Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శాంతితోనే ప్రగతి

-సుస్థిరతతోనే అభివృద్ధి
-ఇప్పటికి చాలాచేశాం.. ఇంకా చేయాల్సిందీ ఉంది
-నాలుగు ఓట్లు, సీట్ల కోసం దిగజారి వ్యవహరిస్తున్నరు
-నిర్మాణాత్మక ప్రభుత్వం కావాలా? విభజన వాదమా?
-జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలి
-ఐటీరంగంలో అగ్రస్థానం.. పెట్టుబడులకు గమ్యస్థానం
-బ్రాండ్‌ హైదరాబాద్‌-ప్యూచర్‌ రెడీ మీట్‌లో కేటీఆర్‌

సుస్థిర ప్రభుత్వం, శాంతిభద్రతలతో తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని.. వీటివల్లనే హైదరాబాద్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తున్నాయని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. కొందరు నాలుగు ఓట్లు, సీట్ల కోసం దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్న నిర్మాణాత్మక ప్రభుత్వం కావాలా? లేక విభజన రాజకీయాలు కావాలా? ఆలోచించాలని జీహెచ్‌ఎంసీ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్‌లో చాలా అభివృద్ధి పనులు చేశామని, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయని చెప్పారు. ఆదివారం హెచ్‌ఐసీసీలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అసోసియేషన్‌ (హైసియా) ఆధ్వర్యంలో బ్రాండ్‌ హైదరాబాద్‌పై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హైసియా అధ్యక్షుడు భరణి కుమార్‌ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌ పలు అంశాలపై తన అభిప్రాయాలు, ఆలోచనలను వివరించారు.

ఒక్కరితో సాధ్యం కాలేదు
హైదరాబాద్‌ బ్రాండ్‌ఇమేజ్‌ ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్కపార్టీ వల్లనో సాధ్యంకాలేదు. కొన్నేండ్లలోనే వచ్చిందీ కాదు. 400 ఏండ్ల చరిత్రఉన్న భాగ్యనగరం క్రమంగా ఈ ఇమేజ్‌ను పెంచుకుంటూ వచ్చింది. అయితే, గత ఆరేండ్లుగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలతో ఈ ఇమేజ్‌ మరింత పెరుగుతూ వస్తున్నది. కరీంనగర్‌, హైదరాబాద్‌, పుణే, ఢిల్లీ, అమెరికాలో చదివిన నాకు ఆయాప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్‌కున్న అనుకూలతలు తెలిశాయి. హైదరాబాద్‌కు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి.

వారే మా బ్రాండ్‌అంబాసిడర్‌లు
తెలంగాణకు ఆరేండ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే ఇక్కడఉన్న పరిశ్రమల యజమానులు తమ కంపెనీలను మరింతగా విస్తరించారు. తెలంగాణకు వారే బ్రాండ్‌అంబాసిడర్‌లు. ప్రభుత్వ విధానాలతో వారు సంతృప్తిగా ఉండటం వల్లనే రాష్ర్టానికి కొత్త పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు తరలివస్తున్నాయి. కొత్తగా వచ్చిన పెట్టుబడులతో ఇప్పటికే 80 శాతం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఐటీ పరిశ్రమకు కావాల్సింది మూడంశాలు. ఒకటి స్కిల్డ్‌ యూత్‌, రెండోది అనుకూల పాలసీలు, మూడోది శాంతిభద్రతలు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి ఐటీ ఎగుమతులు రూ.57 వేలకోట్లు ఉండగా.. ఇప్పడవి రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచంలోనే టాప్‌లోఉన్న ఐదు ఐటీ కంపెనీలు ఆపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాయి. మైక్రాన్‌వంటి ప్రపంచంలోని ప్రముఖసంస్థ సెజ్‌ను ఏర్పాటుచేసింది. దీనంతటికీ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కారణం. అమెజాన్‌ సంస్థతో నిత్యం చర్చలు, సంప్రదింపులు జరపడం ద్వారానే ఆ సంస్థ రూ.21 వేల కోట్ల పెట్టుబడి ఇక్కడి తీసుకురాగలిగాం. దేశ స్వాతంత్య్రం అనంతరం విజయవంతమైన స్టార్టప్‌ తెలంగాణ. ఆరేండ్ల కాలంలోనే ఇది సాధ్యమయింది. దీనిని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు
తమ పిల్లలను డాక్టర్‌ లేదా ఇంజినీరింగ్‌ చేయించాలనేది నేటి తల్లిదండ్రుల మైండ్‌సెట్‌. మా నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు, కానీ వేరే రంగాన్ని ఎంచుకున్నా. వచ్చే దశాబ్దకాలంలో హెల్త్‌కేర్‌ రంగానికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. వైద్యరంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉండనున్నది. ఇది ఒక్క తెలంగాణలో, దేశంలోనో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి ఇష్టమైన రంగంలో చదువుకునేలా ప్రొత్సహించాలి. ఒకవేళ సైన్స్‌, మ్యాథ్స్‌కే పిల్లలను పరిమితం చేయాలనుకుంటే వారిలో స్కిల్‌, ఆప్‌ స్కిల్‌, రీ స్కిల్‌ అభివృద్ధి చేయాలి. దీనికి ప్రత్యామ్నాయం లేదు. టీ హబ్‌, వీ హబ్‌ల ద్వారా అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.

