Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీజనల్‌కు స్వీయ మందు

ఇక ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు అనే నినాదం స్ఫూర్తిగా మనం ప్రతి ఇంట్లో, పరిసరాలలో నీటినిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటిలో నీళ్లు నిల్వ ఉండే పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచుకోవాలి.

రెండేండ్ల కిందట హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానలో ఒక బెడ్డు కూడా ఖాళీ లేకుండె. కేవలం బెడ్డుకోసమే అనేక విజ్ఞప్తులు వచ్చేవి. ఇకపోతే వర్షాలు పడినాక వచ్చే సీజనల్‌ వ్యాధుల వల్ల ప్రజలు బిల్లులు కట్టలేక రాయితీల కోసం విజ్ఞప్తులు చేసేవారు. డెంగ్యూ వచ్చి కొడుకుకో లేదా కూతురుకో ప్లేట్‌లెట్స్‌ పడిపోతుంటే తల్లిదండ్రుల బీపీ పెరిగేది. ఐసీయూలో ఉంటే లక్షల్లో బిల్లు.. ఉన్న ఎకరానికో, రెండెకరాలకో చిల్లు. చికున్‌ గున్యా రోగం తగ్గినా కూడా నెలలకొద్దీ కీళ్ల నొప్పులు.. పనికి తిప్పలు. ఇవన్నీ సీజనల్‌ వ్యాధులు. వానకాలం రాగానే అపరిశుభ్ర పరిసర ప్రాంతాలు, నీటినిల్వలతోపాటు దోమల నిల్వలు పెరుగటం, దానికితోడు కలుషిత ఆహారం.. దాంతో వ్యాధుల జోరు.

సీజనల్‌కు స్వీయ మందు

వర్షం తక్కువగా పడినా వ్యాధుల వర్షం తప్పని ఆనవాయితీ. ఇవన్నీ కేవలం కొన్ని జాగ్రత్తలతో అరికట్టగలిగేవే. ఇప్పుడసలే కరో నా టైం. గట్టిగా తుమ్మాలన్నా, దగ్గాలన్నా భయం.. ఎక్కడ క్వారంటైన్‌లో పడిపోతమోనని. వర్షంతోపాటు మామూలు ఫ్లూ రాకమానదు, వస్తే తుమ్మక తప్పదు. తుమ్మితే ఇంట్లోవాళ్లే గెంటేసే రోజులివి. అందుకోసం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‘ప్రతి ఆదివారం.. 10 గంటలకు.. 10 నిమిషాలు’ అనే నినాదంతో ఈ రుతుపవనాల ఆధారిత రోగవ్యాప్తి నిరోధక చర్యలకు నాంది పలుకాలని పిలుపునిచ్చారు. సీజనల్‌గా వచ్చే 10 వ్యాధులు, వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

డెంగ్యూ ఫీవర్‌: ఇది ఎడిస్‌ దోమ వల్ల మనిషి నుంచి మనిషికి వస్తుంది. ఈ జాతికి చెందిన టైగర్‌ దోమలు మన ఇండ్లలో ఉన్న నీటినిల్వలో కాపురముంటాయి. వ్యాప్తి చెందుతాయి. ఇవి కుట్టడం వల్ల జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రాష్‌, ప్లేట్‌లెట్లు పడిపోవడం, ఇంకా ప్రాణాంతకమైన షాక్‌ సిండ్రోమ్‌కు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. మందుల్లేవు, వ్యాక్సిన్‌ కూడా కొంతమందికే ఉపయోగం. దీనికి.. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ల ఆర్‌ఎన్‌ఏ వైరస్‌, అంటే కరోనాతో బంధుత్వం ఉన్నది. మందు లేదు, ముందు జాగ్రత్తే మున్ముందు రక్ష.

చికున్‌ గున్యా: చికున్‌ గున్యా వైరస్‌ ఎడిస్‌ అనే దోమ వల్ల మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు ఇండ్లలో ఉండే రిఫ్రిజిరేటర్‌, కూలర్‌, కుండీలు ఇతర నీటి నిల్వలున్నచోట్ల పెరుగుతాయి. రాత్రింబవళ్లు కుడుతాయి. జ్వరం, కీళ్లనొప్పులు చికున్‌ గున్యా జబ్బు లక్షణాలు. మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు.

