Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సిరిసిల్ల మురిసింది

-ఊరంతా సాంచల సవ్వడి -మరమగ్గాల కార్మికులకు మహర్దశ -నాలుగేండ్లలో కార్మికుల ఆదాయం రెట్టింపు -ఆర్థికంగా నిలదొక్కుకున్న నేతన్నలు -ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్న కార్మికులు -బతుకమ్మ చీరెల తయారీతో చేతినిండా పని -కార్మికుల్లో భరోసానింపిన రాష్ట్ర ప్రభుత్వం -ప్రత్యేక దృష్టిసారించిన మంత్రి కేటీఆర్ -కార్మికుల జీవితాల్లో మార్పు తెచ్చిన కృషి -భీవండి, సూరత్ నుంచి వలసలు వాపస్ -భరోసా నింపిన రాష్ట్ర ప్రభుత్వం

ఉరిసిల్ల! ఇది నిన్నటి వ్యథ! నిజమైన సిరిసిల్ల.. ఇది నేటి వాస్తవం! ఒకప్పుడు దేశంలోనే అత్యధికంగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఊరుగా మారిన సిరిసిల్ల.. నేడు బతుకుపై భరోసా కల్పిస్తున్నది! ఒకప్పుడు ఎక్కడ చూసినా బక్కచిక్కిన నేత కార్మికులు ఎవరు పనిస్తారో.. పూటగడిచేదెలాగో తెలియక బేలగా చూస్తే.. నేడు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో, ఇస్తున్న ధైర్యంతో అదే నేత కార్మికుల్లో ఆనందం తొణికిసలాడుతున్నది! ఒకప్పుడు బతుకు భారమై గుండె చప్పుళ్లాగిన సిరిసిల్లలో.. ఇప్పుడు వీధివీధినా సాంచల చప్పుళ్లతో రేయింబవళ్లు ఆనందం తాండవిస్తున్నది! ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలకు సమైక్య పాలనలో తోచినంత పరిహారం ప్రకటించి చేతులు దులుపుకొంటే.. నేడు సమస్యను గుర్తించి.. దానిని నిర్మూలించడంద్వారా వృత్తిపై నమ్మకాన్ని కల్పిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం! ఫలితం.. చేతి నిండా పని.. కడుపునిండా తిండి.. ఇంటి నిండా ఆనందం.. మనసులో సంతోషం! దీంతో గతంలో బతుకుదెరువు కోసం భీవండి, సూరత్‌లకు వలస వెళ్లిన నేతకార్మికులు ఇప్పుడు తిరిగి వచ్చారు. తెలంగాణ వచ్చాక మా సిరిసిల్ల బతుకు బాగుపడిందని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అందుకే.. సిరిసిల్ల మురిసింది!

ఓరుగంటి సతీశ్ తెలంగాణ ఏర్పాటు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. అందులో భాగంగానే సిరిసిల్ల నేత కార్మికులు స్వరాష్ట్ర ఫలితాలను ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ పాలకుల మానవీయ కోణానికి సిరిసిల్ల నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకప్పుడు పనికోసం పడిగాపులుగాసిన వాళ్లకు ఇప్పడు చేతినిండా పని దొరుకుతున్నది. బతుకమ్మ చీరెలు, రంజాన్ కానుకలోని దుస్తులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు చీరెలు, గురుకుల విద్యార్థులకు యూనిఫారాలు, రాజీవ్ విద్యామిషన్ ద్వారా పిల్లలకిచ్చే దుస్తులు.. ఇలా అనేక ఆర్డర్లను తెలంగాణలోని నేత కార్మికులకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంట్లో అత్యధికంగా సిరిసిల్లకే ఆర్డర్లు దక్కాయి. పవర్‌లూం పరిశ్రమ సిరిసిల్లలోనే ఉండటం, కార్మికులకు చేతినిండా పని కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇప్పుడు సిరిసిల్ల జీవిత ముఖచిత్రమే మారింది. నమస్తే తెలంగాణ ఇటీవల సిరిసిల్ల నేత కార్మికులను పలుకరించినప్పుడు ప్రతి కుటుంబంలోనూ బతుకుపై భరోసా కనిపించింది. దశాబ్దాలుగా తమ జీవితాల్లో అలుముకున్న చీకట్లు క్రమంగా తొలిగిపోతున్నాయన్న ఆనందం తొణికిసలాడింది.

