-తెలంగాణలో ఎత్తయిన ప్రదేశానికి చేరనున్న గోదావరి -ఎల్లుండే కొండపోచమ్మలోకి గోదావరి ప్రవేశం -మర్కూక్ పంప్‌హౌజ్ నుంచి ఎత్తిపోత -29న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ -చినజీయర్‌స్వామి నేతృత్వంలో యాగం? -ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు -కాళేశ్వరంలో 68 టీఎంసీలకు చేరనున్న నిల్వసామర్థ్యం -కాళేశ్వరంలో తన మెట్టినింటి నుంచి ఎగువకు బయలుదేరిన గోదారి తల్లి.. ఎములాడ రాజన్నను మధ్యలో పలుకరించి.. సిద్దిపేటలో రంగనాయకుడితో ముచ్చటించి.. కొమురెల్లి మల్లన్న పాదాలను అభిషేకించి.. శిఖరాగ్రాన ఉన్న పోచమ్మ చెంతకు చేరడానికి ఉరికురికి వస్తున్నది.

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలోని కొండపోచమ్మతల్లి సిగలో పూవై మెరిసిపోవడానికి ఆత్రంగా వస్తున్నది శుక్రవారం రోజున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా కాళేశ్వరం ప్రాజెక్టులో శిఖరాయమానమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది
రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వందమీటర్లలోపే పారే గోదారమ్మ గరిష్ఠ ఎత్తుకు చేరే కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారయ్యింది. భువి నుంచి అరకిలోమీటరుకుపైగా ఎత్తులోకి ఎగిరిదుంకేందుకు సిద్ధమయ్యింది. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లను నిండుకుండలా మారుస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణించిన కాళేశ్వరం జలాలు ఈ నెల 29న 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సిగలో కొలువుతీరనున్నాయి. సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు మర్కూక్ పంప్‌హౌజ్‌లో రెండు మోటర్లను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్‌స్వామి యజ్ఞం నిర్వహించి ఆశీర్వచనం అందజేస్తారు. ఈ చారిత్రక ఘట్టానికి అధికారయంత్రాంగం అన్నిఏర్పాట్లు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్ -పాములపర్తి గ్రామాల సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని శ్రీరంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల సొరంగం ద్వారా తుక్కాపూర్ (మల్లన్నసాగర్) పంప్‌హౌజ్‌కు చేరుకున్న గోదావరి జలాలు అక్కడ ఎత్తిపోయడం ద్వారా అక్కారం పంప్‌హౌజ్‌కు, అక్కడినుంచి మర్కూక్ పంపుహౌజ్‌కు వచ్చిచేరాయి. మర్కూక్‌లో మరోసారి ఎత్తిపోయడం ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరనున్నాయి.
రంగనాయక్‌సాగర్ నుంచి మూడుదశల్లో రంగనాయక్‌సాగర్ జలాశయం నుంచి మూడుదశల్లో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మకు చేరుతాయి. తుక్కాపూర్ (మల్లన్నసాగర్) సర్జ్‌పూల్ పంప్‌హౌజ్‌లో 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది మోటర్లను ఏర్పాటుచేయగా.. రెండు మోటర్ల ద్వారా జలాలను ఎత్తిపోశారు. ఇక్కడి డెలివరీ సిస్టర్న్ నుంచి మల్లన్నసాగర్ కుడి, ఎడమకాలువలకు నీళ్లు వెళ్తాయి. కుడికాలువ ద్వారా దుబ్బాక, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీళ్లందుతాయి. ప్రస్తుతం ఆ కాలువ పనులు కొనసాగుతున్నాయి. ఎడమకాల్వ ద్వారా 11,500 క్యూసెక్కుల నీరు తుక్కాపూర్ పంపుహౌజ్ నుంచి 7.9 కి.మీ వద్దఉన్న కొడకండ్ల ఫోర్‌బేకు చేరుకుంటాయి.
అక్కడ ఏర్పాటుచేసిన గేటు నుంచి రెండుకాలువలుగా విడిపోతాయి. 4వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉండే ఓ కాలువలో భువనగిరివైపుపారి 15,16వ ప్యాకేజీలోని గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు చేరుతాయి. 7,500 క్యూసెక్కుల సామర్థ్యమున్న రెండవకాలువ ద్వారా అక్కారం పంపుహౌజ్‌కు చేరుకుంటాయి. ఇక్కడ 27 మెగావాట్లతో 6 మోటర్లను ఏర్పాటుచేశారు. అక్కడ ఎత్తిపోయడంతో గ్రావిటీ కెనాల్ ద్వారా జలాలు 10 కిలోమీటర్ల దూరంలోని మర్కూక్ పంపుహౌజ్‌కు చేరుకుంటాయి. ఇక్కడ 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటుచేశారు. ఈ పంప్‌హౌజ్‌లో ఈ నెల 29 ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండుమోటర్లను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోతను ప్రారంభించనున్నారు. మర్కూక్‌లో మోటర్లు నడుస్తున్న సమయంలోనే అక్కారం, తుక్కాపూర్ పంప్హౌజ్లలోనూ మోటర్లు ఆన్‌లోనే ఉంటాయి. నీటిని నిల్వచేసే అవకాశం లేకపోవడంతో మూడు పంప్హౌజ్లలోనూ మోటర్లు ఒకేసారి నడువనున్నాయి.

ఐదుజిల్లాల వరప్రదాయిని కొండపోచమ్మ ఐదుజిల్లాల వరప్రదాయిని కొండపోచమ్మ రిజర్వాయర్. సిద్దిపేట , సంగారెడ్డి, మెదక్, యదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను ఈ రిజర్వాయర్ తీర్చనున్నది. ఐదుజిల్లాలో మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందనున్నది. 15.8 కిలోమీటర్లు వలయాకారంలో చేపట్టిన ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తిచేశారు. రిజర్వాయర్‌కు మూడు ప్రధాన స్లూయిస్ గేట్లు ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్ నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు నీటిని పంపిస్తారు. జగదేవ్‌పూర్ కెనాల్ నుంచి యాదాద్రి జిల్లాకు నీటినందించనున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్ద నిర్మిస్తున్న కేశవపూర్ ద్వారా రిజర్వాయర్ జంటనగరాలకు తాగునీరు అందించనున్నది.
టూకీగా కొండపోచమ్మ సామర్థ్యం : 15 టీఎంసీలు వలయాకారం కట్ట: 15.8 కిలోమీటర్లు ప్రాజెక్టు వ్యయం : 1,540 కోట్లు మొత్తం ఆయకట్టు : 2,85,280 ఎకరాలు ప్రధాన స్లూయిస్‌లు: సంగారెడ్డి ప్రధాన కెనాల్, కేశవపూర్ కెనాల్, జగదేవ్‌పూర్ కెనాల్ లబ్ధిపొందనున్న జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, యదాద్రి భువనగిరి ప్రధాన కాల్వలు: రామాయంపేట, గజ్వేల్, ఉప్పరపల్లి, కిష్టాపూర్, తుర్కపల్లి, జగదేవ్‌పూర్, తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి
కొండపోచమ్మ సాగర్ 557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్ నుంచి తుక్కాపూర్ పంప్‌హౌజ్ అక్కడి నుంచి అక్కారం, మర్కూర్ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ కు చేరుకుంటాయి. లక్ష్మీబరాజ్ నుంచి సుమారు 214 కిలోమీటర్లు ప్రవహించి ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తుకు చేరుకుంటాయి. దీంతో తెలంగాణలోని అత్యంత ఎత్తైన ప్రాంతానికి కాళేశ్వర జలాలు చేరుకుంటాయి.