ఏ జోన్‌ యాక్టివిటీ ఆ జోన్‌లోనే..
ఇతర ప్రాంతాలకూ ఐటీని విస్తరించాలనే ఉద్దేశంతో గ్రిడ్‌ పాలసీని తీసుకొచ్చాం. అక్కడ కంపెనీలు పెట్ట్టేవారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తాం. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను మరింత ప్రోత్సహించాలని నిర్ణయించాం. సబ్‌అర్బనైజేషన్‌ సరిగ్గా జరుగాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని తీసుకొచ్చాం. ఓఆర్‌ఆర్‌ చుట్టూ టౌన్‌షిప్‌లు రావాల్సిన అవసరం ఉన్నది. చందానగర్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు మెట్రో రెండోదశను విస్తరించనున్నాం. ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వేయాలనే ఆలోచనా ఉన్నది. ఇవన్నీ జరిగితే రోడ్లు, మౌలిక సదుపాయాలమీద ఒత్తిడి తగ్గుతుంది. హైదరాబాద్‌లో ఆరుజోన్లు ఉన్నాయి. ఏ జోన్‌ యాక్టివిటీ ఆ జోన్‌లోనే ఉండాలి. అక్కడే హాస్పిటాలిటీ, షాపింగ్‌, విద్యాసంస్థలు ఉండాలి. డీసెంట్రలైజ్‌ కావాలి. ఇవన్నీ జరుగాలంటే ప్లాన్‌ కావాలి. మాకు కమిట్‌మెంట్‌ ఉన్నది. విజన్‌ ఉన్నది. మా ప్రభుత్వం ఇంకా మూడేండ్లు ఉంటుంది. వీటన్నింటినీ చేసి చూపించే బాధ్యత మాది.

అన్నింటికీ శాంతిభద్రతలు బాగుంటేనే..
అనుకున్నవన్నీ జరుగాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. కానీ, కొందరు కెలికి పంచాయతీ పెట్టుకోవాలని చూస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. అయితే అందులో ఏ రకమైన కల్చర్‌ ప్రమోట్‌ చేస్తున్నామనేది ఆలోచించుకోవాలి. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను ఉల్లంఘించిన యూత్‌కు వేసే చలాన్లను తామే కడతామంటూ నిన్నమొన్న మా రాజకీయ ప్రత్యర్థి అంటున్నారు. ఇది ఏమన్న కామన్‌సెన్స్‌ ఉన్న మాటేనా. బండిని తాగి నడిపినా పర్వాలేదు, బండిమీద ముగ్గురు, నలుగురు పోయినా పర్వాలేదు అంటున్నరు. ఓట్లకోసం ఇంత దిగజారాలా? మత సామరస్యం దెబ్బతినేలా, కమ్యూనిటీల మధ్య సంబంధాలు దెబ్బతినేలా తగాదా చేస్తున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి, వృద్ధి కొనసాగాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. విజ్ఞతతో ఓటేయండి.

త్రీ డీలో ముందుండాలి
రాబోయే కాలంలో దేశాన్ని త్రీ డీ (డిజిటైజ్‌, డీకార్బనైజ్‌, డీసెంట్రలైజ్‌)లు శాసించబోతున్నాయి. ఈ మూడింటిలోనూ మన లక్ష్యాన్ని చేరుకోవాలి. డీకార్బనైజ్‌లో క్లిన్‌టెక్‌లో చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు ఉన్నాయి. కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వాతావరణంలో కాలుష్యం తగ్గాలి, గాలి నాణ్యంగా ఉండాలి, నగరాలు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తామనే ధీమా ఉన్నది. ఈవీ పాలసీ ఆవిష్కరించిన మొదటిరోజే కంపెనీలు రూ.3వేల కోట్ల పెట్టుబడులతో ఒప్పందం చేసుకున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్ర అవసరాలు తీర్చగలుగుతుండగా.. రాబోయే రోజుల్లో ఇతర రాష్ర్టాల అవసరాలు తీర్చేలా పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ రంగంలో హైదరాబాద్‌లోనే కాకుండా శివారు, జిల్లాల్లోనూ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. ఐటీ పరిశ్రమకు సెజ్‌లు ఉన్నవిధంగానే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోనూ ఎస్‌ఈజెడ్‌లను ఏర్పాటు చేయనున్నాం. టెక్స్‌టైల్‌, లాజిస్టిక్‌ రంగంలోనూ పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌రంగాల్లో తెలంగాణ రాబోయే దశాబ్దకాలంలో లీడర్‌గా ఉండబోతున్నది.

