Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శ్రేయోరాజ్యంగా తెలంగాణ

-ఆర్థిక వృద్ధిరేటులో దేశంలోనే అగ్రగామి -రాష్ట్ర తృతీయ అవతరణోత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ -నేటినుంచి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ కిట్స్ పంపిణీ -15వేలతో 16 రకాల వస్తువులతో కిట్ -రేపటినుంచి ఒంటరి మహిళలకు భృతి -ఈ యాసంగిలోనే 24 గంటల ఉచిత కరెంటుకు ప్రయత్నం -వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ఆరు రకాల ప్రణాళికలు -వచ్చే నెల హరితహారంలో ప్రజలంతా పాల్గొనాలి -ముఖ్యమంత్రి కేసీఆర్

అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం… కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో.. అన్న మహాకవి దాశరథి కవితా వాక్యాలు తన మదిలో నిరంతరం మెదులుతుంటాయని, ఆ కవి స్వప్నించిన శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతినబూనారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర తృతీయ అవతరణోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మూడేండ్లపాటు తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, అన్నార్తులకు ఆసరాగా ఉండేందుకు సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు మునుపెన్నడూలేని రీతిలో కొనసాగుతున్న తెలంగాణ అభివృద్ధి పథాన్ని తన ప్రసంగంలో ఆవిష్కరించారు. శనివారం నుంచి కేసీఆర్ కిట్లు అందజేసే కార్యక్రమం మొదలవుతుందన్న సీఎం.. ఆదివారం నుంచి ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల జీవనభృతి పథకం ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ యాసంగిలోనే రైతులకు 24గంటలపాటు ఉచిత కరెంటు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఏ ఆశయం సిద్ధించాలని మనం మహోద్యమం నడిపించామో, సాధించుకున్న స్వరాష్ట్రంలో ఏయే స్వప్నాలు ఫలించాలని తపించామో.. ఆ ఆశలు, ఆ ఆకాంక్షలు అన్నింటినీ నెరవేర్చుకునే దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పురోగమిస్తున్నదని సీఎం చెప్పారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది..

ఆదాయ వృద్ధిరేటులో అగ్రభాగాన సకల వనరులతో శోభించే సుసంపన్నమైన ప్రాంతం మన తెలంగాణ. కానీ తెలంగాణకు ఉన్న ఆర్థిక ప్రతిపత్తి సమైక్య రాష్ట్రంలో మరుగునపడింది. తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని నేను ఉద్యమ సమయంలో పదేపదే ప్రకటించాను. ఆనాటి నా మాటలు ఈనాడు అక్షరాలా నిజమయ్యాయి. ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలువడం అందరికీ గర్వకారణం. రాష్ట్ర అభివృద్ధికి శుభసూచికం. గడిచిన మూడు సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠమైన, ప్రణాళికాబద్ధమైన విధానాలు, పాటించిన ఆర్థిక క్రమశిక్షణ వల్లనే ఇది సాధ్యమైంది.

అన్నార్తులకు ఆసరాగా… సంపదను సృష్టించడంలోనే కాకుండా ఆ సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికలుగా ప్రజలకు పంపిణీ చేయడంలోనూ, అభివృద్ధి ఫలితాలను అట్టడుగు వర్గాల ప్రజలదాకా చేర్చడంలోనూ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం సకలజనులకు సంక్షేమాన్ని పంచింది. పేద ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రూ.40వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని ప్రజా సంక్షేమానికే వెచ్చిస్తున్నది. 40 లక్షల మంది అసహాయులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నది. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలు చేసుకుంటున్నాం. పేదలు కడుపునిండా అన్నం తినాలని ప్రతి ఒక్కరికీ నెలకు ఆరు కిలోల బియ్యం అందిస్తున్నం. బడుగులు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నం. చదువుకుంటున్న పిల్లలందరికీ సన్న బియ్యం బువ్వ అందిస్తున్నం. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు కొత్తగా 512 గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశాం. ఎస్సీ మహిళల కోసం ప్రత్యేక గురుకుల డిగ్రీ కాలేజీలు నడుపుతున్నట్లే వచ్చే విద్యాసంవత్సరం ఎస్టీ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తాం. ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసుకొని ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి, వారి జీతాలు భారీగా పెంచాం. దేశ చరిత్రలో ఎన్నడూ, ఎవరూ చేయని విధంగా న్యాయవాదులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాం.

