-మిగతా పార్టీలు ఏకగ్రీవం చేసి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి -ఉద్యమాలు చేయనివారు తెలంగాణ తెచ్చామనడం సిగ్గుచేటు -హుజూర్‌నగర్ సభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శ

హుజూర్‌నగర్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను గెలిపించి త్యాగాల గొప్పతానాన్ని చాటాలి. శంకరమ్మ గెలవకపోతే శ్రీకాంతాచారి త్యాగానికి అర్థం ఉండదు. అత్యధిక మెజార్టీతో గెలిపించి శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పించాలి. తెలంగాణ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అమరవీరుల కుటుంబాల ప్రతినిధిగా బరిలో ఉన్న శంకరమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. మిగతా పార్టీలు నామినేషన్లు విరమించుకొని గౌరవాన్ని నిలబెట్టుకోవాలి.లేదంటే భంగపడి చరిత్రహీనులుగా మిగిలిపోతారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు హెచ్చరించారు. మలివిడత ఉద్యమంలో తొలిఅమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ నవనిర్మాణ సాధన మహాసభలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడూ ఉద్యమాలు చేయనివారు తెలంగాణ తెచ్చామనడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు.
14ఏళ్లుగా ఉద్యమాలు చేసిన టీఆర్‌ఎస్, అమరుల ఆత్మబలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణను తామే తెచ్చామని హైదరాబాద్ గన్‌పార్కు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తెలంగాణవాదులను అవమానపర్చడమేనన్నారు. త్యాగధనులెవరో.. ద్రోహులెవరో గుర్తించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణవాదులు నిరంతరం ఉద్యమాలు చేస్తే, కిరణ్ కేబినేట్‌లో మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడి బిడ్డలను జైల్లో పెట్టించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలాంటి ఉత్తమ్‌తోపాటు కాంగ్రెస్‌కు ఎలా ఓటు వేయాలో ప్రతి వ్యక్తి ప్రశ్నించుకోవాలని సూచించారు. వేణుగోపాల్‌రెడ్డి శవంపై ప్రమాణాలు చేసిన నేతలకు, యాదిరెడ్డి మృతదేహాన్నితీసుకురావడానికి వెళ్లిన మాపై కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీకీ ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలన్నారు.
శంకరమ్మ వద్ద సీసా, పైసా లేదు.. కన్నీటి చుక్కలే అమరవీరుల కుటుంబాలకు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చి బరిలో నిలిపిందని, త్యాగధనులకు ఓటేసి గెలిపించాలని హరీశ్‌రావు కోరారు. శంకరమ్మ వద్ద సీసా.. పైసా లేదని ఆమె వద్ద ఉన్నది కన్నీటి చుక్క మాత్రమేనని, ఆ కన్నీటి చుక్కను గుర్తించి ఓటు వేయాలని కోరారు. అవసరమైతే ప్రతి ఇంటి నుంచి చందాలు వేసుకోనైనా గెలుపునకు బాటలు వేయాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఓట్లు వేస్తే ఆంధ్రా ఉద్యోగులంతా ఇక్కడే ఉండి మనకు ఉద్యోగాలు రాకుండా చేస్తారని ఆరోపించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రమణాచారి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి సూర్యాపేట అసెంబ్లీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.