-అధికారులను ఆదేశించిన మంత్రి కేటీఆర్
-చేనేత, పవర్‌లూంలకు రెండు ప్రత్యేక కార్పొరేషన్‌లు
-వచ్చేనెల మొదటివారం నుంచి నూలు, రసాయనాలు,రంగుల సబ్సిడీ పథకం
చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో చేనేత, జౌళిశాఖలపై అధికారులతో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.10.50 కోట్లు అవసరమవుతాయని, దీనిద్వారా 2500 మంది కార్మికులు లబ్ధిపొందుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. లక్ష రూపాయల వరకు తీసుకున్న ప్రతి చేనేత కార్మికుడి రుణం మాఫీ అవుతుందన్నారు. అర్హులైనవారి తుది జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత, పవర్‌లూం కార్మికులు తీసుకున్న రుణాలను గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి మాఫీ చేస్తున్నామన్నారు. గతంలో నేతన్నలకు ప్రకటించిన పథకాలన్నీ త్వరగా అమలయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. నూలు, రసాయనాలు, రంగులపై సబ్సిడీ ఇచ్చే పథకాన్ని నవంబర్ మొదటివారంలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిద్వారా చేనేత కార్మికులకు 40 శాతం, పవర్‌లూం కార్మికులకు పదిశాతం సబ్సిడీ అందుతుంది. నేతన్నకు చేయూత కార్యక్రమంలో ప్రతి కార్మికుడు చేరేవిధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి సూచించారు. చేనేత కార్మికుల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసే బైబ్యాక్ పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.
రెండు ప్రత్యేక కార్పొరేషన్‌లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా హ్యాండ్లూం, పవర్‌లూంలకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను పూర్తిచేయాలని జయేశ్‌రంజన్, శైలజా రామయ్యర్‌లకు సూచించారు. ప్రస్తుతమున్న టెస్కోను తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌హెచ్‌డీసీ)గా మార్పు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనితోపాటుగా తెలంగాణ స్టేట్ పవర్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌నూ కొత్తగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం జాప్యం చేయరాదన్నారు. ఈ రెండు కార్పొరేషన్‌ల ద్వారా నేతన్నల జీవితాల్లో కీలకమైన మార్పులు వస్తాయన్నారు. గద్వాల చేనేత క్లస్టర్‌కు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చామని, రెండు వారాల్లో పనులు ప్రారంభించాలని తెలిపారు. సిరిసిల్లలో లూం అప్‌గ్రెడేషన్‌ను వచ్చే మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికోసం నవంబర్ 18న సిరిసిల్లలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. రాష్ట్ర విభజన అనంతర సమస్యలను త్వరగా పరిష్కరించుకునే విధంగా ఏపీ అధికారులతో సంప్రదింపులు జరుపాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, చేనేత, జౌళి జేడీ పూర్ణచందర్ రావు, టెస్కో జీఎం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.