అవతరణ దినోత్సవాన ఆత్మీయ కానుకలు.. పేద మహిళలకు ప్రయోజనం కలిగించే రెండు మానవీయ నిర్ణయాలను రాష్ట్రావతరణ ఉత్సవాలను పురస్కరించుకొని అమలు చేసుకోనున్నాం. తమకంటూ ఎవరూ తోడు లేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయల జీవన భృతి ఆదివారం నుంచి లభించనుంది. ఈ భృతి వారికి ఎంతో ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నాం. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన రూ.15వేల విలువైన కేసీఆర్ కిట్ అనే పథకం శనివారం నుంచి అమలులోకి రానుంది. పేదరికం అనుభవిస్తున్న మహిళలు నెలలు నిండిన తర్వాత కూడా కుటుంబం గడువడం కోసం కూలిపనులకు వెళుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో మహిళలకు మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. అందుకే గర్భిణులు కూలి పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్ కిట్స్ అనే పథకం ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ద్వారా గర్భిణులు కూలిపనులకు వెళ్లలేక కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

గర్భిణులకు మూడు విడుతలుగా మొత్తం రూ.12వేలు అందుతాయి. ఆడ పిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో రూ.వెయ్యి అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల శాతం పెరుగాలని, తద్వారా బాలింత మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ఉండాలని, మరీ ముఖ్యంగా భ్రూణ హత్యలు నిరోధించాలనేది ఈ పథకం ద్వారా ప్రభుత్వ లక్ష్యం. ప్రసవానంతరం తల్లీ పిల్ల క్షేమంగా ఉండాలనే తలంపుతో ఇరువురి సంరక్షణకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో మదర్ అండ్ బేబీ కిట్‌ను ప్రభుత్వం అందిస్తున్నది. ఈ కిట్‌లో మూడు నెలల వరకు సరిపోయే విధంగా తల్లీ, బిడ్డలకు అవసరమైన బట్టలు, నాణ్యమైన బేబీ సోప్స్, బేబీ ఆయిల్, బేబీ పౌడర్, దోమ తెర, ఆట వస్తువులు, నాప్కిన్స్, డైపర్స్ తదితర వస్తువుంటాయి. ఇది మాతాశిశువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ కానుక.

మూడు దశాబ్దాల కరెంటు కష్టాలకు చెల్లు.. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ అనతి కాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం. విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన అపూర్వ విజయమే ఇందుకు నిదర్శనం. రాష్ర్టావతరణ జరిగిన వెంటనే ప్రభుత్వం ముందున్న పెనుసవాల్ తీవ్రమైన విద్యుత్ కొరత. ఈ సవాల్‌ను సమర్ధంగా అధిగమించాం. ఇవాళ కోతల్లేని నాణ్యమైన విద్యుత్‌ను విజయవంతంగా సరఫరాచేసే స్థితికి వచ్చాం. రాబోయేకాలంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నాం. ఈ సంవత్సరం యాసంగి పంటకాలం నుంచే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించి, రైతులు మూడుదశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు తొలిగిపోనున్నాయి.

లాభసాటి వ్యవసాయానికి ఆరు ప్రణాళికలు.. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని రుజువు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులతో విస్తృతంగా చర్చలు జరిపి, పటిష్ఠమైన కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు ఆరురకాల ప్రణాళికలు రూపొందించినది. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం, ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి, పుష్కలంగా సాగునీరు అందించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి అందించడం, రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి ఆరు ప్రణాళికలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చనున్నాం.

