Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సెప్టెంబర్ 2 ప్రగతి సభ ఓ అపురూప దృశ్యం

-దేశంలో కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది -నభూతో న భవిష్యత్ అనే రీతిలో నిర్వహణ -ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచన.. ప్రగతి నివేదన సభ ఏర్పాట్ల పరిశీలన -మేము ప్రజల మనసులు దోచుకున్నాం.. కాంగ్రెస్‌వాళ్లు ప్రజల సొమ్ము దోచుకున్నారు -టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది -ఎన్నికలెప్పుడొచ్చినా 100 సీట్లు ఖాయమన్న మంత్రి -ప్రధాన వేదిక నిర్మాణం పూర్తి.. మహిళలకోసం ప్రత్యేక ఏర్పాట్లు -300 మరుగుదొడ్ల నిర్మాణం.. 4 వైద్య శిబిరాల ఏర్పాటు -ఎన్నారైలకు, వృత్తి నిపుణులకు ప్రత్యేక గ్యాలరీ

తెలంగాణ రాష్ట్ర సమితి అపూర్వంగా నిర్వహించనున్న ప్రగతి నివేదనసభ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో అపురూప దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపారు. దేశ చరిత్రలో మరెవ్వరూ నిర్వహించలేని రీతిలో.. నభూతో న భవిష్యత్ అనే రీతిలో సభ అద్భుతంగా జరుగుతుందని, భారీసంఖ్యలో జనసమీకరణ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప రెండోతేదీన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల – కొంగరకలాన్‌లో సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదనసభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రగతి నివేదనసభ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోతున్నదని చెప్పారు. ప్రజలే తమకు బాస్‌లని, వారికే తమ భవిష్యత్‌ను వదిలేస్తామన్నారు. ప్రజాశక్తిని డబ్బులతో లెక్కగట్టలేమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌కు వందసీట్లు కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. తాము ప్రజల మనసు దోచుకున్నామని, కాంగ్రెస్ నేతలు ప్రజల సొమ్మును దోచుకున్నారని వ్యాఖ్యానించా రు. నోట్ల కట్టలతో పట్టుబడ్డ నాయకులు తాము కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ దగుల్బాజీ పార్టీ అని, ఆ పార్టీని ప్రజలే తిరస్కరించారని, తమకు ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ప్రజల వద్దకు పోవడానికి భయమెందుకని ప్రశ్నించారు.

15 రోడ్లు.. 300 టాయిలెట్లు టీఆర్‌ఎస్‌కు బహిరంగసభలు నిర్వహించడం కొత్త కాదని, మొత్తం రెండువేల ఎకరాల్లో సభను నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందు లో 500 ఎకరాల్లో సభప్రాంగణం, మిగిలిన 1500 ఎకరాలు పార్కింగ్‌కు వినియోగిస్తామన్నారు. సభ విజయవంతానికి ఇప్పటికే 8 కమిటీలను నియమించామని చెప్పారు. 15 రోడ్లను నిర్మిస్తున్నామని.. వీటిలో 200 ఫీట్ల రోడ్డు ఒకటి, 100 ఫీట్ల రోడ్లు నాలుగు, 60 ఫీట్ల రోడ్లు ఐదు, 40 ఫీట్ల రోడ్లు ఐదు నిర్మిస్తున్నామన్నారు. వేలమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. మహిళలకు ప్రత్యేకంగా 300 టాయిలెట్లను ఏర్పాటుచేస్తున్నామని.. వారికి ప్రత్యేకంగా సీటింగ్ ఉంటుందని, అత్యవసర సేవలకోసం మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచే మూడులక్షల మంది తరలివస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండటానికి వీలుగా ఆదివారం సభను నిర్వహిస్తున్నామని, వేలసంఖ్యలో వాహనాలు అవసరం ఉన్నందున అందుబాటులో ఉన్న ప్రతి వాహనాన్ని రవాణాకు తీసుకుంటామని, ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను కూడా వినియోగించుకుంటామని, ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు.

దేశ రాజకీయ చరిత్రలో నిలిచేలా సభ: హోంమంత్రి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడు తూ భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా ప్రగతి నివేదనసభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, శంభీపూర్‌రాజు, ఎమ్మెస్ ప్రభాకర్, మై నంపల్లి హన్మంతరావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్‌టీఎస్‌సీ చైర్మన్ చిరుమళ్ళ రాకేశ్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, మాజీమంత్రి దానం నాగేందర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, రాష్ట కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

సభావేదిక నిర్మాణం పూర్తి ప్రగతి నివేదన సభకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం వరకు సభావేదిక నిర్మాణం దాదాపుగా పూర్తిచేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 15 చోట్ల పార్కుస్థలాల్లో భూములను చదునుచేస్తున్నారు. సభప్రాంగణంలో 300 సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రగతి నివేదనసభను భారీఎత్తున నిర్వహిస్తున్నందున కలెక్టరేట్‌కు వెళ్లే 100 ఫీట్ల రహదారి డివైడర్‌పైన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. సభకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 500 వరకు విద్యుత్ పోల్స్‌ను నాటి ప్రత్యేకంగా 80 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేస్తున్నారు. సీఎం కేసీఆర్ రావడం కోసం హెలిప్యాడ్ నిర్మాణం కూడా జరుగుతున్నది. జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, ఆర్డీవోలు, మధుకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి సభ పనులను పరిశీలించారు.

5వేల మంది వలంటీర్లు సభకు వచ్చే ప్రజలకు పార్టీపరంగా సహాయం చేయడానికి ఐదువేల మంది వలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. ప్రగతి నివేదనసభ నిర్వహణకు ఏర్పాటుచేసిన కమిటీలతో మంత్రి కేటీఆర్ భేటీ అయి కమిటీసభ్యులకు సూచనలుచేశారు. వలంటీర్లలో ముఖ్యులకు వాకీటాకీలు ఇవ్వాలని నిర్ణయించారు. నగరంతోపాటుగా శివారుప్రాంతాలన్నీ గులాబీమయమయ్యేలా అలంకరణ కమిటీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతి ఉన్న ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, సభ ప్రాంగణంలో కటౌట్లు పెడ్తారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ముఖ్యఘట్టాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేస్తారు. కులవృత్తుల ప్రదర్శనలను ఏర్పాటుచేయడానికి ఆయా కుల వృత్తులవారు ముందుకొచ్చినందున వారికి అవసరమైన ప్రాంతాన్ని కేటాయించడానికి, సహాయం అందించాలని నిర్ణయించారు. లక్షల మంది వచ్చే సభలో ఎవరికైనా ఆనారోగ్య సమస్యలు తలెత్తితే వారికి వైద్యసేవలు అందించడానికి నాలుగు వైద్యశిబిరాలు నిర్వహిస్తారు. 30 అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సభకు వచ్చే వారికి వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు రోడ్డు పొడవునా అందిస్తారు. ప్రగతి నివేదన సభకు వివిధదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వీరితోపాటు వివిధ వృత్తినిపుణులు, పారిశ్రామికవేత్తలు డాక్టర్లు, న్యాయవాదులు సభకు హాజరుకావడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరందరికి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటుచేయనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.