పీఆర్టీఎస్‌కు మార్గదర్శకాలు ఇవ్వండి
కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
హైదరాబాద్‌లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన సమీకృత మురుగునీటి శుద్ధి మాస్టర్ ప్లాన్ (సీఎస్‌ఎంపీ)కి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు పీఆర్టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం)కు మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. ఈ మేరకు గురువారం ఆయన ఢిల్లీ లో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురీని కలిసి వినతిపత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లో మూసీనది, ఇతర జలాశయాలు కలుషితం కాకుండా సీఎస్‌ఎంపీని రూపొందించామని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో 62 మురుగునీటి శుద్ధి ప్లాంట్లతోపాటు మురుగునీటి పారుదలకు అవసరమయ్యే పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. ఎస్టీపీపీకి సంబంధించి రూ. 4,818. 33 కోట్లతో 3 ప్యాకేజీల పనులకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏఎం-60:40)లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.8,684.54 కోట్లు కాగా, అమృత్-2 పథకంలో భాగంగా రూ.2,850 కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
పీఆర్టీఎస్‌కు మార్గదర్శకాలు జారీ చేయండి
హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థను విస్తరించాల్సి ఉన్నదని, మెట్రో, ఎంఎంటీఎస్‌కు అదనంగా స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌పై సర్కారు దృష్టి పెట్టిందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి తెలిపారు. మెట్రో, ఎంఎంటీఎస్‌కు ఫీడర్ సర్వీసుల కోసం పీఆర్టీఎస్, రోప్‌వే సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ పీఆర్టీఎస్ ప్రమాణాలు, మార్గదర్శకాల రూపకల్పనకు హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసిందని, కాబట్టి తెలంగాణ ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ప్రమాణాలు, న్యాయ తదితర అంశాలకు సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తిచేశారు.