Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శరవేగంగా ప్రాజెక్టులు..

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి రైతుల పొలాల్లోకి సాగునీరు పంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మొదటి ప్రాధాన్యంగా పాలమూరు ప్రాజెక్టులన్నీ రెండున్నరేండ్లలో పూర్తికావాలని డెడ్‌లైన్ విధించారు. ప్రతి పనికి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించి, ఆ మేరకు పనులు పూర్తి చేయాలన్నారు. ఇసుక, బ్లాస్టింగ్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సింగిల్‌విండో అనుమతులు ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మలను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. -నిధుల కొరత లేదు.. భూసేకరణ సమస్యలేదు -మిగిలింది నిర్మాణపనులే -హరీశ్ చొరవతో కేంద్రం నుంచి 3వేల కోట్లు -బిల్లుల చెల్లింపునకు ప్రతినెల 2వేల కోట్లు విడుదల -ఇసుక, బ్లాస్టింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు -పాలమూరు రైతులకు నీరు అందించడం మొదటి ప్రాధాన్యం -సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR review meet on palamuru lift irrigation project

సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో కేంద్రం నుంచి రూ. 3వేల కోట్లు వచ్చాయని, భూసేకరణ సమస్యలు కూడా లేవని, కేవలం నిర్మాణ పనులే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఏ సమస్యలు లేనందున రైతులకు సాగునీరు అందించేవరకు విశ్రమించకుండా నిర్విరామంగా పనిచేయాలని, అతిత్వరగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించడానికి ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కేజోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీడీవో చీఫ్ ఇంజినీర్ ఏ నరేందర్‌రెడ్డి, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

బిల్లుల చెల్లింపుకు ప్రతి నెల రూ.2 వేల కోట్లు నీటి ప్రాజెక్టుల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ప్రతి నెలా రూ.2 వేల కోట్లు విడుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రతి పనికి ఒక నిర్ణీత వ్యవధి పెట్టుకొని దానికి అనుగుణంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. పనిపూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయవద్దని సీఎం అధికారులకు నిర్దేశించారు. బిల్లుల చెల్లింపులను తాను కూడా ఆన్‌లైన్‌లో పరిశీలిస్తానన్నారు. ఎక్కడైనా తేడా వస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాక్ ఇసుక వాడుతున్నామని చెప్పడంతో సీఎం కేసీఆర్ అభినందించారు.

ఇదే సమయంలో రాక్ ఇసుక, మామూలు ఇసుక, బ్లాస్టింగ్‌లకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని సీఎస్‌ను, డీజీపీని సీఎం ఆదేశించారు. ఎక్కడా కాంట్రాక్టర్లు ఇబ్బంది పడకుండా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. బ్లాస్టింగ్‌కు సంబంధించి కాంట్రాక్టర్లకే నేరుగా అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఘడియ సమయం కూడా వృథా కాకూడదన్నారు. మూడుషిఫ్ట్‌లలో షిఫ్ట్‌కు 8 గంటల చొప్పున 24 గంటలు నిర్విరామంగా పని జరగాలన్నారు.

మిగిలిన భూసేకరణ త్వరగా పూర్తిచేయండి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ 60శాతం పూర్తయిందని సీఎం అన్నారు. మిగిలిన భూసేకరణ కూడా త్వరగా పూర్తిచేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని, అందుకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఉద్యోగులు, సిబ్బంది నియామకం, వాహనాల కొనుగోలు, పరికరాల సరఫరా లాంటి చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని అధికారులకు స్పష్టం చేశారు.

సమాంతరంగా పనులు జరగాలి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇన్‌టేక్ వెల్, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెళ్ల నిర్మాణం సమాంతరంగా జరగాలని సీఎం అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టంచేశారు. వీటికి సంబంధించిన డిజైన్లు కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు. రిజర్వాయర్ల సామర్ధ్యాన్ని కూడా నిర్మాణాలకు అనుగుణంగా క్రమంగా పెంచుకుంటూ పోవాలన్నారు. కాలువల నుంచి రిజర్వాయర్లకు నీరు నింపే క్రమంలో మధ్యలో ఉన్న చెరువులను కూడా నింపుకొనే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. నార్లాపూర్ పంప్‌హౌస్‌తో పాటు కరివెన, పట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను 24 నెలల్లో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్దండాపూర్ నుంచి లక్ష్మిదేవిపల్లె వరకు, రిజర్వాయర్లు, కాలువ సొరంగ మార్గాల నిర్మాణపనులకు త్వరితగతిన టెండర్లు పిలవాలన్నారు.

16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా కోస్గి, కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్నారు. నార్లాపూర్ వద్ద అలైన్‌మెంట్‌ను కాంట్రాక్టర్లు మరో విధంగా సూచించడంతో దానిపై పరిశీలన జరపాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా 20 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిస్తున్న రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. అంతారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచి కేవలం రంగారెడ్డి జిల్లాకు మాత్రమే డెడికేటెడ్‌గా నీరు అందించాలన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 10 టీఎంసీల నీటి నిల్వకు ఒకటి నుంచి రెండు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఐదారు రిజర్వాయర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రెండున్నరేండ్లలో నిర్మాణాలు పూర్తికావాలి అన్ని నిర్మాణాలు రెండున్నరేండ్లలో పూర్తయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రోమెకానికల్ డిజైన్ల రూపకల్పన కోసం విద్యుత్, నీటిపారుదలశాఖ అధికారులతో కమిటీ వేయాలన్నారు. సాగునీరు అందించే క్రమంలోనే మిషన్ భగీరథకు కూడా నీరు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని సీఎం అన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తికావడం ద్వారా పాలమూరు జిల్లాలో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అప్పుడు జిల్లాలో వలసలు ఆగిపోతాయని, వలసలు పోయిన వారు తిరిగి స్వంత ఊరికి చేరుకుంటారని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. తమ పొలాలకు నదీజలాలు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారని, వారి నమ్మకం నిలబెట్టి తీరాలన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సమిష్టి కృషి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను, కాంట్రాక్టర్లను కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.