మలేరియా: ఈ వ్యాధి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. ఇది అనొఫెలెస్‌ అనే ఆడ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్లాస్మోడియం అనే పారసైట్‌ వల్ల మలేరియా వస్తుంది. చలిజ్వరం, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన జాండిస్‌, ఫిట్స్‌ వస్తాయి. బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌ కావచ్చు లేదా లివర్‌ ఫెయిల్‌ కావచ్చు. ఈ వ్యాధి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇండ్లలో, పరిసర ప్రాంతాల్లో ఉండే నీటినిల్వల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

అతిసారం: ఈ వ్యాధి అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల, అపరిశుభ్రమైన నీరు, ఆహార పదార్థాల వల్ల వస్తుంది. నీటినిల్వలు, రోడ్డు పక్కన అపరిశుభ్రమైన ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది.

టైఫాయిడ్‌: అపరిశుభ్రమైన నీరు, ఆహార పదార్థాల వల్ల సాల్మొనెల్లా టైఫాయి అనే బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్‌ వస్తుంది. జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, కడుపునొప్పి దీని లక్షణాలు. తీవ్రమైన కేసుల్లో పసిరికలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఫ్లూ లేదా కామన్‌ కోల్డ్‌: ఇవి రైనో, కరోనా, పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వల్ల వస్తాయి. జలుబు, తుమ్ములతో కూడిన జ్వరం వస్తుంది. దీనికి మందు లేదు. స్వతహాగా తగ్గిపోతుంది. ఎయిర్‌ ట్రాన్సిషన్‌ వల్ల వస్తుంది.

కలరా: బ్యాక్టీరియం వైబ్రియో ద్వారా వస్తుంది. కలుషితమైన నీరు, ఆహార పదార్థాల వల్ల వ్యాప్తి చెందుతుంది.

లెప్టోస్పైరోసిస్‌: ఇది లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మురికినీళ్లతో చర్మం ద్వారా మనిషికి వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, రాష్‌, తీవ్రమైన కేసులలో హార్ట్‌, బ్రెయిన్‌, లివర్‌పై కూడా ప్రభా వం చూపుతుంది. శుభ్రమైన పరిసరాల ద్వారా దీనిని నివారించవచ్చు.

వైరల్‌ హెపటైటిస్‌ (జాండిస్‌): పసిరిక వ్యాధి సాధారణంగా హెపటైటిస్‌ అనే వైరస్‌ ద్వారా వస్తుంది. కలుషిత నీరు, ఆహారం ద్వారా సంక్రమిస్తుంది.

గ్యాస్ట్రో ఎంటరైటిస్‌: వెరైటీ బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి లాంటివి వస్తాయి. అపరిశుభ్రమైన నీరు, కల్తీ ఆహారం కారణం.

ఈ వ్యాధులకు సంబంధించి గమనించాల్సిన విషయం ఏమంటే కొన్ని జాగ్రత్తలతో వీటిని నివారించవచ్చు. తీవ్రమైన లక్షణాలున్నప్పుడు పట్టించుకోకుంటే మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. వైరస్‌ వ్యాధులకు మందు లేదు. మనకు కరోనా కూడా ఉంది కాబట్టి రెండింటి మధ్య కన్ఫ్యూజన్‌ కావొద్దు. కరోనా, సీజనల్‌ వ్యాధులు కలిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. దోమలు అన్ని వైరల్‌ జబ్బులకు రవాణా వ్యవస్థలా పనిచేస్తాయి. కానీ ఆ వైరస్‌ల వల్ల దోమలకు ఎలాంటి నష్టం ఉండదు. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణం అపరిశుభ్రత, నీటి నిల్వ, కలుషిత ఆహారం అని గుర్తెరగాలి.

ఇక ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు అనే నినాదం స్ఫూర్తిగా మనం ప్రతి ఇంట్లో, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటిలో నీళ్లు నిల్వ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా దోమలను, అపరిశుభ్ర నీటి నిల్వల వల్ల వచ్చే వ్యాధులను నివారించవ చ్చు. అందరూ పరిశుభ్రతను పాటిస్తే అన్నిరకాల వైరస్‌లను నివారించవచ్చు. నిలిచి ఉన్న మురికినీటిని తొలిగిస్తే అనేక రుతువుల ఆధారిత వ్యాధులను నివారించుకోగలుగుతాం. ఈ కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించవచ్చు. ఒక్క పది నిమిషాలు జాగ్రత్తలు పాటి స్తే లక్షల సంఖ్యలో వచ్చే వ్యాధులను నివారించవచ్చు. అందరూ ఆలోచించాలి, ఆచరించాలి.

(వ్యాసకర్త: డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎంపీ, భువనగిరి)

RELATED NEWS

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.