Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీట్లు పంచుకునే చేతకాదు.. ప్రభుత్వాన్ని నడిపిస్తారా?

-టీడీపీని అమరావతికి, కాంగ్రెస్‌ను ఢిల్లీకి తరిమికొట్టండి
-తెలంగాణను ఏ అమ్మా ఏ బొమ్మా ఇయ్యలేదు
-పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నాం
-కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇజ్జత్ లేకుండా కలుస్తున్నరు..
-హైదరాబాద్‌లో దివ్యాంగులకు ప్రత్యేక పార్కు
-డబుల్ బెడ్‌రూంలలో ఐదు శాతం కేటాయింపు
-రైతుల తలరాతలు మార్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే
-సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట సభల్లో మంత్రి కే తారకరామారావు

సీట్లు పంచుకోవడం చేతకానోళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు? ఈ ఎన్నికలు ఆషామాషీ కాదు.. మన తలరాతలు మార్చుకునే ఎన్నికలు. ఆగమాగం కావద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకుని టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి, సిరిసిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలో 16 మంది ప్రధానమంత్రులు, పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు మారినా రైతుల తలరాతలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ అమ్మా బొమ్మా తెలంగాణ ఇవ్వలేదని, ఇది పోరాటాల గడ్డని, త్యాగాలతో స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని స్పష్టంచేశారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఫంక్షన్‌హాల్‌లో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం, పద్మనాయక కల్యాణ మండపంలో కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల కలయిక కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు ఎల్లారెడ్డిపేటలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన రైతు కృతజ్ఞతసభలో పాల్గొన్నారు. భారీసంఖ్యలో తరలివచ్చిన రైతులు మంత్రులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల కోసం ఇజ్జత్ లేకుండా కలిసివస్తున్న టీడీపీని అమరావతికి, కాంగ్రెస్‌ను ఢిల్లీకి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కాటన్ ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని చెప్పారు. నల్లగొండ జిల్లా అంగవైకల్యానికి గత పాలకుల పాపమే కారణమని విమర్శించారు. దివ్యాంగులకు హైదరాబాద్‌లో ప్రత్యేక పార్కు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల పాలనలో కరంట్ కోసం గోసపడ్డ తెలంగాణ రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇవ్వడంతోపాటు రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు లేక ఎడారిగా మారిన తెలంగాణను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ సంకల్పాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకొంటున్నారని, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అనుమతులు ఇవ్వద్దని చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో ఒక్కటై వస్తున్న వీరికి ఓటేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందని, మరోసారి మోసపోతే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని హెచ్చరించారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్
దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయడంతోపాటు రూ.8 కోట్లతో 7,500 మంది దివ్యాంగులకు సహాయక ఉపకరణాలు పంపిణీచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ కొనియాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కు పెం చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాబోయే రోజుల్లో దీన్ని రూ.3,016కు పెంచుతామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల మానసిక ఉల్లాసం కోసం ప్రత్యేక పార్కును, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి శిక్షణ కేంద్రాలను, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసి ఉపాధి మార్గాలను పెంచేందుకు కృషిచేస్తామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.

కూటమికి డిపాజిట్లు గల్లంతు చేయాలి: పోచారం
60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఆరు గం టల కరంట్ ఇవ్వడం చేతకాలేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. దేశాన్ని అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. రాబోయే మూడు నాలుగేండ్లలో రెండు పంటలకు సరిపడా నీరందించి రైతును రాజుగా చేస్తామని చెప్పారు.

టీఆర్‌ఎస్ పాలనలో దివ్యాంగులకు మంచిరోజులు
వేములవాడ అభ్యర్థి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయని, వారి సమస్యలన్నీ పరిష్కారమయ్యాయనీ పేర్కొన్నారు. సిరిసిల్ల చిన్న జిల్లా అయినప్పటికీ రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టిన ఘనత మంత్రి కేటీఆర్‌దేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగారావు, చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, తోట ఆగయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఆడెపు రవీందర్, బొట్ల వెంకటస్వామి, కోడం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రైతు కృతజ్ఞతసభ విజయవంతం
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం జరిగిన రైతు కృతజ్ఞతసభ విజయవంతమైంది. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరంట్ కోతలతో ఎన్నో అవస్థలు పడ్డామని, ఎరువులు, విత్తనాల కోసం గంటల తరబడి లైనులో నిలబడలేక వెంకటాపూర్‌కు చెందిన రైతు మునిగె ఎల్లయ్య గుండెపోటుతో మరణించడం ఇప్పటికీ ఎంతో ఆవేదన కలిగిస్తున్నదని అన్నదాతలు గుర్తుచేసుకున్నారు. నాలుగేండ్ల కేసీఆర్ పాలనలో తమ సమస్యలన్నీ సమసిపోయి ఇప్పుడు సంతోషంగా బతుకుతున్నామని వారు పేర్కొన్నారు. రైతును రాజుగా చేసిన సీఎం కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకొంటామని స్పష్టంచేశారు. ఈ సభకు దాదాపు 10 వేలమంది హాజరవుతారని రైతు సమన్వయ సమితి నాయకులు అంచనాలు వేయగా పదిహేను వేలమందికిపైగా రైతులు పాల్గొని ఈ సభను సక్సెస్ చేశారు. ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలపడం చరిత్రాత్మకమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

సిరిసిల్ల మరో తిరుపూర్ కావాలి
వస్త్ర ఉత్పత్తుల్లో నాణ్యత పెంచి సిరిసిల్ల మరో తిరుపూర్‌గా ఖ్యాతి గడించాలని, సిరిసిల్ల అంటేనే చేనేతకు బ్రాండ్ ఇమేజ్‌గా గుర్తింపు రావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. వస్త్ర పరిశ్రమకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశంలో పత్తిని పండించడంలో రాష్ట్రానిదే అగ్రస్థానమని, కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. రాష్ర్టానికి వచ్చే చేనేత ఆర్డర్లను సిరిసిల్లకు పూర్తిస్థాయిలో ఇస్తామని హామీ ఇచ్చారు. అపెరల్ పార్కు నిర్మాణంతో పదివేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని, కార్మికుడిని యజమాని చేయాలన్న లక్ష్యంతో వర్క్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వస్త్ర అనుబంధ పరిశ్రమలకు ఎలాంటి సహకారం ఆశిస్తున్నారో నివేదిక రూపంలో సమర్పించాలని ఆయన సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.