-రాష్ట్ర సాధన.. ఏడాది పాలనపై రాష్ట్రవ్యాప్త సర్వే -తెలంగాణ పాలనకు జనం జేజేలు -టీఆర్‌ఎస్ సర్కారుకు ప్రజలు వేసిన మార్కులు.. -సీఎంగా కేసీఆర్ పనితీరుకు 91శాతం ప్రశంసలు -సీమాంధ్రుల కంటే తెలంగాణ పాలన బెటరన్న 93 శాతం -నమస్తే తెలంగాణ సర్వేలో తెలంగాణ హృదయ స్పందన -10 జిల్లాలు.. 113 నియోజకవర్గాలు.. 3 ప్రశ్నలు -56,450 మంది నుంచి అభిప్రాయసేకరణ -సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది మహిళలు -మొత్తం సర్వేలో పాల్గొన్నవారిలో సగ భాగం యువత -సమాజంలోని అన్ని వర్గాల అభిప్రాయాలకూ ప్రాధాన్యం

జూన్ 2! భారతదేశ చరిత్రను కొత్త మలుపు తిప్పిన రోజు! త్యాగాలే పునాదులుగా.. దేశ భౌగోళిక చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన రోజు! కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అను నేను.. అంటూ ఆ మహోద్యమ సారథి కేసీఆర్ రాష్ట్ర పాలనా బాధ్యతలు స్వీకరించినదీ అదే రోజు! ఈ రెండు చారిత్రక సందర్భాలకు మరికొద్ది రోజుల్లో ఏడాది నిండబోతున్నది! ఈ నేపథ్యంలో.. ఏడాదికాలంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందా? అనే అంశం తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ ప్రయత్నం చేయగా.. జనం ఇంటిపార్టీ పాలనకు జై కొట్టారు! ఎన్నికలనాటికి టీఆర్‌ఎస్‌కు ఉన్న ఆదరణకు మించిన స్థాయిలో దాని నేతృత్వంలోని ప్రభుత్వానికి అమోఘమైన మద్దతు పలికారు. నూటికి 90 మార్కులు వేసి.. శభాషన్నారు! సీఎంగా కేసీఆర్ పనితీరుకు మరొకటి అదనంగా కలిపి 91 మార్కులు ఇచ్చారు. గత సీమాంధ్ర పాలనకంటే చాలా మెరుగ్గా ఉందని 93% మంది అభిప్రాయపడ్డారు.
మూడు ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 2 నాటికి ఏడాది కావస్తున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ దినపత్రిక రాష్ట్రంలోని పది జిల్లాల్లో సమగ్ర సర్వే నిర్వహించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 500 మంది చొప్పున (వీరిలో సగం మంది మహిళలు) మొత్తం 113 నియోజకవర్గాల్లో (హైదరాబాద్ పాతబస్తీలోని ఆరు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించలేదు) 56,450 మందిని కలిసి మూడు ప్రశ్నలు అడిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?
ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన ఎలా ఉంది? గత సీమాంధ్ర ప్రభుత్వాలతో పోల్చితే ఇప్పటి తెలంగాణ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అనే అంశాలపై అభిప్రాయాలు సేకరించింది. మొత్తం సర్వే చేసిన 56,450 మందిలో సగం మంది మహిళలు. పురుషుల్లోనూ, మహిళల్లోనూ యువత సగభాగాన్ని ఆక్రమించింది. అలాగే ధనిక, మధ్యతరగతి, పేద వర్గాలకు, పట్టణ, పల్లె వాసులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వే జరిగింది. అభిప్రాయం చెప్పిన ప్రతి వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేయడంద్వారా ఈ సర్వే పూర్తి విశ్వసనీయతతో కొనసాగింది.
చాలా బాగుంది: ఈ ఏడాదిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు సమాధానంగా చాలా బాగుందని 61.2 శాతం, బాగుందని 28.68 శాతం చెప్పారు. బాగాలేదని 6.12 శాతం, ఏ అభిప్రాయమూ చెప్పలేమని 4శాతం మంది జవాబిచ్చారు. బాగుందని చెప్పిన జిల్లాల్లో 93.27 శాతంతో ఆదిలాబాద్ జిల్లా ముందుండగా, 84.81 శాతంతో ఖమ్మం జిల్లా చివరి స్థానంలో ఉంది. బాగాలేదని చెప్పినవారు మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువ (9.05 శాతం) ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ మంది (4.06 శాతం) ఉన్నారు. ఈ ప్రశ్నను అడిగినప్పుడు చాలా మంది మహిళలు, యువత ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని, గతంలో ఇలాంటి పాలనను ఎప్పుడూ చూడలేదని చెప్పడం గమనార్హం.


కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం: ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరు ఎలా ఉందన్న ప్రశ్నకు మరింత ఎక్కువ స్పందన లభించింది. చాలా బాగుందని 62.02 శాతం మంది, బాగుందని 29.33 శాతం మంది చెప్పారు. బాగా లేదని కేవలం 5.36 శాతం మంది, చెప్పలేమని 3.29 శాతం మంది సమాధానం చెప్పారు. కేసీఆర్‌కు మంచి మార్కులిచ్చిన జిల్లాల్లో 94.18 శాతంతో ఆదిలాబాద్, 93.62 శాతంతో మెదక్, 93.45 శాతంతో కరీంనగర్ జిల్లాలు ముందుండగా, రాజధాని హైదరాబాద్‌లోనూ 92.92 శాతం మంది జనం కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 84.82 శాతంతో ఖమ్మం జిల్లా చివరన ఉంది. సర్వే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అనేక మంది అపూర్వ స్థాయిలో అభినందించారు.
పీవీ నరసింహారావు నుంచి ఎన్టీఆర్ వరకు ఎందరో ముఖ్యమంత్రులను తాము చూశామని, కేసీఆర్ లాగా చురుగ్గా ఎవరూ పనిచేయలేదని, ప్రజల మేలు కొరకు ముఖ్యంగా పేదప్రజల మేలు కోసం ఆయన పగలూ రాత్రీ పని యంత్రంలా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లోని పలువురు కేసీఆర్ ఇలానే ముఖ్యమంత్రిగా కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. తమ అభిప్రాయాన్ని సర్వే పత్రాల్లో నమోదు చేయాల్సిందిగా వాళ్లు కోరారు.

మన రాష్ట్రం.. మన పాలన: గత సీమాంధ్ర ప్రభుత్వాల పాలనతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న మూడవ ప్రశ్నకు కూడా ఏకపక్ష సమాధానమే లభించింది. చాలా బాగుందని 49.35 శాతం, బాగుందని 43.41 శాతం మంది చెప్పారు. రెండింటికీ పెద్దగా తేడాలేదని కేవలం 7.24 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు సీమాంధ్ర ముఖ్యమంత్రుల పాలనను దుయ్యబట్టారు. జిల్లాల వారీగా చూస్తే, 95.91 శాతంతో ఆదిలాబాద్ ముందుండగా, 89.29 శాతంతో మహబూబ్‌నగర్, 89.5 శాతంతో ఖమ్మం జిల్లాలు వెనుక ఉన్నాయి. సీమాంధ్ర సర్కార్లకు, కేసీఆర్ సర్కారుకు పెద్దగా తేడా లేదని ఈ జిల్లాలకు చెందిన సుమారుగా 10 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.
మన పాలనకు జన నీరాజనం గింత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు తెలంగాణ రాష్ట్రమత్తదంటే ఏందో అనుకున్న గాని ఇప్పుడు తెలుస్తుంది. మన రాష్ట్రం మనకు వస్తే ఎంత మంచిగుంటదో గిప్పుడు అర్థమైతుంది. గిట్ల పొద్దుందాక కరెంటు ఉంటదని ఎప్పుడు అనుకోలె. గీ గవర్నమెంట్ వచ్చిన ఒక్క యడాదికె గింతమంచిగ కరెంటు ఇత్తుంది. రైతులకైతె ఇక పండగనె. గిసుంటి ప్రభుత్వ పాలన పదెండ్ల గిందటే వస్తే ఎంత బాగుంటుండె అనిపిస్తుంది. – రతన్‌నాయక్, రైతు, చెరు తండా, ధర్పల్లి, నిజామాబాద్
పంటలు పండుతాయనే నమ్మకం కలిగింది మిషన్ కాకతీయ ద్వారా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మా సమ్మిరెడ్డి కుంటను ఎమ్మెల్యే జలగం సహకారంతో బాగు చేస్తుండ్రు. ఇక పంటలు బాగా పండుతాయనే నమ్మకం కుదిరింది. మా లాంటి చిన్నకారు రైతులకు ఇంతకంటే కావాల్సిన మంచి ఇంకేముంటుంది? – రామక్క, రైతు, ఎదురుగడ్డ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
