-అవసరమైతే కేంద్రం వాటాను కొంటాం
-విద్యుత్, ఆర్టీసీని సైతం ప్రైవేటుపరం కానీయం
-సింగరేణి కార్మికుల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
-కారుణ్య నియామకాలపై స్పష్టతనిచ్చిన సీఎం
-ఆరు భూగర్భ గనులకు ప్రారంభోత్సవం
సింగరేణి కార్మికులపై సీఎం వరాల జల్లు
-కార్మికుల కోసం పదివేల క్వార్టర్ల నిర్మాణం
-60 వేలమంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యం
-రిటైర్డ్ ఉద్యోగులకు త్వరలో పెన్షన్ పెంచుతాం
-సింగరేణి భూముల్లో కట్టుకున్న ఇండ్లకు పట్టాలు
-ఇకపై కార్మికులకు నీటి, విద్యుత్ బిల్లులు రద్దు
-మూడు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన
సింగరేణి గనుల ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. సింగరేణిపై కేంద్రానికి ఏ మాత్రం పెత్తనం లేదని అన్నారు. అవసరమైతే సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటాను సైతం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇది తమాషాకు చెప్పే ముచ్చట కాదన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో సింగరేణి కార్మికులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. అంతకు ముందు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ముర్మూరు గ్రామంలో రామగుండం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిపొడవునా 65 టీఎంసీల నీళ్లతో గోదావరి జలకళ సంతరించుకుంటుందని, రానున్న రోజుల్లో పెద్దపల్లి ధనిక జిల్లా కాబోతున్నదని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు పనులను పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అక్కడినుంచి ఆదిలాబాద్ చేరుకుని, స్థానిక డైట్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. రైతు సంక్షోభానికి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఈ సభలో ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఇంకా రైతుల ఓపికను పరీక్షించడం మంచిదికాదని జాతీయపార్టీలకు హితవు పలికారు. అవసరమైతే రైతుల తరఫున తానే ఉద్యమిస్తానని ప్రకటించారు. చివరిగా శ్రీరాంపూర్‌లో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తూ, సింగరేణి కార్మికులపై వరాల వాన కురిపించారు.
మూడు జంబో సంస్థల్లో సింగరేణి ప్రధానం
సింగరేణి, విద్యుత్, ఆర్టీసీలను రాష్ట్ర ప్రభుత్వానికి జంబో సంస్థలుగా సీఎం అభివర్ణించారు. ఈ మూడింటినీ బలోపేతం చేస్తామే తప్ప ప్రైవేటుపరం కానివ్వబోమని నొక్కిచెప్పారు. అందులో ప్రధానమైంది సింగరేణి అన్నారు. ఎక్కడా ఏమీ లేనప్పుడు అన్నం పెట్టింది సింగరేణి సంస్థే. చుట్టుపక్కల ప్రజలు ఎంతోమంది ఇక్కడికి వచ్చి సింగరేణిపై బతికారు. అలాంటి సింగరేణిని వదులుకోబోము అని స్పష్టంచేశారు. ఇంకోటి విద్యుత్ సంస్థ. విద్యుత్ ఉత్పత్తి ఆరు వేల మెగావాట్లకు పెంచాలనుకున్నప్పుడు మాకివ్వాలని ప్రైవేటువాళ్లు అడిగారు. కానీ ఇవ్వనని కరాఖండిగా చెప్పాను అని సీఎం తెలిపారు. అందులో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్టీసీలో సైతం 50 వేల పైచిలుకు కార్మికులున్నారు. సీమాంధ్ర హయాంలో వాళ్ల మెడపై కత్తి వేలాడుతుండేది. ఆ సంస్థను సైతం బలోపేతం చేశాం. ప్రైవేటుపరం కానీయం అని చెప్పారు.
వారసత్వ ఉద్యోగాలు అనే మాటలేకుండా కేవలం కారుణ్య నియామకాల పద్ధతిలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. మార్చి మొదటి వారంనుంచి కొత్త మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని, త్వరలో వెబ్సైట్లో అప్లికేషన్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ అని పేరు పెట్టినందుకు ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. దేశంలో, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సంస్థల్లో కారుణ్య నియామకాలు అమలవుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నూతన బోర్డులో కేవలం సింగరేణి వైద్యులే కాకుండా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ నుంచి సైతం నియమిస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా సీఎండీనుద్దేశించి మాట్లాడుతూ మెడికల్ బోర్డు విషయాల్లో అవినీతి జరుగుతున్నట్టు తన వద్ద ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, అవినీతి పీడ పోవాలంటే దాని ప్రక్షాళన తప్పదని చెప్పారు.