గిట్టుబాటు ధరలను నిర్ణయించేది రైతులే.. రైతాంగం అధిక దిగుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందించడంతో పాటు పండించిన పంటలకు గిట్టు ధర లభించడంలో ఈ రైతు సంఘాలు విశేషంగా కృషిచేస్తాయి. ఆయా జిల్లాల్లో ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం, భూముల రకాల ఆధారంగా ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ప్రభుత్వం గుర్తిస్తుంది. దాన్ని బట్టి రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించి, రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే ప్రమాదాన్ని నివారిస్తాం. తద్వారా పండిన పంటకు మార్కెటింగ్ సమస్య తలెత్తదు. రైతులు పండించిన పంటలకు దళారులే ధరలు నిర్ణయిస్తున్నారు. ఇలా కాకుండా రైతులను సంఘటితపరిచేందుకు ప్రభుత్వం పూనుకున్నది. ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారిని నియమించింది. వాళ్లంతా ఇప్పుడు గ్రామాల్లో సర్వే చేస్తూ, భూముల వివరాలు, రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే గ్రామంలోని రైతులందరూ సభ్యులుగా గ్రామ రైతు సంఘాలు, తద్వారా మండల సమాఖ్యలు.. ఆపై జిల్లా రైతు సమాఖ్యల నుంచి రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటవుతుంది. రైతులకు గిట్టుబాటు ధరకోసం రాష్ట్ర రైతు సమాఖ్యకు రూ.500 కోట్ల నిధిని ప్రభుత్వం అందిస్తుంది. పంటల కొనుగోలు కోసం ఆ మూల ధనాన్ని వినియోగించి, రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చేలా రైతు సంఘాలు కృషి చేస్తాయి. ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఈ ప్రణాళికలో రైతులు అందరూ భాగస్వాములు కావాలి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి గ్రామాల్లో ఉండే మానవ సంపదను సరిగ్గా వినియోగించుకుంటే మహత్తరమైన ఫలితాలను సాధించవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయవచ్చుననే సమగ్ర దృక్పథంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ, ఆయా అనుబంధ వృత్తులకు ఆర్థిక ప్రేరణ అందించడం ద్వారా పల్లెలను ప్రగతిబాట పట్టించే సమగ్ర ప్రణాళికలు రూపొందించాం. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్రీయమైన పద్ధతుల్లో, సమగ్రమైన విధానాలను ఇప్పటి వరకూ ఎవరూ అవలంబించలేదు. రైతే రాజు అనే పడికట్టు పదాలు చెప్పడంతోనే సరిపుచ్చారు తప్ప, వ్యవసాయాన్ని సంస్కరించే దిశగా బలమైన ప్రయత్నాలేవీ చేయలేదు. సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ రైతాంగం మరింత తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నాలు ప్రారంభించాం.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా రాష్ట్రంలో 35.30 లక్షలమంది రైతుల రూ.17వేల కోట్ల పంటరుణాలు మాఫీచేశాం. రాష్ట్రంలోని 46వేల చెరువులకుగాను గడిచిన రెండు సంవత్సరాల్లో 16వేల చెరువులను పునరుద్ధరించాం. తద్వారా చెరువుల్లో జలకళ ఉట్టిపడుతూ, భూగర్భజలాలు గణనీయంగా పెరిగినయి. గ్రామీణ వాతావరణంలో ఎంతో మార్పు వచ్చింది. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు నానా అగచాట్లు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఎరువులు, విత్తనాలు సమీకరించుకొని రైతులకు అందుబాటులో ఉంచడంతో విత్తనాలు, ఎరువుల కొరత లేదు. పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌లో ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నం. తెలంగాణ వచ్చే నాటికి ఉన్న కేవలం నాలుగు లక్షల టన్నుల గోడౌన్ల సామర్థ్యాన్ని ఇప్పుడు 22.5 లక్షల టన్నులకు తీసుకుపోయినం. రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లు అందించడంతో పాటు ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు చేసినం. కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ప్రతీ ఏటా రూ.25వేల కోట్ల బడ్జెట్‌తో వీలైనంత త్వరగా సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. రైతులకు ఈ ఏడాది యాసంగి నుంచే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి రూ.నాలుగు వేల చొప్పున రెండు పంటలకు కలిపి రైతులకు రూ.8వేలు పెట్టుబడిగా అందించనున్నాం.

