Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సింహం సింగిల్‌గానే..

-నాలుగు పార్టీలు కూటమిగా వచ్చినా..
-కాంగ్రెస్, టీడీపీ హయాంలో మారని గిరిపుత్రుల బతుకులు
-నాలుగు పార్టీలు కూటమిగా వచ్చినా.. సింగిల్‌గానే సింహంలాంటి కేసీఆర్
-గోదావరి జలాలతో మెట్టప్రాంతాలు సస్యశ్యామలం
-సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో మంత్రి కేటీఆర్ రోడ్‌షో

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తండాలకు మహర్దశ పట్టిందని మంత్రి, సిరిసిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కే తారకరామారావు అన్నారు. ఆయన సంకల్పంతోనే మా తండాలో మా రాజ్యం నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 3,400 తండాలు, గూడేలు గ్రామపంచాయతీలుగా ఆవిర్భవించాయని చెప్పారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే నాలుగు పార్టీలు కూటమి పేరుతో వస్తున్నాయని.. సింహంలాంటి కేసీఆర్ మాత్రం సింగిల్‌గానే వస్తున్నారని.. ప్రజల ఆశీర్వాదంతో ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ పార్టీయే మళ్లీ అధికారం చేపడుతుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా మార్చాలని దశాబ్దాలపాటు మొరపెట్టుకున్నా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకున్నపాపాన పోలేదని విమర్శించారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్ గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి చలించారని, స్వరాష్ట్రంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను నెరవేర్చారని కొనియాడారు. మంచి పనులు చేసిన సీఎంను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. మూలకు విసిరేసినట్టు ఉండే గ్రామాలన్నీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు అడుగులు వేశాయన్నారు. 500 కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని. వీర్నపల్లి కూడా మండలంగా మారిందన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న వీర్నపల్లిని చూస్తూంటే గర్వకారణంగా ఉన్నదని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉంది? వచ్చాక ఎలా ఉందో? అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే కాలంలో మరింత అభివృద్ధి
సాగునీరులేక బీళ్లుగా మారిన మెట్టప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రూ. 130 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ ద్వారా వీర్నపల్లి మండలంలోని వన్‌పల్లి, మద్దిమల్ల, గర్జనపల్లి గ్రామాలకు నీళ్లు రానున్నాయని తెలిపారు. పోడుభూముల సమస్యలను పరిష్కారిస్తామని హామీఇచ్చారు. రైతుకు పంట పెట్టుబడి సాయం అందించే రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణనేని చెప్పడానికి గర్వంగా ఉన్నదన్నారు.

వచ్చే ప్రభుత్వంలో పింఛన్లు రెండింతలు చేసుకోబోతున్నామని, రైతుబంధు మొత్తాన్ని రూ.10 వేలకు పెంచనున్నామని వెల్లడించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పనిచేసినా కేసీఆర్ మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని కొనియాడారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గుగులోత్ రేణ, కో ఆపరేటివ్ బ్యాంకు వైస్‌చైర్మన్ చీటి నర్సింగారావు, జెడ్పీటీసీ ఆగయ్య, ఎంపీపీ సుజాత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మాటిచ్చి.. టీ తాగి..

ఒక చిన్నగుడిసెలో హోటల్ నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్న ఓ నిరుద్యోగికి ఇచ్చిన మాటను నెరవేర్చారు మంత్రి కేటీఆర్. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీప్రాంతంలో మోహన్ నాయక్ తనభార్యతో కలిసి అమ్మ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల గంభీరావుపేట మండలంలోని పలుగ్రామాల్లో పర్యటిస్తున్న కేటీఆర్‌ను దమ్మన్నపేట జగదాంబతండాకు చెందిన మెహన్‌నాయక్.. తన హోటల్‌లో టీ తాగమని కోరాడు. తప్పకుండా వస్తానని ఆ సందర్భంగా మంత్రి అతడికి మాట ఇచ్చారు. ఆదివారం సాయంత్రం వీర్నపల్లి మండలకేంద్రంలో రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్ తిరుగుప్రయాణంలో పెద్దమ్మ స్టేజీలో ఉన్న అమ్మ హోటల్ వద్ద ఆగారు. మాటఇచ్చిన ప్రకారం మోహన్‌నాయక్ వద్ద టీ తాగారు. కొద్దిసేపు అక్కడే గడిపిన మంత్రి మోహన్‌నాయక్‌తో ముచ్చటించారు. స్వయానా మంత్రి తనవద్ద టీ తాగడంతో నాయక్ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.