Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సరుకు రవాణాకు కేంద్రం హైదరాబాద్

-పెద్ద లాజిస్టిక్ హబ్ -మల్టీమోడల్ సరుకు రవాణా వ్యవస్థల ఏర్పాటే మా లక్ష్యం -లాజిస్టిక్ పార్కులతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు -ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడి -బాటసింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్కులకు శంకుస్థాపన

సరుకు రవాణాకు అనువైన ప్రాంతం ఏదైన ఉందా అంటే అది ఒక్క హైదరాబాద్ మాత్రమేనని, లాజిస్టిక్ పార్కులు, కోల్డ్‌స్టోరేజీ కంపెనీల రాకతో దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్ హబ్‌గా హైదరాబాద్ నగరం మారనున్నదని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. ఈస్ట్ వెస్ట్ సౌత్‌లో ఎక్కడికి సరుకులు రవాణా చేయాలన్నా హైదరాబాద్‌ను మించిన మరో నగరం దొరుకదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధ్దతిలో దాదాపు రూ. 60కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన హైదరాబాద్ శివారులోని బాటసింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్కుల నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ రెండు పార్కుల్లో 750 లారీలు, ట్రక్కులకు పార్కింగ్ సౌకర్యాలతోపాటు 3 లక్షల చదరపు ఫీట్లలో వేర్‌హౌజ్‌లు, 15వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్‌స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల నిర్మాణం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఇది ఆరంభం మాత్రమేనని, నగరం చుట్టూ 12 లాజిస్టిక్ పార్కులను తీసుకువస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రివర్గం అమోదించిన తర్వాత ఎక్కడెక్కడ పార్కులు వస్తాయో వెల్లడిస్తామన్నారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే టెర్మినళ్లు, శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానంచేస్తూ రెండుమూడు వందల ఎకరాల్లో లాజిస్టిక్ పార్కులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. శంషాబాద్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్ట్, రవాణాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. సరుకుల రవాణాలో మల్టీ మోడల్ వ్యవస్థల దిశగా అడుగులు వేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకువెళ్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఫార్మా ఉత్పత్తులు, బల్క్‌డ్రగ్స్, వ్యాక్సిన్లు, వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాం. ఆహార ఉత్పత్తులు పెరుగబోతున్నాయి. విస్తృతంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, కోల్డ్‌స్టోరేజీ యూనిట్లు రానున్నాయి. ప్రపంచంలోని అన్ని సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుండటంతో నగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నదని మంత్రి చెప్పారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ఉజ్వల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను తేవాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే అందుకు తగిన హంగులుండాలన్న ఉద్దేశంతో నగరం చుట్టూ ఔటర్‌కు అనుసంధానంగా దాదాపు 340 కిలోమీటర్ల మేర రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం చేపడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత ప్రభుత్వాల లాగా భూదందాలు, భూ సంతర్పణలు చేసే అలవాటు తమ ప్రభుత్వానికి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరం లేని దగ్గర అడ్డగోలు జమాబందీ ఉండదని, ప్రాజెక్టులకు, పరిశ్రమలకు అవసరమైతే ప్రజలను ఒప్పించి మెప్పించి భూమి తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా పొరపాటు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ జోన్‌లో బండ రావిర్యాలకు సంబంధించి పేద రైతులకు అన్యాయం జరిగిందని, వారిని తాము త్వరలోనే ఆదుకుంటామని తెలిపారు. ఇంజాపూర్ నుంచి హయత్‌నగర్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు, బాటసింగారం మచ్చగూడెం, మిగులుపురం గ్రామాలకు రోడ్ల సౌకర్యానికి కోటి రూపాయలను మంజూరు చేయాలని, ఈ అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలని హెచ్‌ఎండీఏను మంత్రి ఆదేశించారు. కుంట్లూరులో సీవరేజి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. తుర్కయాంజాల్ గ్రామపంచాయితీ తీర్మానం చేస్తే దానిని నగర పంచాయతీగా మారుస్తామని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.