Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సెంచరీ కొడదాం

-సీల్డ్ కవర్ సీఎం కావాలో..సింహం లాంటి కేసీఆర్ కావాలో ప్రజలే తేలుస్తారు
-రాహుల్‌ను చూస్తే ఓటేసేవారు కూడా వెనుకకు వెళ్లిపోతారు
-కేంద్రంలో రాబోయేది సంకీర్ణమే.. అందులో టీఆర్‌ఎస్‌ది కీలకపాత్ర
-ముష్టి మూడుసీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్ పార్టీకి పొర్లు దండాలు
-ఉత్తమ్‌వి ఉత్తి హామీలే.. అమలుచేయాలంటే ఆరురాష్ట్రాల బడ్జెట్ అవసరం
-టీఆర్‌ఎస్‌లో చేరికల సందర్భంగా మంత్రి కే తారకరామారావు

సీల్డ్ కవర్ సీఎం కావాలో.. సింహంలాంటి కేసీఆర్ కావాలో రాబోయే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని ఐటీ, పరిశ్రమలశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రభుత్వపథకాల అమలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేసీఆర్ ఎక్కడా రాజీ పడరని, చివరకు దేవుడ్ని అయినా ఎదిరిస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట్టు వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొడదాం అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత డాక్టర్ విజయేందర్‌రెడ్డి తదితరులు శుక్రవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. అందులో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీకి ఓటేస్తే అమరావతి, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీ చుట్టూ తిరుగాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు విలువలకు తిలోదకాలు ఇచ్చి పొత్తులు పెట్టుకుంటున్నాయని, కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆత్మక్షోభించేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. గతంలో తెలంగాణ ప్రయోజనాల కోసమే టీఆర్‌ఎస్.. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నదని, కాంగ్రెస్ మాత్రం ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ముష్టి మూడుసీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్‌పార్టీకి పొర్లు దండాలు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. నాటి యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇస్తున్నవన్నీ ఉత్త హామీలేనని, వాటిని అమలుచేయాలంటే దక్షిణాదికి చెందిన ఆరురాష్ట్రాల బడ్జెట్ కావాలని వ్యాఖ్యానించారు.

విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు
కేంద్రంలో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠ మసకబారిపోయిందని, గత ఎన్నికల్లో ప్రజలు ఆయనపై ఎంతో నమ్మకంతో గెలిపిస్తే పేదవారి కోసం ఒక్క పథకాన్ని కూడా అమలుచేయలేకపోయారని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దనోట్ల రద్దుతో మన డబ్బులు మనం తీసుకోవడానికి బ్యాంకుల ముందు నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో పర్యటించిన అమిత్‌షా, స్మృతిఇరానీ కేంద్రంలో అమలుచేసిన ఒక్క పథకాన్ని చెప్పుకోలేకపోయారని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్కహామీని కూడా కేంద్రం అమలుచేయలేదని తెలిపారు. తెలంగాణలో ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వరంగంలో కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ఉద్యోగాలు కల్పించగలుగుతామని, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీఐఆర్ పురోగతిపై అనేకమార్లు కేంద్రానికి వినతిపత్రం సమర్పించినా ఇంతవరకు అతీగతీ లేకపోయిందన్నారు.

బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, హైకోర్టు విభజన, కొత్త రాష్ర్టానికి పన్నురాయితీలు వంటి ఎలాంటి హామీలనూ కేంద్రం అమలుచేయలేకపోయిందని చెప్పారు. ఎయిమ్స్ ఒక్కటి ఇచ్చి చేతులు దులిపేసుకున్నదని అన్నారు. రాష్ట్రానికి రూ.2.30 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా చెప్తున్నారని, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రం ఇచ్చే నిధులతో పోలిస్తే కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా తక్కువేనని అన్నారు. గత నాలుగేండ్లలో రాష్ట్ర సగటు వృద్ధిరేటు 17.17 శాతం ఉన్నదని, ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రంలో పరిపాలనను పొగిడారని, కానీ ఒక్కపైసా అదనంగా ఇవ్వలేదన్నారు. రాహుల్‌గాంధీని చూస్తే ఓటువేసే వారు వేయకుండా వెనుదిరుగుతారని ఎద్దేవా చేశారు.

మంత్రి కేటీఆర్‌ను కలిసిన పరకాల నేతలు
-చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాగ్దానం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విజయానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. హైదరాబాద్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను పరకాల నియోజకవర్గ నాయకులు కలిశారు. ఎన్నికల ప్రచార సరళిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో ఓటర్లందరినీ కలుసుకోవాలని, పార్టీ నాయకులంతా ప్రచారంలో పాల్గొనేవిధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవిధంగా పనిచేస్తామని నియోజకవర్గ నాయకులు మంత్రికి వాగ్దానం చేశారు. మంత్రి కేటీఆర్‌ను కలిసినవారిలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గీసుగొండ మండల టీఆర్‌ఎస్ నాయకులు పోలీసు ధర్మారావు, వీరగోని రాజుకుమార్, గోపాల నవీన్‌రాజ్, అంకతి నాగేశ్వర్‌రావు, బోడకుంట్ల ప్రకాశ్ తదితరులున్నారు.

ప్రాంతీయపార్టీల పాలనలోనే అభివృద్ధి: ఎంపీ వినోద్‌కుమార్
ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతున్నదని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి గురించి తపన ఉన్నది ఒక్క టీఆర్‌ఎస్‌కేనని, రాజ్యాధికారం కావాలనుకునేవారే కూటమిలో ఉన్నారన్నారు. వైఎస్ బతికున్నంతవరకు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఊసే ఎత్తలేదని విమర్శించారు. తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ మహాకూటమి అనేది అభివృద్ధిని అడ్డుకోవడానికి కడుతున్న విషకూటమి అని అన్నారు. అభివృద్ధి నిలిచిపోకుండా మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకోగానే అనేకమంది అభినందించారని తెలిపారు. ఇతర పార్టీలు సీఎం ఎవరనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, భాస్కర్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.