బతుకునిచ్చిన బతుకమ్మ చీరెలు సిరిసిల్ల కార్మికులకు అతిపెద్ద సమస్య పనిదొరకడం. పనిదొరికినా చాలీచాలని జీతాలే. సగటున ఒక్కొక్క కార్మికుడికి నెలకు రూ.6-8 వేలకు మించి ఆదాయం లభించేదికాదు. ఇది 2014 వరకు పరిస్థితి. ఒకవేళ ఆసామి వద్ద పనిదొరకకపోతే పస్తులుండటమే. ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది నెలలే పనిదొరికేది. కూలికూడా గిట్టుబాటుకాక కార్మికులు, ఆసాములు అనేక ఇబ్బందులుపడేవారు. అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈ దుస్థితిని అధిగమించడంపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు ప్రత్యేకంగా దృష్టిసారించారు. సిరిసిల్లలో అత్యధికంగా ఉండే నేత కార్మికుల జీవితాల్లో మార్పుతెచ్చే అంశాలపై రోజులతరబడి అధ్యయనంచేశారు. జాతీయస్థాయిలో పేరున్న నిపుణులతో చర్చించారు. అది ఫలితాన్నిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడి కార్మికులకు పనికల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద అందించే దుస్తులన్నింటి ఆర్డర్లను మరమగ్గాల కార్మికులకే ఇచ్చారు. ఇలా చేనేత, నేత కార్మికులకు వేల కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి.

తద్వారా కార్మికులకు, పరిశ్రమకు ప్రభుత్వం ఒక మార్గం చూపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లక్రితం బతుకమ్మ పండుగకు మహిళలందరికీ చీరెలు ఇవ్వాలని నిర్ణయించడం తెలిసిందే. వీటిని తయారుచేసే బాధ్యతను సిరిసిల్ల పవర్‌లూంలకే ఇచ్చారు. గతేడాది సిరిసిల్ల, సమీపంలోని సుమారు 30 వేల పవర్‌లూం యూనిట్లకు (సొసైటీలు, వ్యక్తిగత మగ్గాలను కలిపి) రూ.222.48 కోట్ల విలువైన చీరెల తయారీ బాధ్యతను అప్పగించింది. ఈ ఏడాది కూడా రూ.280కోట్ల విలువైన 97 లక్షల చీరెలను సిరిసిల్లలో తయారుచేస్తున్నారు. బతుకమ్మ చీరెల తయారీ మొదలుపెట్టాక కార్మికుల జీతాల్లో భారీ మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రతి కార్మికుడు వారానికి రూ.4-5వేల చొప్పున నెలకు కనీసం రూ.16-20వేలు సంపాదిస్తున్నాడు. ఏడాదిలో 6-8 నెలలపాటు ప్రభుత్వం ఇచ్చే పనులతోనే కార్మికులు బిజీ అవుతున్నారు.