కులవృత్తులకు ప్రోత్సాహం.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు ఇతర కులవృత్తులు చేసుకొని బతికే వారే ఎక్కువ. కాలక్రమేణ వచ్చిన మార్పుల వల్ల కొన్ని కులవృత్తులు అంతరించిపోయాయి. అలాంటి కులవృత్తులకు తగిన ప్రోత్సాహం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకున్నాం. గొర్రెల పెంపకంలో అపారమైన నైపుణ్యం ఉన్న గొల్ల, కుర్మలకు 75 శాతం భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను పంచే పథకం ఈ నెలలోనే ప్రారంభం కానున్నది. గొర్ల కాపరుల సొసైటీలోని సభ్యులందరికీ 21 గొర్ల చొప్పున మొదటి దశలో ఈ పథకం అమలు కోసం రూ.5వేల కోట్ల భారీ వ్యయంతో 84 లక్షల గొర్లను అందించనున్నాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని యాదవ, కుర్మ సోదరులు రూ.20వేల కోట్ల సంపదను సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న నీటి వనరులను సాగునీటి కోసమే కాకుండా చేపల పెంపకానికి కూడా వినియోగించి మత్స్యకారుల జీవితాలు మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించింది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించాం. నూలు రసాయనాలను 50 శాతం సబ్సిడీపై అందించడంతో పాటు చేనేత కార్మికులు నేసిన వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశించాం. నవీన క్షౌరశాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మణులకు రూ.లక్ష ఆర్థికసాయం ప్రభుత్వం అందించనుంది.

రజకులకు బట్టలు ఉతికే అధునాతన యంత్రాలను అందించనుంది. విశ్వ బ్రాహ్మణులకు వారి వారి వృత్తులకు సంబంధించిన పరికరాలు అందించడంతో పాటు అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈత, తాడిచెట్ల పెంపకం చేపట్టింది. అనివార్య పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వృత్తులకు మారాలనుకునే వారెవరికైనా తగిన ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుంది. అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న సంచార కులాలు, ఆశ్రిత కులాలు తదితర వర్గాల వారిని అన్ని రకాలుగా ఆదుకొనేందుకు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఏర్పడిన ఎంబీసీ కార్పొరేషన్, పలు పథకాలను ప్రభుత్వం రూపొందిస్తున్నది.

ఎన్నో చేశాం… ఇంకెన్నో చేస్తాం.. -ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సంకల్పంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు బృహత్తర కార్యక్రమం మిషన్ భగీరథ ప్రారంభించాం. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులతో ఈ ఏడాది డిసెంబరు మాసాంతం వరకు నదీజలాలు అన్ని గ్రామాలకు అందించే అవకాశం ఉంది. ఈ పథకం పూర్తితో ప్రజలకు మంచినీటి కష్టాలు తొలిగి, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువనున్నది.

-రాష్ట్రం నలుమూలలా రహదారులన్నింటినీ చక్కగా తీర్చిదిద్దుతున్నాం. సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా రవాణా రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం.

-పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం సత్ఫలితాలను సాధిస్తున్నది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ర్టానికి తరలివస్తున్నాయి.

-సులభ వాణిజ్య విధానంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

-ఐటీ రంగంలో వినూత్న ఆలోచనలతో ఆ రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి.

-రాష్ట్రంలో పచ్చదనం పెంచడంకోసం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంలో భాగంగా వచ్చే నెలలో మూడోదశ హరితహారం కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందులో ప్రజానీకమంతా పాల్గొనాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.