Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సింగరేణి కార్మికులకు సీఎం వరాలు

-సంస్థ లాభాల్లో కార్మికులకు 20 శాతం వాటా -కోల్ ఇండియా ద్వారా రూ.40వేల బోనస్ -3,100 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు -నెలాఖరులోగా కార్మికులకు సెప్టెంబర్ జీతం -కోల్‌బెల్ట్ నేతలతో భేటీలో సీఎం కేసీఆర్ హామీ -చరిత్రాత్మక నిర్ణయం:ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు -సింగరేణి సీఎండీతో నేతల భేటీ -కార్మికుల సమస్యలపై వినతి పత్రం

సింగరేణి కార్మికుల కుటుంబాల్లో దసరా, దీపావళి పండుగల కాంతులు ముందుగానే విరజిమ్మాయి. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల జీవితాలను కూడా వెలిగించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వారిపై వరాల జల్లు కురిపించారు. సంస్థ లాభాల్లో 20శాతాన్ని కార్మికులకు చెల్లించాలని నిర్ణయించారు. కార్మికులకు బోనస్‌గా కోల్‌ఇండియా ద్వారా రూ.240కోట్ల ప్యాకేజీని అందిస్తామని ప్రకటించారు. దీంతో ప్రతి కార్మికుడికి సగటున రూ.40వేల చొప్పున లబ్ధ్దిచేకూరనున్నది.

Singareniసోమవారం సాయంత్రం కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ నిర్ణయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి దసరా పండుగ జరుపుకోబోతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నడూ లేని విధంగా 20శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్మికులు ఎప్పటి నుంచో కోరుతున్న డిపెండింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి కానుకగా దాదాపు 3,100 మంది పెండింగ్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రితో సమావేశమైనవారిలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, దివాకర్‌రావు, సోమారపు సత్యనారాయణ, చెన్నయ్య తదితరులున్నారు. సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 20 శాతం వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. గత ప్రభుత్వాలు కార్మికులను ఇబ్బందిపెడితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వరాల జల్లు కురిపించారని కొనియాడారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలతోపాటు డిస్మిస్డ్ కార్మికులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించినట్లు చెప్పారు.

ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు మాట్లాడుతూ చీకట్లో పనిచేస్తూ దేశానికి వెలుగులందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారని ప్రశంసించారు. గత ప్రభుత్వాలు ఏటా లాభాల్లో ఒకశాతం మాత్రమే కార్మికులకు ఇచ్చేవారని, వీటికి భిన్నంగా ముఖ్యమంత్రి ఒకేసారి 20శాతం ప్రకటించి కార్మికులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, సోమారపు సత్యనారాయణ, చెన్నయ్య తెలిపారు. దసరా పండుగను పురష్కరించుకుని సెప్టెంబర్ నెల జీతాలను ఈ నెల చివరిలోగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంకు సింగరేణి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి సీఎండీతో కోల్‌బెల్ట్ ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ సింగరేణి కార్మికులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని సింగరేణి మైనింగ్ ఏరియా ప్రజాప్రతినిధులు సింగరేణి సంస్థ సీఎండీ సుతీర్ధ భట్టాచార్యను కోరారు. ఎంపీ బాల్క సుమన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, సోమారపు సత్యనారాయణ, దుర్గం చిన్నయ్య, ఎన్ దివాకర్‌రావు తదితరులు సోమవారం మధ్యాహ్నం భట్టాచార్యను కలిసి ఐదు అంశాలతో కూడిన వినపతిపత్రాన్ని అందజేశారు.

సింగరేణి సంస్థ 2013-14 సంవత్సరపు లాభాల్లో 25శాతం కార్మికులకు ఇవ్వాలని, డిపెండెంట్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్న ఉద్యోగుల దరఖాస్తుల పరిశీలనకు అప్పిలేట్ మెడిక్ బోర్డును ఏర్పాటుచేయాలని, డిస్మిస్డ్ ఉద్యోగులకు మానవతా దృక్పథంతో మరొక అవకాశం ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాల్కా సుమన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థ వివక్షకు గురైందని, తెలంగాణ రాష్ట్రంలో సంస్థ భవిష్యత్తుకు, కార్మికుల సంక్షేమానికి కోల్‌బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులుగా నిరంతరం కృషిచేస్తామన్నారు. ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మాట్లాడుతూ ఏడేండ్లకుపైగా గనుల్లో పనిచేసి అనారోగ్యంతో చనిపోయిన కార్మికుల పిల్లలకు చివరి అవకాశం (వన్‌టైమ్ సెటిల్‌మెంట్) కల్పించేందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తంచేసినట్లు చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.