ఆత్మహత్యల నుంచి ఆత్మైస్థెర్యాల వరకు.. సిరిసిల్ల చరిత్రలోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యల నివారణ సాధ్యమైందని చెప్పవచ్చు. తెలంగాణ వచ్చేనాటికి 432 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక నేతన్నల ఆత్మహత్యలు లేవు. నేత కార్మికులు ఆత్మహత్యల ఆలోచన పక్కనపెట్టి.. పనిపై నిమగ్నమయ్యారు. ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలుతీసుకున్నది. మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని బలోపేతంచేశారు. ప్రభుత్వ దవాఖానలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంతోపాటు ప్రతీ డివిజన్‌లో యువత, మహిళలతో కమిటీలు వేశారు. వీటిలో సుమారు 600 మంది సభ్యులుంటారు. సాంచల వద్ద పనిచేసేవారితో మాట్లాడటం, కార్ఖానాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం, సమస్యలుంటే సావధానంగా వినడం, పరిష్కార మార్గాలు చూపడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యతగా ప్రచారం చేస్తున్నారు. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. ఆధునికత వైపు సాంచలు ప్రభుత్వం భారీ ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఇప్పటికే ఇక్కడున్న మరమగ్గాలను ఆధునీకరించటంపై దృష్టిపెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. దారం పోగు ఎక్కడైనా తెగితే బట్టమొత్తం పాడైపోయేది. ఇప్పుడు మరమగ్గాలను ఉచితంగా ఆధునీకరిస్తున్నారు. ఎక్కడైనా పోగు తెగితే మగ్గం ఆటోమెటిగ్గా ఆగిపోయే ఏర్పాటు చేయించింది ప్రభుత్వం. ఇప్పటివరకు రూ.ఆరుకోట్లకుపైగా వెచ్చించి, సుమారు 7వేల మగ్గాలను ఆధునీకరించారు. మిగిలినవాటిని క్రమంగా ఆధునీకరించనున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు, ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా ప్రభుత్వమే చూపిస్తున్నది. దీంట్లో భాగంగా జూకీ మిషన్‌లపై దుస్తులు కుట్టడంపై శిక్షణ ఇస్తున్నారు. 2017 ఏప్రిల్‌లో దీన్ని సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో ప్రారంభించారు. ఏడాదిలోనే 923 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. ఒక్కొక్క బ్యాచ్‌లో 35 మందికి శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడ మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు ఇప్పటికే సొంతంగా రెడీమేడ్ దుస్తుల తయారీలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఇక్కడ అపెరల్‌పార్కు ప్రారంభించనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు.

నేత, చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం..14 శాఖల నుంచి ఆర్డర్లు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగేండ్లుగా నేత, చేనేత కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించింది. దీంట్లో భాగంగా 2014-15 నుంచి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. నేత, చేనేత కార్మికులకు సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, గురుకులం, మహాత్మా జ్యోతిరావుపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, పోలీసు శాఖ, సర్వశిక్ష అభియాన్, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్లు, క్రిస్మస్, రంజాన్ కానుకలు, మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ, ఆశా వర్కర్ల చీరెల ఆర్డర్లను ఇప్పటివరకు ఇచ్చారు. మొత్తం 14 శాఖల ద్వారా 2014-15లో చేనేత కార్మికులకే రూ.117.27 కోట్ల విలువైన పనిని ఇచ్చారు. 2015-16లో రూ.109.26 కోట్ల మేరకు, 2016-17లో చేనేత, నేత కార్మికులకు రూ.103.28 కోట్ల మేరకు పనులు అప్పగించారు. 2017-18లో చేనేత, నేతలకు కలిపి రూ.398.28కోట్లు, 2018-19లో రూ.459.12 కోట్ల విలువైన పనులు ఇచ్చారు. ఆ భగవంతుడే మా కోసం కేటీఆర్‌ను పంపినట్లుంది.. మా సిరిసిల్లలో కార్మికులు, ఆసాములు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు మా లాంటి వాళ్లను ఆందోళనకు గురిచేశాయి. ఊరు వల్లకాడు అవుతుందనిపించేది. పొట్టచేతపట్టుకొని పట్నంపోయేవాళ్లు పెరిగిపోయారు. అలాంటి టైంలో ఆ భగవంతుడే మా కోసం ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను పంపించినట్లయింది. ఆయన ఎమ్మెల్యే, మంత్రి కాకపోయి ఉంటే మా సిరిసిల్ల కార్మికులు రోడ్లపై పడేవారు. ఇప్పటివరకు అంతా మంచిగానే ఉన్నది. టెక్స్‌టైల్ కార్పొరేషన్ కూడా పెడితే మరింత మంచిగుంటుంది. – వెల్దండి నారాయణ, పవర్ లూం యజమాని

గతంలో ఎనిమిది వేలు దొరికేది.. ఇప్పుడు రెట్టింపయ్యాయి 30 ఏండ్లనుంచి సాంచల్లోనే పనిచేస్తున్న. ఏడాదిలో ఆరునెలలే పని ఉండేది. అదికూడా చాలీచాలని జీతాలతోనే పని వచ్చేది. కానీ, రెండేండ్లనుంచి మా జీతం డబుల్ అయ్యింది. వారానికి రూ.4వేలు తీసుకుపోతున్నాం. నెలకు రూ.16వేలు వస్తున్నాయి. ఇక మాకు చేతినిండ పని ఉంటున్నది. గతంలో మా గురించి పట్టించుకునేవాళ్లు లేకుండె. ఇప్పుడు మాకు కావాల్సినంత పని ఉంటున్నది. – మహేశుని భూమయ్య, నేత కార్మికుడు

సిరిసిల్లలో పనిదొరుకుతుందని వచ్చాం.. నేను భీవండిలో పదేండ్లు పనిచేశా. అంతదూరంపోయి పనిచేయడంకన్నా సిరిసిల్లలో పనిచేసుకోవడం మంచిదనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చేశా. భీవండిలో పదివేల వరకు గిట్టుబాటయ్యేది. ఇక్కడికి వచ్చిన కొత్తలో పదివేల వరకు వచ్చేవి. ఇప్పుడు 18వేల వరకు సంపాదించుకోగలుగుతున్న. కుటుంబంతో సహా ఇక్కడే ఉంటున్న. బతుకమ్మ చీరెలతో మాకు కావాల్సినంత పని దొరుకుతున్నది. – మెదక్ జిల్లా రామయంపేట మండలం కోనాపూర్ వాసి పొలాస స్వామి

సూరత్‌లో చేసేవాడిని.. ఇప్పుడు సిరిసిల్లకు పనికోసం ఊహతెలిసినప్పుడే సూరత్‌కు వెళ్లాను. పదేండ్లకుపైగా అక్కడ పనిచేసిన. ఇక అక్కడ ఉండబుద్ధికాలేదు. సిరిసిల్లలో సాంచలున్నాయి.. పని దొరుకుతున్నదని తెలుసుకొని ఇక్కడికి వచ్చా. కుటుంబంతో సహా సిరిసిల్లలోనే ఉంటున్నాం. వారానికి గతంలో రెండువేలు వచ్చేవి. ఇప్పుడు నాలుగు వేలు వస్తున్నాయి. మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఊపిరి పీల్చుకుంటున్నాం. – లకూం సదానందం, ఎల్కతుర్తి

కేటీఆర్ సహకారం మరువలేం జీఎస్టీ, ద్రవ్యోల్బణం తదితరాలతో దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్‌రంగం కుదేలయ్యింది. కానీ, సిరిసిల్లలో మాత్రం కొత్తగా యూనిట్లు వచ్చాయి. ఏడాదికి 25 లక్షల మీటర్ల బట్టను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. బయటి ఆర్డర్లకుతోడు ఆర్వీఎం, రంజా న్, క్రిస్మస్.. ఇలా అనేక పథకాల పేరుతో ప్రభుత్వం అందించే దుస్తుల తయారీ బాధ్యతను మాకు అప్పగించారు. వీటితో పార్కులోని వందకుపైగా యూనిట్లలోని సుమారు రెండువేల మంది కార్మికులు బతుకుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోయి ఉంటే మా పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. విద్యుత్ చార్జీల విషయంలోనూ సర్కారు సానుకూలంగా ఉన్నది. గతంలో మాకు మూడేండ్ల సబ్సిడీ బకాయిలను విడుదలచేసింది. స్వయంగా మంత్రి కేటీఆర్ ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. – ఏముల శ్రీనివాస్, టెక్స్‌టైల్ పార్క్ క్లాత్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ కార్యదర్శి

నా భర్తలా ఎవ్వరూ చనిపోవద్దని నేతన్నలను చైతన్యం చేస్తున్న నా భర్త పవర్‌లూం కార్మికుడు. సరైన పనిలేక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చనిపోయేనాటికి మాకు ఆరేండ్ల కొడుకు, రెండేండ్ల పాప ఉన్నారు. అప్పటి నుంచి కుంగిపోయాను. కానీ, తర్వాత ధైర్యం తెచ్చుకొని పిల్లలను పెంచుతున్న. ఇప్పుడు కొడుకు ఎన్టీపీసీలో ఏఈగా చేస్తున్నాడు. కూతురు ఎమ్మెస్సీ చదువుతున్నది. ఇక ఇప్పుడు నేను పూర్తిస్థాయిలో కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న. ఆత్మహత్యలు వద్దంటూ ప్రచారం చేస్తున్న. ఆత్మహత్యకు పాల్పడే ఆలోచన ఉన్నవారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇస్తున్న. నా భర్తలా ఎవ్వరూ కావద్దనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న. – రాపెల్లి లత, కౌన్సెలింగ్ కేంద్రం సోషల్ వర్కర్