లంచం అడిగితే చెప్పుతో కొట్టుండ్రి… మెడికల్‌బోర్డు, ఇతర వ్యవహారాల్లో అధికారులు తినడానికి రుచిమరిగారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. నాయకులుకూడా భోంచేసేందుకు చూస్తున్నారన్నారు. లంచం అడిగినవారిని పొట్టుపొట్టు తన్నుండ్రి. చెప్పుతో కొట్టుండ్రి. మీకేమైనా అయితే నావద్దకు రండి అని కార్మికుల హర్షధ్వానాల మధ్య సీఎం పిలుపునిచ్చారు. కార్మికుల రక్తం తాగేవారు రాక్షసులు తప్ప నాయకులు కాదన్నారు. పార్టీల చందాలు రూపాయికన్నా ఎక్కువ ఇవ్వరాదని, రేపటినుంచే సింగరేణిలో ఈ విధానం అమలుచేయాలని అక్కడికక్కడే సీఎండీని ఆదేశించారు.
సింగరేణి కార్మికులపై వరాల జల్లు సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. తాను సింగరేణి కార్మికులు నివాసముండే కాలనీకి వెళ్లి చూశానని, 1970కి ముందు కట్టిన క్వార్టర్లు ఏమాత్రం బాగోలేవని అన్నారు. 1980కి ముందు కట్టిన వాటిలో 5500 క్వార్టర్లు ఉన్నాయని, అందులో కొన్ని మరీ ఇరుకుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా 10 వేల క్వార్టర్లను వరుసక్రమంలో నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇందుకు యాజమాన్యం రూ.400 కోట్లు ఇస్తుందని, వెంటనే దానిపై ఆదేశాలు జారీచేస్తామని ప్రకటించారు. తనతో కొందరు రిటైర్డ్ కార్మికులు మాట్లాడుతూ తమకు కేవలం రూ.350 పింఛన్ వస్తున్నదని తెలిపారని, కనీసం హెల్త్‌కార్డు కూడా లేదని చెప్పారని పేర్కొన్నారు. సింగరేణిలో రిటైర్డ్ కార్మికులు సుమారు 60వేల మంది ఉన్నారన్న సీఎం.. వారందరికీ సింగరేణి ఉచిత వైద్యసేవలు అందిస్తుందని ప్రకటించారు. కొంత సమయం తీసుకుని పెన్షన్ పెంచేందుకు కూడా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
సింగరేణి భూముల్లో ఇండ్లకు పట్టాలు
శ్రీరాంపూర్ ఏరియాలోని 156 ఎకరాల సింగరేణి భూముల్లో పలువురు కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఇండ్లు కట్టుకున్నారని, వారికి పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎంపీ బాల్క సుమన్ కోరినట్టు సీఎం కార్మికులకు చెప్పారు. దానికి చిన్న సమస్య ఉందని, అయినా, నెలలో పట్టాలు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక నేతలు, టీబీజీకేఎస్ నాయకులు వచ్చి సర్టిఫికెట్లు ఇస్తారని ఆయన హామీ ఇచ్చారు. బెల్లంపల్లి ఏరియాతోపాటు మరికొన్ని చోట్ల పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వలేదని, వాటన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు. ఈ విషయంలో సీఎండీ శ్రీధర్‌కు ఆదేశాలు జారీచేశారు.
ఆరు భూగర్భ గనుల ప్రారంభం
సింగరేణివ్యాప్తంగా ఆరు భూగర్భ గనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి స్టేడియం నుంచి ప్రారంభించారు. కాసిపేట 2 ఇంక్లయిన్, కేకే 6 ఇంక్లయిన్, కొండాపురం గని, రాంపురం షాప్ట్ బ్లాక్, కేటీకే 3, 5 ఇంక్లయిన్లకు వేదికవద్దే ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకుముందు నూతన కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేశారు. సింగరేణి కార్మికుల కాలనీలో పర్యటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయనతోపాటు మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి, జీ వివేకానంద, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, విప్ నల్లాల ఓదెలు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోవ లక్ష్మీ, పుట్ట మధు, జలగం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావు, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, మాజీ మంత్రి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక కాలనీలో సీఎం కేసీఆర్
సీసీసీ నస్పూర్: శ్రీరాంపూర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్.. కార్మికుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా వారి కాలనీల్లో కలియదిరిగారు. ఏరియా స్టోర్స్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోతరాజుల రాజేందర్ దంపతులు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి తమ క్వార్టర్లోకి సాదరంగా స్వాగతించారు. ఇంట్లోని గదులన్నీ తిరిగి చూసిన కేసీఆర్.. సౌకర్యాలు, కుటుంబం గురించి తెలుసుకున్నారు. ఇల్లు చిన్నగా ఉండటం చూసి, మళ్లీ కట్టించే గృహాలు డబుల్ బెడ్రూంతో, అన్ని సౌకర్యాలతో ఉండాలని సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు.