Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సింగరేణిలో అవినీతి భరతం పడతాం

-లంచం అడిగేటోళ్లను.. తీసుకునేటోళ్లను చెప్పుతో కొట్టండి -మెడికల్ అన్‌ఫిట్‌కు 6లక్షలా..?.. మంచి క్వార్టర్‌కూ లంచమేనా..? -త్వరలో సింగరేణి యాత్ర చేపడుతా.. కార్మికులు గెలువాలి.. సంఘాలు కాదు -నమ్మకంతో గెలిపించారు.. ఫలాలు దక్కాలి.. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం -మరో ఆరు గనులు ప్రారంభిస్తాం.. త్వరలోనే పే రివిజన్ కమిటీ -పెరిగే జీతాల కోసం రూ.370కోట్లు.. బయ్యారం గనులు సింగరేణికే -సింగరేణి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ -చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై ఆగ్రహం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సింగరేణి కార్మికులపై మరోసారి వరాల జల్లు కురిపించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్తూనే.. కొత్తవి కూడా ప్రకటించారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు, రూ.10లక్షల వరకు వడ్డీలేని ఇండ్ల రుణాలు, మెడికల్‌బోర్డు ప్రక్షాళన, క్వార్టర్లకు ఏసీలు, పిల్లల ఉన్నతవిద్యకు ఖర్చు, అంబేద్కర్ జయంతికి సెలవు, యూనియన్ సభ్యత్వ రుసుం రూపాయికి తగ్గింపు వంటి వరాలు ప్రకటించిన సీఎం.. ఏండ్ల నుంచి వేళ్లూనుకుపోయిన అవినీతి భరతం పడుతామని ప్రతినబూనారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. లంచం అడిగినోళ్లను, తీసుకొనేటోళ్లను చెప్పుతో కొట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. మెడికల్ అన్‌ఫిట్ నుంచి క్వార్టర్ల కేటాయింపు వరకు ప్రతిపనిలో గత పాలకులు లంచాలు తీసుకోవడం ప్రారంభించారని, ఇకనుంచి ఆ సంస్కృతికి చరమగీతం పాడుదామని కార్మికులకు పిలుపునిచ్చారు. లంచం అంతం చేయాలని పలుమార్లు కోరిన సీఎం కేసీఆర్ ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. అక్రమాలకు, లంచాలకు నిలయంగా మారిన సింగరేణి మెడికల్ బోర్డును ప్రక్షాళన చేస్తామని చెప్పారు.

ఇన్నాళ్ల్లు సింగరేణిని పట్టించుకోలేదని, ఇకనుంచి తామేమిటో చూపిస్తామని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సంఘాలు, పార్టీలు మాత్రమే గెలుస్తున్నాయని చెప్పిన సీఎం కేసీఆర్.. ఈసారి గెలుపు కార్మికులదని, వారికి ప్రతిఫలం దక్కాలన్నారు. కార్మికుల సమస్యలు తెలుసుకొనేందుకు స్వయంగా సింగరేణి యాత్ర చేపడుతానని, ప్రతి క్వార్టర్ తిరిగి కార్మికులను కలిసి సమస్యలు విని, ఒక్కొక్కటి పరిష్కరించుకొంటూ ముందుకు పోతానని హామీ ఇచ్చారు. గతంలో సింగరేణి ఎన్నికల్లో గెలిచిపించినప్పటికీ ఏమీచేయలేకపోయామని.. ఇకనుంచి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకొనే బాధ్యత తనదని ప్రకటించారు. కేవలం బొగ్గు గనులకు మాత్రమే సింగరేణిని పరిమితం చేయకుండా ఇతర ఖనిజాల తవ్వకాలను అప్పగించి విస్తరిస్తామన్నారు. భూగర్భ గనులను కాపాడుకొంటామని, త్వరలో మరో ఆరు గనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఓపెన్ కాస్ట్ గనులు అవసరం అని, వాటి లాభనష్టాలు సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతామని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల రక్తం తాగుతున్న ప్రస్తుత మెడికల్ బోర్డును ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా 11 డివిజన్లకు 9 డివిజన్లు గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు సింగరేణి కొంగుబంగారమని, దాన్ని కాపాడుకొంటూ కార్మికులకు ఫలాలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర వివరాలు సీఎం కేసీఆర్ మాటల్లోనే..

ఇప్పుడు చూపిస్తాం 2012లో టీబీజీకేఎస్‌ను గెలిపించారు. అనుకున్నంత మంచి పనులు జరగలేదు. రోగం ఏందో తెలిస్తెనే మందు వేసుకుంటం. ఇప్పుడు మందు వేయాలి. చిక్కులు బాగా ఉన్నాయి. పరిగికంప లాంటి పరిస్థితి నుంచి దాటుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం వచ్చాక మీ మీద శ్రద్ధ పెట్టలేదు. నిజం ఒప్పుకోవాలె. సమయం లేకుండే. పనులు జరుగుతున్నయి కదా అనుకున్నా. గతంలో టీబీజీకేఎస్ గెలిచింది మీ దయతోనే. ఇప్పుడూ గెలిపించారు. ఈ గెలుపు నిజమైంది కావాలె. కార్మికులు గెలిస్తేనే అది సాధ్యం. సింగరేణిలో ఉండే ప్రతి కార్మికుడి గెలుపు ఇది. కార్మికులు ఏసంఘంవారైనా నాకు సంబంధం లేదు. అందరి బాగు చూసుకుంటా. ఎప్పుడూ సంఘాలు గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి కార్మికులను గెలిపిస్తాం. మీరు గెలువలేదు. గెలిపించారు.

ఇతర సంస్థలను కాపాడుకుంటాం సింగరేణి లెక్కనే ఆర్టీసీలో 50వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నరు. నేను సీఎం అయ్యేనాటికి వారి ఉద్యోగాలు ఉంటయా ఉండయా కూడా ఎవరికీ స్పష్టత లేదు. వారి బతుకులు అగాధంలో ఉండేవి. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ. 750కోట్లు బడ్జెట్ ఇచ్చి నిలబెట్టినం. నష్టాల్లో ఎక్కువ భాగం సిటీ నుంచే. విదేశాల్లో నగరాల నుంచి వచ్చే నష్టాన్ని నగర సంస్థలు భరిస్తాయి. అలాగే ఇక్కడా భరించేలా చేసినం. ఏడాదికి 200కోట్లు ఇచ్చేలా జీహెచ్‌ఎంసీని ఒప్పించినం. అలా ఆర్టీసీని కాపాడినం. మరో పెద్దసంస్థ ఎలక్ట్రిసిటీ. వాళ్లలో చాలామంది తక్కువ జీతాలకు పనిచేస్తున్నరు. కడుపు కూడా నిండది. 25వేల మందిని ఔట్‌సోర్సు ఉద్యోగులను పెట్టారు. వారికి జీతాలివ్వరు. ఎంతకాలం ఇలా అని చెప్పి వారి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేసినం.

సభ్యత్వ రుసుం రూపాయే కార్మికసంఘానికి సభ్యత్వ రుసుం రూ.20 చెల్లిస్తున్నారు. ఎందుకు ఇయ్యాల్నో నాకు అర్థం కాదు. ఎవనికి దొబ్బపెట్టడానికి ఇయ్యాలె. 53వేల మంది కార్మికులు నెలకు రూ.20 ఇస్తే నెలకు 13.50 లక్షలు అయితున్నయి. ఇదేమన్న లంచమా. సేవాభావం ఉంటే ఇంత ఎందుకు? ఇక నుంచి కార్మికసంఘ సభ్యత్వానికి మీరు ఇచ్చేది కేవలం ఒక రూపాయే. ఎవరికైనా అంతే. దీనిమీద త్వరలో అగ్రిమెంట్ కూడా చేపిద్దాం. ఇప్పుడు చూద్దాం ఎన్ని సంఘాలు సేవ చేసేందుకు వస్తాయో. చెప్పులు లేకుండా వచ్చినోడు కార్లల్ల తిరుగుతున్నడు. కార్మికుల రక్తం తాగి సేవపేరుతో గడించారు. మొత్తం బంద్ కావాలె.

ఓరియెంటేషన్ మారాలె సీఎండీకి ఇప్పటికే ఆదేశం ఇచ్చిన. నేను సింగరేణికి వచ్చేసరికి సమస్యల లిస్ట్ తయారుచెయ్యాలె. వచ్చి మైక్‌ల మాట్లాడిపోను. అందరితో కలిసి 4గంటలు టేబుల్ వేసుకొని కూసుంటా. అధికారులు, ప్రజాప్రతినిధులందరూ మీ పక్కనే ఉంటరు. మీ సమస్యలు ఏందో చెప్పాలె. వాటిని ఎలా అధిగమించాలో పరిశీలిద్దాం. కొత్తగూడెంల బ్రిటీష్ కాలం నాటి క్వార్టర్లు ఉన్నాయని చెప్తున్నరు. నిజానికి ఎక్కడ సక్కగ లేవు. మారుద్దాం. క్వార్టర్లల్ల బాత్రూంలు, లెట్రిన్లు కూడా ఎట్లున్నయో చూస్తా. సమస్యలకు పరిష్కారం కనుక్కొందాం.

తప్పుడు ప్రచారం ఇష్టమున్నట్లు ప్రచారం చేసి అబద్ధ్దాలు చెప్తున్నరు మిగతా యూనియన్ వాళ్లు.. లాభాలు తక్కువ చూపెట్టినం అని ప్రచారం చేస్తున్నరు. నిరుడు రూ.750-800 కోట్లు వచ్చినయి. పే రివిజన్ కమిటీ వస్తున్నది. పెంచిన జీతం ఇచ్చేందుకు అని రూ.370 కోట్లు తీసి పక్కన పెట్టినం. ఎప్పుడైనా ఈ విషయం చెప్పారా? ఇలాంటివి చెప్పరు. మందు బాటిల్, గొర్రె ఇచ్చి మోసం చేద్దామని చూశారు. 20 రూపాయల ఫీజు కోసం అబద్ధాలు చెప్పారు. గొర్రె, మందు బాటిల్ పంచేది మీ డబ్బు నుంచే. మీ నెత్తి కొట్టి ఇస్తున్నరు. భూగర్భ గనులు తెరువాలని ప్రచారం చేస్తున్నరు. ఓపెన్ కాస్ట్ మైన్స్ లేకుంటే సింగరేణి బతుకదు. 30వేల మంది కార్మికులు పనిచేస్తున్న భూగర్భ గనుల వల్ల వచ్చే లాభాలు 15శాతం అయితే ఓపెన్ కాస్టుల వల్ల వచ్చే లాభం 85శాతం. ఓసీ లేకుంటే కంపెనీనే గోవిందా. లాభ నష్టాలను సమన్వయం చేసుకొని ముందుకుపోతున్నం. ఇవన్నీ అసలు నిజాలు . కాని ఏఐటీయూసీ వాళ్లు దీనికి రివర్స్ చెప్పి మోసం చేస్తరు. ఉన్మాదం, పిచ్చిల పోతే అందరి నోట్లె మన్నుపడుతది.

సింగరేణి కష్టం తెలుసుకున్నా 2000లో సింగరేణికి పోయిన. అప్పుడు ఏమీ తెలియదు. అక్కడి స్థానికనేతలు చెప్పారు. చాలా బాధపడ్డ. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేస్తరు. మంచి ఉద్యోగం కాదు. విషవాయువు నడుమ కష్టపడుతరు. మోకాలు చిప్పలు అరుగుతయి. అనారోగ్యం పాలవుతరు. ఉద్యమ సమయంలో ఎంతో కొట్లాడాను. అండగా మీరు నిలిచారు. మీ సమ్మె కీలకం. నేను బతికినా అంటే మీ సమ్మె వల్లనే. తెలంగాణ ఏర్పడ్డ ఫలాలు మీకు దక్కాలె. అందుకే సకల జనుల సమ్మె నాటి జీతం ఇచ్చినం. ఇంకా చాలా చేస్తాం.

యూనియన్ల మోసం కొడుకులు ఉండరు.. లక్షలు తీసుకొని డూప్లికేట్ పేరుతో ఉద్యోగాలు పెట్టిస్తరు. మధ్యలో మిగతాపనులకు పైసలే. అపాయింట్‌మెంట్ లెటర్‌కు పైసలే. యూనియన్ లీడర్లకు కొంత, అధికారులకు కొంత. ఉద్యోగం ఎక్కిన నాటినుంచి ఇక వాడికి బెదిరింపులే.. ఉద్యోగం ఉంటదా.. ఊడ్తదా తెల్వది.. ఇలాంటి బాధ ఇక వద్దు. తప్పు జరిగిపోయింది. యూనియన్ల తప్పులకు కార్మికులను బలిచేయవద్దు. ఇలాంటోళ్లను ఈ ఒక్కసారికి క్షమిద్దాం. పనిచేస్తున్నవారిని క్రమబద్ధీకరిద్దాం.

మెడికల్ బోర్డా.. దుంప బోర్డా.. మెడికల్ బోర్డు తీసిపారేసి కొత్తది పెడుదాం. కార్మికులకు న్యాయం, సాయం చేసేది ఉండాలె కానీ రక్తంతాగేది ఉంటదా? అది మెడికల్ బోర్డా దుంప బోర్డా.. వాళ్లకే అసలు బీమార్ ఉన్నది. అలాంటి నాయకులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, బోర్డు ఎందుకు సావనీకా.. కష్టపడి చీకటి గనులల్ల పనిచేసివస్తే వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కన్న దుర్మార్గం ఉండదు. ఇవన్నీ జరిగినయి. ఇకనుంచి నేను పట్టించుకుంటున్నా. పట్టించుకుంటే ఎట్లుంటదో మీకు తెలుసు. నేను మొండి కేసు. దాని సంగతో నా సంగతో తేలాలె.

చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఎత్తేద్దాం కొత్తగూడెంలో ఓ పెద్దాఫీసరు ఉన్నడట. సీఎంవో అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ అట. కార్మికులు మాత్రమే కాదు ఎంపీ ఒక క్యాన్సర్ పేషెంట్ కోసం 15సార్లు ఫోన్ చేస్తే.. ఎత్తుకోడు. ఆయన ఎంత గొప్పోడన్నట్లు.. ఎత్తిపారేద్దామా? మన బాధకోసం ఫోన్ ఎత్తనోడు మనకెందుకు? పనికిమాలినోళ్లందర్నీ జమచేసి ఇలా చేస్తున్నరు.

మీ అన్న తమ్ముడిగా చెప్తున్నా రెక్కలు ముక్కలు చేసి రక్తం రంగరించి మీ జీవితాలు అరచేతిల పెట్టుకొని బావిల దిగినా ఎక్కినా మైసమ్మకు దండం పెడుతరు. కష్టపడ్డ డబ్బుతో పిల్లలు పైకి రావాలని కోరుకోవాలె. బొగ్గులోఉండాలని కోరుకోవద్దు. మంచి ఉద్యోగాలు సాధించాలె. డిపెండెంట్ పేరిట అబద్ధం ఆడకుండా ఉండాలె. అబద్ధం ఆడి ఉద్యోగం ఎవరికో ఇచ్చే కర్మ లేకుండా, కొడుకులు లేకున్నా నీకు ఆసరా ఉండేందుకు ఇవ్వాలని 25లక్షలు చేసిన.. పోరగాండ్లు అందరూ ఒక తరీక లేరు. నాయినా అవ్వా అని మోసం చేస్తరు. ఉన్న పైసలు లేకుంటా చేస్తరు. అందుకే అలా లేకుంటే నెలకు 25వేలు తీసుకునే వెసులుబాటు కల్పించినమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కవిత, బాల్కసుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పసునూరి దయాకర్, సీతారాంనాయక్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వసలహాదారు వివేక్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నల్లాల ఓదెలు, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి, చిన్నయ్య, పుట్ట మధు, దివాకర్‌రావు, జలగం వెంకట్రావు, సత్యనారాయణ, కోవా లక్ష్మి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, పురాణం సతీశ్, లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, టీబీజీకేఎస్ వెంకట్రావు పాల్గొన్నారు.