సిర్చిల్ల2 20 యూనిట్ల నుంచి 111 యూనిట్లుగా టెక్స్‌టైల్ పార్కు సిరిసిల్ల దశ తిరిగిందని చెప్పడానికి మరో నిదర్శనం ఇక్కడ ఉన్న టెక్స్‌టైల్ పార్కే. సమైక్య పాలనలో, 2002లో ఇక్కడ టెక్స్‌టైల్ పార్కు కోసం శంకుస్థాపనచేశారు. అప్పటినుంచి 2009వరకు ఇక్కడికి పది పదిహేను యూనిట్లు మాత్రమే వచ్చాయి. 2009లో ఎమ్మెల్యేగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొంత ప్రయత్నం చేయడంతో 2012 నాటికి వీటిసంఖ్య 20కి చేరింది. క్రమక్రమంగా ఇక్కడికి వచ్చే పరిశ్రమల సంఖ్య పెరిగి, వీటి సంఖ్య 111కు చేరింది. వీటిలో 90 యూనిట్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఏటా సుమారు రూ.200 కోట్ల వ్యాపారం టెక్స్‌టైల్ పార్కు నుంచే జరుగుతున్నది. దీంట్లో మరిన్ని వసతులను పెంచనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు -సామాజిక భద్రతా చర్యల్లో భాగంగా మరమగ్గ కార్మికులకు పొదుపు పథకం (త్రిఫ్ట్) అమలు. ప్రభుత్వం 8%, కార్మికులు 8% ఈ పథకంలో జమచేస్తారు. -సుమారు 7వేల మరమగ్గాలను 7 కోట్లతో పూర్తి సబ్సిడీతో ఆధునీకరణ. -వర్కర్ టు ఓనర్ పథకంలో 1104 యూనిట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం. దీనికోసం ప్రత్యేకంగా 88 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి. -జనశ్రీ బీమా యోజన కింద ప్రభుత్వమే ప్రీమియం కడుతున్నది. -బతుకమ్మ చీరలకు దారం(యార్న్)పై వచ్చే సబ్సిడీ కార్మికులకే.

సిర్చిల్ల6 త్వరలోనే అపెరల్ పార్కు .. టెక్స్‌టైల్ పార్కుకు తోడుగా ప్రభుత్వం ఇక్కడ అపెరల్, వీవింగ్ పార్కులను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. సిరిసిల్ల సమీపంలోని పెద్దూరులో 64 ఎకరాల్లో అపెరల్, 88 ఎకరాల్లో వీవింగ్ పార్కులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అపెరల్ పార్కు అభివృద్ధికోసం రూ.174 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించి పనులు మొదలుపెట్టారు. మరో ఏడాదిలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. ఇతర అభివృద్ధి పనులు కూడా మొదలుపెట్టారు.

