Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సన్నబియ్యంపై సర్వత్రా హర్షం

సుద్దలాంటి అన్నం.. అక్కడక్కడా పలకరించే పురుగులు! చారులాంటి పప్పు.. నీళ్లలాంటి చారు! ఇది మొన్నటిదాకా హాస్టల్ విద్యార్థి భోజనం! మరోమార్గం లేదు.. తినలేకపోయినా.. అదే అన్నం తినకతప్పలేదు! అది ఘనత వహించిన సమైక్య పాలన! ఇప్పుడు దృశ్యం మారిపోయింది!! ఆర్థిక అవకాశాల్లేక.. హాస్టళ్లలో చదువుకునే భావిభారత పౌరులకు గౌరవప్రదంగా.. అందరూ తినేలా పోషకాలతో.. నాణ్యమైన సన్న బియ్యంతో వండిన.. సంపూర్ణ ఆహారం అందుతున్నది.

Etela Rajendar

-కిలో రూపాయికే సన్నబియ్యంతో అన్నం.. 4 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి -హాస్టళ్లకు ఏటా 1.5లక్షల టన్నుల బియ్యం.. ఖర్చు రూ.500 కోట్లు! -విద్యార్థులు.. తల్లిదండ్రుల్లో సంతోషం ఇది స్వయంపాలన గొప్పతనం! ఇప్పుడు హాస్టల్ విద్యార్థి తృప్తిగా అన్నం తింటున్నాడు! సొంత రాష్ట్రం కోసం అర్ధాకలితోనే కొట్లాడిన సగటు విద్యార్థి.. దాని ఫలాలను అనుభూతిస్తున్నాడు! ఇంటికి దూరంగా ఉంటున్న బిడ్డ ఏం తింటున్నాడోనన్న బెంగపెట్టుకున్న నాలుగు లక్షలకుపైగా కన్న తల్లులకు ఇక కలత తీరిపోయింది!!

హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వెయ్యికాదు.. పదివేలు కాదు.. అక్షరాలా నాలుగు లక్షల పైచిలుకు హాస్టల్ విద్యార్థులు కడుపునిండా భోజనం చేస్తున్నారు. తమకు వచ్చే చాలీచాలని మెస్‌చార్జీలతో ఇప్పటిదాకా కిలో రూపాయికి సరఫరా చేసిన ముక్కిపోయిన బియ్యంతో వండిన అన్నం తిన్న సంక్షేమ విద్యార్థి.. ఇప్పుడు అదే రూపాయి ఖర్చుతో వచ్చే సన్నబియ్యంతో వండిన అన్నం తృప్తిగా తిని.. చదువులకు ఉపక్రమిస్తున్నాడు.

అనేకరంగాలకు వేల కోట్లు వెచ్చిస్తుండగా.. సంక్షేమ విద్యార్థులకు ఎందుకు ఖర్చు చేయకూడదన్న సర్కారు ఆలోచన.. వారి స్థితిగతులను మార్చేస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలోని హాస్టల్ విద్యార్థులకు 1-7తరగతుల వారికి రూ.750, 8-10వ తరగతి వారికి రూ.850 చొప్పున మెస్‌చార్జీలు ఇస్తున్నారు. ఇక విద్యార్థుల నిర్వహణలో ఉన్న హాస్టళ్లకు రూ.1050 చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కొక్క విద్యార్థికి రోజుకు 550గ్రాములు, విద్యార్థినికి 500గ్రాముల బియ్యం కేటాయిస్తారు.

దీని ప్రకారం ఒక్కొక్క విద్యార్థికి నెలకు 15-18 కిలోల బియ్యం అవసరంపడుతుంది. అంటే నెలకు సరాసరిన ఒక్కొక్క విద్యార్థికి అయ్యే బియ్యం ఖర్చు కేవలం రూ.15-18మాత్రమే. గతంలో కూడా ఇంతే ఇచ్చినా… హాస్టల్లో తినకుండా బయట తినేదానికే ఎక్కువగా ఖర్చు అయ్యేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇస్తున్న మెస్‌చార్జీ బిల్లుతోనే మూడు పూటలా భోజనం చేయడానికి అవకాశం లభించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 1500 నుంచి 1800 హాస్టళ్లు ఉన్నాయి. మరో 230 రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా ఉన్నాయి.

వీటిలో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిరోజూ వీరందరికీ నాణ్యమైన భోజనం అందుబాటులోకి వచ్చింది. గత సర్కారు హాస్టల్ విద్యార్థుల కోసం రమారమి 70-80 కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం.. సన్న బియ్యానికి చేసే ఖర్చు సుమారు రూ.500 కోట్లు అవుతుందని అంచనా. ఇప్పటికున్న అంచనా ప్రకారం ఏటా లక్షాయాభై వేల టన్నుల సన్న బియ్యం ప్రభుత్వ వసతి గృహాలకు చేరనుంది.