లంచం అడిగేటోళ్లను, తీసుకొనేటోళ్లను చెప్పుతో కొట్టాలి అన్‌ఫిట్‌కోసం మెడికల్ బోర్డుకు పోతే 6లక్షల లంచం ఇవ్వాల్నా.. మంచి క్వార్టర్ కావాలంటే లంచం ఇవ్వాల్నా.. ఏం వానయ్యదా.. రేపటి నుంచి లంచం తీసుకునేటోన్ని, అడిగేటోన్ని, ఇప్పించెటోన్ని చెప్పుతో కొట్టాలె. లంచం ఉన్నది కాబట్టే ఇన్నాళ్లు మీరు గెలువలేదు అంటున్న. యూనియన్లన్నీ వ్యవస్థను నాశనం చేశాయి. ఎందుకు కార్మికులు లంచం ఇవ్వాలి.. క్వార్టర్ మారితే లంచం ఇచ్చుడా.. జరమచ్చి గనిలో చిన్నడ్యూటీ వేయించుకోవాలంటే సెక్రెటరీకి లంచం ఇవ్వాలె. ఇదా.. ఇలాంటి వ్యవస్థను ఇన్నాళ్లు పోషించిన యూనియన్లు గెలిస్తే మీరు గెలిచినట్లా? అందరు గౌరవంగా బతకాలె. లంచాల వ్యవస్థను పారదోలాలె. దీనికోసం ఒక ప్రతిజ్ఞ చేయాలె. నేను పర్యటనకు వచ్చిననాడు అందరితో చేపిస్తాను.. కేసీఆర్ వచ్చిపోయినంక సింగరేణిలో లంచాలు బంద్ కావాలె. దీనికోసం ఓ ప్రత్యేక వ్యవస్థ ప్రారంభిస్తాం. ఫిర్యాదులు తీసుకొనే కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఇప్పటిదాక ఒకటి జరిగింది. ఇక మీదట జరుగనివ్వను. టీబీజీకేఎస్ కార్యాలయానికి వస్తే నిమిషాల్లో పని పూర్తయ్యేలా సదుపాయం కల్పిస్తా.

త్వరలో సింగరేణి యాత్ర ఇక ఎవర్నీ నమ్మను, రాబోయే 20, 25 రోజుల్లో నేనే సింగరేణి యాత్ర చేపడుతా. నేనే వస్తాను. క్వార్టర్లు, దవాఖానలు, ఇతర వసతులు అన్నీ చూస్తాను. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్ల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు.. నేనే స్వయంగా తిరుగుతా. మీకు క్వార్టర్ ఎందుకు ఇయ్యరో ఎందుకు కరెంటు వద్దంటరో, ఎందుకు ఏసీ వద్దంటరో, ఉన్న వసతులు ఏంటియో, దవాఖానా ఏందో.. ఆ డాక్టర్లు ఏందో.. సమీక్షిస్తా. మీ దవాఖాన్లనే నా బీపీ చెక్ చేసుకుంటా. మొత్తం కతేందో తెగాలె ఇగ. క్యాంటీన్లల్ల ఏమున్నయో కూడా చూస్తం. క్యాంటిన్లల్ల ఒకటో రెండో పెడుతున్నరు. అయిదారు రకాలు పెట్టాలి. మీ అందరితో కూర్చొని మాట్లాడుతా. ప్రజాప్రతినిధులూ.. మీరు.. ఏం కావాలో చెప్పాలె.