త్రీ ఐతో దేశాభివృద్ధి సాధ్యం
ఏరో స్పెస్‌ రంగంలోనూ తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలిక్యాప్టర్‌ క్యాబిన్‌ మన దగ్గరే తయారవుతున్నది. ఎస్‌ 92 హెలికాప్టర్లు ఇక్కడ తయారవుతున్నాయి. ఇండియాలో అతిపెద్ద ప్రైవేటు మిైస్సెల్‌ ఫ్యాక్టరీ కల్యాణి రైఫిల్‌ హైదరాబాద్‌లో ఉన్నది. రక్షణరంగ పరిశ్రమలకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉన్నది. ఇందులో 10 ప్రభుత్వరంగ సంస్థలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వీటికి అనుబంధంగా మరో 1,000 ఎస్‌ఎంఈలు ఇక్కడ ఉన్నాయి. ఆజాద్‌ ఇంజినీరింగ్‌ సంస్థ భారీ ఆర్డర్లను చేజిక్కించుకున్నది. ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో దేశ అభివృద్ధికి త్రీ ఐ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌గ్రోత్‌, ఇన్నోవేషన్‌) కావాలని చెప్పాం.

నిర్మాణాత్మక ప్రభుత్వం కావాలా? విభజన రాజకీయాలా ?
నిర్మాణాత్మక ప్రభుత్వం కావాలా? విభజన రాజకీయాలు కావాల్నా? అందరూ ఆలోచించాలి. నాలుగుఓట్ల కోసం, నాలుగుసీట్ల కోసం, కార్పొరేషన్‌ ఎన్నికల కోసం ఇంత దిగజారుడు రాజకీయమా? నగరం ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి చెందుతున్నది. దీనిని దెబ్బతీయొద్దు. ఇది ఎవరికీ మంచిది కాదు. సే నో టూ హేట్‌ పాలిటిక్స్‌.

త్రికోణం.. ఇదీ కేటీఆర్‌ మంత్ర
హైదరాబాద్‌తోపాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి ‘తీ డీ’ సూత్రాలే మూలాధారమని మంత్రి కేటీఆర్‌ సూత్రీకరించారు. ఆదివారం హెచ్‌ఐసీసీలో జరిగిన బ్రాండ్‌ హైదరాబాద్‌ ప్యూచర్‌ రెడీ సదస్సులో మంత్రి కేటీఆర్‌ ఐటీరంగంతోపాటు హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలపై జరిగిన ‘బ్రాండ్‌ హైదరాబాద్‌-ఫ్యూచర్‌ రెడీ’ కార్యక్రమంలో త్రీడీని వివరించారు.

ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యత. హైదరాబాద్‌లో ఓటర్లు ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి. పోలింగ్‌లో పాల్గొనకుండా ఆ తర్వాత సోషల్‌ మీడియా లో ఎంత ఫిర్యాదు చేసినా లాభంలేదు. మీ నాయకుడ్ని మీరే ఎంచుకోండి.. ఏదో ఒకపార్టీకి ఓటేయండి. ఎవరూ నచ్చకుంటే కనీసం నోటాకైనా వేయండి. కానీ ఓటింగ్‌లో మాత్రం పా ల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.

మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు కొబ్బరి కాయలు కొట్టానా.. నాలుగు రిబ్బన్లు కట్‌ చేశానా అనుకుంటే వేస్ట్‌. మంత్రులు అనేవారు నా కంటే ముందూ వచ్చారు. నా తర్వాతా వస్తారు. కానీ, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాను, ప్రజల కోసం ఇంకా ఏమన్న చేయగలనా? అనేదే ఆలోచిస్తూ ఉంటా. ఇష్టంతోనే ఏదైనా చేయగలగాలి. ఇష్టంలేకుండా.. వచ్చానంటే అంటే వచ్చాను, పోయినాఅంటే పోయాను అనుకుంటే కుదరదు. దీనినే నేను విశ్వసిస్తా.
– మంత్రి కేటీఆర్‌