సిర్చిల్ల10 రూ.291 కోట్లతో వర్కర్ టు ఓనర్ పథకం.. దేశంలో తొలిసారి సిరిసిల్లలో దశాబ్దాలుగా కార్మికులుగానే ఉన్నవారిని యజమానులుగా మార్చే బృహత్తర పథకానికి ప్రభుత్వం నాంది పలికింది. వర్కర్ టు ఓనర్ పథకం పేరుతో రూ.291 కోట్ల నిధులతో 1104 యూనిట్లను కార్మికులకు ఇవ్వనున్నారు. దీన్ని అపెరల్ పార్కులోనే ఏర్పాటుచేసి మొత్తం అపెరల్ పార్కును, దీన్ని కలిపి ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్ పార్కుగా నామకరణం చేయనున్నారు. రాబోయే ఏడాదిలోపే ఇది పూర్తికానుంది. దేశంలో ఈ తరహా ఏర్పాటు సిరిసిల్లలోనే ఉండటం విశేషం. ప్రభుత్వం శరవేగంగా ఇక్కడ పనులు మొదలుపెట్టింది. సిర్చిల్ల11 పించన్లు, బీమా పథకాలు బాగున్నాయి.. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా మంచిగానే ఉన్నది. బతుకమ్మ చీరెలతోపాటు ఆర్వీఎం, క్రిస్మస్, రంజాన్ కానుకలకు సంబంధించిన పనులను మాకు ఇచ్చారు. ఇప్పుడు మా జీవితాలు బాగుపడ్డాయి. ఇక 50 ఏండ్లు నిండిన కార్మికులకు పెన్షన్ ఇవ్వడం, జీవిత బీమా పథకాన్ని అమలు చేయడం, త్రిఫ్టు పథకాన్ని కూడా ఏర్పాటుచేయడంతో మాకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. – గుండెల్లి రాజేంద్రప్రసాద్(వార్పర్), సిరిసిల్ల

సిరిసిల్ల బతుకు బాగుపడింది.. తెలంగాణ వచ్చాక మా సిరిసిల్ల బతుకుబాగుపడింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్దఎత్తున ఆర్డర్లు ఇవ్వలేదు. తెలంగాణ వచ్చాక, మంత్రి కేటీఆర్ చొరవతోనే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కార్మికులకు, ఆసామికి, యజమానికి బాగున్నది. 80 రకాల కలర్లు, జరీ అంచుతో ఇప్పుడు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇస్తున్నారు. ఆర్థికంగా కార్మికులు, మేము నిలదొక్కుకుంటున్నాం. – దూడం శంకర్, పాలిస్టర్ ఉత్పత్తిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు

ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటున్నది మాకు 12 సాంచలున్నాయి. ఇద్దరు వర్కర్లు, నేను పనిచేసుకుంటున్నాం. మా వర్కర్లకు కూడా ఇప్పుడు పని గిట్టుబాటు అవుతున్నది. ఒకప్పుడు మేము పని బందు పెట్టుకునేవాళ్లం. ఆర్డర్లు ఉండేవి కావు. వర్కర్లకు సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు చావే శరణ్యం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలాకాదు.. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వస్తాయని, ఆదుకుంటున్నారన్న భరోసా పెరిగింది. – బూర భాస్కర్, ఆసామి

ఇప్పటిలా ప్రభుత్వం ఉంటే మా నాన్న బతికేవాడేమో.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నట్టుగా అప్పట్లో కూడా పని ఇస్తే మా నాన్న బతికేవాడేమో. ఆర్థిక ఇబ్బందులతో మా నాన్న తనువు చాలించాడు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న వర్కర్ టు ఓనర్ పథకం బాగుంటుంది. మాలాంటి వాళ్లకు ఆ పథకం ఒక ఆశాదీపం. తొలి ప్రాధాన్యం మాలాంటి వాళ్లకు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికీ నేను పవర్‌లూంలోనే పనిచేస్తున్న. మాకు తిండిపెట్టే వృత్తి ఇదే. – ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు ఒగ్గు శ్రీనివాస్ కుమారుడు బాలలింగం

సామాజిక పరివర్తన వచ్చింది… మైండ్‌కేర్ కౌన్సెలింగ్ సెంటర్‌ద్వారా సామాజిక పరివర్తన తెచ్చే ప్రయత్నంచేస్తున్నాం. దీంట్లో విజయం సాధించాం. ఇప్పుడు ఆత్మహత్యలు లేవు. 2004-14 మధ్య 432 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గడిచిన రెండేండ్లుగా కార్మికులకు పని ఉంటున్నది. ఆర్థికంగా వెసులుబాటు కూడా ఉంటున్నది. దీంతో ఆత్మహత్యలు లేవు. మేము ఇప్పటికీ మా చైతన్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణ, జీవితాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలన్న అంశాలపై నేత కార్మికులకు సలహాలు, సూచనలను ఇస్తున్నాం. – పున్నం చందర్, సైకాలజిస్టు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.