Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సింగరేణికి కేసీఆర్ రక్ష

-ఏ హక్కు అయినా సీఎంతోనే సాధ్యం -కేసీఆర్ మాట రామబాణం -కాపలా ఉండాలంటే కార్మికులను కాటేసిన జాతీయ సంఘాలు -టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత

తెలంగాణకు అన్నంగిన్నె లాంటి సింగరేణికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంచిర్యాల జిల్లాలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన పలు బహిరంగసభల్లో ఆమె పాల్గొన్నారు. మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. సింగరేణి కార్మికులంటే ముఖ్యమంత్రికి గుండెల నిండా ప్రేమ ఉన్నదన్నారు. సింగరేణి కార్మికులు, కేసీఆర్ సైనికులు భుజంభుజం కలిపితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో కేసీఆర్‌ను అరెస్ట్‌చేస్తే ముందుగా రంగంలోకి దిగి సింగరేణిని స్తంభింపజేసిన ఘనత ఇక్కడి కార్మికులదేనన్నారు. సింగరేణిని సీమాంధ్ర ప్రాంత పాలకులు దోచుకున్నారని, ఆంధ్రప్రాంతంలో సంస్థలను ఏర్పాటు చేసి సింగరేణి నుంచి సొమ్మును తరలించారని, మనసున్న సీఎం కేసీఆర్ అని, ఆయన మాట రామబాణమన్నారు. సింగరేణిని కేసీఆర్ అర్థం చేసుకున్నట్టుగా 60ఏండ్లలో ఎవరూ అర్థం చేసుకోలేదన్నారు. ఆయన చేసిందే చెప్తరు.. చెప్పేదే చేస్తరని కవిత అన్నారు.

రాష్ట్రంలో కేసులు వేసే ముఠా ఉంది.. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఆగడానికి కారణం ఒక ముఠా అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకు ఆ ముఠా పనిచేస్తుందన్నారు. విద్యుత్తు శాఖలో 24వేల మందిని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించినప్పుడు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలనుకున్నప్పుడు.. పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలనుకున్నప్పుడు.. ఇలా 17 రకాల కేసులు కోర్టుల్లో వేసి ప్రభుత్వానికి అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు. అన్ని కేసులోనూ ఫిర్యాదుదారులూ, లాయర్లూ వారే ఉండటం గమనించాలన్నారు. బ్రహ్మరాక్షసులను ఎదుర్కొని తెలంగాణ తెచ్చుకున్నం.. ఈ పిల్ల రాక్షసులు ఒక లెక్కనా? అని ఆమె వ్యాఖ్యానించారు.

ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించండి.. 1998 వరకు వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయని, ఏఐటీయూసీ పుణ్యమా అని అవి రద్దయ్యాయన్నారు. కాపలా ఉండాలని అంటే కార్మికులను కాటేశారని మండిపడ్డారు. కార్మికుల ఓట్లు అడగడానికి ఏఐటీయూసీ వస్తే మా హక్కులు పోగొట్టింది.. సంతకాలు పెట్టింది ఎవరు? అని ప్రశ్నించాలని, మిమ్మల్ని గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాలు తెస్తారా? అని నిలదీయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

పీఠాలు కదులుతున్నాయి.. వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ ప్రకటనతో వాళ్ల కాళ్ల కింద భూమి కదులుతున్నది. నిరుడు అక్టోబర్ 6న ముఖ్యమంత్రి ప్రకటన చేయగానే కండ్లల్ల కారం పడ్డట్టయింది. దీన్ని అడ్డుకోవటానికి కేసులు వేయించి, కొద్దిసేపు కాళ్లు అడ్డం పెట్టిండ్రు. కానీ వాళ్ల కాళ్లు విరగ్గొట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తం. పని అయితేనే అయితదని చెప్తం. కాకపోతే కాదంటం. ముఖ్యమంత్రి మాట్లాడకుంటే ఆయన మాట్లాడటం లేదని అన్నరు. ఆయన మాట్లాడి, ప్రకటన చేసిన తర్వాత వంకరటింకర మాటలు మాట్లాడుతున్నరు. పేర్లు మార్చినంత మాత్రాన వారసత్వం ఆగదు. రెండుమూడు నెలలుగా న్యాయనిపుణులతో మాట్లాడినం. ఆ తర్వాతే ముందుకొచ్చినం అని కవిత స్పష్టం చేశారు.

రాబోయేది స్వర్ణయుగం.. సింగరేణిలో టీబీజీకేఎస్ గెలుస్తున్నదని, రాబోయేది స్వర్ణయుగమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆమె కార్మికులకు చేయబోయే వాటిని వెల్లడించారు. కార్మికులకు దిగిపోయిన తర్వాత సొంతింటి కోసం 6లక్షల వరకు వడ్డీలేని రుణం అందిస్తామన్నారు. అన్‌ఫిట్ అయిన కార్మికులకు బేసిక్ పడిపోతున్న దృష్ట్యా వారికి వేజ్‌ప్రొటెక్షన్ కల్పిస్తామన్నారు. బెల్లంపల్లి ఏరియాలో లాకౌట్ ఎత్తివేయిస్తామన్నారు. 2015-16లో మస్టర్లు నిండిన బదిలీ వర్కర్లను పర్మినెంట్ చేస్తామని చెప్పారు. జేఎంఈటీల శిక్షణను గతంలో మాదిరిగా మూడేండ్లకు కుదిస్తామన్నారు. కోలిండియాలో మాదిరిగా సింగరేణిలో క్యాడర్‌స్కీంను అమలు చేస్తామన్నారు. ప్రతి కార్మికుడి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందేలా చూస్తామన్నారు. అధికారుల మాదిరిగానే కార్మికులకు ఏసీ పెట్టుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. కాసిపేట 2ఇైంక్లెన్, కేకే-6 భూగర్భ గనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని కవిత చెప్పారు. ఆర్‌కే-1ఏ మూసివేసే పరిస్థితి ఉండేదని, దానిని కాపాడుకున్నామని, దీంతో 800మంది కార్మికులకు ఉద్యోగాలు నిలిచాయని తెలిపారు. అంతకుముందు లక్ష 20వేల మంది కార్మికులు ఉంటే నేడు 63వేల మందికి కుదించిన ఘనత జాతీయ కార్మిక సంఘాలదేనని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. టీబీజీకేఎస్‌ను ఓడగొట్టడానికి అందరు ఒక్కటైయ్యారని, టీబీజీకేఎస్‌ను కార్మికులు గెలిపించి వారికే చుక్కలు చూపించాలని పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.