ఆకలి కేకలు పట్టని సమైక్య సర్కారు: ప్రభుత్వం అంటే ఆకలి తీర్చాలి. కానీ గత సమైక్య రాష్ర్టాన్నేలిన ప్రభుత్వాలు విద్యార్థుల కడుపులు కాల్చాయి. విద్యార్థుల ఆకలికేకలను పట్టించుకోలేదు. మెస్ చార్జీలు పెరగాలంటే.. ఓ పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చేది. లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చేది. అరెస్టులు.. కేసులు.. జైళ్లు తప్పేవికావు. ఇంతజేసినా.. పెరిగేది వందో రెండొందలో! మరోవైపు ధరలు రోజు రోజుకు పెరిగిపోతుంటే.. ఆహారం నాణ్యత రానురాను పడిపోయేది. ఎదిగే వయసు.. చదువుకునే వయసు. తగిన పోషకాహారం అందితేనే వారిలో ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. మనసు చదువు మీద లగ్నమవుతుంది.

ఈ ప్రాథమిక అంశాన్నిసైతం నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ఇటువంటి కష్టాలన్నీ దగ్గరనుంచి గమనించిన ఉద్యమనేతలు.. ప్రభుత్వాధినేతలైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆకలికేకలు తీర్చడమే ప్రధాన ఎజెండాగా ముందుకు పోతున్నది. ఎంత ఖర్చయినా.. హాస్టల్ విద్యార్థుల స్థితిగతులు మార్చేందుకు సమాయత్తమైంది.

గత ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల కోసం రూ.70-80కోట్లు ఖర్చు పెట్టింది. అయితే తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్న బియ్యం కోసం రూ.500కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనా. అదే సమయంలో సన్నబియ్యం సరఫరాలో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని అదేశాలు వెళ్లాయి. మిల్లర్లు కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పక్క రాష్ర్టాల నుండి బియ్యం కొనుగోలు చేసి పౌరసరఫరాల శాఖకు అందిస్తున్నారు.

తల్లిదండ్రుల హర్షాతిరేకాలు: ఏ తల్లిదండ్రులైనా బిడ్డల ఆకలి తీరితే వారి ఆకలి తీరినట్లుగానే భావిస్తారు. వారి ఆకలిని తీర్చే ఆర్థిక స్థోమతలేకపోతే.. హాస్టల్లోవేస్తే కనీసం అక్కడైనా నాలుగు మెతుకులు తింటాడని ఆశపడతారు. కానీ.. సమైక్య రాష్ట్రంలో వారి ఆశలు అడియాశలే అయ్యాయి. ముక్కిన బియ్యంతో పురుగుల అన్నం తినాల్సివస్తున్నదని కలతపడని కన్నతల్లిలేదు. కానీ.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కన్నవారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తెలంగాణ రాష్ట్రం వస్తేనే సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పిన ఉద్యమ మార్గదర్శకులే, పాలకులై ప్రజల ఆకాంక్షలకు రూపం ఇస్తుంటే పులకించిపోతున్నారు.

ముందు పిల్లల ఆకలి తీర్చడమే తమ విధి అంటూ హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తుండటంపై హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మేధావి లోకం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నది. గతంలోని ప్రభుత్వాలు కేవలం ఓట్ల రాజకీయంలో భాగంగానే మెస్‌చార్జీలను చూశాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యార్థి ఆకలికోణంలో నుండి చూస్తున్నది. దీనిని కూడా ఓటు రాజకీయాలంటూ ఎవరైనా వక్రభాష్యాలు చెబితే.. అది వారి అవివేకమే. ఎందుకంటే ఇప్పుట్లో ఎటువంటి ఎన్నికలు లేవు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడమే ప్రభుత్వం పని. ఆ పనిని తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా కొనసాగిస్తున్నది అని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

ఈటెలకు విద్యార్థుల కృతజ్ఞతలు హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టిన ప్రభుత్వానికి విద్యార్థి సమాజం జేజేలు పలుకుతున్నది. శుక్రవారం పౌరసరఫరాలు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లోని సంక్షేమ హాస్టళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి చాంబర్‌కు వచ్చిన విద్యార్థులు ఈటెలకు నూతన సంవత్సరం సందర్భంగా స్వీటు తినిపించారు. మంత్రి కూడా విద్యార్థులందరికీ స్వీట్లు తినిపించారు.

సన్నబియ్యం అన్నం పెట్టి ఆకలి తీర్చినందుకు సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. తాను కూడా సంక్షేమ హాస్టళ్లలో ఉండే వచ్చానని, అక్కడున్న పరిస్థితులు తనకు కూడా తెలుసునని చెప్పారు. ఈ పథకం కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తామని, ఏమాత్రం వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థి జేఏసీ కన్వీనర్ బాలరాజ్‌యాదవ్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పురుగుల అన్నం తిన్న విద్యార్థులు స్వరాష్ట్రంలో సన్నబియ్యం అన్నం తింటున్నారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో హాస్టల్ బతుకులు అత్యంత దయనీయంగా ఉండేవని తెలిపారు. తాము ఎన్నోసార్లు ఆంధ్రా ప్రభుత్వాలను సన్నబియ్యం ఇవ్వాలని అడిగినా పెడచెవిన పెట్టాయన్నారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు చిరంజీవి యాదవ్, మధుకర్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్, క్రాంతిగౌడ్, అడ్డగుట్ట ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.