Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీడ్‌బౌల్‌గా రాష్ట్రం

-రూ. 19 వేల కోట్ల రుణ మాఫీ త్వరలోనే.. -నిజామాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ – సర్వే పూర్తికాగానే బీడీ కార్మికులకు రూ.వెయ్యి భృతి – రూ.11 కోట్ల ఎర్రజొన్న బకాయిలు వారంలో చెల్లింపు – హౌసింగ్ అక్రమాలపై సీఐడీ విచారణ – గత ప్రభుత్వాల తీరుతో వేల కోట్ల దుర్వినియోగం – ఇంటి నిర్మాణ వ్యయం రూ. 3.50 లక్షలకు పెంపు – దళిత, గిరిజనుల బిడ్డలకు కల్యాణ లక్ష్మితో రూ. 50 వేలు – నాలుగేండ్ల లోపు నల్లాలేని ఇండ్లు లేకుండా చేస్తా – 19 నాడు ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేసుకోవాలి – 15 ఆగస్టున కనీసం 4వేల మంది దళితులకు భూపంపిణీ – హైజెనిక్ పద్ధతిలో కూరగాయల మార్కెట్‌లు – స్కూల్ పిల్లల్ని రోడ్డుపైకి తేవడం బ్యాన్ – మెదక్, కరీంనగర్ జిల్లాలకు సింగూరు నుంచి తాగునీరు – ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రి – మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏ స్థాయి పథకాలు – చెరువులు, కుంటల బాధ్యత రెవెన్యూ అధికారులదే – ఎవరెస్ట్ విజేత పూర్ణకు రూ.25 లక్షలు అందజేత – అంతర్జాతీయ బాక్సర్ నికత్‌కు రూ. 50 లక్షల ప్రకటన – నిజామాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్

08-08-2014-2

తెలంగాణ రాష్ర్టాన్ని సీడ్‌బౌల్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. విత్తనోత్పత్తికి రానున్న రోజుల్లో ఇతోధికంగా ప్రాధాన్యమిచ్చి ప్రతి రైతును లక్షాధికారిగా మారుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించి వివిధ సభలు సమావేశాల్లో ప్రసంగించారు. ఆర్మూర్‌లో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, తర్వాత అంకాపూర్ రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనేక అభివృద్ధి పథకాలు కార్యక్రమాలు ప్రకటించారు. వివిధ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు. అనేక విధాన ప్రకటనలు చేశారు. బలహీనవర్గాల గృహనిర్మాణాన్ని హౌసింగ్‌ నుంచి పంచాయతీరాజ్‌కు మార్చినట్టు విధాన ప్రకటన చేశారు. రైతు రుణాల మాఫీ అతి త్వరలో అమలు జరుగుతుందని తెలిపారు. రిజర్వ్‌బ్యాంకు కొన్ని కొర్రీలు పెట్టిందని వాటన్నింటినీ త్వరలోనే అధిగమించి బ్యాంకుల్లో రుణాల బకాయలను జమ చేయడం జరుగుతుందని సీఎం చెప్పారు. ఆటోలు, ట్రాలీల పై రవాణా పన్ను రద్దు చేయడం జరిగిందని వివరించారు. కొత్త కార్డులు పంపిణీ చేసి వృద్ధులు వితంతువుల పెన్షన్లు దసరా దీపావళి మధ్య అందజేస్తామని చెప్పారు. తెలంగాణ వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో రానున్న నాలుగేండ్లలో నల్లా కనెక్షన్ లేని ఇల్లు ఉండదని ఆయన ప్రకటించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే విత్తనాలు అందించే సీడ్‌బౌల్‌గా ఎదుగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన అంకాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో విత్తన బౌల్‌గా అంకాపూర్ ఉండటం, పంజాబ్‌కే విత్తనాలు అందించడం గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రపంచంలోనే భిన్నమైదని చెప్పారు.

ఇక్కడ జరిగినట్లుగా విత్తనోత్పత్తి ప్రపంచంలో మరెక్కడా జరుగదన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికే సీడ్ బౌల్‌గా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. అంకాపూర్‌పై సీఎం వరాల జల్లు కురిపించారు. అంకాపూర్ నుంచి లక్ష్మాపూర్ వరకు బీటీ రోడ్డు కోసం రూ. కోటీ 75 లక్షలు మంజూరు చేశారు. గ్రామ శివారులో 116 మంది నిరుపేదలకు గుట్ట పక్కన స్థలంలో పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామ రైతులకు నూరు శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నానని చెప్పారు. ఇజ్రాయిల్‌లో టమాట మన కన్నా 300 రెట్లు అధికంగా దిగుబడి వస్తుందని, ఆ స్థాయికి ఎదగాలని అన్నారు. గ్రీన్‌హౌజ్ కల్టివేషన్ యూనిట్‌లను ప్రయోగాత్మకంగా గ్రామానికి చెందిన అరుగురు రైతులకు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఢిల్లీ, ముంబై, నాందేడ్ ప్రాంతాలకు కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగొచ్చు.

