Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శాసనమండలి సభ్యులుగా నాయిని, రాములునాయక్ ప్రమాణం

-కేసీఆర్ చాలా తెలివైన ఉద్యమకారుడు -ప్రజాస్వామికంగానే తెలంగాణ సాధించారు: నాయిని -కేసీఆర్ రాముడు.. నేను హనుమంతుడిని: రాములు నాయక్ -మా కమిట్‌మెంట్ బంగారు తెలంగాణ కోసమే: ఈటెల -ప్రమాణానికి ముందు గన్‌పార్క్ వద్ద నేతల నివాళులు

Naini Narimha Reddy

శాసనమండలి సభ్యులుగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములు నాయక్ ఆదివారం ప్రమాణాన్ని స్వీకరించారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారిద్దరితో శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. అనంతరం చట్టసభల నిబంధనలు, విధానాలతో కూడిన కిట్‌ను వారికి చైర్మన్ అందజేశారు. అలాగే వారికి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ఆలీ, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి నాయిని, రాములునాయక్ గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. అనంతరం ఒక పావురాన్ని ఎగురవేశారు. అక్కడి నుంచి శాసనమండలికి చేరుకొని ప్రమాణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడు తూ తాను 1969 నాటి నుంచి నేటివరకు తెలంగాణ ఉద్యమం లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చానని, మధ్యలో మదన్‌మోహన్, చెన్నారెడ్డి వంటివారు కూడా ఉద్యమాన్ని చేపట్టారని, అన్ని రకాల తెలంగాణ ఉద్యమాల్లో తాను భాగస్వామినయ్యానని తెలిపారు.

తొలిదశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు పోలీస్ కాల్పుల్లో మరణించారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు 610 జీవో తెచ్చారని, కేంద్రం ఆరుసూత్రాల ఫార్మూలా ప్రవేశపెట్టిందని, అయినా ఇవేవీ అమలు కాలేదని గుర్తుచేశారు. ఆ తరువాత కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. అప్పట్లో ఆయనే నాకు ఫోన్ చేసి నువ్వు మా ఇంటికి వస్తావా… నన్ను రమ్మాంటావా అని అడిగారు. ఆయనింటికి వెళ్లి అరంగంట చర్చించాం. అప్పటినుంచి నేటివరకు ఉద్యమానికి అంకితం అయ్యాను అని ఆయన వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ యూనివర్సిటీలో విద్యార్థి అని, అయినా ఆయన నాయకత్వాన్ని స్వీకరించామని చెప్పారు. ఇప్పటివరకు ఉద్యమాలు చేసిన వారందరికంటే కేసీఆర్ చాలా తెలివైన వ్యక్తి అని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని నడిపించారని కొనియాడారు.

Naini Narsimha Reddy

తెలంగాణ పదమే ఉచ్చరించవద్దని నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారని, కానీ ఆనాటి నుంచి నేటివరకు అన్ని పార్టీలు తెలంగాణ అనేలా చేసిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. పోరాడితేనే తెలంగాణ అని ప్రజలు గుర్తించినందునే అన్ని సంఘాలు, సంస్థలు, విద్యార్థులు, ఉద్యోగులు ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేశారని, దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. ఉద్యమంలో కొన్ని దెబ్బలు తగిలాయని, అయినా నిలదొక్కుకున్నామని, కేసీఆర్‌ను పార్టీ నుంచి తొలగించి ఆఫీసును కబ్జా చేసుకునే ఆలోచనలో కొందరుంటే ఆయన వెంట నిలిచి పనిచేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంలో తమ గౌరవాన్ని, ఆయన గౌరవాన్ని కాపాడుకొని పోరాటం చేశామన్నారు. తనకు ఎలాంటి పదవి లేకున్నా హోంశాఖ ఇచ్చారని, కేసీఆర్ ఉద్యమకారులను గౌరవిస్తారనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. తనను ఎమ్మెల్సీగా, మంత్రిగా నియమించినందుకు ప్రజలకు న్యాయం చేస్తానని తెలిపారు. కేసీఆర్ కలలుగంటున్న బంగారు తెలంగాణ కోసం పాటుపడుతామన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి అనుభవాన్ని, టీఆర్‌ఎస్ పట్ల ఆయనకున్న కమిట్‌మెంట్‌ను గుర్తించినందునే ఎమ్మెల్సీతోపాటు, హోంమంత్రి పదవిని ఆయనకు ఇచ్చారని తెలిపారు. ఉద్యమంలో, కష్టకాలంలో వెంట ఉన్నవారితోనే బంగారు తెలంగాణ నిర్మించాలని కేసీఆర్ భావించారు కనుకే వీరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వీరిద్దరి కమిట్‌మెంట్, ఉద్యమ స్ఫూర్తి బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌కు 2001 నుంచి వెన్నంటి ఉంటూ అన్ని సందర్భాల్లో పార్టీతోనే ఉన్న రాములునాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంపై ఈటెల సంతోషం వ్యక్తం చేశారు. 2001 నుంచి కూడా ఉద్యమాన్ని, పార్టీని నమ్ముకుని ఉన్న గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాములునాయక్ అని తెలిపారు.

గతంలో ఎమ్మెల్సీ అవకాశాలు ఉంటే మొదట రాములునాయక్‌కే ఇస్తానని కేసీఆర్ అన్నారని, అన్నట్లుగానే ఆయనకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో నిరంతరం కృషి చేస్తారని చెప్పారు. ఎమ్మెల్సీ రాములునాయక్ మాట్లాడుతూ 2001లో తాము గులాబీ కండువా కప్పుకుంటే తమను చూసి నవ్వారని, ఇప్పుడు అదే కండువాతో ఉన్న తాము ఇప్పుడు కారు మాది సర్కారు మాది, సెక్రటేరియట్ మాది, గజ్వేల్ మాది గవర్నమెంట్ మాది అంటున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన కార్మికులు, గిరిజనులు, రైతుల సమస్యల పరిష్కారాల కోసం శాసనమండలిలో కషిచేస్తానని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై మండలిలో ప్రశ్నిస్తామన్నారు. తనపై కేసీఆర్ నమ్మకముంచినందుకు సంతోషం కలుగుతోందని, కేసీఆర్ రాముడు అయితే తాను హనుమంతుడినని, ఆయనకు అన్ని వేళలా అండగా ఉండి కాపాడుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, గంప గోవర్ధన్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.