేస్తారు. తద్వారా బినామీ పేర్లతో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడటమేకాకుండా.. అందరికీ సమాన స్థాయిలో పథకాల ప్రయోజనాలు చేరుతాయి. గ్రామాల్లో పెత్తందార్లు తమ పాలేర్లపేరుతో ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకున్న సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు అందించే స్వయం ఉపాధి పథకాలకు ఇచ్చే రుణాలు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నట్లు రికార్డులు పరిశీలిస్తే అతి సులువుగా వెల్లడవుతుంది. బ్యాంకు రుణాల విషయంలోనూ ఇలాంటి అక్రమాలే అనేకం ఉన్నాయి. ఇలాంటివాటిని నిరోధించాలంటే గ్రామసభలోనే స్క్రీనింగ్ జరగాల్సి ఉంది. ఒక్కో పథకంకింద ఎవరెవరు లబ్ధి పొందారు? కొత్తగా ఎవరికి ప్రయోజనం కలగాలి? కొత్తగా తెల్లరేషన్ కార్డు మంజూరు చేయాలంటే అతని ఆదాయ పరిస్థితి ఏమిటి? అనేది గ్రామసభలో చర్చిస్తే వారికి తెలిసిన వ్యక్తులే అక్కడ ఉండటం వల్ల నిజమైన లబ్ధిదారులకే మేలు జరిగే అవకాశం ఉంటుంది.

గ్రామాలకు పకడ్బందీగా వసూలైయ్యే పన్నులే ప్రధాన ఆదాయం. గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టికావాలంటే పన్నుల వసూళ్ల వ్యవస్థలో లోపాలు తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల నుంచి వసూలు చేసే పన్నులే గ్రామాల అభివృద్ధికి తిరిగి పెట్టుబడులు అవుతాయి. ఆస్తిపన్నును సక్రమంగా వసూలు చేస్తేనే ప్రజల్లో పంచాయతీ నిర్వహణలో భాగస్వామ్యం పెరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఓట్లు, సీట్ల కోసం గ్రామస్థాయిలో పన్నుల వసూలును సర్పంచ్‌లు పట్టించుకునేవారు కాదు. అది పంచాయతీలు ఆర్థికంగా పతనం కావడానికి దారి తీసింది. దాంతో ప్రజలు కూడా పంచాయతీల తీరును పట్టించుకునేవారు కాదు. దీంతో గ్రామ పాలన ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కొత్తగా రూపొందించే ప్రణాళికల్లో ప్రభుత్వానికి ఏ రకమైన పన్ను బకాయి ఉన్నా సంబంధిత కుటుంబానికి, వ్యక్తికి ప్రభుత్వ పథకాన్ని నిలిపివేసేలా సర్పంచ్‌కు అధికారాలు అప్పగించనున్నారు. గ్రామ స్థాయిలో ప్రతి ప్రభుత్వ పథకం అమలుకు సంబంధించి సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించే గ్రామసభలోనే నిర్ణయాలు జరిగేలా కేసీఆర్ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

అన్ని కమిటీలూ సర్పంచ్ ఆధ్వర్యంలోనే గ్రామ అభివృద్ధికి ఏర్పాటు చేసే కమిటీలన్నీ ఇకపై సర్పంచ్ ఆధ్వర్యంలో పని చేస్తాయి. ఇప్పటి వరకు కేవలం గ్రామ పంచాయతీల సమావేశాలు నిర్వహించడం, పంచాయతీ తీర్మానాలు చేయడం, సిబ్బందిపై నియంత్రణ, ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, సంవత్సరానికి కనీసం రెండుసార్లు గ్రామ సభలు జరపడం, గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసే అధికారుల నుంచి పరిపాలనా సంబంధమైన సమాచారం తెప్పించడం, పంచాయతీ విద్యా కమిటీ, స్వయం సహాయక సంఘాల సమావేశానికి హాజరై తగిన సూచనలివ్వడం, గ్రామ పంచాయతీల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో నిర్వహించే శిక్షణాకార్యక్రమాలకి హాజరవడంలాంటి అధికారాలు-విధులను మాత్రమే సర్పంచ్‌లు నిర్వహించే వారు.

పంచాయతీ పరిధిలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, అంటువ్యాధుల నివారణ, తాగునీటి సరఫరా, పంచాయతీ ఆధీనంలో ఉన్న భవనాలు, రోడ్లు, కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ, మురుగునీటి కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ, వీధులను శుభ్రం చేయించడం, పంచాయతీ పరిధిలో ప్రజారోగ్యానికి భంగం కలగకుండా పారిశుద్ధ్యం నిర్వహించడం, దహన వాటికలు, శ్మశానాల ఏర్పాటు, అనాథ ప్రేతాలకు అత్యక్రియలు, బందెల దొడ్ల నిర్వహణ, జనన మరణాల నమోదు, వివాహాల రిజిస్ట్రేషన్‌లాంటి విధులను పర్యవేక్షిస్తుంటారు. ఈ విధుల నిర్వహణలో ఉన్నవారు సర్పంచ్‌కు ఏ మాత్రం జవాబుదారీగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తయారు చేస్తున్న ప్రణాళికతో ఇవన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇకపై సర్పంచ్‌కు జవాబుదారీగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సకల అధికారులు ఏ రకంగా అయితే జవాబుదారీగా ఉంటారో.. సరిగ్గా అదే రీతిలో సర్పంచ్‌కు కూడా గ్రామ స్థాయి ప్రభుత్వ సిబ్బంది జవాబుదారీగా ఉంటారన్నమాట!!

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.