-తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెడుతారు -టీఆర్ఎస్లో చేరికలు.. కాంగ్రెస్‌లో కొట్లాటలు -బౌన్సర్ల అడ్డాగా గాంధీభవన్ -మంత్రి కేటీఆర్ విమర్శలు -టీఆర్ఎస్లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్ -కేసీఆర్‌ను మించిన లౌకికవాది లేరు: కేటీఆర్
ఒక్కో సీటును మూడుకోట్లకు చొప్పున అమ్ముకున్న అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్నీ అమ్మేస్తారని, తెలంగాణను ఏపీ సీఎం చంద్రబాబుకు తాకట్టు పెడుతారని మంత్రి కే తారకరామారావు విమర్శించారు. సీట్లు పంచుకోవటం చేతగాని అసమర్థులకు పాలన సాధ్యమైతదా? 70 రోజుల నుంచి సీట్లు పంచుకోలేక, తేల్చుకోలేక అమరావతికి, ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ నేతలకు పాలనపగ్గాలు అప్పగించాలా? అంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ రద్దుచేసిననాడే సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులను ప్రకటిస్తే.. కాంగ్రెస్ మాత్రం మల్లగుల్లాలు పడుతున్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ప్రతిరోజూ పెద్దసంఖ్యలో టీఆర్ఎస్లోకి చేరికలతో తెలంగాణభవన్ కళకళలాడుతుంటే, గాంధీభవన్ మాత్రం ప్రైవేటు సైన్యం, బౌన్సర్ల రక్షణలో ఉందని చెప్పారు. సొంతపార్టీ నేతల చేతిలో గాంధీభవన్ తలుపులు బద్దలుకాకుండా, అవినీతి కోటలు బీటలు వారకుండా రక్షణ ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కోదాడ టీడీపీ సీనియర్ నేత బొల్లం మల్లయ్యయాదవ్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు ఆబిద్ రసూల్‌ఖాన్, ఖలీల్ ఉర్ రెహమన్ తమ అనుచరులతో టీఆర్ఎస్లో చేరారు. ఆయా సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. 35 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌కు జీవితం ధారబోసిన బలహీనవర్గానికి చెందిన నేతకు సీటుకోసం మూడుకోట్లు డిమాండ్ చేయడం దారుణమన్నారు. కారులో నోట్లు కాల్చుకోవటం, కోట్లకు సీట్లు అమ్ముకోవటం వంటి సంస్కృతికి కాంగ్రెస్‌కే చెందుతుందన్నారు.
మాయమాటలతో విద్యార్థులను, ఉద్యమకారులను మభ్యపెట్టిన కాంగ్రెస్ అసలురంగు సీట్ల కేటాయింపుతో బయటపడిందని విమర్శించారు. ఒక్క ఉస్మానియా విద్యార్థికి కూడా సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసంచేసిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పి బొల్లం మల్లయ్యయాదవ్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు చెప్పారు. బలహీనవర్గాలకు బలమైన గొంతుగా నిలువాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని కేటీఆర్ తెలిపారు.

ఈ గడ్డమీద పుట్టినోళ్లే పాలించాలి తెలంగాణ గడ్డ మీద పుట్టినోడికే రాష్ట్రాన్ని నడిపే అధికారం ఉంటుందన్న కేటీఆర్.. పక్క రాష్ట్రం నాయకుడి చేతిలో అధికారాన్ని పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. టికెట్లకోసం గాంధీభవన్, ఉత్తమ్ ఇంటి ముందు ధర్నాలు చేస్తున్నారని, ఢిల్లీ, అమరావతిలో పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవాచేశారు. కోదాడ కేంద్రంగా నేతలందరూ ఏకమయ్యారని, ఐకమత్యంగా ఉండి టీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. యుద్ధంలో మరో 25 రోజులు మాత్రమే మిగిలిందన్న కేటీఆర్.. మరింత వేగంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ఉత్తమ్ కోట బద్దలుకొడుతా: మల్లయ్యయాదవ్ అవినీతి సమ్రాట్ ఉత్తమ్ కోటలు బద్దలుకొట్టేందుకే కారెక్కుతున్నానని టీఆర్ఎస్లోకి చేరిన బొల్లం మల్లయ్యయాదవ్ చెప్పారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఆగడాలను అరికట్టేందుకు కంకణబద్ధులమై ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు, సంక్షేమ పథకాల కొనసాగింపునకు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కోసం అహర్నిశలు శ్రమిస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నియోజకవర్గ ఇంచార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు తదితర టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

ముస్లింలపై కాంగ్రెస్‌ది చిన్నచూపు: ఆబిద్ రూసూల్ఖాన్ కాంగ్రెస్‌లో ముస్లింలను చిన్నచూపు చూస్తున్నారని టీఆర్ఎస్లో చేరిన ఆబిద్ రసూల్‌ఖాన్ విమర్శించారు. 32 ఏండ్లపాటు కాంగ్రెస్‌లో పనిచేశాను. నా తండ్రి కూడా కాంగ్రెస్‌లో పని చేశారు. ముస్లింలంటే కాంగ్రెస్‌కు చిన్న చూపు. ముస్లింలు ఎన్నికల్లో గెలవరని చెప్తూ మోసం చేస్తున్నారు అని చెప్పారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఖాళీచేసిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వడం దారుణమని విమర్శించారు.
కేసీఆర్ గొప్ప లౌకికవాది: మంత్రి కేటీఆర్ అన్ని వర్గాలు, కులాల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించే సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన్ను మించిన లౌకికవాది మరొకరు లేరని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, తదితర మతాలకు సంబంధించిన పండుగలను నిర్వహించి లౌకికత్వాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. ఎక్కడా లేనివిధంగా సిద్దిపేటలో ఇక్బల్ మినార్ను నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆబిద్ రసూల్ ఖాన్, ఖలీల్ ఉర్ రెహమన్ అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరడం బీజేపీతో టీఆర్ఎస్కు స్నేహం ఉందన్న విమర్శకులకు చెంపపెట్టని వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసే అవకాశమే లేదన్న ఆయన, బీజేపీతో తమకు సిద్ధాంతపరమైన విరోధం ఉందని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలిచి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషిస్తామన్నారు.