భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోత అనే మాట వినిపించవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. వచ్చే మూడేండ్లలో రాష్ట్రం విద్యుత్ మిగులు సాధించి తీరాలన్నారు. ఇందుకోసం అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది నవంబర్ 15కల్లా 1200 మెగావాట్ల యూనిట్ పనులు పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి పవర్‌ప్లాంట్‌లో రెండోదశకు చెందిన 600 మెగావాట్ల మూడో ప్లాంటు పనులకు ముఖ్యమంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు.

-రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండొద్దు -మూడేండ్లలో మిగులు సాధించాల్సిందే -1200 మెగావాట్ల ప్లాంట్ నవంబర్‌కల్లా సిద్ధం కావాలి -పనులు త్వరగా పూర్తయ్యేలా చూడండి -అధికారులకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు -సింగరేణి మూడో పవర్ ప్లాంటుకు సీఎం శంకుస్థాపన
అనంతరం సింగరేణి గెస్ట్‌హౌజ్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవర్ ప్లాంటు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కొరత ఎదుర్కోకుండా ఉండేలా అందరూ దీక్షతో పనిచేయాలని సూచించారు. వచ్చే మూడేండ్లలో తెలంగాణ మిగులు విద్యుత్ లక్ష్యసాధనకు కృషి జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పురోగతిలో ఉన్న 1200 మెగావాట్ల ప్లాంటు పనులు ఈ ఏడాది నవంబర్ 15 కల్లా పూర్తి కావాలని ఆదేశించారు. దీనికి అధికారులంతా అంగీకరించి మొదటి యూనిట్ నవంబర్ 15, రెండో యూనిట్ డిసెంబర్ 15కల్లా పూర్తి చేస్తామని చెప్పారు.
సమస్యలు తక్షణం పరిష్కరించండి..: కాగా..1200 మెగావాట్ల కోసం నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్‌కు సంబంధించి తలెత్తుతున్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్లాంటుకు సంబంధించి రైల్వే ట్రాక్, వాటర్ పైప్‌లైన్ పనులకు సంబంధించి భూ సేకరణను రైతులు అడ్డుకుంటున్నారని సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్, సీఎం దృష్టికి తెచ్చారు. స్పందించిన సీఎం కేసీఆర్.. కలెక్టర్, మంచిర్యాల ఆర్డీవోలతో భూ సేకరణ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కూడా సహకరించాలని కోరారు.
సీఎం దృష్టికి సమస్యలు: ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ముఖ్యమంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లారు. సంస్థలో బొగ్గు ఉత్పత్తి పెంపునకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రస్తుతం ఉన్న 52 మిలియన్ టన్నుల ఉత్పత్తిని 2019-20 నాటికి 75.6 మిలియన్ టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త గనులను ప్రారంభిస్తామన్నారు. దీనిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం, నాయకత్వం మీద పూర్తి నమ్మకం ఉన్నదన్నారు. కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలైన ఇండోనేషియా, మెజాంబిక్, సౌత్‌ఆఫ్రికాలో బొగ్గు బ్లాక్‌లను తీసుకోవాలని సూచించారు. పర్యటన సందర్భంగా స్థానికుల నుంచి అర్జీలను సీఎం స్వీకరించారు. ప్లాంట్‌కు సంబంధించి పెగడపల్లి వైపు గేటు ఏర్పాటు చేయాలని కొందరు సీఎంను కోరారు. భూములు కోల్పోయిన వారికి వీలైతే శాశ్వత ప్రాతిపదికన, లేకపోతే కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలవ్వాలని అభ్యర్థించారు.
రామారావుపేటలో 300 ఎకరాల భూముల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రాలేదని ఆ గ్రామ సర్పంచ్ నామాల శ్రీనివాస్ సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడే ఉన్న సీఎండీతో ఆ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ వెంకట్రావ్, జిల్లా పరిషత్ చైర్మన్ వలికొండ శోభాసత్యనారాయణ గౌడ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ జగన్మోహన్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, శాసనసభ్యులు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాబూరావు, రేఖాశ్యాంనాయక్, చిన్నయ్య, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ తరుణ్‌జోషి, మంచిర్యాల ఆర్డీవో అయేషా మస్రత్ ఖానం తదితరులు పాల్గొన్నారు.
కొత్త యూనిట్ ఇస్తా.. ఎన్నాళ్లలో చేస్తారు? మరోవైపు జైపూర్‌లో రెండు యూనిట్లకు సంబంధించిన పనులు చేస్తున్న బీహెచ్‌ఈఎల్, ఎంబీఈ కంపెనీ అధికారులతో సీఎం మాట్లాడారు. బీహెచ్‌ఈఎల్ చైర్మన్ ప్రసాద్‌రావు, డైరెక్టర్ అతుల్ సోప్టి, ఎంబీఈ డైరెక్టర్ దీపాంకర్ సర్కార్ ముఖ్యమంత్రికి పనుల పురోగతి వివరించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త యూనిట్ (600 మెగావాట్లు) పనులు సైతం మీకే అప్పగిస్తా..ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని సీఎం వారిని ప్రశ్నించారు. దానికి 36 నెలల సమయం పడుతుందని సమాధానం చెప్పారు. అయితే, 36 నెలలు కాదు.. 30 నెలల్లోనే పూర్తి చేయాలని సీఎం వారితో అన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలన్నది తన తపన అని వారికి వివరించారు. దీనికి ఆ సంస్థల ప్రతినిధులు బదులిస్తూ సీఎం విధించిన గడువులోగా పూర్తి చేస్తామని అంగీకరించారు.