అవకాశాలు పుష్కలంగా ఉన్నయి అని చెప్పారు. అడవి పందుల నుండి పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ కోసం ఎంపీ ఫండ్ నుండి రూ.కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు పాలిషింగ్ డ్రమ్ముల కోసం రూ. 2 కోట్లు మంజూరు చేయించి ఈ సీజన్‌కే ఆ యంత్రాలు అందేలా అధికారులు చూస్తరు. పసుపు తవ్వే యంత్రాలకు రూ.కోటి 20 లక్షలు మంజూరు చేస్తున్న. అంకాపూర్ గ్రామం మాదిరి ప్రతి నియోజకవర్గంలో గ్రామాలను తయారుచేసుకుంటే ఇలాగే నిధులు మంజూరు చేస్తా. అంకాపూర్‌కు మరోసారి వస్తా. అప్పటిలోగా ఇపుడు మంజూరుచేసిన పథకాలన్ని అమలు కావాలె.

లక్ష్మాపూర్ రోడ్డు పనులు వారంలో మొదలు పెట్టి నాలుగు నెలల్లో పనులు పూర్తి కావాలని కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యేలు పర్యవేక్షణలో పూర్తి చేయాలని కోరుతున్న. మళ్ళీ అంకాపూర్‌కు వచ్చేలోగా ఈ పనులన్నీ అధికారులు దగ్గరుండి పూర్తి చేయాలె అని సీఎం అన్నారు. అంకాపూర్‌ను శిక్షణాకేంద్రంగా మారుస్తున్నందున ఇక్కడికి వచ్చే రైతుల కోసం విశాలమైన హాలు, గెస్ట్‌హౌజ్‌ను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేయిస్త. మల్ల నిజామాబాద్‌కు ఎప్పుడు వచ్చినా ఈ గెస్ట్‌హౌజ్‌కు వచ్చి, అంకాపూర్ కోడి కూర తింట. రైతులు పంటల్లో మంచి దిగుబడులు సాధించి బంగారంలాంటి అంకాపూర్ వజ్రం లాంటి అంకాపూర్‌గా మారాలి అని సీఎం ఆకాంక్షించారు.

అంకాపూర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం.. 1985లో నేను సిద్దిపేట ఎమ్మెల్యేను. ఏడాది అయినంక నాలుగు ప్రాంతాలు సూద్దామని బయల్దేరిన. మొట్టమొదలు అంకాపూర్‌కే 1986లో ఫియట్ కారును నడుపుకుంటూ వచ్చిన. ఊర్ల చౌరస్తా ఉండే. అక్కడ చాయ్ హోటల్ ఉండే. చాయ్ హోటల్ కాడ ఆగి చాయ్ తాగి ఊరు విషయాలు తెలుసుకున్న. ఊరోల్లు అడిగితే హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ అని చెప్పిన. దీంతో పొలాలు చూపెట్టి కోడికూర తినిపించిండ్రు. పంపించేటప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేనని చెప్పిన. అయ్యో ముందుగల్ల చెప్పితె సన్మానం చేస్తుంటిమి అన్నరు. సన్మానం చెస్తరనే చెప్పలే. అంకాపూర్‌తోటి ఈ అనుబంధం అప్పటి నుంచి ఉన్నది అని చెప్పారు.

ఇయ్యల్ల పోలీసులు, సెక్యూరిటీ అని మీతో కలిసి తోటలు సూడడలేకపోతున్న. అంకాపూర్ ఆడబిడ్డలకు కాళ్లు మొక్కి దండం పెట్టాలె. ఆళ్ల కష్టంతోటే అంకాపూర్ అభివృద్ధి చెందింది. అంకాపూర్‌తో పాటు పరిసరాల్లోని 270 గ్రామాలు కూడ ఇట్లనే పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నరు. ఇంత కష్టపడే గుణం, వినూత్న పద్ధతులతో వ్యవసాయం చేయడం అంకాపూర్‌కే చెల్లింది. నేను అంకాపూర్‌కు రాలేదు. అంకాపూర్ గ్రామమే నన్ను ఇక్కడికి రప్పించింది అన్నారు. ఇట్లనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందితే సీఎం కాదు పీఎం కూడా ఎక్కడికైనా వస్తడు అని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.