సింగరేణి విస్తరణ సింగరేణి అధికారులు, నేతలతో సమావేశమయిన. ఖమ్మంలో బయ్యారం ఉక్కుగనులు ఉన్నాయి. ఆ పనులు సింగరేణికే అప్పగిస్తం. కాపర్, ఐరన్, లైమ్‌స్టోన్, షాబాద్ బండలు వంటివి కూడా అప్పగిస్తం. వయసు సహకరించనివాళ్లకు షిప్టులుగా చేసి ఇందులోకి మార్చుతాం. కొత్త ఓపెన్ కాస్టులలో కూడా పాతవాళ్లనే తీసుకొని చేపిస్తాం. భూగర్భాలను బంద్ పెట్టం. అవి కొనసాగుతవి. సమానంగా ఓపెన్ కాస్టు నడుపుతం. రామగుండం, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, భూపాలపల్లి, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో ఆరు భూగర్భ గనులు ప్రారంభిస్తాం. మంచిర్యాల లోని కాసిపేట 2 ఇైంక్లెన్, భద్రాద్రి కొత్తగూడెంలోని కొండాపూర్ గని, భూపాలపల్లిలోని కేటీకే 3 ఇైంక్లెన్, మంచిర్యాలలోని కేకే 6 ఇైంక్లెన్, భద్రాద్రి కొత్తగూడెంలోని రాంపూర్ షార్ట్‌బ్లాక్ ప్రాంతాల్లో గనులు ప్రారంభించటానికి అవకాశం ఉన్నది. ఇవన్నీ చేస్తే ఏడెనిమిది వేల మందికి కొత్త ఉద్యోగాలు వస్తయి.

సీఎం కేసీఆర్ వరాలు 1.రైల్వేలో మాదిరిగా డిపెండెంట్ ఉద్యోగాల ఏర్పాటుకు ప్రయత్నం. 2.కార్మికుడికి డిపెండెంట్ లేకుంటే రూ. 25 లక్షలు, లేదా నెలకు రూ. 25వేలు. 3.వడ్డీ లేని ఇండ్ల రుణాలు 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు. దీనికోసం ప్రభుత్వ వాటా నుంచి 50 కోట్లు తక్కువ చేసుకొనటానికి సిద్ధం. 4.కార్మికుడి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం. 5.దవాఖానల నిర్వహణలో మార్పు. అవసరమైతే పెద్దాసుపత్రిలో చికిత్స. 6.బదిలీ ఫిలర్లను పర్మినెంట్ చేసేందుకు ఉన్న 190 రోజుల కాలపరిమితి తగ్గింపు. 7.డూప్లికేట్ పేరుతో ఉన్న 2750 మందికి వారంలో క్రమబద్ధీకరణ. 8.వేడిలో పనిచేసేవారికి రిలీఫ్ కోసం ఉచిత కరెంట్‌తో ఏసీ వాడుకునే సదుపాయం. 9.క్యాంటీన్లలో తినుబండారాల పెంపు. 10.బట్టలు మార్చుకునే గదులు, స్నానాల గదుల నిర్మాణం. 11.అంబేద్కర్ జయంతికి ఉత్సవాలు.. సింగరేణికి సెలవు. 12.పిల్లల ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నతవిద్య ఫీజు భారం కంపెనీదే. 13.కోల్‌ఇండియాలోఉన్న క్యాడర్ స్కీం.. సింగరేణిలో అమలు. 14.క్వార్టర్ల పరిస్థితి మెరుగుపరుస్తాం. 15.కార్మికసంఘ సభ్యత్వ రుసుం ఒక రూపాయే.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.