స్వరాష్ట్ర పాలన భేష్ మొదటిసారి కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయడం పాలన భేష్‌గా ఉందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఘనత. స్వరాష్ట్రం లేకపోతే ఏం కోల్పోయామో ఇప్పుడు తెలుస్తున్నది. దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలువటం ఖాయం. – ఏ ప్రవీణ్, వ్యాపారి, కరీంనగర్
అన్ని పనులు మంచిగ చేస్తున్రు మన రాష్ట్రం వచ్చినంక మనకు మంచి మేలైతాంది. కేసీఆర్ సారు చెరువు మంచిగుంటెనే ఊరు మంచిగుంటదని తెలిసినోడయ్యేపట్టిగనే ఇవన్ని చేపిస్తున్నడు. ఎసొంటోళ్లయినా చెరువులల్ల మట్టి తీసెతానికి వస్తున్నరు. మన రాష్ట్రం రాకుంటే ఇసొంటి పనులు ఇంక వందేండ్లయినా జరగకపోయేటియి. – పీ గంగవ్వ, దిలావర్‌పూర్, ఆదిలాబాద్ జిల్లా
పెద్దకొడుకులా ఆసరా అయ్యిండు కేసీఆర్ సారు వెయ్యిరూపాయల పింఛన్ ఇచ్చి ఆసరా అయ్యిండు. బుక్కెడు గంజిపోసెటోడు కరువైన ఈ రోజుల్లో నెలనెలా మాలాంటి వాళ్లకు బతకడానికి వెయ్యి రూపాయలు పంపిస్తుండు. అన్న మాటకు కట్టుబడ్డడు. మేమంతా కేసీఆర్ సారుకు రుణపడి ఉన్నాం. – ఎత్తరి లింగమ్మ, వృద్ధురాలు,
పులిగిల్ల, వలిగొండ, నల్లగొండ జిల్లా శ్రామికుల కష్టం తెలిసిన ప్రభుత్వం శ్రామికుల కష్టం తెలిసిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం. సీమాంధ్ర పాలనలో దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ, ఏడాదిలో అందరి మన్ననలు పొందింది. దశాబ్దాల పరాయి పాలనకు ఏడాది స్వయం పాలనకు చాలా తేడా ఉంది. ఇదంతా కేసీఆర్ కృషి ఫలితమే. – బుల్లెట్ సుధాకర్, ఆర్టీసీ కార్మికుడు, గద్వాల
షాదీముబారక్ గొప్ప పథకం ముస్లిం మైనార్టీ పేద మహిళలకు కేసీఆర్ అడుగకుండా షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం. అదే విధంగా మైనార్టీలకు బడ్జెట్‌లో అధిక నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించడం గొప్ప విషయం. – సాధిక్ అలీ, తిరుమలగిరి
వాటర్ గ్రిడ్ వరంలాంటిది రాబోయే మూడేండ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వాటిర్ గ్రిడ్ ద్వారా నల్లా కనెక్షన్‌లు ఇచ్చే బృహత్తర కార్యక్రమం మహిళలకు వరం. పేదలు పబ్లిక్ నల్లాలు, బోర్ల వద్ద నీటిని తెచ్చుకునే ఇబ్బందులు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇక త్వరలో తీరబోతున్నాయి. – పద్మమ్మ, గృహిణి, చిన్నజట్రం మహబూబ్‌నగర్
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌నుంచి పోటీ చేయడం మా అదృష్టం. అందులో ముఖ్యంగా గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని నిధుల వరద కురిపించారు. ఏడాది పాలన చాలా బాగుంది. గజ్వేల్ ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. – అల్వాల విజయ, గజ్వేల్
ప్రజల మనసు గెలిచిన పాలన కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన ఎంతో బాగుంది. అన్ని వర్గాలు మెచ్చేవిధంగా పరిపాలన కొనసాగుతున్నది. ఉద్యమంలో కలిసివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 43% ఫిట్‌మెంట్ ఇచ్చి మనసు గెలుచుకున్నారు. అంగన్‌వాడీల జీతాలు కూడా భారీగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సామాజిక పింఛన్లు ఐదురెట్లు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకున్నారు. ఏడాది పాలనలోనే ఎన్నో మంచి పనులు చేశారు. – కవిత, బీఈడీ విద్యార్థి, నాగసన్‌పల్లి, బంట్వారం మండలం, రంగారెడ్డి