Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సత్తా చాటుతాం

-అసెంబ్లీ ఫలితాలే మళ్లీ రావాలి.. పదహారు ఎంపీ సీట్లే లక్ష్యంగా కార్యకర్తలు కృషిచేయాలి
-దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మకపాత్ర పోషించాలి
-పదహారు మంది ఎంపీలను కేసీఆర్ చేతుల్లో పెడితే శాసించేది మనమే
-ప్రధాని ఎవరనేది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు
-సనత్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-ఓటరు నమోదును ఉద్యమస్ఫూర్తితో చేపట్టాలి
-పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేద్దాం
-కష్టపడి పనిచేసినవారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం
-కేసీఆర్ ఏదిచేసినా కొత్త చరిత్రే
-ముందస్తుకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావడం ఓ రికార్డు
-ప్రజలు గుద్దిన గుద్దుడుకు ప్రజాకూటమి నేతలు ఆగమాగం: కేటీఆర్

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. 2019 సంవత్సరం పార్టీకి కీలకమని, పదహారు ఎంపీ సీట్లు గెలవడం లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కృషిచేయాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన వారిని మళ్లీ దగ్గరకు తెచ్చుకుందామని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల మెజార్టీ తగ్గడం వ్యక్తిగతంగా బాధ కలిగించిందని, ఇందుకు ఓట్ల గల్లంతు కూడా కారణమని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరుగకుండా ఓటర్ల నమోదును ఉధృతంగా, ఉద్యమస్ఫూర్తితో చేయించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. పదవుల కోసం నాయకుల చుట్టూ తిరగొద్దని, ప్రజల చుట్టూ తిరుగాలని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు.

బుధవారం హైదరాబాద్ జలవిహార్‌లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటరు నమోదులో తప్పిదాలు, లోపాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. ఓటరు నమోదులో కార్యకర్తలు, నాయకులు క్రియాశీలకంగా ఉంటే పార్టీ అభ్యర్థులకు మరింత మెజార్టీ వచ్చేదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కాకుం డా జనవరి 25 వరకు జరిగే ఓటర్ల నమోదును విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 12వేల చొప్పున ఓటరు ఎన్‌రోల్‌మెంట్ ఫారాలను అందించామని, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఓటరు నమోదు కార్యక్రమాన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని అన్నారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డివిజన్లు, బూత్‌లవారీగా పోలైన ఓట్లు పరిశీలించి.. ప్రస్తుత ఓటర్ల జాబితాను సమీక్షించుకోవాలని సూచించారు.

16 స్థానాలతో కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటే సీఎం కేసీఆర్.. కేంద్రం మెడలువంచి రాష్ర్టానికి రావాల్సిన ప్రయోజనాలను సాధిస్తారని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో యూపీఏ, ఎన్డీఏలకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, ఈ సమయంలో ఒక్కో పార్లమెంట్ సీటు కూడా కీలకమవుతుందని అన్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని, కేంద్రంలో కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం కచ్చితంగా ఉన్నదని, 16 ఎంపీ స్థానాలను ఆయన చేతుల్లో పెడుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్ పరిపాలన దేశంలో దిక్చూచిగా మారిపోయిందని, రైతుబంధు, రైతుబీమా పథకాలను ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాలు ఇప్పటికే అమలుచేస్తుండగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా క్రిషక్‌బంధు పేరుతో ప్రారంభించారని వివరించారు. బెంగాల్ ఈ రోజు ఏమి ఆలోచిస్తుందో భారతదేశం దానిని రేపు ఆలోచిస్తుందనేది నానుడి.. కానీ, ఇప్పు డు తెలంగాణ ఏం అమలుచేస్తున్నదో దేశమంతా దానిని అమలుచేయాలని చూస్తున్నది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ కొంచెం అటుఇటుగా వాళ్ల రంగురుద్ది రైతుబంధును దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు యత్నిస్తుండటం హర్షణీయమన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశమంతటా అమలుకావాలంటే ఢిల్లీలో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక పాత్ర పొషించాల్సిన అవసరం ఉన్నదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పక్షాన నిలబడి 16 సీట్లు కట్టబెడితే ఢిల్లీ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించే శక్తి తెలంగాణ ప్రజలకు వస్తుందని అన్నారు.

కేసీఆర్ అరుదైన నాయకుడు
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ప్రతిఒక్కరికీ చేదు అనుభవాలే ఎదురయ్యాయని, ఇందిరాగాంధీ, వాజపేయి, ఎన్టీఆర్, చంద్రబాబు వంటివారందరూ ముందస్తులో ఓడిపోయారని కేటీఆర్ తెలిపారు. కానీ, ప్రజల ఆలోచనలను పసిగట్టిన నాయకుడు కేసీఆర్ మాత్రం ముందస్తులో విజయం సాధించి చరిత్రను తిరుగరాశారని అన్నారు. ఒక రాజకీయనాయకుడు తన జీవితకాలంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టి దాని ఫలాలను ప్రజలకు అందించడం.. ఆ తరువాత రాష్ర్టానికి సీఎం కావడంతోపాటు, రెండోసారి ఆ పీఠాన్ని చేజిక్కించుకోవడం దేశ చరిత్రలోనే రికార్డు అని తెలిపారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ.. కేసీఆర్‌ను ధన్యజీవి అంటూ ఆశీర్వదించారని, ఉద్యమనాయకుడికి రాష్ట్ర నాయకత్వ బాధ్యత దక్కడం చాలా అరుదు అంటూ కితాబిచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ ఏదీచేసినా కొత్త చరిత్రే అని.. సెప్టెంబర్ 6న శాసనసభను రద్దుచేస్తున్నట్టు ప్రకటించి కేవలం గంటల వ్యవధిలోనే 105మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారన్నారు.

కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని బలంగా నమ్మిన ప్రజ లు కేసీఆర్‌కు రెండోసారి విజయం కట్టబెట్టారని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుద్దిన గుద్దుడుకు కిందపడిన ప్రజాకూటమి నేతలు ఇప్పటికీ లేవలేకపోతున్నారని, పాడయింది ఈవీఎంలు కాదు.. వారి బుర్రలు అని ఎద్దేవాచేశారు. ఎన్నికల ముందు బీరా లు పలికిన బీజేపీకి 103 సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. తెలంగాణలో టీడీపీ కథ ముగిసిందని, చంద్రబాబు అమరావతిలో అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. కుల, మతాలకతీతంగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేశారని, వారిచ్చిన బ్రహ్మాండమైన తీర్పును వమ్ముచేయకుండా వ్యవహరిస్తామని హామీఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకొంటామని స్పష్టంచేశారు. ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త కాలర్ ఎగరేసేలా హామీలు నెరవేరుస్తామని ధీమాగా చెప్పారు. తలసాని శ్రీనివాస్ ప్రజల మనిషి అని కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్‌లో ఏ కొత్త కార్యక్రమం ప్రారంభమైనా.. సనత్‌నగర్ నియోజకవర్గంలోనే ఉండేలా పట్టుపడతారని చెప్పారు. ఐడీహెచ్ కాలనీ, వైట్ ట్యాపింగ్ రోడ్లు, మోడల్ మార్కెట్లు, ఫంక్షన్‌హాల్స్ ఇలా ఏది ప్రారంభమైనా అది సనత్‌నగర్‌లోనే అని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ అయాచితం శ్రీధర్, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

నేడు సిరిసిల్లకు కేటీఆర్ సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుం ట్ల తారకరామారావు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీకి హాజరైన కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. సిరిసిల్లలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్‌హాల్‌లో మండలాలవారీగా కార్యకర్తలతో సమావేశమై అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తీరుపై సమీక్షించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరి 12.30 గంటలకు సిరిసిల్లకు చేరుకోనున్నారు. 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట, 1.30 గంటలకు గంభీరావుపేట, 2.30 గంటలకు ముస్తాబాద్, 3.30 గంటలకు తంగళ్లపల్లి, 4.30 సిరిసిల్ల టౌన్ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.

బెంగాల్ ఈ రోజు ఏమి ఆలోచిస్తుందో భారతదేశం దానిని రేపు ఆలోచిస్తుందనేది నానుడి.. కానీ, ఇప్పుడు తెలంగాణ ఏం అమలు చేస్తున్నదో దేశమంతా దానిని అమలు చేయాలని చూస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ కొంచెం అటుఇటుగా వాళ్ల రంగురుద్ది రైతుబంధును దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు యత్నిస్తుండటం సంతోషించదగిన విషయం. – కేటీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.