చాలా చేశాం … ఇంకా చేయాల్సి ఉంది
అధికారంలో ఉన్న ఈ ఆరేండ్లలో చాలాచేశాం.. చేయాల్సింది ఇంకా చాలా ఉన్నది. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. తెలంగాణ వచ్చిన కొత్తలో వారానికి రెండ్రోజులు పవర్‌ హాలిడే ఉండేది. కానీ, ఇప్పుడు ఆదివారం కూడా పరిశ్రమలు నడిపించుకొనేలా అనుమతులిచ్చాం. మూడుషిఫ్ట్‌ల్లోనూ పరిశ్రమలను నడుపుకుంటున్నారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగడంతోపాటు, ఉత్పత్తి కూడా పెరిగింది. తాగునీటి సమస్యను పరిష్కరించాం. కేశవపూరంలో 6.5 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో 2050 వరకు తాగునీటికి ఢోకా ఉండదు. ఎస్సార్డీపీతో ద్వారా రూ.6వేల కోట్లతో పనులు చేపట్టాం. 137 లింక్‌రోడ్లను నిర్మిస్తున్నాం. సీఆర్‌ఎంపీలో భాగంగా రూ.800 కోట్లతో 710 కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తున్నాం. రోడ్డువేసిన కాంట్రాక్టర్‌ ఐదేండ్లదాకా దాని నిర్వహణ చూసేలా చర్యలు తీసుకొన్నాం. రూ.3,700 కోట్లతో నగర శివారులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించాం. అయితే నగరం మధ్యలో ఉన్న పురాతన డ్రైనేజీ రెండు సెంటీమీటర్లు వర్షానికి మాత్రమే తట్టుకొనేలా ఉన్నది. వందేండ్ల తర్వాత ఈ ఏడాది కురిసిన అతి భారీవర్షాలతో హైదరాబాద్‌లో వందల కాలనీలు నీటమునిగాయి. వ్యక్తుల దురాశ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికావడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. ఎస్‌ఎన్‌డీపీని చేపట్టడంద్వారా రూ.10-15వేల కోట్ల ఖర్చుతో చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా కోరలనుంచి కాపాడుతాం. అయితే దీనికి కొంతసమయం పడుతుంది.

మా సంకల్పాన్ని చూడండి
పనిలేనివారు చాలామంది సోషల్‌ మీడియాలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ అయితే దానిని ఏకంగా యాంటీ సోషల్‌ మీడియా అంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇదేనా బంగారు తెలంగాణ, ఇదేనా గ్లోబల్‌సిటీ అంటూ జోకులు వేస్తుంటారు. అల్లావుద్దీన్‌ అద్భుతదీపమేమీ మా వద్దలేదు. ఛూమంతర్‌ అనగానే మొత్తం మాయమై పోయి విశ్వనగరాలు ఓవర్‌నైట్‌ నిర్మాణం కావు. ఇందుకు కొంతసమయం పడుతుంది. ప్రభుత్వానికి నగరాన్ని అభివృద్ధిచేసే తపన ఉన్నదా? లేదా? అనేది చూడండి. ఏమైనా చేయాలనే సంకల్పం ఉన్నదా? చూడండి. ఆ దిశగా ప్రయాణం ప్రారంభమైందా? అనేది చూడండి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిన్సియర్‌గా ప్రయాణం ప్రారంభించింది. అయితే, కొన్నిలోపాలు ఉండొచ్చు, ఇంకా పరిష్కరించాల్సినవీ ఉండొచ్చు. వాటిని చేయడానికి మీ మద్దతు, దీవెనలు అవసరం. సోషల్‌ మీడియాలో నిర్మాణాత్మక విమర్శలు చేయండి.. స్వీకరిస్తాం.

హైదరాబాద్‌ ఆరేండ్లుగా ప్రశాంతంగా ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే పేకాట క్లబ్బుల్లేవు, గుడుంబా గబ్బులేదు, ఆకతాయిల ఆగడాల్లేవు, పోకిరీల పోకడలు లేవు, బాంబు పేలుళ్లు లేవు, మత కల్లోలాలు లేవు, దొమ్మీలు లేవు, దోపిడీలు లేవు. మన పిల్లలకు ఎలాంటి హైదరాబాద్‌ను ఇవ్వాలనుకుంటున్నాం. ‘నిర్ణయాత్మక రాజకీయాలా? విభజన రాజకీయాలా? అనేది ఆలోచించి ఓటేయండి.
– మంత్రి కేటీఆర్‌

ఐటీ పరిశ్రమకు కావాల్సిన మూడు సూత్రాలు
-నైపుణ్యం కలిగిన యువత
-ప్రభుత్వపరంగా అనుకూలమైన పాలసీలు
-శాంతి భద్రతలు
అభివృద్ధికి మూలాధారం త్రీడీ -డిజిటైజ్‌
-డీకార్బనైజ్‌
-డీ సెంట్రలైజ్‌
దేశాభివృద్ధికి చేయాల్సినవి – త్రీఐ
-ఇన్నోవేషన్స్‌ (నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహకం)
-ఇన్‌ఫ్రా (మౌలిక వసతులు)
-ఇన్‌క్లూజివ్‌ (అందరినీ కలుపుకొని వెళ్లడం)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.